వామనరావు ఆ బుట్టని కసిగా చూసి కాల్తో ఫుట్ బాల్ మాదిరి కొట్టేడు.
ఆ దెబ్బతో ఆ బుట్ట తలుపు దగ్గరకొచ్చి పడింది.
అంతలోనే-
ఆ తలుపు తెరుచుకుంది. అక్కడ శివరామారావు, అతనిక్కాబోయే భార్యామణీ, సెక్రట్రీ నిలబడివున్నారు.
వామనరావు ముక్కుపుటా లెగరవేస్తూ 'యస్' అన్నాడు కోపంగా.
శివరామారావు చాలా వినయంగా మనవి చేసేడు.
"ఈమె పేరు మిస్ మేరీ సార్! మన కంపెనీలోనే స్టెనోగా పనిచేస్తోంది. మేమిద్దరం గత అయిదేళ్ళుగా ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమ పెద్దవాళ్ళ కిష్టంలేదు. వాళ్ళు తెచ్చిన సంబంధాలు కాదని మేరీని జేసుకుంటున్నాను. మా పెళ్ళికి అమ్మా నాన్న ఎట్లాగూ రారు. వారు రాని లోటు తీర్చి, మీరే మా పెళ్ళి జరిపించాలని కోరుకుంటున్నాం!"
సెక్రట్రీ తాళం వేసేడు.
'మన శివరామారావుకు అయిదువేల రూపాయలు అవార్డు కూడా యిస్తున్నారు. ఈ పెళ్ళి కూడా తమ చేతుల మీద జరిపించేస్తే రెండు అవార్డు లిచ్చినట్టవుతుంది!"
ఆవేళకి వామనరావు కళ్ళు బాగా ఎరుపెక్కేయి. మనిషి కోపంతో ఊగిపోతూ అన్నాడు.
"అయ్ టెల్యూ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని కాదనే మనిషికి ఉరిశిక్ష వేయాలని నా సిద్ధాంతం! ఈ శివరామారావు నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుంటున్నాడు. ఉరిశిక్ష వేసే అధికారం లేదు గనుక అయ్ జస్ట్ హేట్ హిమ్!"
వామనరావు కేకలకు ముగ్గురూ భయపడ్డారు. సెక్రెట్రీ ధైర్యం తెచ్చుకుని ఒక ఫైలు వామనరావు ముందు పెట్టేడు. ఆ ఫైలుని విసుగ్గా చూస్తూ అడిగేడు వామనరావు.
"వాట్ ఈజ్ దిస్!"
సెక్రట్రీ నీళ్ళు నముల్తూ అన్నాడు.
"శివరామారావుకి తమరు యిస్తానన్న అయిదువేల రూపాయలకు ఆర్డరు తయారు చేసేను సార్. తమ సంతకం."
వామనరావు ముక్కుపుటా లెగరవేస్తూ అన్నాడు.
"నో! అయ్ విల్ నాట్ సైన్ దట్ బ్లడి ఆర్డర్! నా నిర్ణయం మార్చుకున్నాను. అయ్ టెల్యూ అయిదు వేలు కాదు గదా అయిదు పైసలు కూడా ఇవ్వను. అండర్ స్టాండ్..."
శివరామారావు ఏదో చెప్పబోయే ప్రయత్నంలో...
"సార్" అన్నాడు.
"డోంటాక్! నాక్కావల్సింది వ్యాపారంలో ప్రయోజకత్వ మొక్కటే కాదు. నా సిద్ధాంతానికి కట్టుబడి వుండే గుణం కూడా కావాలి. అయ్ టెల్యూ ఆ గుణం లేని వాడికి నాకంపెనీలో చోటు లేదు. వుండదు. సెక్రట్రీ..."
"యస్సర్."
"ఇతన్తోపాటు ఈ అమ్మాయిక్కూడా రావాల్సిన పైకమిచ్చేసి తక్షణం ఉద్యోగంలోంచి తీసేయండి. ఈ కంపెనీలో రెండు ఖాళీలున్నాయని కూడా వెంటనే పేపర్లో ప్రకటించండి! నవ్, యూమేగో!...లీవ్ ది రూం."
వామనరావు వరసకి వాళ్ళు ముగ్గురూ భయపడిపోయేరు.అంచేత ఆ గది విడిచి వెళ్ళిపోయేరు.
వాళ్ళు వెళ్ళిపోయిం తర్వాత, తాను కూడా ఆ గది విడిస్తూ గొణుక్కుంటున్నాడు వామనరావు.
"లవ్వుట, లవ్వు! ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు."
ఆ తర్వాత, దారి కడ్డంగా వున్న చెత్త బుట్టను, కసిగా... గట్టిగా తన్నేడు.
