"ఏదో కొంచెం. ముందా చేతినిలా యివ్వండి" అన్నాను చొరవగా.
పద్మ చేతిని తాకి నన్ను నేనే మరిచాను. ఏదో చెప్పక తప్పదు గనుక చాలా విషయాలు (ఊహించి) మహత్తరంగా చెప్పి పదమని మురిపించేద్దామనుకున్నాను. కాని, ఆ ఆడపిల్ల నా మాయమాటలు నమ్మలేదో, ఏమోగాని నవ్వుతూ విన్నదంతే. అప్పుడు నా వొళ్లు మండిపోయింది. పదమని ఏడిపించాలనే ఉద్దేశంతో అతి సాహసంగా ఒక చిన్న బాణం విసిరాను.
"ఐయామ్ సారీ పద్మా! మీకు చెప్పగూడనిది తప్పనిసరై చెబుతున్నాను. మీ చేతిలో ఉన్న వివాహ రేఖ చిత్రంగా వుంది. ఒకరకంగా వ్యాఖ్యానిస్తే మీకు రెండు పెళ్ళిళ్ళు"
పద్మ ఆ మాటకి గలగలా నవ్వేసి తన చేతిని నా చేతుల్లో అలాగే వుంచి నిర్భయంగా అన్నది -
"సరిగ్గా చూడండి సార్! మునుపెవరో నాకు నాలుగు పెళ్ళిళ్ళని చెప్పారు. ఇప్పుడు నేనెవరి మాట నమ్మేది"
పద్మ చొరవకి నేనదిరి చచ్చాను!
* * *
కథ నింతవరకూ విన్న తర్వాత సుబ్బారావుకి కోపమొచ్చేసింది. చివాలున లేచి నించోబోయాడు. కానీ, మందు ప్రభావం అతన్ని లేవనివ్వలేదు. అందుచేత వాడు కూచునే నన్ను తిట్టడం ప్రారంభించాడు.
"చెప్పుకోరేయ్ బాబ్జీ! నువ్వు చెప్పేదంతా పచ్చి గాస్! ఏడాది క్రితం నీకు పద్మ కలిస్తే ఇంతదాకా నాకెందుకు చెప్పావు కాదు. అసలు నువ్వు పద్మని కలుసుకోడమే పెద్ద కొత్త. దానికింత కథా."
"నిజవేఁ గురూ! ఏడాది క్రితం తిరుపతి బస్సులో నేనో అమ్మాయిని బాబ్జీ ప్రక్కన కూచోడం చూచాను. అయితే ఆ అమ్మాయి పద్మో కాదో తెలీదు. ఎందుచేతంటే నాకు పద్మెవరో తెలీదు" అన్నాడు ఆచారి.
"నువ్వు నోర్ముయ్ రా చారిగా! ఎవర్ని చూచి ఎవరనుకున్నావోగానీ, మీడుత్త రౌడీ వెధవ! వీడి దగ్గర అన్నీ కట్టుకథలే. ఏరా బాబ్జీ! నీతోనట్రా పద్మ మాట్లాడింది? ఫూల్! డామ్ ఫూల్. నోరు మూసేయింక. పద్మకి రెండు పెళ్ళిళ్ళని చెప్పావా? డొక్క చీలుస్తా. పద్మ చేతిని చూచే సాముద్రికం గాడివిట్రా నువ్వు. ఆ అమ్మాయితో పేకాటాడావ్. పద్మ నీలాగ జూదం మనిషి కాదురోయ్ రౌడీ! ఒరేయ్! నన్ను కొట్టాలని వుంటే కొట్టు. చంపవతల పారేయ్. ఆచారీని పొడిచెయ్. నేను కాదనను. కాని బాబ్జీ! వెధవ్వేషాలేసినట్టు కథలు చెప్పకు. అవుట్. గెటవుట్ యూ రాస్కెల్! రేయ్ చారీ! నన్ను కొంచెం పట్టుకోరా బాబూ. లేవలేకుండా వున్నాను. నిండా తాగించాడు ఫూల్. సోలాన్ తొందరగా కిక్ యిచ్చింది. ప్లీజ్ సాయం పట్టరా చారీ. వస్తారా బాబ్జీ నీ కథకీ నీకూ ఓ నమస్కారం. వస్తా" ఆచారి సాయంతో వాడు లేవబోయాడు.
"ఎవడూ లేవద్దు. లేస్తే మీ ప్రాణాలు తీస్తాను. కూర్చొండలా" గది దద్దరిల్లేలా అరిచాను. నా కళ్ళల్లోని ఎర్రదనం చూచారో యేమోగాని యిద్దరూ కూర్చుండిపోయారు. సుబ్బారావు సిగరెట్టు ముట్టించాడు. ఆచారి గ్లాసులో మందు నింపి నా ముందుంచాడు.
"నేను కథలు చెప్పన్రా సుబ్బారావ్! రాస్తాను. నేను చెప్పేది నిజం. పద్మని కలుసుకున్న వైనం నీకు ఏడాదిపాటు చెప్పలేదంటే - కారణం యేమిటనుకున్నావ్. పద్మ నన్ను అవమానించిందిరా గాడిద! ఆ కథా విను. వినంతె."
* * *
అర్ధరాత్రి అకస్మాత్తుగా మేలుకున్నాను. పడుకునే చుట్టూ చూశాను. నాకవతలగా చిన్న గురకతో రామానుజం తలనిండా దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. సరిగ్గా నా ముందున్న మంచం మీద హోల్డాలు పరుచుకొని పద్మ వెల్లికిలా పడుకున్నది. గదిలో వెలుగుతున్న లైటు వెల్తుర్ని మించిన చాయగల ఒకానొక అప్సరస అలసిపోయి తర్వాత మైమరచి నిద్రిస్తున్న భంగిమను నేను చూచి కలవరపాటు చెందాను. లేచి నుంచుందామనిపించింది.
