సుబ్బారావు నా కళ్ళల్లో నీళ్ళు తిరగడం చూశాడు గాబోలు, చప్పున నోరు మూశాడు. నేను కళ్ళు తుడుచుకుంటూండగా ఆచారి ఉలిక్కిపడి అడిగాడు. "అదేమిటి గురూ! నువ్వే - నువ్వేడుస్తున్నావా?"
నేను అనబడే ఈ బాబ్జీ ఇంతవరకూ ఏ విషయంలోనూ యేడవలేదు. నేనేడవమంటే యేదో మహాద్భుతం జరిగిందని అర్థం. అందుచేతనే ఆచారి అంత ఆశ్చర్యంగా అడిగాడు. సుబ్బారావు మళ్ళా మాటలారంభించాడు.
"చూశావా ఆచారీ? గురుడేడుస్తున్నాడు. రేయ్ బాబ్జీ! నువ్వు నక్కవురా. నా కెక్కడ పద్మ దక్కుతుందోనని భయపడి చచ్చే వెధవ్వి. ఎందుకురా ఏడుస్తావ్? మనిద్దరికీ పెళ్ళిళ్ళై పోయాయిగా. నీమీద నేను, నా మీద నువ్వూ ఏడవద్దు. సుఖపడనీ మరో మానవుడ్ని. మేగాడ్ బ్లెస్ పద్మాస్ పార్టనర్. మేగాడ్ సేవ్ మి అండ్ బాబూరావ్! ఆచారి చెప్పవోయ్! మనింగ్లీషెలా వుంది? మన మొహం లాగుందేమిటి. థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. చెప్పరా బాబ్జీ? నీ కథ కానివ్వు. దుఃఖం నటించకు. నా వొళ్ళుమంట. కానివ్వు."
ఆ ఉదయమే మేము స్వామివారి దర్శనం ముగించుకున్నాం. ఎక్కడ్నుంచి పట్టుకొచ్చేడో, రామానుజం రెండు దండలు తెచ్చాడు. సరిగ్గా స్వామివారి ఆలయం ముందు నేనో విచిత్రాన్ని కళ్ళారా చూచి అదిరిపోయాను.
పద్మ మెళ్ళో రామానుజం, రామానుజం మెళ్ళో పద్మ దండలు వేసుకున్నారు. ఓ నిమిషం పాటు ఆలయం ముందే నించుని వాళ్ళిద్దరూ చేతులు జోడించి ఆ దేవదేవుడికి నమస్కారం చేశారు. నాకవతల మతిపోతోంది. నేను తలదించేసుకుని నించున్నాను. రామానుజం నాతో అన్నాడు.
"మా వివాహానికి మొదటి సాక్షి మీరు. మమ్మల్ని దీవించండి రాజుగారూ. మేమిప్పుడు దంపతులమయ్యాం. కొన్ని విపత్కర పరిస్థితుల దృష్ట్యా మేమిలా చేయవలసి వచ్చింది. మా కంటిక్కనిపించే పెద్దలు మీరే సార్! సంసార సాగరంలో అడుగు పెడుతూన్న మమ్మల్ని మనసారా దీవించండి సార్!"
వాళ్ళిద్దరూ నాకు పాదాభివందనం చేశారు.
ఇక మనసారా వాళ్ళని దీవించాను. ఇదీ కథ. ఈ కథని ఇంకో పరిస్థితిలో మీకు నేను చస్తే చెప్పేవాడిని కాదు. కాని, నిన్నగాక మొన్న ఏలూర్లో నేనో దారుణం విన్నాను గనక ఇంత కథా మీకు నేను చెప్పాను.
రామానుజం ఏలూర్లో కనిపించాడు. మనిషి యావత్తూ నీరసంగా వుండి అతి భయంకరంగానూ వున్నాడు - పరిశీలించి చూస్తే అసహ్యంగానూ వున్నాడు.
నేనతని దగ్గరికెళ్ళి నించుని పలకరించాను. అతను దేన్నో వెతుకుతున్నట్టు నావేపు చూశాడు. నన్ను గుర్తించి అన్నాడు.
"ఏం సార్! జ్ఞాపకమున్నానా?"
నాకు ఒళ్ళు మండిపోయింది. మొట్టమొదటగా నేనే అతన్ని మరిచి పలుకరించాను. అంటే ఏమిటి - అతన్ని మరిచిపోయానని అర్థమా? డామ్ సిల్లీ డాగ్!
