"అంతా వినేసేవా?"
"ఇన్నాను గనకే నీ అబద్ధాలకి బాధపడి పోతున్నాను. మీ నాన్న ఇష్టం లేకపోయినా మానిక్యమ్మని లవ్వాడి గుళ్ళో పెళ్ళి చేసుకుంటున్నది చాలక-మీ అయ్య తెచ్చిన సంబంధం, కళ్ళు మూసుకుని తాళికడ్తన్నానని అయ్యగార్తో కోతలు కోస్తే కళ్ళు పోవంట్రా?"
"ఎదవకళ్ళు పోతే పోనీయ్! లవ్వాడి పెళ్ళి చేసుకుంటున్నానని నిజం చెబితే ఉద్యోగం పోద్ది!"
పనిమనిషి అట్నుంచి నరుక్కొచ్చేడు.
"ఇప్పుడు మాత్రం పోదని గేరంట్రీ ఏంటి? అసలు కతేంటో అయ్యగారితో సెప్పడానికి నేన్లేనా?"
డ్రైవరు అదిరిపోతూ అన్నాడు.
"బాబ్బాబు-నీ కాళ్ళట్టుకుంటాను. అంత పని చేయమాకు."
"కాళ్ళొద్దు! చేతులట్టుకో!"
డ్రైవరు అంతపనీ చేసేడు.
"ఉత్తినే పట్టుకుంటే తిమ్మిరిగా వుంటది. నీకు తోచింది నా చేతుల్లో పెట్టు."
డ్రైవరు వందకాగితం పెట్టి అన్నాడు.
"ఇప్పుడు చెప్పవుగా!"
"ఏంటో ఇంకా చెప్పాలనే వుంది."
డ్రైవరు మరో కాగితం పెట్టేసి అన్నాడు.
"ఇప్పుడో?"
"ఇగ సెప్పను. ధైర్యంగా ఎల్లిపోవచ్చు." అన్నాడు పనిమనిషి నోట్లు జేబులో తోసేసుకుని అయ్యగారి గదిలోకి అడుగు పెడుతున్నాడు.
4
వామనరావు ముస్తాబు పూర్తి చేసుకున్నాడు.
టై కట్టుకుంటుండగా గదిలోకి వచ్చిన పనిమనిషిని అడిగేడు.
"అబ్బాయ్ గారెక్కడ?"
"ఆ సంగత్తెలవదండి. ఆరొచ్చేవరకు తమర్ని ఇంట్లో వుండమని ఆర్డరేసేరండి." అన్నాడతను.
వామనరావు పనిమనిషి చెంప ఛెళ్ళు మనిపించేడు.
"ఎందుక్కొట్టేనో తెలుసా?"
"తెలవదండి!"
"ఈ ఇంటికి యజమానిన్నేను! ఆర్డర్లు వేయాల్సింది నేనుగాని వాడుకాదు. వాడు వేసే ఆర్డర్లకి విలువలేదు. విలువలేని వాడి ఆర్డర్లతో నన్నాపాలనుకోవడం తప్పు! అందుకే కొట్టేను. ఇంతకీ వాడెక్కడ? శేషూ? అని పిలుచుకుంటో ఆ గది విడిచేడు వామనరావు.
5
అమ్మవారి గుడి.
చిరంజీవి శేషుబాబు భక్తుల క్యూలో నిలబడ్డాడు. చేతిలో పూలసెజ్జ వుంది. అందులో పూలూ, కొబ్బరికాయలున్నాయి.
అతని ముందు ఆ క్యూలో కొ చమత్కారి నిలబడి వుంది, క్యూ సాగుతూంటే మధ్య మధ్యలో వెనక్కి తిరిగి శేషుబాబుని కొంటెగా చూసుకుంటో నడుస్తోంది.
ఆ విన్యాసంలో ఆ చమత్కారి గంట కొట్టడం మరిచిపోయి ముందుకు వెళ్ళబోతుండగా శేషు ఆదుర్దాగా అరిచేడు.
"ఏవండీ!"
చమత్కారి ఆగి వెనక్కి తిరిగి ఏమిటన్నట్టు శేషు వేపు చూస్తూ ఆంజనేయస్వామి లాగా ఛాతీ చీల్చుకున్నట్టు పమిట తొలగించింది.
శేషు ఆ దెబ్బకి తట్టుకోలేక కళ్ళు మూసుకున్నాడు.
గంటసేపు దృష్టినిలిపి పవిత్రంగా చెబుతున్నాడు.
"గంట కొట్టకుండా అమ్మవారి దర్శనం అపరాధమండి. గంట కొట్టండి!"