నిద్రలో పద్మ కొంచెం కదిలింది. ఆ కదలికలో నామతి పూర్తిగా పోయింది. పిచ్చివాడినైపోయాను. లేచి నుంచున్నాను. సిగరెట్టు ముట్టించుకునేందుకు చేతులాడలేదు. నా శరీరంలో యేదో అద్భుతమైన చలనం కలిగింది. నేను దానిని పూర్తిగా లొంగిపోయాను.
నెమ్మదిగా పద్మవైపు నడిచి, ఆమెను చేరుకున్నాడు.
ఆమె మొహంలోకి, పెదాలమీద నా దృష్టి నిలిచింది. పద్మ నిద్రలో ఒక దరహాసాన్ని విసిరింది. పులకించి పోయాను. పుత్తడిబొమ్మలా మెరిసిపోతున్న పద్మని అతి దగ్గర్లో చూచిం తర్వాత నేను సర్వం మరిచిపోయి ఫూలునై పోయాను.
పద్మ మొహంమీదికి వొరిగాను.
"వండ్రఫుల్! అసాధ్యులే మీరు" అన్నది పద్మ కళ్లు విప్పి.
లేచి నిటారుగా నించున్నాను. సిగ్గుతో తలవొంచేను. నిలువెల్లా వొణికిపోతున్నాను.
"నేనేమీ అనుకోను గాని వెళ్ళి పడుకోండి. రామానుజం లేస్తాడు. గొడవ చేయకుండా వెళ్ళిపోండి" అన్నది పద్మ మెత్తగా.
నేను నా పక్కమీద నడుం వాల్చిన తర్వాత అడిగింది.
"మనం చదువుకునే రోజుల్లోనేగా మీకు పెళ్ళయింది."
"........."
"మీ ఆవిడెంతవరకు చదువుకున్నారేమిటి?"
"........."
"అవును బాబ్జీగారూ...."
"ప్లీజ్ క్షమించండి పద్మగారూ. నేను పిచ్చివాణ్నైపోయాను. ఆవేశానికి లొంగిపోయాను!
పద్మ అలలాగా నవ్వి అన్నది -
"ఏమిటో విడ్డూరంగా మాటాడుతున్నారు మీరు. నిష్కాముకులైన మహామునులే మీరనుభవించిన అవస్థకి తలలొంచి పారేశారు. ఉప్పు కారం తినే మానవులం. మనమెంత? నేనేమీ అనుకోను. మీరు ఏమీ అనుకోవద్దు. ఉదయమే మనం స్వామి దర్శనం చేయబోతున్నాం. నిర్మలమైన మనసులో స్వామిని చూచేందుకు ప్రయత్నిద్దాం. సరేనా! గుడ్ నైట్."
"సీ బ్యాడ్ నైట్ పద్మా" అన్నాను బాధగా.
* * *
సుబ్బారావు మొహంలో వెలుగు నిండింది. అతి జాగ్రత్తగా వాడు కొన్ని మాటల్ని నా గుండెల్లో దించేసేడు.
"చూసేవా ఆచారీ! నా పద్మేమిటనుకున్నావ్. దేవతరా బాబు దేవత. నిప్పు, నెంబర్ వన్. ఎన్ని యుగాలకైనా సరే. ఆ దేవతలాంటి దేవత ఈ భూమ్మీద పుట్టదు గాక పుట్టదని రాసిస్తాను. ఛాలెంజ్ చేస్తాను. మునుపటి సుబ్బారావుని కాదురా నేను. నేను ప్రయోజకుడినైపోయాను సార్. సుబ్బారావ్ ది గ్రేట్ నైపోయాను. ఈ చేతుల్లో వేలూ లక్షలూ తిరుగుతుంటాయి. మా ఫాదరికి నేనొక్కడ్ని సంతానం. నాన్నా- పద్మ కావాలి, అన్నాననుకో. యస్. సన్, కొనుక్కో అనేస్తాడు నాన్న. తర్వాత మా పెళ్ళి. ఆకాశమంత పందిరి, భూదేవంత మందిరం. మా పద్మమ్మ పెళ్ళికూతురాయెనే, మా సుబ్బిగాడు పెళ్ళికొడుకాయెనే, రేయ్ బాజాలో వాయించండ్రా వాయించండి. మాంచి త్యాగరాజు - ఒరేయ్ బాబ్జీ! త్యాగయ్య! త్యాగరాజురా? ఎవడైతేనేం. వాడికీర్తన వొకటి వాయించవతల పారేయండి. తలుపు దగ్గిర -నేనూ, పద్మ పేర్లు చెప్పాలిగా. ఆల్ రైట్ నో ఫియర్స్. మనకి సిగ్గేమిటి సార్? నేనూ మా - బహువచన మేమిటోయ్ సన్నాసీ. బాజిగాడు జోస్యంలా, నేనూ నా పద్మ వచ్చేశాం. పద్మా నువ్వూ చెప్పు. సిగ్గుపడకు. చెప్పేయ్. కాని ఆచారీ నాకు పెళ్ళయిపోయింది గదరా! ఇంత చేస్తుంటే చూస్తూ నా పెళ్ళాం వూరుకుంటుందా? గనక లాభం లేదు. పద్మా మనం వచ్చే జన్మలో కలుసుకుందాం..."
