గోపాలరావు భయపడ్డాడు. వామనరావుని పట్టుకుని అన్నాడు.
"టేకిట్ ఈజీ! రిలాక్సవ్వు రిలాక్స్"
వామనరావు గోపాలరావునుంచి తప్పుకున్నాడు.
"నో రిలాక్స్. నో రెస్ట్. నా కొడుకు నన్ను వెధవని చెసింతర్వాత నాకు రెస్టెక్కడిది? రిలాక్సెట్లా అవుతాను? వాడ్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఆ తర్వాత కాసుకోండిరా పందేలు...శేషూ-
(ఊహాగానం ప్రారంభమైంది. వామనరావింట్లో-హాల్లో-కొడుకుని నిలబెట్టి, చేతిలోవున్న స్టిక్ తో పచ్చడి చేస్తున్నాడు.
"నాన్నా నాన్నా' అంటూ శేషు ఆక్రోశిస్తున్నాడు. కొడుకుని ఉతికేస్తూ, ఉద్రేకపడుతూ అరుస్తున్నాడు వామనరావు)
"నోర్ముయ్. అరిచేవంటే చంపేస్తాను. అయ్ విల్ కిల్యూ. ఏరా, నేను నీకు భయపడాలా? నువ్వు చెప్పినట్లు నడుచుకోవాలా?" అంటూ కొట్టేడు.
"నాన్నా? కొట్టొద్దు నాన్నా!"
"నేను తాక్కూడదా? తాగుతాన్రా! నా యిష్టమొచ్చినట్టు తాగేస్తాను. నువ్వు తాగొద్దంటే నీ రక్తాన్నే తాగుతాను. తానుతానురా తాగేస్తాను" చేతికి అందిన చోటల్లా బాదేస్తున్నాడు.
"నాన్నా! నువ్వు గట్టిగాకొడితే చచ్చిపోతాను నాన్నా?"
"చావరా! చావు! నన్ను అదుపులోపెట్టే శక్తి ఈ భూలోకంలోనే లేదురా! ప్రేమతో, వాత్సల్యంతో పెంచుకున్నందుకు నన్ను వెధవని చేస్తావా? నీ చేతిలో బొమ్మనని తెలిసిపోయిందిరా! ఊరందరికీ తెలిసి పోయింది. అసలు మనిద్దర్లో ఎవరు తండ్రి? ఎవరు కొడుకు? ఎవరు ఎవర్ని కన్నారు? ఎవరు ఎవరికి భయపడాలి. కమాన్. ఆ పాయింటేదో తేల్చుముందు. ఊఁ తేల్చరా తేల్చెయ్"
శేషు స్పృహ తప్పి పడిపోయాడు. గోపాలరావు అడ్డంపడి ఆ భీభత్సం ఆపగలిగేడు. చివరికి గోపాలరావుకూడా వామనరావు మీద గట్టిగా అరిచేడు.
"గొడ్డుని బాదినట్టు బాదేవు. వెంటనే డాక్టర్ కి ఫోన్ చెయ్ లేకపోతే శేషు మనకి దక్కడు! అండర్ స్టాండ్?"
వామనరావు గంభీరంగా అన్నాడు.
"అయ్ టెల్యూ. రామానాయుడు పేటలో డాక్టరున్నాడు. నా ఫ్రండు. స్కిన్ స్పెషలిస్టు. తోలు ఊడిపోయేలా బాదేస్తే, క్షణాల్లో నయమయ్యే మందులతని దగ్గిరున్నాయి. ఆ డాక్టర్ని చూసుకునే పిల్లల్ని బాదేస్తారు పెద్దలు. నీకంత జాలిగా వుంటే శేషుని అక్కడకి తీసుకెళ్ళు. నేను బాదినట్టు చెప్పు. డోసు పెంచి మందువేస్తాడు. టేక్ హిమ్ బాస్టర్డ్. గో" అంటూ చేతిలోబెత్తం కింద పారేసేడు.
(ఇక్కడ్తో ఊహాగానం పూర్తయి పోయింది. క్లబ్బులో వామనరావు చెమట్లు కక్కుతున్నాడు. చేతిలో స్టిక్కు దూరంగా పడివుంది. అది లేకుండానే గోడల్ని పట్టుకుంటో క్లబ్బు దాటబోతున్నాడు. గోపాలరావు స్టిక్కు తీసుకొచ్చి వామనరావుకిచ్చి అన్నాడు.)
"యూ ఆర్ నాట్ ఆల్ రైట్!"
"డోంటాక్ రబ్బిష్ బాస్టర్డ్! ఆయామాల్ రైట్. పెర్ ఫెక్ట్ లీ ఆల్ రైట్".
"నిన్ను మీ యింటి దగ్గర డ్రాప్ చేస్తానురా!"
"నో! నాతో మా యింటికి ఎవడూ రాకూడదు. అయ్ టెల్యూ. మా ఇంట్లో ఈ రాత్రి ఒక మర్డర్ జరగబోతోంది. మైండిట్!"
