Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 64


    ఫ్రిజు రిలీజయ్యింది. శేషు కదలబోతుండగా వెనకనించి కోయిల కంఠం వినిపించింది.

 

    "సారీ! కాలికి చీర అడ్డంపడి, మీమీద పడ్డాను."

 

    శేషు అంతరాత్మ ఘోష పెట్టింది...ఆ దృశ్యం ఫ్రిజులో వుంది.

 

    "విన్నావాకోకిల కంఠం? సారీ చెబుతోంది అమ్మడు సారీగీరీ లొద్దను. మరోసారి మీద పడమను. (ఆగి) నాకు తెలుసు. మాటాడలేవు. పోనీలే...ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు."

 

    అంతరాత్మ చెప్పిన విధంగా శేషు వెనక్కి తిరిగి చూసేడు. ఆ అమ్మాయితో అతని కళ్ళు కలిసేయి.

 

    మళ్ళా అతని అంతరాత్మ గొంతు విప్పింది...

 

    "ఆహా-మాంచిమూడ్ లో బ్రహ్మ సృష్టించిన బొమ్మయిది. ఎంత బావుంది? కళ్ళా అవి? కావు. చేపలు. ముక్కా అది? కాదు కాదు. సంపెంగపూవు. కంఠమా ఇది. కానేకాదు శంఖము. (కొంచెమాగి) ఇకచాల్లే బావుండదుగానీ, చూపు మార్చు!"

 

    ఫ్రీజు రిలీజయ్యింది.

 

    శేషు తల తిప్పుతున్నాడు. నడుస్తున్నాడు. క్యూ సాగుతోంది. పరాకుగా నడిచే శేషు గంట దాటేసేడు.

 

    కిలకిలా నవ్వు వినిపించింది. శేషు ఉలికిపడ్డాడు. సొంతం వెనక్కి తిరిగిపోయాడు.

 

    అమ్మడు హెచ్చరిస్తోంది.

 

    "గంట-గంటకొట్టడం మరిచిపోయెరు" అని తాను గంట కొట్టింది.

 

    అంతలో అతని అంతరాత్మ ఒక ఆర్డరు వేసింది.

 

    "ఇదే ఛాన్సు! వెనక్కొచ్చెయ్. వెనక్కూడా కొన్ని సొగసులున్నాయి."

 

    ఆ ఆర్డరుతో అతను గబగబా ఆమె వెనక్కొచ్చి నిలబడ్డాడు. ఈ ఫోజు కూడ ఫ్రీజయ్యింది. శేషు అంతరాత్మ అంటోంది.

 

    "చూడు నాయనా! కన్నుల విందుగా చూసెయ్. అందానికి అసలైన అర్థం ఈ అమ్మడు. బాగుంది కదూ! ఇంక కదులు."

 

    ఫ్రీజు రిలీజైంది. అడుగు ముందుకు వేసేడు. మళ్ళా గంట దాటబోతుండగా అంతరాత్మ హెచ్చరించింది.

 

    "పప్పులో కాలేస్తున్నావ్...గంట...గంట."

 

    శేషు గంట పట్టుకున్నాడు గణగణగణ గంట కొట్టేస్తున్నాడు ఫైరింజనుమల్లె అదుపూ ఆపూలేదు.

 

    అమ్మడు నోటికి చెంగు అడ్డం పెట్టుకుని పకపకా నవ్వేస్తోంది.


                                       17


    వామనరావు ఇంటిముందు కుక్క భయంకరంగా అరుస్తోంది. గుమ్మం బయట టెన్నీస్ దుస్తుల్లోవున్న గోపాలరావు వొణికిపోతూ అరుస్తున్నాడు.

 

    "వామనరావ్, ఒరే వామీ!"

 

    చేతిలో పేపర్తో హాల్లోంచి వచ్చేడు వామనరావు. వస్తూనే కుక్కని మందలించేడు.

 

    "టామీ డోంట్ క్రై."

 

    కుక్క మొరగడం ఆపింది. వామనరావు గోపాలరావుని అడిగేడు-

 

    "ఎందుకొచ్చేవ్?"

 

    "మందుకిపిలవడానిక్కాదులేరా? టెన్నీస్ ఆడుకుందామని వచ్చేను"

 

    వామనరావు కోపంగా అన్నాడు.

 

    "అయ్ టెల్యూ-నీతో ఏ ఆటా ఆడను. ఆడి ఓడిపోదలుచుకోలేదు"

 

    గోపాలరావు 'అదికాదురా' అంటూ ముందుకి రాబోయేడు. టామీ భౌమని కేకవేసింది. గోపాలరావు భయపడి వెనకడుగు వేసేడు. వేస్తూ అన్నాడు.

 

    "వెధవ కుక్కకి-బాగానే ఇచ్చేవు ట్రైనింగు."

 

    వామనరావు కసిగా అన్నాడు.

 

    "ఇచ్చేను నన్ను నేను కాపాడుకోవడం తెలీక ఆ బాధ్యత టామీకిచ్చేను."

