"ఈ లేడీస్ తో యిదే యాతన రాజుగారూ! మనం వాళ్ళనేం అనగూడదు. టూ సెన్సిటివ్ దే ఆర్! ఈవిడ గారికో భర్త! (ఇక్కడ చాలా ఆశ్చర్యపోతూ అన్నాడతను) తాగి తిరగడం తప్పించి మరో పన్లేదు మానవుడికి. పైగా వాళ్ళది లవ్ మ్యారేజిట. ఈవిడేమో అతగాడ్ని పెళ్ళి చేసుకున్నందుకు శిక్షగా అతన్ని పోషించే బాధ్యత తీసుకుంది...." శర్మ చాలా విషయాలు చెప్పాడు.
నరసరాజు కేడుపోచ్చినంత పనయింది.
లోలోన ఏడుస్తూ అతను చాలా అనుకున్నాడు.
'శర్మగారూ! మీరన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు సెన్సిటివ్ గానే ఉంటారు శర్మగారూ! అందులో సీత... సీత చాలా మంచిది శర్మగారూ! మీరా పిల్లనేం అనకండి. మీకో సిస్టరుండి, ఆ సిస్టరింత టార్చర్ అనుభవిస్తుంటే మీకెలా వుంటుంది శర్మా? ప్రేమలో తప్పిన ఆడకూతురు సీత. జీవితం లెక్కల్లో వాళ్ళ నాన్నగారూ తప్పారు. భార్యను పోషించలేని మొగాడు వుండేం, చచ్చేం? పైగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాట్ట. పెళ్ళి. సీతా. నువ్విక్కడింతగా అల్లాడిపోతున్నావా? వందలూ, పదులూ నీ చేతుల్లో నలిగిపోవాలనుకున్నాను. ఆఫ్టరాల్, లక్షలమీద జరిగే కాంట్రాక్టు ఫారాలు పూర్తిచేస్తున్నావన్నమాట. సోఫాలు, పంకాలు, దాసదాసీలు - సీతా! నువ్వీ నాలుగు గోడలమధ్యా నాకు కనిపించి నన్ను బాధపెట్టావు. నువ్వోడిపోయావు. నీమీద ఆశలు పెట్టుకుని నేనూ ఓడిపోయాను.'
ఆ వేళకి సీత కొన్ని కాగితాలు పట్టుకొచ్చి టేబిల్ మీద పెట్టి వెళ్ళిపోయేప్పుడు చివరిసారిగా నరసరాజు వేపు భయంభయంగా చూచింది. నరసరాజప్పుడు తలదించుకుని వున్నాడు.
సంతకాలు పూర్తయ్యాయి. పనీ పూర్తయింది. శర్మేదో చెప్తున్నా మరేం వినిపించుకోకుండానే నరసరాజు గది నుంచి బయటపడ్డాడు. గది బయట టైపు మిషనొక్కటే (పాతది -మాసిపోయినదీను) వుంది. అక్కడ సీత లేదు.
నరసరాజు నడుస్తున్నాడు. విజిటర్స్ హాల్లోంచి సీత మాటలు వినిపించాయి.
"ప్లీజ్... నన్నిలా దగా చేయకండి మీరు?" అంటున్నది సీత.
"నేనెప్పుడూ నిన్ను దగా చేయలేదు సీతా... భార్యాభర్తల మధ్య దగా ఎందుకుంటుందసలు? చివరిసారి. పెద్దవసరం. కాదనకు." అన్నవాడు వెంకట్రావు.
ఇద్దర్నీ చూశాడు నరసరాజు ఆ పళంగా వెంకట్రావు మీద కలియబడి దవడపళ్ళు రాలగొట్టేంత కోపమొచ్చింది.
"ఫూల్! నువ్వు కాదురా దగా చేస్త? నువ్వేరా దగా చేశావ్. అందమైన సీతని అన్యాయం చేసింది నువ్వురా రాస్కెల్! సీతని ఉద్ధరిస్తావనుకున్నాను. ఆడదాని సంపాదనతో కులికే నువ్వు క్లాస్ వన్ రోగ్ వి. అవుట్. వెళ్లిపో ఇక్కడ్నుంచి. సీతా రండి మీరు. నాతో వచ్చేయండి. నరసరాజు అండ్ బ్రదర్స్ కి మీరివాళ నుంచి పర్సనల్ సెక్రటరీ. మీ జీతం వెయ్యి రూపాయలు. ఫ్రీ క్వార్టర్స్, నా కారు మీకిచ్చేస్తాను. కమాన్. మీరొచ్చేయండి సీతా! మీరీ నక్కల మధ్య బ్రతకలేరు. వచ్చేయండి."
నరసరాజు సీతతో ఎన్నడూ మాట్లాడనట్టు, ఇప్పుడూ మాట్లాడలేదు. పైగా - ఇప్పుడది నిషేధం కూడాను. నరసరాజిప్పుడు పూర్తిగా శకుంతల మనిషి. అతనికో ఆడపిల్ల వున్నది. సంఘంలో మంచి పరపతి వున్న బ్యాంకులో లక్షల డబ్బు వున్నది. వీటన్నిటికంటే ముఖ్యం, కొన్ని కట్టుబాట్లు వున్నాయి కనక అతనెప్పుడూ సీతతో మాట్లాడనే కూడదు.
అందుచేత, అతను మౌనంగా - ఏమీ జరగలేదన్నట్టు వచ్చేసి కారెక్కాడు. కారు కదిలిం తర్వాత గాని అతను తన కనుకొలకుల్లో నిలిచిన నీటిని గమనించలేదు.
* * * *