నేను వెంటనే అడిగాను -
"ఎలా వుంది మీ పద్మ? పిల్లలా?"
పద్మ విషయం అడగ్గానే అతను నిలువెల్లా కూలిపోయాడు. ఆ సోడా షాపు దగ్గిర వేసిన బల్లమీద కూర్చుని మొహాన్ని చేతుల్లో దాచుకుని కుళ్ళి కుళ్ళి ఏడవడం ప్రారంభించాడు. నాకు చెడ్డ రోత కలిగింది. నేనతన్ని కోప్పడేలోగానే అతను తేరుకుని జాలిగా అన్నాడు.
"లేదు సార్! పద్మ లేదు. ధనుర్వాతం పద్మని పొట్టన పెట్టుకుంది. ఒక డాక్టర్ని మింగింది మరో డాక్టర్! కళ్ళల్లో దుమ్ము కొట్టింది సార్! మనకి పద్మ లేదిప్పుడు. అందం చచ్చిపోయి రెన్నెళ్లయింది. ప్రేమ లేదిప్పుడు. నా పద్మ లేదు."
* * *
సుబ్బారావు గోడనానుకుని కూర్చున్నాడు. వాడికి యేడ్చేపాటి ఓపిక లేక సొమ్మసిల్లి పడిపోయినట్టున్నాడు. వాడి ప్రక్కనే ఆచారి. ఇద్దరి మొహాల్లోనూ జీవం లేదు.
సుబ్బారావుకే చెప్పాను.
"నా దీవెన అమోఘంరా సుబ్బారావ్! నల్లబండని చూపించి అది పిండై పోవాలని మనసారా దీవించానంటే క్షణంలో బూడిదై పోతుంది. నువ్వింత పచ్చగా బతుకుతున్న వెధవ్వా. నీ బతుకుమీద నా చూపు పడితే రెండో రోజుకల్లా "భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ" అయిపోతావ్. గనక కుర్రాళ్ళూ! బతికి బట్టకట్టుకోవాలనుకున్న జనంగాళ్లు నన్ను దీవించమని అడగరాదు. అలా అడిగారో దీవించేందుకు నేను వెనుకాడను గాని వాళ్ళ ఖర్మ కాలిపోయిందని మాత్రం ఖచ్చితంగా చెబుతాను. సంవత్సరం క్రితం రామానుజాన్ని, పదమని దీవించాను. వాళ్ళ పట్ల నాకున్న జెలసీని దాచుకొని, పద్మమీద నేను పెంచుకున్న 'కోరిక' నోరుమూసి దీవించాను. దాని ఫలితమే పద్మ దిక్కుమాలిన చావు. అర్థమైందట్రా! శెహభాష్? భస్మాసురుడి బాబున్నేను. తప్పుకోండి నేను వెళ్ళిపోవాలి. మరో యెదుటి మనిషి నెత్తిమీద నా హస్తం వుంచాలి. దారివ్వండి...."
గబగబా రోడ్డుమీదకొచ్చేశాను. అయితే నాకు రోడ్డుగానీ, దానిమీద వస్తువులు గానీ స్పష్టంగా కనిపించడం లేదు. నా శరీరంలోని అన్ని శక్తులూ కలిసి నామీద స్వారీ చేస్తున్నట్టనిపించింది. నడిరోడ్డుమీద ఒరిగి పోవడమే తెలుసు నాకు.
మళ్ళా కళ్ళు విప్పినప్పుడు నేను ఆచారి గదిలో వున్నట్లు గమనించాను. నా ముందున్న ఆచారి, సుబ్బారావూ యిద్దరూ దిగులుగా ఆందోళనగా నావేపు చూస్తున్నారు.
నా పట్ల వాళ్ళ స్నేహానికి నేను ముగ్ధుడనయ్యాను. "కళ్లు విప్పాడు గురూ! బతికించావురా బాబు, అదిరి చచ్చేం" అన్నాడు. ఆచారి కళ్ళల్లో ఆనందం నింపుకుని!
"నీ మనస్సు వెన్నరా వెధవా! ఉత్త పిచ్చి సన్నాసివి" అన్నాడు సుబ్బారావు నా తల నిమురుతూ. వాడి కనుకొలకుల్లో నీళ్ళు నిలిచి వున్నాయి. సుబ్బారావు మాటతో నా మనస్సు కుదుటపడింది.
* * * *