 

    "టెన్నీస్ ఆడినా చెడిపోతారేమిట్రా బొత్తిగా!" అంటూ వామనరావు భుజంమీద చెయ్యి వేసేడు.

 

    ఆ చేతిని తొలగించుకుంటో అన్నాడు వామనరావు.

 

    "డోంట్ టచ్ మి! నన్ను ముట్టుకున్నావో, టామీ నీ పీక ముట్టుకుంటుంది."

 

    అనేసి, కుక్కతోపాటు వామనరావుకూడా అక్కడ్నించి కదిలేరు.

 

    గోపాలరావు 'డామిట్' అనుకుంటో ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోయేడు.

 

    వామనరావు సోఫాలో కూర్చున్నాడు. టీపాయ్ మీదున్న పేపరు తీసేడు. హెడ్ లైన్స్ చూస్తుండగా పనిమనిషి ఖంగారుగా అరిచేడు-

 

    "అబ్బాయిగారొస్తున్నారండీ! అబ్బాయిగారొస్తున్నారు!"

 

    ఆ మాటలకి వామనరావు చేతిలోంచి పేపరు జారి పడిపోయింది. పడిపోయిన పేపరు తీసుకుంటో సౌమ్యంగా అన్నాడు వామనరావు.

 

    "వస్తే ఏమిట్రా? ఏవైందిప్పుడు? వార్తలు చూసుకుంటున్నారా! వార్తలు పో అవతలికి."

 

    వాడు వెళ్ళిపోతుండగా శేషు వచ్చేడు. వార్తలు చదూతున్నట్లు నటిస్తూ శేషుని చూస్తున్నాడు వామనరావు.

 

    శేషు తెచ్చిన పూలసెజ్జలో కొబ్బరికాయ అట్లాగే వుంది. పూల పొట్లం, కుంకుమ పొట్లం పొట్లాలుగానే వున్నాయి.

 

    పూల సెజ్జని టీపాయ్ మీద పెట్టేసి గౌతమ బుద్ధుడిలా చేతులు కట్టుకుని మేడ ఎక్కుతున్నాడు శేషు.

 

    వామనరావు తన కళ్ళ ముందునుంచి పేపరు పూర్తిగా తొలగించేసేడు. టీపాయ్ మీదున్న పూలసెజ్జవేపూ, మేడ ఎక్కుతున్న శేషూ వేపూ ఆందోళనగానూ, ఆశ్చర్యంగానూ మార్చిమార్చి చూసేడు.

 

    ఆ తర్వాత గంభీరంగా ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు.

 

    "సింహాచలం! సింహాచలం"      

 

    సింహాచలమని పిలువబడే ఆ బ్రహ్మచారి బక్కగా వున్నాడు. గాలికి తూలిపోతున్నట్టు గాలి పటంలాగా వామనరావు ఎదుటకొచ్చి నిలబడ్డాడు.

 

    సింహాచలం చేతుల్లో వున్న ఒక కాగితాన్ని వామనరావుకి వినయంగా సమర్పించుకుని దాని తాలూకు కాపీనే గంభీరంగా చదువుకున్నాడు.

 

    "అబ్బాయిగారు సరిగ్గా ఉదయం తొమ్మిదింటికి ఆఫీసు గదిలోకి అడుగుపెట్టేరు సార్! తొమ్మిదినుంచి పన్నెండు వరకు బేంకు ఆఫీసర్ తో టెర్రిఫిక్ డిష్కషన్స్ సార్! పన్నెండు నుంచి రెండు వరకూ ఆఫీసు అకౌంటెంట్ మీద అగ్గిరాముడై పోయాడు సార్. ఆ తర్వాత లంచ్ ఆఫ్టర్ దట్-రెస్ట్. మూడు నుంచి నాలుగువరకు డిక్టేషన్స్. నాలుగు నుంచి అయిదు వరకు ఆఫీస్ ఇన్ స్పెక్షన్. అయిదు నుంచి ఆరు గుడి. గుడి తర్వాత ఇల్లు. మీకు బొట్టుపెట్టేరు. ప్రసాదమిచ్చేరు. మేడఎక్కేరు."

 

    "స్టాపిట్" అరిచేడు వామనరావు. ఆ తర్వాత తాపీగా అంటున్నా వ్యంగ్యంగా వినిపించేడు.

 

    "నాకు బొట్టు పెట్టేడు. ప్రసాదమిచ్చేడు. మేడ ఎక్కేడు కదూ"

 

    అప్పటిగ్గాని సింహాచలం దార్లో పడలేదు. టీపాయ్ మీద పూలసెజ్జా దాని వాతావరణం చూసి ఉలికిపడి అన్నాడు.

 

    "క్షమించాలి సార్. లిస్టులో చివరిపాయింట్లు తప్పు చెప్పేను"

 

    "అసలు నీ ఉద్యోగమేమిటి?"

 

    "అబ్బాయిగారికి తెలీకుండా వారి సొంత విషయాలు సేకరించి' తమకి వినిపించడం సార్!"

 

    "దానికెంత ఇస్తున్నాను జీతం?"

 

    "సెవెన్ ఫిఫ్టీ ఏడొందల ఏభై సార్"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS