Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 60


    అయిదు నిమిషాలు వాడు ఆ సినిమా గురించే మాట్లాడాడు. ఆ తర్వాత, బందరు నుంచి అప్పుడే బస్టాండులోకి వచ్చిన తిరుపతి బస్సుని చూచి గట్టిగా, ఆనందంగా అరిచాడు.
    "అదిగోరా బాబు తిరుపతి!"
    ఆ బస్సుని చూచిం తర్వాత వాడి ఒళ్ళు గాల్లో తేలినట్టయిపోయింది. వాడు నాతోపాటు తిరుపతి రావడం లేదు. గత రోజున్నర నుంచీ వాడి ప్రాణాన్ని తింటూన్న ఒక జంతువు కొన్ని నిమిషాల్లో ఆ బస్సెక్కి వెళ్ళిపోతుందనే నమ్మకం కొద్దీ వాడు అల్లాడిపోతున్నాడు.
    బస్సు వచ్చి ఆగింది. ఆ కండక్టరు కిందికి దిగిం తర్వాత, అతన్ని కలుసుకుని నాకున్న బస్ పాస్ చూపించాను. అతనా పాస్ చూస్తూనే విష్ చేసి, వినయంగా అన్నాడు.
    "మూడే సీట్లున్నాయి సార్! సెవెన్, ట్వంటీ, ఫోర్టీన్. ఏదో ఒకటి కోరుకోండి."
    "ఫోర్టీన్" అన్నాడు ఆచారి చాలా తొందరగా.
    ఆచారి వేపు చూశాను. అతను చాలా హడావిడిగా వున్నట్టున్నాడు. ఎంత తొందరగా నన్ను బస్సెక్కించి వెళ్లిపోదామా అనే కంగారులో వున్నాడు. జాలీ నవ్వూ రెండూ కలిగాయి, నేను బస్సెక్కి ఫోర్టీన్లో కూర్చుంటూ నా పక్కసీట్లు చూశాను. ఆ రెండూ ఖాళీగానే ఉన్నాయిగానీ ఆ జాగాల్లో ఒక సంచీ, ఒక పెరీమెషన్ పుస్తకమూ వుంచబడ్డాయి. క్రింద ఆచారి సిగరెట్ ముట్టించుకుంటూ అన్నాడు!
    "మదరాసు వెళతావేమిట్రా?"
    "వెళ్ళను."
    "పోన్లే ఇంకో మాటెళ్ళచ్చు. ఏమంటావ్?"
    ఆచారిని ఇంకా కొంతసేపలాగే నుంచోబెట్టి ఏడిపించాలని వుంది. నోటికొచ్చినట్టు పేలుతున్నాడు వెధవ! అందుచేత నాకై నేను వాడిని వెళ్ళిపొమ్మని చెప్పకూడదనుకున్నాను. రెండు నిమిషాలు మా యిద్దర్లో ఎవ్వరం ఏమీ మాట్లాడుకోలేదు.
    బస్సులోకి ఒక యువతీ, ఒక యువకుడూ వచ్చారు. ఇద్దరూ యెంతో అందంగా వున్నారు. ఎక్కవసేపు వాళ్ళని చూడాలని వుందిగాని సభ్యత గుర్తుకొచ్చి జేబులు వెతుక్కోవడం ప్రారంభించాను. షర్టు జేబులో వుంది సిగరెట్టు పాకెట్టు. అది అంది పుచ్చుకుని అగ్గిపెట్టె కోసం వేట ప్రారంభించాను. ఆ వేటలో సరిగ్గా నా నెత్తిపైన అందమైన గొంతు వినిపించి నిలువెల్లా జలదరించాను.
    "లెట్ మి గో దట్ సైడ్ ప్లీజ్!"
    నవవధువు తలుపు దగ్గర మాట్లాడినట్టున్న ఆ మాటల్ని మళ్ళా ఆ దేవత నుంచి వినాలని కోరిక కలిగింది. నేనది వినిపించుకోనట్టు నటించి జేబునుంచి అగ్గిపెట్టె తీశాను.
    కాని ఆచారి నా కోరికని తినేశాడు వెధవ! కింద నించున్నవాడు తిన్నగా నుంచోక వాడి సొమ్మేదో పోయినట్టు గావు కేక పెట్టాడు.
    "లేవరా బాబ్జీ! ఆవిడ సీట్లోకి వెళ్ళాలిట."
