అతను మెల్లిగా శేషు గదిలోకి వెళ్లేడు. శేషుకి దుప్పటి కప్పేడు. అతని వళ్ళంతా తడిమి- ఆ చేతుల్ని తనివి తీరా ముద్దాడేడు ఆ తర్వాత ఆ గదిలో లైటాఫ్ చేసి వెళ్ళిపోయేడు.
ఈ తతంగం యావత్తూ శేషు చూసినట్టు వామనరావుకి తెలీదు.
13
ఉదయం ఎనిమిది.
డైనింగ్ టేబిల్ ముందు వామనరావు ఒక్కడే వున్నాడు. టేబిల్ మీద బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేయబడింది.
వామనరావు అటూఇటూ చూసి-పనిమనిషిని అడిగేడు...
"అబ్బాయ్ గార్ని రమ్మను."
మరో పక్కనుంచి మరొకడు ఒకప్లేటు పట్టుకొచ్చేడు. ఆ ప్లేటులో ఒక కాగితముంది.
ప్లేట్ ని టేబిల్ మీద పెట్టి వాడు వెళ్ళిపోయాడు. వామనరావు కంటికి కాగితం కనిపించింది.
ఆత్రంగా చదివేడు. ఆరాత శేషు గొంతుతో చదవబడింది.
"నాన్నా! రాత్రి నువ్వు మామూలు పరిస్థితిలో ఇంటికి రాలేదు. అంచేత నేను నీతో నాలుగురోజులు మాటాడను."
ఆ హెచ్చరికకు వామనరావు తల్లడిల్లిపోయాడు. శేషూ అంటూ టేబిల్ మీద నుంచి లేచిపోయాడు.
14
పూజగది.
ఆ గదిలో శేషు వాళ్ళమ్మలాగే నిష్టగా పూజ చేస్తున్నాడు. వామనరావుకి లిప్తపాటు శేషుస్థానంలో సుభద్రే కనిపించింది.
ఉలిక్కిపడ్డాడు వామనరావు.
శేషు గంటకొట్టి పూజా ద్రవ్యాలతో పూజ గదినుంచి బయటకు వస్తున్నాడు.
శేషు పూజ గది విడిచి వచ్చింతర్వాత.
వామనరావు శేషుని తృప్తి పరిచే నిమిత్తం...చొరవగా పళ్ళెంలోంచి కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకున్నాడు.
ప్రసాదంకూడా తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నాడు. ఆ తర్వాత అసలేం జరిగిందో చెప్పడం ప్రారంభించేడు.
"రాత్రి చాలా పెందరాళే ఇంటికొద్దామని ప్రయత్నించేను. కానీ"
శేషు వామనరావు మాటలు వినిపించుకోకుండా... మేడ మెట్లెక్కుతున్నాడు. అతని చర్యకి వామనరావు నోరుపడిపోయినట్లయింది. క్షణం పాటు శిలా ప్రతిమలా నిలబడిపోయాడు.
ఆ తర్వాత తానుకూడా పరుగెత్తుకుంటో మేడ మెట్లెక్కేడు. ఇద్దరూ శేషుగది చేరుకున్నారు. ఆ గదిలో శేషుతో వామనరావు కథ చెబుతున్నాడు.
"రాత్రి పాపం-కనకారావుకి గుండెపోటు విపరీతంగా వచ్చేసిందిరా శేషు. వాడ్ని..ఆ స్థితిలో ఆస్పత్రిలో విడిచేసి రాబుద్ధి పుట్టలేదు. అంచేత ఏమిటంటే..." ఒక చెట్టుమీద కొన్ని కాకులు కావు కావుమని అరుస్తున్నాయి.
శేషు గదిలో-
వామనరావు శేషుతో ఏదో చెబుతూనే వున్నాడు. అయితే కావు కావుమనే కాకుల శబ్దంలో అతనేం చెబుతున్నదీ అర్థం కావడంలేదు.
టై కట్టుకోడం పూర్తిచేసిన శేషు తండ్రి వేపు సీరియస్ గా చూసేడు.
అకస్మాత్తుగా కాకుల శబ్దాలు ఆగిపోయాయి. శేషు తండ్రిని గంభీరంగా ప్రశ్నించేడు.
"కాకమ్మ కథలొద్దు నాన్నా! రాత్రి నువ్వేం చేసేవో నా కళ్ళల్లోకి చూసి చెప్పు."
దాంతో వామనరావు బాగా దెబ్బతినేసేడు. వెంటనే సంబాళించుకున్నాడు. ఇక తప్పదన్నట్టు నిజమే చెప్పేడు. ఒక్కోమాటా కూడబలుక్కుంటూ...
