Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 59


    పని మనుషులు ఎవరూ వినడం లేదని నిర్ధారణ చేసుకుని అన్నాడు వామనరావు.

 

    "అసలివాళ్ళ అడుగు బయటకు పెట్టకూడదనే అనుకున్నాన్రా! నీ కోసమే వెయిట్ చేస్తూ కూచున్నాను. అంతలో ఫోన్ వచ్చింది."

 

    "ఫోనా?"

 

    జవాబు ఎట్లా చెప్పాలో తోచక నోటికి వచ్చినట్టు చెప్పడం ప్రారంభించేడు వామనరావు.

 

    "కనకారావని నా చిన్ననాటి ఫ్రెండు. (బాధనటిస్తూ) పెద్ద వయస్సు గదా సడన్ గా గుండెపోటు వచ్చిందిట. నన్ను చూడాలని తెగ కలవరిస్తున్నాట్ట. ఉన్న పళంగా వచ్చేయండంకుల్ అని వాళ్ళబ్బాయి ఫోన్ చేసేడు. వెళ్ళనా వద్దా అని కనుక్కోడానికి నువ్వు ఇంట్లో లేవాయ్! ఎంతైనా ఫ్రండుగదా-వెళ్ళకపోతే బావుంటుందా చెప్పు! ఇట్లా వెళ్ళి- అట్లా వచ్చేస్తాను. ఏడున్నర కల్లా ఇంట్లో వుంటాను. ఒ.కే.?"

 

    శేషు భారంగా నిట్టూర్చి అన్నాడు.

 

    "ఏడున్నరకి రాలేవు నాన్నా! కనీసం ఎనిమిదికైనా వచ్చేయ్!"

 

    "అట్లాగే అట్లాగే" అంటూ వామనరావు స్పీడుగా కారు దగ్గరికి నడుస్తున్నాడు.

 

    శేషు వాళ్ళ నాన్నని కన్నార్పకుండా చూస్తున్నాడు.


                                                                  7


    అదొక క్లబ్బు.

 

    ఖరీదైన మనుషులు ప్రతి సాయింత్రం అక్కడ కాలక్షేపం చేస్తుంటారు. కొందరు మందు కొడతారు. కొందరు చీట్ల పేక ఆడుతుంటారు.

 

    ఏమైనా-

 

    ఊళ్ళో పెద్దలందర్నీ ఒకే చోట కలుసుకోవాలంటే ఆ క్లబ్బొక్కటే చోటు.

 

    క్లబ్బు గొప్ప సందడిగా వుంది. మందు సెక్షన్లో అందరి ముందూ మందు గ్లాసులున్నాయి. కొందరు అప్పుడే ప్రారంభించేరు. కొందరు గీత దాట బోతుంటే కొందరేమో గీతదాటేసి తామెక్కిన గుర్రాలకు కళ్ళేలు విప్పేసేరు.

 

    అల్లాంటి స్థితిలో...

 

    వామనరావు క్లబ్బులోకి అడుగు పెట్టేడు.

 

    వామనరావుని చూడగానే క్లబ్బులో కలకలం పెద్ద స్థాయిలో ఏర్పడింది. అతని పట్ల తమకున్న గౌరవాభిమానాలు, మందులో వుండి కూడా మరచిపోకుండా ప్రదర్శిస్తున్నారు.

 

    లేచి నిలబడి నమస్కారాలు చేసేవారు, హాల్లో అని పలకరించే వారు. చేతులూపి తమ ఆనందాన్ని ప్రకటించేవారు. అనేకమండి అనేక రకాలుగా వామనరావుకి ఆహ్వానం పలుకుతున్నారు.

 

    ఒకానొక టేబిల్ ముందు ఇద్దరు కూచున్నారు. అందులో ఒకడు ఆ ఊరికి కొత్తవాడు. మరొకడు పాతకాపు. ఇద్దరూ ఖరీదుగానే వున్నారు.

 

    క్లబ్బు గుమ్మం దగ్గిరే వామనరావుని చూసి కొత్త మనిషి పాత కాపుతో అన్నాడు.

 

    "ఆహా...ఏమి వర్చస్సు! మనిషిని చూడగానే చేతులు జోడించాల్సిందే".

 

    "వామనరావని రిటైర్డ్ మిలట్రీ ఆఫీసరు. వామన్ స్కూటర్స్ కి ప్రొప్రయిటరు" అన్నాడు పాతకాపు.

 

    "మరింకే! ఫుల్ బోటిల్ ఎత్తేగలడు!"

 

    "ఎత్తగలడేమోగాని పుచ్చుకునేది ఒకే ఒక్క పెగ్గు మాత్రమే!"

 

    "జోకు వేయకు. ఫుల్ బోటిల్ తాగేస్తాడు. పందెం కాయ్!"

 

    "ఒద్దు ఓడిపోతావ్."

 

    "ఆ మాట నేననాలి దమ్ముంటే కాయ్ పందెం గురువుగారు పెగ్గుతో ఆగిపోతే నేను వందిస్తాను ఫుల్ బోటిల్ కొడితే నువ్వు వందివ్వు. ఓ.కె?"

 

    పాతకాపు కూడా ఓ.కే. అనేసేడు. ఇద్దరూ చెరో వంద కాగితం పందెం కింద కలిపి గ్లాసుకింద రెండు వందలూ పెట్టేరు.

