Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 61


    నేనుత్త అసూయపరుడ్ని. నాకు లేని ఆనందం, నేనెరుగని సుఖం, నాకు తెలీని రుచి - ఎదుటి వాడెవడైనా సరే అనుభవిస్తున్నట్టు పసిగడితే నాకు కడుపుమంటగా వుంటుంది. వినేందుకు ఎదుటివాడు సిద్ధపడితే నేనేమనుకుంటున్నదీ స్పష్టంగా చెప్పగలను కూడా.
    పద్మ ఢిల్లీలో వాళ్ళన్నయ్య దగ్గరుండి, అక్కడే మెడిసిన్ చదువుతున్నట్టు యిందాక చెప్పింది. ఎంత మెడికో అయితేనేం, పట్టపగ్గాలేకుండా పరాయి మగవాడితో యింత రాసుకు తిరగడం విడ్డూరమే. (రామానుజం స్థానంలో నేనుంటే అది విడ్డూరం కాదని రాసిస్తాను. అది వేరే విషయం)
    నెల్లూర్లో దిగి టీ తాగుదామనుకున్నవాడిని, టీ తాగేందుకు దిగకుండా వాళ్ళిద్దర్నీ చూస్తూ కూర్చున్నాను. కాసేపటికి బస్సు కదిలింది.
    డాక్టరీ చదివే మనుషులకి "ఎనాటమీ" పూర్తిగా తెలీడం మూలంగా, సెక్స్ ఎలిమెంట్ ని వాళ్ళ కోర్సు పూర్తయ్యేలోగా దూరం చేసుకుంటారనే దురభిప్రాయం కల వాడిన్నేను. కనక - పద్మ అటు రామానుజమ్మీదకు వొరిగినట్టే ఇటు నా మీద గూడా వొరగవచ్చు కదా.
    ఒక గొప్ప ప్లాన్ వేశాను. నిద్ర నటించిన చాలాసేపటికి నేనే పద్మవేపు వొరిగాను. నేను పద్మమీదికి వొరగడమే కాకుండా, మెల్లిగా ఆమెని నావేపు వొరిగేట్టు చేసుకున్నాను.
    ఉదయం తొమ్మిది గంటల ప్రాంతాన తిరుపతిలో దిగేం. ఎకాఎకిని యెగువకి వెళ్లిపోదామనుకున్నాను. పద్మ వెంటనే రాలేనన్నది. కనీసం, ఆ ఒక్కరోజూ కింద గడిపి తర్వాత రోజు ఉదయమే స్వామి దర్శనం చేద్దామన్నది.  దానికి రామానుజం తలూపాడు. రామానుజం గంగిరెద్దు. నేనూ వాళ్ళ కోరిక ప్రకారం ఆగిపోక తప్పింది కాదు.
    ఒక గది పుచ్చుకున్నాం. స్నానాలు ముగిసిం తర్వాత కాసేపు బాతాఖానీ జరిగింది. మాటల్లోనే రామానుజం నిద్రలోకి జారుకున్నాడు. నిద్రకాగలేని మనుషులంటే నాకు చెడ్డ చిరాకు. పద్మ మొహం చూచి రామానుజాన్ని నేనేమీ అనలేకపోతున్నాను.
    ఆ మధ్యాహ్నం భోజనాల తర్వాత రామానుజం మళ్ళీ నిద్ర సీన్ కీ జారుకున్నాడు. అతను నిద్రపోతుండగా పద్మ అన్నది -
    "ఒట్టి నిద్ర మనిషి. వాళ్ళమ్మా నాన్న ఇతన్నలా పెంచారు పాపం!"
    "కొందరస్తమానం నిద్రకోసం మొహం వాచీ వుంటారు. వాళ్ళ జీవితకాలమంతా యీ నిద్రలోనే గడిచినా దిగులుపడరు. నన్నడిగితే ఈ జాతి మనుషులు నిద్రపోవడం మినహాయించి మరో తెలివిగల పని చేయలేరని చెప్తాను" అన్నాను.
    "అది తప్పు" అన్నది పద్మ.
    నిద్రనే గతిమాలిన సంగతిపట్ల నాకు అభిమానం లేకపోవడం చేత నేనెక్కువసేపు పద్మతో వాదించలేదు. పద్మ చీట్లపేకని తీసింది పేకని కలుపుతూ అన్నది -
    "మీకు చాతవునా?"
    "కొంచెంగా వచ్చు"
    "అయితే చేయి కలపండి. కట్ జోకరేద్దాం. స్టేకెంత?"
    "అది కూడా మీరే చెప్పండి"
    "అయిదు పైసలు - నేషనల్"
    "ఆల్ రైట్" అనేశాను ఉత్సాహంగా.