"అవున్రా! తాగేను. బాగా ఎక్కువే తాగేను. గోపాలరావుగాడి మీద వళ్ళు మండిపోయి తాగేసేను."
"దట్ మీన్స్-నువ్వుమాట తప్పేవు!" అన్నాడు శేషు.
"మాటేమిట్రా మాట!" వామనరావు చిరాగ్గా అడిగేడు.
శేషు మరింత గంభీరంగా అన్నాడు-
"మన ఎట్రిమెంటు మరచిపోయావా నాన్నా! నాకు పెళ్ళంటూ జరిగితే-నువ్వు తెచ్చిన సంబంధమే చేసుకోవాలన్నావు. గుర్తుందా?"
వామనరావు కూడా గంభీరంగానే అన్నాడు-
'అయ్ టెల్యూ-అది కేవలం అగ్రిమెంటే కాదురా! నా జీవిత లక్ష్యం!"
"నీ జీవిత లక్ష్యం నెరవేరాలంటే-మన అగ్రిమెంటు ప్రకారం నా మాటకూడా నువ్వు వినాలిగదా! నిన్ను తాగొద్దని చెప్పేను. అయినా తాగేవు. నువ్వు నా కిచ్చిన మాట తప్పినట్టే నేనుకూడా నీకిచ్చినమాట తప్పవచ్చుగదా! దట్ మీన్స్-నువ్వు తెచ్చే సంబంధం కాదని- నాకిష్టమైన పిల్లని ప్రేమించి పెళ్లాడవచ్చుగా!"
శేషు గురిచూసికొట్టిన దెబ్బకి వామనరావు అల్లాడిపోతూ అన్నాడు.
"ఒరే శేషూ-ఫర్ గాడ్ సేక్-అంత మాటనకురా! పెద్దవాడ్ని బుద్ధితక్కువై మాట తప్పేను. నువ్వుకూడా మాట తప్పితే నా ఆశయం, లక్ష్యం, ధ్యేయం అన్నీ సర్వనాశనమైపోతాయి నాయనా! (సీరియస్ గా అన్నాడు) ఒరే-ఇకముందు తాగను. తాగను. తాగను. ఒ.కె?"
అప్పటిక్కూడా శేషు వదిలిపెట్టలేదు.
"రాత్రి తాగిన దానికి శిక్షేమిటి?"
వామనరావు సరైన సమాధానమే చెప్పేడు-
"నువ్వు నీ మాట తప్పకుండా-నీ యిష్టమొచ్చిన శిక్ష విధించు!"
శేషు కోపంగా అన్నాడు.
"ఈ రోజు నేను పచ్చి మంచినీళ్ళుకూడా ముట్టుకోను."
వామనరావు ఖంగారుగా అన్నాడు.
"ఒరే...ఒరే...నాకు విక్ష వేయమంటే, నిన్ను శిక్షించుకుంటావేమిట్రా పిచ్చివాడా?"
"ఎవర్ని శిక్షిస్తే ఎవరు దార్లోకి వస్తారో నాకు బాగా తెలుసు. నోమోర్ డిస్కషన్స్..."
అంటూ అతను వెళ్ళబోతుంటే-అతన్ని పట్టుకుని ఆపి అన్నాడు వామనరావు.
"అయ్ టెల్యూ-నాకు శిక్షేమిటో నేనే వేసుకుంటానురా. నీతోబాటు నేనుకూడా బ్రేక్ ఫాస్ట్, భోజనం బంద్...ఆ...అంతే!"
15
వామన్ స్కూటర్స్ ఆఫీసు.
శేషు గదిలో కూర్చున్న ఖరీదైన ఆసామి లేచి నించున్నాడు. అతని చేతిలో ఫైలుంది.
శేషుకూడా మర్యాదకోసం లేచి నిలబడ్డాడు. ఆసామి అంటున్నాడు.
"రేపు రిజిస్ట్రేషన్ వర్కుంది. అది కూడా పూర్తిచేసుకుని బొంబాయి వెళ్ళిపోతాను. ఒ.కె?"
అంటూ కరచాలనం కోసం చెయ్యి అందించేడు. శేషు కరచాలనం చేస్తూ ఒ.కె. అన్నాడు.
ఇద్దరూ ఆ గదిదాటి బయటకొచ్చేరు.
వామన్ స్కూటర్స్ ఆవరణలో ఆసామి తన కారెక్కేడు. శేషు చెయ్యి ఊపేడు.
కారు వెళ్ళిపోయింది.
ఆ కారు వెళ్ళిపోయిం తర్వాత-ఏడేళ్ళ కుర్రాడు టిఫిన్ కేరియర్తో వస్తూ కనిపించేడు.
శేషు ఆఫీసులోకి వెళ్ళబోతుండగా, కుర్రాడే పిలిచేడు.