 

    వామనరావు తిన్నగా కౌంటరు దగ్గిర కెళ్ళేడు. ఒక గ్లాసులో ఒకటంటే ఒకే పెగ్గు పోసుకున్నాడు. ఆ తర్వాత గ్లాసు నిండా సోడా కలుపుకున్నాడు. ఆ పైన గడ గడా తాగేసి మూతి తుడుచుకున్నాడు.

 

    జేబులోంచి పొట్లాంతీసేడు. అందులో అర డజనుయాలకలున్నాయి. డజను లవంగాలున్నాయి. అవన్నీ నోట్లో వేసుకుని అందరికీ గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు.

 

    పందెం ఓడిపోయిన వ్యక్తి గొప్పషాకై పోతూ కళ్ళు నులుముకుంటో చూస్తున్నాడు.

 

    గెలిచిన వాడు గ్లాసెత్తి రెండు వందల కాగితాలూ జేబులో వేసుకున్నాడు.

 

    ఓడిపోయిన వాడు అంటున్నాడు.

 

    "ఆకారం చూస్తే ఫుల్ బోటిలూను-అనుభవానికొస్తే పెగ్గూనా? విడ్డూరంగా వుందే కేసు?"

 

    "అతనిక్కూడా బాగా తాగేయాలనే వుంటుంది. భయపడి పెగ్గుకి పెట్టుకున్నాడు లిమిటు. ప్రతి రోజూ ఒకే ఒక్క పెగ్గు కొట్టేసి వాసన రాకుండా యాలకులూ, లవంగాలూ మింగేసి, ఇంటికి పోతాడు. అదతని రూలు!"

 

    "ఇంట్లో ఎవరున్నారేవిటి-అంత భయపడటానికి?"

 

    "వాళ్ళబ్బాయి! కన్న కొడుకంటే చచ్చేంత భయం!"

 

    వామనరావు ఆ క్లబ్బు విడిచి వెళ్ళిపోయేవాడే. అతను గుమ్మం దాటుతూండగా గోపాలరావు క్లబ్బులోకి వచ్చేడు.

 

    గోపాలరావుని చూడగానే 'హల్లో' అన్నాడు వామనరావు. గోపాలరావు ఒక పిచ్చికేకపెట్టి, వామనరావుని ఎత్తేసుకుని బొంగరంలాగా గిరగిరా తిప్పేస్తున్నాడు హల్లో...హల్లో అంటూ.

 

    ఆ గొడవ పూర్తయిం తర్వాత వామనరావు విసుక్కుంటూ అన్నాడు-

 

    "అయ్ టెల్యూ గోపాలరావ్! అభిమానం వుండటం వరకూ ఫర్లేదు. మోతాదు మించిపోతే రోతగా వుంటుంది."

 

    "క్షమించరా వామీ! నీకో శుభవార్త చెప్పాలి గనక ఈ తిప్పుడు తప్పలేదు. ఒరే-నలభై అయిదేళ్ళుగా నా పుట్టిం రోజెప్పుడో తెలీకుండా గడిపేసేనురా! తషోమషి దయవల్ల నా పుట్టినరోజు నిమిషాలు ఘడియల్తో సహా తెలిసిపోయింది."

 

    "తషోమషి ఎవరు?"

 

    "కరెక్టుగా లెక్కలుగట్టి పుట్టినరోజులు చెప్పేవాడు. ఆ ఫీల్డులో స్పెషలిస్టు. టోకియోలో వుంటాడు. వాడి దగ్గర కొన్నికోట్ల తాళపత్ర గ్రంథాలున్నాయిరా! నా పుట్టినరోజు గొడవ అందులో దొరికి పోయింది. తషోమషి లెక్క ప్రకారం-ఇవాళే నా పుట్టింరోజు! అందుకే ఈ ఆనందం!".

 

    వామనరావు కూడా ఆనందించేడు.

 

    "దెన్-అయ్ విష్ యూ మెనీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!" అన్నాడతను.

 

    గోపాలరావు వామనరావు చేతిని పట్టుకుని లాక్కువెడుతూ అన్నాడు.

 

    "కమాన్ మందుకొట్టి నా బర్త్ డే సెలిబ్రేట్ చేసుకుందాం."

 

    చెయ్యి విదిలించుకుని అన్నాడు వామనరావు.

 

    "సారీరా గోపాలరావు! నే వెళ్ళాలి. ఎనిమిదింటికల్లా ఇంట్లో వుండాలి. లేకపోతే మా అబ్బాయి బాధపడతాడు."

 

    గోపాలరావు బాధపడిపోతే అన్నాడు.

 

    "ఒరే వామనరావు-నలభై అయిదేళ్ళ తర్వాత తొలిసారిగా చేసుకుంటున్న పుట్టిన్రోజురా ఇది! ప్రాణమిత్రుడిని నువ్వు నా ఆనందాన్ని పంచుకోకపోతే బాధపడి పోతాన్రా! ఆఫ్టరాల్ మీ అబ్బాయికోసం".

 

    "గోపాలరావ్...వద్దు! వాడికి బిరుదులివ్వకు!" అన్నాడు వామనరావు కోపంగా.

 

    "ఓ.కే. ఓ.కె! మీ అబ్బాయిగారు నిన్నేమీ అనకుండా వుండేందుకు ఒక ఉత్తరం రాసి దాన్ని నీ వీపుమీద అంటిస్తాను. నాన్నా అంటాడు. వీపు చూపించు. నా ఉత్తరం చదివేస్తాడు. క్షమిస్తాడు. ఒ.కే?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS