Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 59


                                                               దీవెన

    హైదరాబాద్ లో ఆనాటి గదిలో నా కోరిక ప్రకారం ఆరోజు మా సమావేశం ఏర్పాటయింది. ప్రత్యేకాహ్వానితుడు సుబ్బారావు, సుబ్బారావు నా ప్రాణమిత్రుడు. అతను నాతోపాటు చదువుకునే రోజుల్లో పద్మ కూడా చదువుకుంది. మిస్ పద్మ పట్ల సుబ్బారావుకి అమితమైన భక్తితో పాటు ప్రేమ కూడా వుండేది.
    సుబ్బారావు గొప్పవాడు గనక అతని మాటలు కూడా గొప్పగానే వుండేవి. అతనా రోజుల్లో (అరిగిపోయిన గ్రాం ఫోన్ రికార్డులా) తరచూ అతని ప్రేమ గురించి నాకు చెబుతుండేవాడు.
    "ఒరే గురో" పద్మెంత అందంగా వుంటుందిరా, కళ్ళద్దాలు-వెధవ్వి, నీకు నప్పలేదు గాని ఆ పిల్లకెంతో బావుంటాయి! నన్నడిగితే పద్మకి రెండు జడలు బాగుండవు. ఒకటే పొడుగాటి జడైతే బ్రహ్మాండంగా వుంటుంది. బట్- నేనెలా ఆ విషయం చెప్పేదీ? పోగా, ఏం గతిలేనట్టు ఆ అమ్మాయి ఒంటెద్దు బండిమీద కాలేజీకి రావడం కూడా నాకిష్టం లేదు. అందుచేత నేనా పిల్లని పెళ్ళాడేసి, మా నాన్నని అడిగి ఒక కారు కొంటాను. లేటెస్ట్ మోడల్ ఏదైనా సరే, కారుని కొని నేను స్టీరింగ్ దగ్గర, నా ప్రక్కన పద్మ, అవునురోయ్, కారులో స్టీరింగ్ కుడిప్రక్కనుంటుందా, యెడం ప్రక్కనా, ఏదో ఒక ప్రక్కన అక్కడికది అయ్యిందా. ఆ పైన మా కారు జోరుగా పోతుండగా బైట వర్షం, అప్పుడు అద్దాల తలుపులు ఎత్తేస్తా. బైట వర్షం చలి, లోన వేడి, బయట జనం తడిచి చస్తారు. లోపం మేం వెచ్చగా కూర్చుంటాం. కారుని ఓ చోట ఆపి.
    (పదమని ప్రేమించానని చెప్పుకుంటున్న ఈ సుబ్బారావులాంటి గొప్పవాడెవడైనా సరే- ఖర్మకాలి పదమని పెళ్ళి చేసుకున్న తర్వాత-వాడి ప్రేమ పద్మ యెక్కే కారుమీదా పద్మ దుస్తులూ, నగల మీదా కేంద్రీకరించబడి- పద్మనబడే శాల్తీమీది ప్రేమ దుమ్ముకొట్టుకుపోతుందని నాకు భయంగా వుండేది.)
    -ఇన్ని కలలు కనే బోడివెధవ జీవితంలో ఏం సాధిస్తాడోనని నేను కొన్నాళ్ళుగా చూస్తున్నాను గదా! ఒక్కటి. మచ్చుకి ఒక్క సరదానైనా నిజం చేయలేకపోయాడు.    
    పద్మని వాడు నీడలా వెంబడించేవాడు. ఎద్దుబండి వెనకాతల నత్తలా నడిచేవాడు. వాడికున్న కొత్త సైకిల్ని నాబోటి వాడికి దానం చేసి మరీ తిరిగాడు. లక్షాధికారి బిడ్డడు. ఎండమొహం తెలీని పసివాడు. యాపిల్ పందులాంటి కుర్రవాడు. పద్మవల్ల వాడుత్త సన్నాసైపోయాడు. పదిమందిలోనూ వాడు అల్లరైపోయాడు. ఇదంతా ఏడెనిమిది సంవత్సరాల క్రితం కథాకమామీషు!
    రెండురోజుల క్రితమే పద్మ గురించి నేనో మహత్తరమైన విషయం విన్నాను. అది సుబ్బారావుకి చెప్పేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ఆచారి గదిలో మా సమావేశం ఏర్పాటు చేశాను. ప్రస్తుతం సుబ్బారావు హైద్రాబాద్ లోని కంట్రాక్టు పనులు చేస్తున్నాడు. గనుక నేనీ నగరం రాక తప్పలేదు.
    మా సమావేశం పెద్ద ఎత్తులో జరిగేందుకు రెండు సోలాన్ విస్కీ సీసాలూ, మూడు గోల్డెన్ ఈగిల్ బీరు బాటిల్సూ ఆచారి చేతనే తెప్పించాను. వాటితోపాటు కొన్ని ఖరీదైన తినుబండారాలూను.
    సరిగ్గా అయిదున్నరకు సుబ్బారావు వచ్చేశాడు. వస్తూనే అడిగాడు-
    "ఏమిటో గురూ! హంగామా! ఆచారిగాడొచ్చి పార్టీ వుందని చెప్పాడేగాని, వివరాలు తెలీవన్నాడు ఏమిటి కథ?"
    నేను ఆచారి వేపు చూశాను.
    "అవున్రా. ఇవాళ సాయంత్రం సుబ్బారావుకు పార్టీ ఇస్తున్నానని చెప్పేవేగాని, వివరాలు నాగ్గూడా చెప్పలేదుగా మరి" అన్నాడు ఆచారి నాన్చుతూ.
    నాకు గర్వం పెల్లుబికింది. వీళ్ళందరూ కాసబియాంకాలు. నేనేది చెబితే అది కళ్ళు మూసుకుచేసే జాతి మనుషులు. నేను చదువుకునే రోజుల్నుంచీ నాకు మనుషుల్ని వాడుకునే అలవాటుంది. నాతో తిరిగే మనుషుల్ని నేనతి గమ్మత్తుగా మంత్రించి బొమ్మల్లా తయారుచేస్తాను. నా జాదూ ప్రకారం వాళ్ళు నేనేది చెబితే అది చేస్తారు. నేను కా అంటే కా! కి అంటే కి! అలా. నా మాటకి తలొంచి తిరిగే మనుషులంటే నాకు అత్యంతాభిమానం.
    నేను సుబ్బారావుతో అన్నాను.
    "ఇవాళిక్కడ ఆచారి గదిలో మనం ముగ్గురమే వున్నాం. నేనీ మందుపార్టీ నిమిత్తమే బందర్నుంచి ఇంత దూరం వచ్చేను. ఆ ఊళ్ళో మనం మందు పుచ్చుకోమని మీకు తెలిసిందేగా. పోతే, ఈ పార్టీ ఇచ్చేందుక్కారణం మీక్కావాలి. ఆల్ రైట్ - నేనో కథ చెబుతాను. అదే కారణం."
    "కథా!" అన్నాడు ఆచారి ఉత్సాహంగా.
    "బడాయి పోకురా బాబ్జీ. నాకు ఒళ్ళు మండిపోతోంది. అవతలెన్నో అర్జంటు పనుల్ని తగలేసి ఇటొచ్చాను. వేళాకోళమాడకు." అన్నాడు సుబ్బారావు.
    "షటప్ యూ సిల్లీ..."
    నా కేకతో సుబ్బారావు ఠక్కున నోరుమూసాడు.
    "నేను చెప్పబోయే కథని మీరు చచ్చినట్టు విని తీరాల్సిందే. కథ పూర్తయ్యేంతవరకూ ఎవడూ యిక్కడ్నుంచి కదలకూడదు. తెలిసిందా?"
    వాళ్ళిద్దరూ తలలూపారు. సీసాలు ముందుకు లాక్కున్నాను. వాటిమీద తాగుదామానుకున్న ఉద్దేశం ఆచారి బెరుకుతనం వల్ల చెడిపోయింది. తాగుతూ కథ చెప్పడం ప్రారంభించాను.

                                           *   *   *
    తేదీ నెల గుర్తులేదుగానీ - ఏడాది క్రితం ఒకరాత్రి బెజవాడ బస్ స్టాండ్ లో తిరుపతి బస్సు కోసం యెదురుచూస్తూ నించున్నాను. అప్పుడీ ఆచారి నా ప్రక్కనే వున్నాడు. రాత్రి తొమ్మిది దాటింది. ఆచారి ఆవలించడం గమనించి విసుక్కోవాలనుకున్నానుగాని, గతరాత్రి మా ఇద్దరికీ నిద్రలేని కారణంగా వాడిని క్షమించాను. అయితే నా అవస్థని గమనించిన ఆచారి నోటికి చిటికవేసి నవ్వి అన్నాడు.
    "సినిమా చూస్తున్నంతసేపూ నిద్రరాలేదా? ఇప్పుడు చూడు ముంచుకొస్తుంది- అందుచేత నేను ఇంగ్లీషు సినిమాలంటే పడి చస్తాను. ఏం సినిమారా బాబూ! చూస్తున్నంతసేపూ తల తిప్పేందుక్కూడా మనసొప్పలేదు."
    మేమప్పుడు చూచిన సినిమా కేవలం బూతు సినిమా! తలా తోకలేని సెక్సు సినిమా. చాలావరకు సెన్సార్ వారు కత్తిరించేసి జాలికొద్దీ కొంచెం మిగిల్చిన ఎంగిలీ సినిమా అది. ఆచారి 'టేస్టు' చాలా చిత్రంగా వుంటుంది మరి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS