"ఏమండోయ్!"
శేషు ఆగిపోయి, ఆ కుర్రాడివేపు ఏమిటన్నట్టు చూసేడు-
"మీరు కూడా ఈ ఆఫీసులోనే పనిచేస్తున్నారా?" కుర్రాడు అడిగేడు.
శేషు తల ఊపేడు.
"మా నాన్న కూడా యిక్కడే పనిచేస్తున్నాడు లేండి. చాలా పెద్ద ఉద్యోగం!"
"అట్లాగే? ఏమిటో అంతపెద్ద ఉద్యోగం?" శేషు అడిగేడు.
"వాచ్ మేన్!"
కుర్రాడి అమాయకత్వానికి ముచ్చటపడ్డాడు శేషు.
"నాన్నకి అన్నం పట్టుకొచ్చేనండీ! దీన్ని మా నాన్నకిస్తారా-నేను స్కూలుకి వెళ్ళిపోవాలి" అంటూ కేరియరు శేషు చేతిలో పెట్టేడు.
శేషు కేరియరు తీసుకున్నాడు.
"త్వరగా ఇవ్వండి. ఆలస్యమైతే పాపం-మా నాన్న ఆకలికి ఆగలేడు. గిలగిలా తన్నుకుంటాడు."
వాళ్ళ నాన్న గురించి అంత ఇదిగా చెబుతుంటే-శేషు మరింత కుతూహలంగా అడిగేడు.
"రోజూ, నువ్వే మీనాన్నకి అన్నం తెస్తావా?"
"ఉహు! మొన్న మొన్నటివరకు మా అమ్మ తెచ్చేది!"
"మరి ఇప్పుడు నువ్వు తెస్తున్నావే!"
"మా అమ్మ చచ్చిపోయిందిగా! నేను తీసుకురాకపోతే ఎవరు తీసుకొస్తారు? త్వరగా ఇవ్వండేం!"
అంటూ కుర్రాడు వెళ్ళిపోయేడు.
అతని మాలు శేషుని కలవర పెడుతుండగా-ఆ కుర్రాడి వేపే చూస్తూ నిలబడిపోయాడు.
ఆ వేళకి వాచ్ మేన్ శేషుని చేరుకొని-కేరియరు తీసుకుంటో క్షమాపణ చెప్పుకునే ధోరణిలో అన్నాడు.
"క్షమించాలండయ్యా! కుర్రోడు- తమరెవరో తెలవక తమకిచ్చేడు"
"పర్లేదులే! నీకెంతమంది పిల్లలు?"
ఈడొక్కడేనండయ్య (ఆగి భారంగా అన్నాడు) కట్టుకున్న మడిసి కన్ను మూసింది. కన్న కొడుకు సిన్నోడైనా నన్ను కంటికి రెప్పలాగా సూసుకుంటాడండి!"
ఆ మాటకి మరింత కదిలిపోయాడు శేషు. 'అదృష్టవంతుడివి' అని వాచ్ మేన్ తో అనేసి అక్కడ్నించి కదిలేడు.
లంచవరు కాబోలు-కంపెనీలో వాళ్ళంతా కేరియర్లు పుచ్చుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూసుకుంటో వామనరావు గదివేపు నడుస్తున్నాడు శేషు.
అతనికి కుర్రాడి మాటలు వినిపిస్తూనే వున్నాయి-
"ఆలస్యమైపోతే-పాపం-మానాన్న ఆకలికి ఆగలేడు. గిలగిలా తన్నుకుంటాడు."
శేషు తండ్రి గది దగ్గిర కొచ్చేడు. తలుపు దగ్గిర నిలబడి అద్దంలోంచి లోపలికి చూస్తున్నాడు.
వామనరావు ఎవర్తోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
"ఇవాళ డిన్నర్లూ గిన్నర్లూ కుదరవు నాకు. నే రానంతే! (ఫోన్ లో క్షణంసేపు విని కసిగా, దిగులుగా అన్నాడు) ఫిష్ కర్రీ కావచ్చు, చికెన్ మషాలా, కైమాబాల్స్ కావచ్చు. అయ్ డోంట్ కేర్...(క్షణమాగి) అయ్ టెల్యూ-కర్రీస్ పేర్లు చెప్పి నన్ను ఊరించకు. (బాధగా) ఇవాళ నేను భోంచేయకూడదయ్యా! అదంతే!...కారణమేమిటంటే ఏం చెప్పను! ఏకాదశినోము. ఇవాళ ఏకాదశి కాదా? అయ్ టెల్యూ-ఫర్ మీ ఇటీజ్ ఏకాదశి! దట్సాల్!" అంటూ ఫోన్ పెట్టేసి బాధగా గొణుక్కుంటున్నాడు-
"ఫిష్ కర్రీ! చికెన్ మషాలా! కైమాబాల్స్. హు...దేనికైనా వుండాలి ప్రాప్తం!" అని తలపట్టుక్కూచున్నాడు.
శేషు గొప్ప బాధపడిపోయాడు. నిట్టూర్చి అక్కడ్నించి కదిలేడు.
వామనరావు ఆకలి బాధకి తట్టుకోలేక-టేబిల్ మీదున్న నీళ్ళగ్లాసు తీసుకుని గడగడా తాగేసేడు.
అంతలో ఇంటర్ కమ్ మోగింది- ఎత్తుకున్నాడు.
అవతలినుంచి శేషు మాటాడుతున్నాడు.
"నాన్నా! నా గదికిరా!"
ఫోన్ పెట్టేసి గొణుక్కుంటున్నాడు వామనరావు-
"మళ్ళా ఏంకొంప మునిగిందో ఏమో! ప్రాణాలు తీసేస్తున్నాడు."
అనుకుంటూనే ఏడుకొండలస్వామి పటానికి చేతులెత్తి మొక్కుతూ అన్నాడు-
"అయ్ టెల్యూ-వాడిక్కోపం రాకుండా చూడు!"
అంటూ తన గదిలోంచి ఖంగారుగా నడిచేడు.
శేషు గదిలోకి వామనరావు దిగాలుగానే నడిచేడు. తండ్రిని చూడగానే శేషు లేచి నించున్నాడు.
"ఇప్పుడు నావల్ల ఏం తప్పు జరిగిందని, అంత అర్జంటుగా పిలిచేవ్!"
శేషు చిరునవ్వు నవ్వేడు. వామనరావు రిలాక్స్ య్యాడు. శేషు తండ్రిని లోపలి గదిలోకి తీసుకెళ్ళేడు.
ఆ గదిలో-
రకరకాల ఖరీదైన భోజన పదార్థాలు అమర్చబడి వున్నాయి. వాటిని చూడగానే వామనరావు షాకైపోయాడు.
శేషు అన్నాడు.
"నీకిష్టమైన అయిటమ్స్ హోటల్ జింజింనుంచి తెప్పించేను."
అంటూ ఒక స్వీట్ తీసి-
"నోరు తెరు...ఆ...అదీ! ఎట్లా వుంది?"
స్వీట్ తింటూ, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా ఉబ్బితబ్బిబైపోతూ అన్నాడు వామనరావు.
"అయ్ కాంట్ సే ఇన్ వర్డ్స్ మై బోయ్ ఎట్లా వుందో నువ్వే చెప్పాలి."
అంటూ వామనరావుకూడా మరో స్వీట్ తీసుకుని శేషు నోటికి అందించేడు.
"హవ్ ఈ జిట్?" అడిగేడు.
"సో స్వీట్ ఫాదర్!"
వామనరావు శేషుని కౌగలించుకున్నాడు. ఆ ఇద్దరూ కొన్ని క్షణాలపాటు కౌగిలింతలో వున్నారు.
వెంటనే వామనరావు అన్నాడు.
"కమాన్..కమాన్...ఆకలి దంచేస్తోంది. అందునా ఫుడ్ అయిటమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయేమో, ఆకలి గొప్ప గొడవ చేసేస్తోంది...క్విక్!"
అంటూనే ప్లేట్లు సర్ది వడ్డన చేస్తున్నాడు.
16
అమ్మవారి గుడి.
క్యూలోనే వున్నాడు శేషు. అతనికి చాలా దూరంగా వుంది గంట. ఆ గంటవేపు చూస్తూ, అమ్మవార్ని స్మరిస్తూ నడుస్తున్నాడు శేషు.
అంతలో శేషుమీద, ఏదో బరువు మెత్తగా సుతిమెత్తగా హాయిగా తగలడంవల్ల అతను కొంచెం ముందుకు తూలేడు.
శేషు వీపుమీద అందమైన అమ్మడు ఆనుకుని వుంది.
ఆ దృశ్యం సరిగ్గా అదేస్థితిలో ఫ్రీజైపోగా, శేషు అంతరాత్మ కొన్ని వాక్యాలు వినిపించింది.
"స్పర్శ కొత్తగా మెత్తగా సుఖంగా వుందా? ఉంటుందంటుంది. హాయిగా వుందికదాని బొమ్మలా నిలబడిపోతే మర్యాదగా వుండదు కదులు!"