చమత్కారి చాతీ మరింత చీల్చుకుంటో వయ్యారంగా అనేసింది.
"గంట కొట్టాలంటే ఇంకొకరి చెయ్యి తోడుండాలి. (క్షణమాగి అన్నది) అయినా చెట్టంత మనిషిని ముందెట్టుకుని గంటసేపు చూస్తావేమిటి? ఇదిగో నిన్నే...నీ వయిస్సెంత?"
గంటసేపు చూస్తూనే భక్తిగా చెప్పాడు.
"ఇరవై రెండు!"
ఇంక ప్రయోజనం లేదని గ్రహించి ఛాతీ కప్పేసుకుని విసుగ్గా అనేసింది చమత్కారి.
"ఇంకానయం! అరవైరెండను కున్నాను, నా గంటా నీ గంటా నువ్వే కొట్టు వస్తా?"
అనేసి ఆమె వెళ్ళిపోతుండగా-చిరంజీవి శేషు 'అపరాధం' 'అపరాధం' అంటూ లెంపలేసుకుంటున్నాడు.
6
వామనరావు సూటూ బూటూ హేటూ చేతిలో స్టిక్కూ వగైరా హంగుల్తో వెలిగిపోతున్నా-మేడమెట్లు దిగుతూ ఫైరింజన్ లా మండిపోతున్నాడు.
మెట్ల కింద నిలబడ్డ జనాభ (పని మనుషులు) యావత్తూ కళ్ళప్పగించి చూస్తున్నారు.
వామనరావు తన చేతిలోని స్టిక్కుని మంత్ర దండంలా తిప్పుతూ మినీ లెక్చరు దంచుతూ ఒక్కో మెట్టు దిగుతున్నాడు.
"అబ్బాయి గార్ని గౌరవించండి. నా కిష్టమే. అంతేగాని వాడు వేసే పిచ్చి పిచ్చి ఆర్డర్లు మీరు నా చెవినేయకూడదు. నన్ను ఇంట్లోంచి కదలొద్దని చెప్పడానికి వాడెవడు? హు ఈజ్ హి ఆఫ్టరాల్? నాకు పుట్టినవాడు నా మీద అజమాయిషీ చేస్తే నేనెట్లా సహిస్తాను? అయ్ టెల్యూ మిలట్రీ. మనిషి న్నేను. డిసిప్లిన్-క్రమశిక్షణ నాకు ఆరోప్రాణం. కన్న కొడుకైనా సరే నా మాట కెదురు చెప్పకూడదు. నా సిద్ధాంతాన్ని వ్యతిరేకించకూడదు. అట్లా జరిగిన పక్షంలో పిచ్చెక్కిపోతుంది నాకు. ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు, కారి కొరికేస్తాను. నమిలేస్తాను మింగేస్తాను మైండిట్".
ఉపన్యాసం పూర్తయ్యేసరికి వామనరావు హాలు దాటిపోయేడు. హాల్లో వున్న జనాభా బొమ్మల్లా నిలబడి పోయివున్నారు.
హాలు బయట.
పూల సెజ్జ అందులో పూజా ద్రవ్యాలతో చిరంజీవి శేషుబాబు అపర భర్త శిఖామణిలా ప్రత్యక్షమయ్యాడు.
కన్న కొడుకుని చూడగానే ఫైరింజను ఐస్ క్రీం బండైపోయింది. నిప్పులు కురిసే కళ్ళల్లో వెన్నెల నిండింది.
వెనకా ముందు చూసుకున్నాడు. ఎవరూ లేనందుకు బోలెడు ఆనందించేడు.
కొడుకుని సంతోషపరిచేందుకు మందహాసం కూడా చేసేడు.
శేషు కుంకుమ తీసి తండ్రి నుదుట బొట్టు పెట్టేడు. గంగి గోవులా తల వంచి బొట్టు పెట్టించుకున్నాడు వామనరావు.
శేషు ప్రసాదమిచ్చేడు. దాన్ని గబుక్కున మింగబోయాడు వామనరావు.
శేషు గంభీరంగా ఆర్డరు వేసేడు.
"కళ్ళ కద్దుకో నాన్నా!"
"అవునవును! కళ్ళకద్దుకునే ప్రసాదం తీసుకోవాలి!" అంటూ ఆ కార్యక్రమం పూర్తి చేసాడు వామనరావు.
"నేనొచ్చేవరకూ ఇంట్లో వుండమని ఖబురు పెట్టేను గదా! నే రాకుండానే వెళ్ళిపోతున్నావే?"
