ఇంత మంచివాడు నరసరాజు, కానీ ఓనాడు పదిమంది కళ్ళల్లో చెడ్డవాడైపోయాడు. నచ్చిన పుస్తకమేదైనా తీసుకుందామని కాలేజీ లైబ్రరీకి వెళ్ళాడతను. ఆరోజు లైబ్రరీలో ఎవ్వరూ లేరు. సీత ఒక్కర్తి ఒక మూలగా కూర్చుని వుండడంతో అతనెంతో ఆనందించాడు. అయితే సీత సుబ్బారావుగారిలా తల దించుకొని ఏదో విషయమై గాఢంగా ఆలోచించడంతో కలవరపడ్డాడు కూడాను. పుస్తకమేదీ తీసుకోకుండానే సీతకు చాలా దూరంగా కూచుని సీతవేపు చూచాడు. అప్పుడామె తలెత్తి అతన్ని చూచింది. అంతే యిద్దరూ ఒకర్నొకరు కొన్ని క్షణాలు అలా చూస్తుండిపోయారు.
అందమైన అమ్మాయికి మరింత అందమైన కళ్ళల్లో నీళ్ళెందుకుంచాడో ఆ దేవుడు నరసరాజుకి తోచలేదుగానీ, పూర్తిగా చలించిపోయాడు. లేచి నుంచున్నాడు.
"ఏడవకండేవకండి! మీరేడుస్తుంటే నే చూళ్ళేను. మీ కష్టమేమిటో చెప్పండి. నేను మీ స్నేహితుల జాబితాలో లేనుగాని ఓ మనిషిని. మీసాటి మనిషిని. నాతో మీకష్టం చెప్పుకోండి. అవసరమనుకుంటే నా సాయం మీరు పొందండి. సందేహించకండి. అంతేగానీ, మీ కన్నీటిని నే చూళ్ళేను. చెప్పండంతే. ఏమిటి మీ కష్టం!"
ఇన్ని మాటల్నీ గుండెలో దాచుకుని కళ్ళతో అడిగాడు నరసరాజు. కళ్ళ భాష అర్థం చేసుకోలేదేమో ఆమె అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది. నరసరాజు అక్కడలాగే నిల్చుండిపోయాడు. కాసేపటికి బలమైన చేయొకటి అతని భుజాన్ని తట్టింది. ఉలిక్కిపడి చూశాడు.
ఎదుట వెంకట్రావు.
పేలవంగా నవ్వేసి చేతులు రెండూ ఒకదానికొకటి రుద్దుకున్నాడు నరసరాజు.
"వాటే బ్యూటిఫుల్ రోగ్ యూ ఆర్!" అన్నాడు వెంకట్రావు వెటకారంగా.
నరసరాజు రెండు పాదాలకీ మంచి ఖరీదైన చెప్పులున్నాయి. అవి పుచ్చుకుని వెంకట్రావు దవడపళ్ళు రాలగొట్టేంత కోపమొచ్చిందతనికి. కానీ, వెంకట్రావుమీద నరసరాజుకున్న గౌరవం అంతపని చేయించలేదు. కనీసం రెండు మాటలైనా అని పోదామనుకున్నాడు నరసరాజు. ఏమని మాట్లాడాలో తోచక అక్కడనుంచి కదిలి వెళ్ళిపోయాడు. మరుసటి ఉదయం పనిమనిషి చెప్పింది - సీత కాలేజీ ఫీజు విషయమై గత రెండు రోజులుగా ఆ యింట్లో మనుషులు గొప్ప బాధపడిపోగా, ఆ ఉదయం ఎవరో వెంకట్రావనే కుర్రవాడు ఇంటికొచ్చి డబ్బిచ్చి వెళ్ళిపోయాట్ట. ఇదీ విషయం.
అదే విషయానికీ సీత నిన్న కన్నీరు పెట్టుకున్నది. ఇదే విషయం సకాలానికి తెలుసుకున్న వెంకట్రావు యోగ్యుడు కనుక సాయం చేయగలిగాడు.
నరసరాజుకి వెంకట్రావుమీద సదభిప్రాయం పెరిగిపోయిందప్పుడు. 'వాటె బ్యూటీఫుల్ రోగ్ యూ ఆర్!" అన్న వెంకట్రావు మాటకి అర్థం కూడా తెలిసిందప్పుడు.
* * *
లీలామహల్లో సినిమా వదిలారు. నెమ్మదిగా జనాన్ని తప్పుకుంటూ రోడ్డుమీదకొచ్చి నించున్నాడు నరసరాజు. భోంచేయాలనిపించలేదతనికి. సోడా తాగాలనిపించింది. షాపువేపు చూశాడు. మరంతే అక్కడనుంచి చూపు మరల్చలేకపోయాడతను.
అక్కడ సోడాషాపు దగ్గర పాత గొడుగుతో సహా బాగా వొంగిపోయి రెండు అరటిపళ్ళు కొనుక్కున్న సుబ్బారావు గారు రోడ్డుమీదకి రాబోయాడు. నరసరాజు గబగబా ఆయన్ని చేరుకుని అన్నాడు.
"నన్ను గుర్తుపట్టారా?"
సుబ్బారావుగారతన్ని రెండు క్షణాలు పరిశీలించి లేదన్నట్టు తలూపారు.
"నరసరాజునండీ.... నేను. రెండేళ్ల క్రితం గోవిందరావుగారింట్లో అద్దెకుండి చదువుకున్నాన్నేను. నరసరాజు నా పేరు. ఆ వీధి చివర్లో మీది.."
"బలే... గుర్తుకొచ్చేవు బాబూ! అవునవును. నీ పేరు నరసరాజు." అన్నాడాయన నీరసంగా, పేలవంగా నవ్వేస్తూ.
"అంతా క్షేమమాండి?"
ఆయన కాదూ, అవునూల మధ్య తలూపాడు.
"నేనిప్పుడు కాకినాడలో వున్నానండి."
"పెళ్లయిందా బాబూ?"
"ఆహా.... ఒక ఆడపిల్ల కూడాను."
"ఇప్పుడేం చేస్తున్నావూ?"
"కాంట్రాక్టులు చేస్తున్నాను. మా నాన్నగారేమో రెస్టు తీసుకుంటున్నారు. మొన్నీ మధ్యనే ఈ ఊళ్లో బ్రాంచీ పెట్టాము. అందుచేతనే నేనిక్కడికి వొచ్చాను."
"మంచిది బాబూ! శ్రీమంతుడివైనా నన్ను గుర్తుబట్టి పలుకరించావు. అదే పదివేలు. వస్తా నాయనా, రైలుకి వేళయింది."
"అదేమిటి? మీరీ వూళ్ళో లేరా?"
"ఇక్కడిల్లు అమ్ముకుని గుడివాడలో మా పెద్దమ్మాయి దగ్గిరున్నాం. ఇల్లమ్మకం తాలూకు పైకం కొంచెం రావలసి వస్తే ఇలా వచ్చాను. వస్తా బాబు!"
ఆయన రెండడుగులు వేసిన తర్వాత నరసరాజుకి అతనడగవలసిన మాట గుర్తుకొచ్చింది. అవకాశం చేయిదాటి పోతుందేమోనన్న బెంగచేత చాలా ఆదుర్దాగా పిలిచాడతను.
"సుబ్బారావుగారూ! ఒక చిన్నమాట. అవునండీ? మీ సీతగారికి పెళ్ళి చేశారా?"
ఆ మాటలో సుబ్బారావుగారు చాలా మారిపోయాడు. తడారిపోయిన గొంతుకలో ఇంత బక్కకోపం రంగరించి అన్నారాయన.
"అయింది. దాని పెళ్ళితో నా పరువూ పోయింది బాబూ! కులం కాని వాడినది పెళ్ళి చేసుకుంది. కులంలో నేను తలెత్తుకోలేక సతమతమవుతున్నాను. నేను చచ్చి బతుకుతూన్న మనిషిని తెలుసా బాబూ! సీతని ఈ గుండెలమీద పెంచాను. కొండంతాశ పెట్టుకున్నాను. అదేం చేసిందిప్పుడు. పోన్లే బాబూ. నా నోటినుంచి శోకాన్నే వినవలసి వస్తుంది. పోన్లే వెళ్ళిరా నాయనా వెళ్ళిరా."
సుబ్బారావుగారు రోడ్డుమీద వూగిపోతూ నడుస్తుంటే నరసరాజుకి తమాషాగానూ, జాలిగానూ వున్నది. అప్పుడతను అనుకున్నాడు.
"అయ్యా లెక్కలు మాష్టారూ! సుబ్బారావుగారూ! ఇది రాతియుగం కాదు. మీకేం తెలీదులాగుంది. సీత సుఖపడేందుకు మీరేం చేయలేదు. బి.ఏ. పాసైనా, సీత వెట్టిచాకిరి చేస్తేనేగానీ వందరూపాయలు దొరకవు. ఆ వంద రూపాయలూ, హవ్వ.... అయ్యా సుబ్బారావుగారూ ఆ వందరూపాయల్లో అంత అందమైన సీత అందంగా బతుకుతుందనే ధీమా మీకేమైనా వుందా ఏమిటి? అలా కాదనుకుని, డబ్బున్న మొగుడ్ని మీ ఎరికలో పట్టుకొచ్చి సీతకి పెండ్లి చేయండి చూద్దాం! అంతే మాష్టారూ అదంతే. ఇదంతా యుగధర్మం. సీత చేసిందేమీ తప్పుకాదు. సీత ఎవరో ఒకర్ని డబ్బున్న మనిషిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటేనే తప్ప సుఖం లేదు. వెర్రి ఆలోచనలు మానుకొని, గుండెలు మీద చేయి వేసుకుని, తిన్నగా తలెత్తి నడవండి. ఇప్పుడేం జరిగిందని. మీరంతలా క్రుంగిపోతారు? బలేవారేనే!"
నరసరాజు ఆరోజు రాత్రి తృప్తిగా నిద్రపోయాడు.
* * *