    పద్మనే ఆడపిల్ల (అందమైనది) పేకాటలో నిపుణురాలని నాకిప్పుడే తెలిసింది. పేకాటలో మొదలెట్టిన గంటలో నా దగ్గిర్నుంచి పన్నెండు రూపాయిలూడగొట్టేసింది. పద్మ పేకాటానుభవాన్ని ఆట మధ్యలో అక్కడో ముక్క ఇక్కడో ముక్కగా చెప్పింది.
    "మాకు సీనియర్ ఒకతనుండేవాడు. మిస్టర్ పాల్. అతను క్రిస్టియను కాడు. పూర్తిపేరు గోపాలం. మనవేపు వాడే. పాల్ కి నాతో ఆడాలని మహా గొప్ప సరదా. అతని క్వార్టర్స్ కి నేనొచ్చి పోయే నిమిత్తం. టాక్సీఫేర్ కూడా అతనే భరించేవాడు. అతను మీ అంత తెలివైన ఆటగాడూ కాదు. సీక్వెన్స్ కట్టడమే చాతకాదు. నాలుగు జోకర్లు పేకలో కలిస్తే అతని ఖంగారు వర్ణనాతీతం. ఖచ్చితంగా రాంగ్ షో తిప్పేస్తాడు. అతనోడిపోని రోజు లేదంటే నమ్మండి. అయినా సరే. నాతో అతను పేకాట మానేవాడు కాదు. అతనంటే నాకు చచ్చేంత జాలి. ఒకసారేమైందో తెలుసాండి - అతను విపరీతంగా సిగరెట్టు కాలుస్తుంటాడు లెండి. ఆ అలవాటుని మాన్పించాలని నేనో యెత్తువేసి అతన్తో అన్నాను. 'మిస్టర్ పాల్! మీరా కాష్టదహనం మానకుంటేనే గానీ, నేను మీతో పేకాట ఆడనావటానికి అంతే బంద్. ఇప్పటికొచ్చి అతను సిగరెట్లు కాల్చడం చూళ్ళేదు నేను. నేనంటే అతనికి భక్తి, విచిత్రంగా వుంది కదూ!"
    "లేదు" అన్నాడు.
    "ఎందుకనిట?"
    "పాల్ నాకు తెలుసు. మా కజిన్ మొగుడతను. మొన్నీమధ్య పెళ్ళయింది."
    "ఓ గాడ్! చెప్పారు కాదే."
    "మీరతన్తో చనువుగా వున్న రోజుల్లో అతనికి పెళ్ళి కాలేదు. పెళ్ళికాని కుర్రాడు, అతన్తో చనువుగా తిరిగే ఆడపిల్ల చనువుకొద్దీ యేది ఆజ్ఞాపిస్తే అది శిరసావహించడం, విడ్డూరంగాదు, మా కజిన్ తో అతని పెళ్ళయిం తర్వాత, మీరతన్ని గమనించారో లేదోగాని యిప్పుడతను ఆ ఫుల్ స్మోకర్."
    "అవునా, యింత చెబుతున్నారు గనక అడగాలనిపిస్తుంది. అతను నా గురించి మీకేమైనా చెప్పాడా?"
    "చాలా చెప్పాడు."
    "ఒట్టి అమాయకుడతను."
    "గనకను, అతను మీ గురించి కొన్నాళ్ళ పాటైనా సిగరెట్లు మానాడు."
    "అదేం మాటలేండి. మీ కజిన్ చెప్పినా అతను సిగరెట్లు మానేస్తాడు."
    పేక ముక్కలు కలుపుతూ అన్నాను మెల్లిగా. కొంచెం బెరుగ్గా -
    "ఇంత చదువుకున్న మీకు సృష్టి రహస్యం నేను వివరించడం మెచ్చతగదు కానీండి, ఒక్కటి మాత్రం నిజం. మగవాడు పెళ్ళాం మాటకన్నా నేస్తురాలి మాటకు విలువెక్కువ యిస్తాడు. దాన్ని మీరొప్పుకు తీరాలి. అంతే."
    "అందుకనే మీ కథలు రాసేవాళ్ళంటే నాకు భయం. ఏదీ తిన్నగా మాట్లాడరు" అన్నది పద్మ ముసిముసిగా నవ్వుతూ. పద్మ అందమయిన వేళ్ళు పేకముక్కల్ని మరింత అందంగా కలపడం నేను పసిగట్టాను. ఆ వేళ్ళమీదికీ, అంతందమైన ఆ చేతిమీదికీ నా దృష్టి నిలిచింది. నాలోని దుష్ట మానవుడు నన్ను తొందరపట్టాడు. చాలాసేపు ఆలోచించింది.
    "కాస్త మీ చేతినిలా యిస్తారూ!" అన్నాను.
    "మీకు, హస్తసాముద్రికం వొచ్చునేమిటి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS