అతని పెదాలమధ్య సిగరెట్ వెలుగులోంచి అవంతి మొహం పైకి 'ఉఫ్' మని పొగని వదిలాడు.
ఆ పొగ ఘాటుకి అవంతి కొన్ని క్షణాలు ఉక్కిరిబిక్కిరి అయి చేత్తో పొగని చెదరగొట్టి "ఏమిటీ మోటు సరసం!" అంది.
"నీతో మోటు సరసం అంటే నాకిష్టం!" అన్నాడు మనోహర్.
అవంతి ఎవరో విసిరిన మల్లె పువ్వులా అతని గుండెలపై వాలిపోయింది. తలెత్తి అతని మొహంలోకి మత్తుగా చూసింది.
సన్నని ఆమె చెంపపైన గట్టిగా కొరికాడు మనోహర్.
"అబ్బ" అని చేతి చూపుడు వేలితో అతని పెదవిపైన కొట్టింది.
"నాకూ అంతే. నీలాంటి మోటు మనుషులంటే ఇష్టం!"
మనోహర్ ఏదో అర్థం అయినట్టుగా విన్నాడు.
"మనోహర్, నీకు ఇష్టమైనదేమిటో నాకు చెప్పు" అడిగింది అవంతి.
"నాకిష్టమైనదేమిటో నాకే తెలియదు. నీకెలా చెప్పగలను? అయినా దేనికి"
"జస్ట్ ఐ వాంట్ టు నో ఇట్!" అంది అవంతి మనోహర్ అప్పుడు వెంటనే చెప్పాడు.
"నువ్వు మాత్రం కాదు"
అవంతి అతని మాటలకి నీరస పడిపోలేదు. కేవలం తనతో ఆటకేగానీ, అతనికి తనపట్ల అభిమానం గానీ, ఇష్టంగానీ లేదని ఆమెకు పూర్తిగా తెలుసు. కానీ అతని సమాధానం తనేదో అతన్ని కట్టుకోవాలని ప్రాధేయపడితే చెప్పినట్టుగా అనిపించి వళ్ళుమండింది. కానీ ఆ కోపాన్ని అతనికి తెలీనివ్వలేదు.
"ఆ సంగతి నాకు తెలుసు. నా కంపెనీ కోసం చాలామంది పడిఛస్తారు. కానీ నాకు నువ్వంటే ఇష్టం. అందుకనే నువ్వు చెప్పినట్టు వినడమే తప్ప నిన్నేమీ నేను అడగను!"
ఆ మాటలకి మనోహర్ ఏ విధమైన ప్రాముఖ్యతనీ ఇవ్వలేదు. చాలా తేలికగా నోట్లకట్టని చూసి వెంటపడిచచ్చే వ్యభిచారిణిని చూసినట్టుగా చూశాడు.
"నేనంటే కాదు. నా డబ్బంటే నీకిష్టం!" అన్నాడు.
అతను వెటకారంగా అన్న ఆ మాటలకి ఆమె అహం దెబ్బతిన్నది. తన పొందుకోసం అంత దూరం తీసికొచ్చి హేళనగా మాట్లాడితే ఏ ఆడది సహించగలదు. మగాడు ఎలాంటివాడైనా ఆడదానికో ప్రాముఖ్యతనిస్తే మనస్ఫూర్తిగా తనని తాను అర్చించుకుంటుంది. ఆఖరికి డబ్బుకోసం వళ్ళమ్ముకునే వేశ్య కూడా విటుడి ప్రవర్తనని బట్టి ప్రవర్తిస్తుంది.
కానీ అవంతి ఏమీ అనలేని పరిస్థితిలో ఉంది. అతని చెంప పగిలేలా కొట్టాలని మాత్రం అనిపిస్తోంది.
"అఫ్ కోర్స్, నువ్వెలా అనుకున్నా ఫరవాలేదులే."
అతను ఫక్కుమని నవ్వాడు.
"సిగ్గులేని మనిషివి ఇంకా ఆ నవ్వుదేనికి?" అంది.
అవంతి రెండు చెవులని పట్టుకుని ఆమె మొహాన్ని దగ్గరగా తీసుకొని గడ్డంపైన ముద్దు పెట్టుకున్నాడు మనోహర్.
"ముద్దు పెట్టుకోడానికి ఇంకెక్కడా చోటేలేదా?" అడిగింది.
మనోహర్ కళ్ళతోనే ఆమె గెడ్డంకేసి చూసుకోమన్నట్టుగా సైగ చేశాడు.
"ఏముందక్కడ?" చేత్తో తడుముకొంటూ అడిగింది.
"నీ గెడ్డంపైన పుట్టుమచ్చ అందంగా ఉంటుంది. అందుకే అక్కడ ముద్దుపెట్టుకొన్నాను" చెప్పాడతను.
ఆ మాటలకి ఆమె మనసు వెన్నెల్లో పరవశించి వికసించే కలువలా ఆనందంతో నిండిపోయింది.
"ఎందుకో క్షణంపాటు అతన్ని చూస్తే ఆమెకి జాలి కలిగింది.
"మనోహర్" మృదువుగా పిలిచింది.
"ఊ,"
"నిన్నోమాట అడిగితే కోపం రాదుగా!"
"అడుగు."
"ఇంతమంది ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకొంటావు కదా! లేని పోని రోగాలొచ్చి నీ ఆరోగ్యం పాడైపోతే నీ పాతికేళ్ళబ్రతుక్కీ నూరేళ్ళు నిండిపోవు?" అడిగింది.
మనోహర్ ఆశ్చర్యంగా చూశాడు. ఇంతవరకూ అతను చాలామంది ఆడవాళ్ళని చూశాడు. కాని ఏ ఆడది ఇలాంటి ప్రశ్న. వేయలేదు. వెన్నెల కాంతిలో మెరుస్తున్న ఆమె కళ్ళల్లోకి కొన్ని క్షణాలపాటు దీక్షగా చూశాడు.
"నీ మాటల్లో నిజం వుంది కాదనను. కానీ నాకెప్పటికప్పుడు కొత్త అనుభవాలంటే ఇష్టం!" మెల్లగా చెప్పాడు.
అవంతి అతనికేసి సూటిగా చూసింది.
"నీ అనుభవంతో భాగం పంచుకునేవాళ్ళే కానీ నీ జీవితంలోకి తొంగిచూసి నీ హృదయానికి ఎవరైనా దగ్గరగా వచ్చారా మనోహర్? నిన్ను చూసి, నీ వ్యక్తిత్వాన్ని చూసి నీకెవరన్నా మనసిచ్చారా?"
"లేదు." అన్నాడు.
"అంటే కేవలం నీ వెనక వున్న డబ్బు చూసే నీతో ఎవరు స్నేహం చేసినా కూడా. అంతే కాదూ!"
"అవును"
ఆమె మాటలు అతని మెదడుపైన చురుకుగా పని చేస్తున్నాయి.