అంటూ గోపాలరావుని కిందపారేసి వామనరావు క్లబ్బు దాటేసేడు.
12
వామనరావు బాగా తాగి వుండడంవల్ల అతను కారుని సమంగా డ్రైవ్ చేయలేక పోతున్నాడు.
ఆ కారు రోడ్డుమీద ఎనిమిది అంకెలు వేసుకుంటో నడుస్తోంది.
బాగా రాత్రి పడటంవల్ల, రద్దీ లేకపోవడం వల్ల, ఎక్కడా ఉపద్రవం జరక్కుండానే, అతను క్షేమంగా తన ఇల్లు చేరుకున్నాడు.
చాలా రోషంగానే కారుదిగేడు. రోషంగానే కారు తలుపు మూసేడు.
రోషంగానే గుమ్మం దగ్గిరికి నడిచి వచ్చేడు.
సరిగ్గా అక్కడ వామనరావులో జ్ఞానజ్యోతి వెలిగింది.
అంత వీరుడూ ఇంట్లో-కొడుకు వుంటాడనే సత్యాన్ని గ్రహించి మెల్లిగా బూట్లు విడిచేడు. ఓపిగ్గా జోళ్ళు తీసేడు. కోటు విప్పేడు. టై ఊడదీసేడు.
ఈ సమస్తమైన సరంజామానంతా మూటగట్టేడు. అది భుజాన వేసుకుని మెల్లగా తలుపు తట్టేడు.
ఆశ్చర్యం.
తలుపు దానంతటదే తెరుచుకుంది.
అందుకు సంతోషించేడు. ఒక్కో అడుగువేసి మెల్లిగా హాల్లోకి ప్రవేశించాడు.
అంతలో హాలంతా వెన్నెల కురిసినట్లు లైట్లు వెలిగింది.
ఆ స్విచ్ తన వెనక వుంటుంది. అంచేత స్విచ్ వేసిన మనిషి కనిపించడు. కనిపించకపోయినా వామనరావు ఊహించ గలడు.
అతను వాళ్ళబ్బాయి శేషే అయివుండాలి. అంచేత-ఎట్లాగో దొరికిపోయాడు. గనక-చాలా నిబ్బరంగా సమాధానం చెప్పేడు తూలుతూనే..
"యస్. తాగేను. బాగా తాగే వచ్చేను. క్షమిస్తే, నా గదిలోకి వెళ్ళిపోయి పడుకుంటాను."
అతని సంజాయిషీకి ఏ విధమైన సమాధానం రాకపోయేసరికి-అతి కష్టమ్మీద వెనక్కి తిరిగి చూసేడు.
లైటు వేసింది శేషు కాదు. ఉదయం చెంప దెబ్బతిన్న పనిమనిషి.
అతన్ని చూడగానే టన్నులకొద్దీ కోపం వచ్చేసింది. ఆటోమేటిగ్గా వాడిచెంప ఛెళ్ళు మనిపించేందుకు చెయ్యెత్తేడు.
పనిమనిషి చేతులు జోడించి, వామనరావు కాళ్ళ మీదపడిపోయాడు. అతని మీద వామనరావుకూడా పడిపోయి చాలా శ్రద్ధగా కొన్ని సూచనలు చేసేడు.
"ఈ మూట తీసుకెళ్ళిపో. లైటాఫ్ చేసెయ్. ఏ స్థితిలో వచ్చేనో అబ్బాయిగారికి తెలీకూడదు."
అనేసి వామనరావు లేచి నించున్నాడు.
క్షణంలో లైట్ ఆఫ్ చేయబడింది. వామనరావు తన గదిలోకి వెళ్ళడానికి మేడ మీదకు దృష్టి సారించేడు.
శేషు గదిలో లైటింకా వెలుగుతూనే వుంది. ఆ గది దాటి వెడితేగాని తన గది రాదు.
ధైర్యంగా మెట్లవేపు నడిచేడు. ఒకటీ రెండు మెట్లు ఎక్కింతర్వాత, నడుచుకుంటో వెడితే అబ్బాయి చూస్తాడేమోనని అనుమానం కలిగింది.
అంచేత-
మిగతా మెట్లన్నీ పాక్కుంటో...పులిలాగానే మేడ ఎక్కేసేడు.
అట్లా పాక్కుంటూనే శేషు గది దాటబోతుండగా-ఒక్కసారి ఆ గదిలోకి తొంగి చూడాలనే కోరిక కలిగింది.
మెల్లిగా లేచి-కిటికీలోంచి-ఆ గదిలోకి తొంగి చూసేడు.
శేషు బోర్లా పడుకుని వున్నాడు. తన కళ్ళకి అమమైన లేడి పిల్లలా కనిపించేడు.
ఆ వెంటనే-
తన ఊహలో తాను శేషుని కొట్టిన దెబ్బలూ, శేషు ఆక్రందనలూ...ఆ భీభత్సమంతా గుర్తుకు వచ్చింది.
వామనరావు కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి!