    వళ్ళు మండిపోతూండగా లేచి నుంచుని చోటిచ్చాను. ఆ అమ్మాయి కంటే ముందు, ఆమె వెంటవచ్చిన కుర్రాడు వచ్చి నాకవతల సీట్లో కూర్చున్నాడు. ఇక మిగిలింది మా యిద్దరిమధ్య సీటు. దాన్లోనే ఆ లతాంగి, కూచుటుందని తెలిసి, ఆనందం కలిగింది. కొంచెం గాలి పీల్చుకుందామని బస్సుదిగి ఆచారి దగ్గర కొచ్చాను.
    ఆచారి దిగులుగా అన్నాడు.
    "దిగొచ్చేవేరా! వెళ్ళెళ్ళు. బస్సు కదిలే టైమైంది."
    "పాపం నువ్వింకా యెంతసేపు నుంచుంటావుగాని వెళ్ళిపోరా చారీ! నీ నిద్ర కూడా -"
    "అదేం మాటలే! నీ బస్సెళ్ళిం తర్వాతే నేను వెళతాను. ముందు నువ్వు బస్సెక్కు."
    "నో.... నో.... ముందు నువ్వే వెళ్ళాలి."
    "కాదు లేరా బాబూ! ముందు నీ బస్సే వెళ్ళాలి."
    "చంపేస్తాను వెధవా! వెళ్ళిపో."
    "బాబ్బాబుగా, కొంచెంసేపుండరా ప్లీజ్! వెధవ్వి, నీ పాదంలో యేముందో గాని - ఎప్పుడూ నక్కతోకనే తొక్కుతుంటావ్. నువ్వెక్కే బస్సు ప్రతిదీ కళకళలాడిపోడం రూలైపోయింది. నువ్వు తంతానని నేను రావడం లేదుగాని - లేకపోతేనా, టిక్కెట్టుకొని యీ బస్సెక్కేసేవాడిని. నీకు నమస్కారం చేస్తా. నువ్వు బస్సెక్కరా తండ్రీ! నీతో మాట్లాడుతూ ఆ పిల్లని కాసేపు చూచే అవకాశం దక్కించుకుంటాను ప్లీజ్-" ఆచారి ప్రాధేయపడ్డాడు. చివరికి వాడి పంతమే నెగ్గింది. మా బస్సు కదిలిం తర్వాతనే వాడు అక్కడ్నుంచి కదిలాడు.
    నా పక్కనున్న యువతి కళ్ళజోడు తొలగించి నన్ను చూస్తూ అన్నది.
    "నన్ను మరచిపోయారులా ఉంది"
    ఆచారికి చెప్పడమెందుకని చెప్పలేడుగాని, ఆ పిల్లని నేనింతకు ముందే గుర్తించాను.
    "ఇంకా నయం. నేను గుర్తున్నానో లేదో ననుకున్నాను. మీ పేరు పద్మ కదూ!" అన్నాను.
    "థాంక్స్. గుర్తున్నాను గనక థాంక్స్. ఇతను రామానుజం. నా క్లాస్ మేట్" అని పద్మ ప్రక్కనున్న మనిషిని పరిచయం చేసింది.
    "నా పేరు బాబూరావు" అని రామానుజానికి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
    "బాబ్జీ అనే పేరుతో కథలు రాస్తుంటారు. చూళ్ళే" అన్నది పద్మ.
    "సారి? నేను కథలు చదవను" అన్నాడతను కటువుగా.
    రామానుజం మెడమీద లాగిపెట్టి కొడదామనుకున్నాను. పూర్ ఫెలో - పద్మపక్కనుండి బతికిపోయాడు. కథలు రాయడం తమాషా అనుకుంటున్నాడల్లే వుంది.
    "మీరెందాకా?" అడిగారు పద్మని.
    "ఎక్కింది తిరుపతి బస్సు. వెళ్ళేదీ అక్కడికే. మీరూ అక్కడికేనా?"
    "ఆహా......." అన్నాను.
    "గుడ్. మంచి కంపెనీ" అన్నది పద్మ.
    బస్సు నడుస్తుండగా, పద్మ వుండి వుండి నాతో యేదో చెబుతూనే ఉంది. కొన్ని విన్నాను. కొన్ని వినలేదు. ఎంత వద్దనుకున్నా పాడు నిద్రకు లొంగిపోయాను.
    నెల్లూరు చేరుకున్న తర్వాత కళ్ళు తెరిచాను. ఇంతసేపూ నేను గాఢనిద్రలో మునిగిన వైనం గుర్తొచ్చి నవ్వుకున్నాను. నా పక్కన కూర్చున్న పద్మ రామానుజమ్మీదకు పూర్తిగా వొరిగిపోయి వుంది. వాళ్ళిద్దరూ యిద్దర్లా కనిపించలేదు నాకు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS