నరసరాజు అండ్ బ్రదర్స్ నుంచి నరసరాజు బయటకొచ్చి నించున్నాడు. డ్రైవరు కారు వెనుక తలుపు తెరిచి పట్టుకుని వినయంగా నించున్నాడు. నరసరాజు కారులో కూర్చున్న తర్వాత, ఆ కారు నున్నటి సిమెంటు రోడ్డుమీద మెత్తగా పోతోంది. ఎన్నో సందులు తిరిగి ఒక ఆఫీసు ముందు ఆగింది.
నరసరాజు కారు దిగాడు. టైనాట్ ని సర్దుకున్నాడు. తిన్నగా విజిటర్స్ హాల్లోకొచ్చి, విజిటింగ్ కార్డు డ్రైవరు చేతికిచ్చి పంపాడు.
ఆ ఆఫీసు యావత్తూ కళకళలాడుతోంది. రెండేళ్ళ క్రితం నరసరాజు వాళ్ల క్లాసు కూడా యిలాగే సందడిగా వుండేది. అక్కడ పనిచేసే వాళ్ళల్లో సగానికి సగం కుర్రవాళ్ళే. అయినా అంతా కుర్రాళ్ళే అనిపించేంత సందడి అక్కడ వున్నది. నరసరాజు మురిసిపోయాడు. మెల్లిగా నవ్వేస్తూ మాటాడుతున్నారు. వాళ్లందరి మధ్య ఓ టైపు మిషనుంది. ఆ టైపు మిషను ముందు....
నరసరాజు ఆ టైపిస్టు వైపు ఇంకా చూస్తూనే వున్నాడు.
"ఇదేమిటి, మీరిక్కడున్నారా? ఇక్కడా మీరు? మీరుద్యోగం చేస్తున్నారా? నాకిది నచ్చదు. మీవారున్నారుగా. వారు శ్రీమంతులు కారా? అయ్యో సీతగారూ మీరుద్యోగం చేయడం నాకిష్టం లేదండి. మీరుద్యోగం చేసి అలిసిపోవడం నాకిష్టం లేదు. మల్లెపూవులా నిత్యం అతి సుకుమారంగా మీరు బ్రతకాలి. ఈ టైపు మిషన్ మీద మీ పవిత్రమైన వేళ్ళెంత బండబారిపోయాయో గమనించారా? వీల్లేదు. సీతగారూ మీరుద్యోగం మానేయండి. ఓహో...మీరీ ఆఫీసులో వున్నారు గనుకనే వీళ్ళింత మందిక్కడ ఉత్సాహంగా వున్నారు అర్థమైంది. నో... వీల్లేదు. మీరలసిపోతూ వీళ్ళింతమందికి ఉత్సాహాన్ని పంచివ్వకూడదు. అంతే. అది రూలు!"
నరసరాజింకా యెన్నెన్నో అనుకుంటున్న వేళ ఆఫీసు జవాను వచ్చి సలాం చేసి "దొర పిలుస్తుండు" అన్నాడు.
నరసరాజు వెంబడించాడు. ఆఫీసులో జనాభా అంతా నరసరాజుని కళ్ళప్పగించి చూస్తున్నారు. ఎవరో ఒకతను "నరసరాజు అండ్ బ్రదర్స్ లీడింగ్ కంట్రాక్టర్స్" అని మరెవ్వళ్ళతోనో చెప్పడం విన్నాడు. దానిమీదట సీత తనవైపు చూడడం జరిగింది. నరసరాజు సీత కళ్ళని దూరం నుంచే పసికట్టాడు. ఆనాడు లైబ్రరీలో కూడా యిలాగే చూచింది. ఆనాడు సీత కళ్ళల్లో నీళ్లున్నాయి. ఈనాడు అవి లేవు. ఆ స్థానంలో చెప్పలేనంత ఆశ్చర్యం వున్నది. కొంచెమో గొప్పో ఆనందమూ వున్నది.
కాసేపటికి సీత తలని దించేసుకున్నది. నరసరాజు హృదయం తల్లడిల్లిపోయింది. విసురుగా దొర గదిలోకి అడుగుపెట్టాడు. అతను గదిలోకి వెళ్ళగానే, గదిలో ఉన్న దొర గౌరవంగా లేచి నుంచోడంతో నరసరాజు చేతిని ఉత్సాహంగా ముందుకు చాచి దొర చేతిని తాకాడు.
"నరసరాజు" అన్నాడు నరసరాజు.
"ది గ్రేట్ ఐ నో" అన్నాడు దొర. దొర పేరు కె.కె.శర్మ!
"హేవ్ యువర్ సీట్ ప్లీజ్" అని కూడా అన్నాడు శర్మ.
ఇద్దరూ కూచున్న తర్వాత దొర బెల్లు నొక్కాడు. ఒకడు ఆ గదిలో ప్రత్యక్షమయ్యాడు.
"టూ డ్రింక్స్?" అన్నాడు శర్మ.
ఆ ఒకడు గదిలోంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.
"మీ ఫాదరు మాకు బాగా తెలుసు. హౌ యీజ్ హి?"
"ఫర్లేదు, కులాసాగానే వున్నారు, నిన్న మీకు ఫోన్ చేసిన...."
"అఫ్ కోర్స్.... అఫ్ కోర్స్" అంటూనే బెల్లు నొక్కాడు.
గదిలో మరొకతను ప్రత్యక్షమయ్యాడు.
"సీతమ్మని పిలు. క్విక్...."
ఆ మరొకడూ వెళ్ళిపోయాడు.
గదిలో పంకా తిరుగుతోంది. దొర అనబడే శర్మ కుర్రాఫీసరు. మంచి ట్రిమ్ముగా, నీటుగా వుండడం చేత - అతని తలనూనె తాలూకు మనోహరమైన గుబాళింపు ఆ గది నావహించింది. శర్మేదో చాలా విషయాలు మనవి చేసుకుంటున్నాడు. నరసరాజు మాత్రం కేవలం సీత రాకకోసం ఎదురు చూస్తూండిపోయాడు.
శర్మ, మాటల మధ్యలో బెల్లు నొక్కేడు. కానీ, అప్పటికే మొదటివాడు రెండు డ్రింక్స్ తో గదిలో అడుగుపెట్టేడు. డ్రింక్స్ తీసుకుంటూ శర్మ అన్నాడు.
"సీతమ్మని రమ్మనోయ్? ఏం చేస్తుందక్కడ? బాతాఖానీకిది చోటు కాదని చెప్పు పో"
నరసరాజు తాగబోయే డ్రింకుని ఆపి,
"ఫర్లేదు. మరేం తొందరలేదు లెండి" అన్నాడు బెరుగ్గా.
"అయ్యో సీతా! నువ్వింత నిరాదరణతో ఉద్యోగం చేస్తున్నావా? మీవారెవరో చెప్పు". దవడ పళ్లు రాలగొట్టి బుద్ధి చెప్తాను. నువ్వింత అవమానాన్ని భరిస్తూ ఉద్యోగం చేయడానికి వీల్లేదంతే" అనికూడా అనుకున్నాడు.
అంతలో సీత వచ్చింది. కొంచెం దూరంగా నించుంది. నరసరాజు కళ్ళ చివర్నుంచి ఆమెని చూశాడు. దేవత! ఈవిడ అమృతం తాగివుంటుందంతే. లేకపోతే ఇంత హీనంగా ఒకచోట పనిచేస్తూ గూడా తన సౌకుమార్యాన్ని కించిత్తు గూడా పోగొట్టుకోలేదంటే ఏమిటర్థం?
"అవునండీ కబురంపి పది నిమిషాలైనా రాలేదు. మీరు యేమిటి చేస్తున్నారక్కడ" అన్నాడు శర్మ.
"అయ్యో, అయ్యో, పది నిమిషాలు కాలేదండీ శర్మగారూ! మీరుత్తి పుణ్యానికి అబద్ధ మాడేస్తున్నారు అనుకుని నొచ్చుకున్నాడు నరసరాజు.
సీత అన్నది -
"మావారొచ్చారు."
"నో...నో... ఐ డోంట్ వాంట్ యువర్ శాడ్ స్టోరీస్. గో అండ్ బ్రింగ్ దట్ కాంట్రాక్ట్ ఫెయిల్ నెంబర్ ఫోర్. క్విక్"
సీత వెళ్ళిపోయింది. శర్మ సీత గురించి మాట్లాడాడు.