మారుతీ చిత్రాలయలో కవిగారు కాలుపట్టుకుని అబ్బా అని మూలిగేరు. అతను కూర్చున్న కుర్చీ అవతల పడి వుంది.
2
అదొక అందమైన ఖరీదైన పెద్ద బంగళా.
వామనరావు, ప్రొప్రయిటరు వామన్ స్కూటర్స్ అనే బోర్డు బయట గోడమీద తగిలించబడి వుంది.
బంగళాముందు ఫౌంటెన్...అందమైన గార్డెను-సిరి తాండవించే చోటుగా తెలీచేస్తున్నాయి.
ఆ బంగళాలోకి వెళ్ళిపోతే హాల్లోనే మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లెక్కితే మేడమీది కెళ్ళిపోవచ్చు.
మేడమీద రెండోగదే వామనరావుది.
వామనరావు నిలువుటద్దమ్ముందు నిలబడికోటు తొడుక్కుంటున్నాడు.
ఆ సమయానికి కారుడ్రైవరు మెల్లిగా గదిలోకి వచ్చేడు. సెల్యూట్ కొట్టి నిలబడ్డాడు.
డ్రైవర్ని అద్దంలోనే చూసి-అద్దంలో డ్రైవర్తో 'యస్' అన్నాడు వామనరావు ఏమిటన్నట్లు.
"వారం రోజులు సెలవు కావాలి సార్" అన్నాడు డ్రైవరు ఎంతో వినయంగా.
కోటుకి గుండీలు పెట్టుకుంటో అడిగాడు వామనరావు.
"ఏమిటో విశేషం?"
"నా పెళ్ళండి!" సిగ్గుతో మెలికలు తిరిగిపోయేడు డ్రైవరు.
వామనరావు అప్పుడు అద్దాన్ని విడిచిపెట్టేడు. డ్రైవరువేపు ఒక్కో అడుగు గంభీరంగా వేస్తూ చెడ్డ సీరియస్ గా ప్రశ్నించాడు.
"ఏం పెళ్ళి? దండల పెళ్ళా? సంతకాల పెళ్ళా? మంత్రాల పెళ్ళా?"
డ్రైవరు ఖంగారుగా గబగబా చెప్పేసేడు-
"మంత్రాల పెళ్ళేనండి. మా నాన్న తెచ్చిన సంబంధం!"
వామనరావు హేపీగా నిట్టూర్చేడు....
"సెభాష్! అయి టెల్యూ-మనిషన్న ప్రతివాడూ-ఇల్లాంటి పెళ్ళేచేసుకోవాలి. పిల్లని చూసేవా?"
డ్రైవరు తలొంచుకుని గారంగా సమాధానమిచ్చేడు.
"చూడలేదండి. అన్నీ మానాన్నే చూసుకుంటాడండి. నా చేతికి తాళిచ్చి కట్టమంటారు. కట్టించుకునేది అమ్మాయికావచ్చు ఆటంబాబు కావచ్చు. కళ్ళు మూసుక్కట్టేయడమే నా డ్యూటీ అండీ!"
వామనరావు ఆ సమాధానానికి పొంగి పోయేడు. డ్రైవరు భుజం తట్టి మరీ చెప్పేడు-
"దట్స్ గుడ్! నాకారు డ్రైవరువే కావచ్చు గొప్పనీతిరా నీది. (కోటు జేబులోంచి 5 వందల నోట్లు తీసేడు. (డ్రైవరుకిస్తూ అన్నాడు) "వుంచుకో!"
డ్రైవరు గొప్ప బెట్టుపోతూ అన్నాడు-
"క్షమించాలి సార్! నాక్కావల్సింది సెలవేగాని, డబ్బుకాదు సార్"
వామనరావు మందహాసం చేస్తో అన్నాడు.
"నేనిచ్చింది ప్రజెంటేషన్! నువ్వు కోరేది సెలవు. రెండూ తీసుకో! నా పని మనిషైనా, పని ముట్టెయినా నా సిద్ధాంతానికి సూటయితే నాకదో సంతోషం. వెర్రి ఆనందం! గో మేన్-గో".
డ్రైవరు మళ్ళీ సెల్యూట్ చేసి వెళ్ళిపోయేడు. వామనరావు నిలువుటద్దం వేపు నడిచేడు.
3
డ్రైవరు డబ్బు తీసుకుని గది బయటకు రాగానే అక్కడో పనిమనిషి వెకిలిగా, కోడిపిల్లలాగా నవ్వేస్తూ అన్నాడు.
"బతకనేర్చినోడివిరా బాబూ! అయ్య గారికి కతలు చెప్పి బతికేస్తున్నావ్!"
అతని స్టేట్ మెంటుకి డ్రైవరు భయపడ్డాడు. అటూ ఇటూ చూసి ఆ పనిమనిషిని పక్కకి తీసికెళ్ళి అడిగేడు.
