Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 56


    ఒక రాత్రి...అందమైన రాత్రి...వెన్నెల పుచ్చ పువ్వులా గాస్తున్న రాత్రి.

 

    మేజరు వామనరావు మఫ్టీలో వున్నాడు. తెల్లటి పంచె లాల్చీలో అతను ధగధగా మెరిసిపోతున్నాడు.

 

    గుండెల్లో సరిగమలు మోగుతుండగా అనతు సుభద్రవున్న గదిలోకి అడుగుపెట్టేడు.

 

    ఆ గదిలో బాబు (కొంచెం పెద్దవాడయ్యాడు) ఆదమరిచి నిద్రపోతున్నాడు. సుభద్ర పూలచెండు గుచ్చుతోంది.

 

    వామనరావు సుభద్ర రూపలావణ్యాలకు ముగ్ధుడవుతూ అన్నాడు-

 

    "బ్యూటిఫుల్, అయ్ టెల్యూ-రంభ, ఊర్వశీ వగైరాలు నీ ముందు ఆఫ్టరాల్! లైట్ ఉంచనా, ఆప్ చేయనా?"

 

    "ఊ..చాల్లే ఊరుకోండి."

 

    "దట్ మీన్స్! చాల్లే ఊరుకోడంటే ఏమిటర్ధం?"

 

    సుభద్ర సిగ్గుపడుతూ చెప్పింది-

 

    "ఇవాళ శుక్రవారం"

 

    "సోవాట్?"

 

    "మీరు పక్కగదిలో పడుకోండి."

 

    వామనరావు చిరాకుపడిపోతూ అన్నాడు-

 

    "నో! నేను పడుకోను. మొన్నెప్పుడో శనివారమన్నావు. ఆ మధ్య గురువారమన్నావు. డే, తిథులూ, వారాల, నక్షత్రాల పేర్లతో నెలకిరవై రోజులు మన పడగ్గదులు వేరై పోతున్నాయ్. (ఆవేశంగా) లుక్ సుభద్ర! మిలట్రీ మేజర్ని. కోపమొస్తే వేరే గన్నక్కర్లేదు. గట్టిగా గాలి పీల్చి ఊదేనంటే మసైపోతావ్ మైండిట్." అంటూ అతను గాలి పీల్చి ఊదకుండానే ఆ గదిలోంచి వేగంగా బయటకు నడిచేడు.

 

    సుభద్ర అతనివేపు ఆందోళనగా చూస్తోంది.

 

    ఇంకోరోజు పగలు, భోజనాల వేళ, సుభద్ర వడ్డిస్తోంది. వామనరావు ముద్ద నోట్లో పెట్టుకుని తుపుక్కున ఊసేడు.

 

    కసిగా భార్యవేపు చూస్తో కోపంగా అన్నాడు.

 

    "వాట్ ఈజ్ దిస్? ఇదేమిటి? ఉప్పులేదు, కారం అస్సల్లేదు. ఉప్పు కారాల్లేని ఫుడ్డు నాకు సయించదు. అండర్ స్టాండ్?"

 

    "ఆరోగ్యానికి మంచిదని అట్లా చేసేనండి!"

 

    సుభద్ర కళ్ళల్లోకి తిన్నగా చూస్తో అన్నాడు వామనరావు.

 

    "సుభద్రా నీ కుట్ర నాకు తెలుసు."

 

    "కుట్రా?"

 

    "ఎగ్జాక్ ట్లీ; క్లాస్ వన్ కుట్ర. నూరేళ్ళూ నీ ప్రేమలో బ్రతకాలనుకున్నవాడ్ని, మనం పెళ్ళి చేసుకుని కనీసం అయిదేళ్ళయినా గడవలేదు. ఈ గడ్డి-క్వైట్ గ్రాస్-నీ భాషలో సాత్త్వ్హికాహారం..కారం ఉప్పులేని ఫుడ్డుతో నా ప్రేమకు బ్రేకులేయాలని నీ ఉద్దేశం. అయ్ హేట్ యువర్ ప్లాన్స్."

 

    అంటూ ఆ కంచాన్ని విష్ణుచక్రంలా విసిరేసేడు. అక్కడితో ఆ విన్యాసం ఆగిపోలేదు.

 

    కేలండర్లో తేదీలు మారుతున్న కొద్దీ విష్ణుచక్రాలు ఎగిరిపడుతూనే వున్నాయి.

 

    కంచాలు ఆ విధంగా విష్ణుచక్రాల ఆట ఆడుకుంటుంటే కవిగారి కామెంట్రీ ఆ ఆటకు జతగా వంతపాడుతోంది.

 

    "గురి తప్పకుండా కంచాలెగరేయడం కూడా ఒక ఆర్టే! చిరాకు పెరిగిపోయిన ఇళ్ళల్లో ఇల్లాంటి ఆర్టు ఎక్కువగా బతుకుతుంది. అది రూలు. రూలు ప్రకారం ఈ ఆర్టుని వామనరావు ప్రతిరోజూ బాగా పోషిస్తూనే వున్నాడు. అతనిలో అశాంతి బాగా పెరిగిపోయింది. సుభద్రలో అసహనం కూడా అదేస్థాయికి చేరుకుంది. అంచేత వాళ్ళ కథకి, కొసమెరుపు. ఇదిగో ఇట్లా అఘోరించింది."

 

    మెడకి కట్టుకున్న టైతీసి నేలకేసి కొట్టేడు వామనరావు. ఆ కార్యక్రమం ముగిసేక కిటికీవేపు నడుస్తూ అంటున్నాడు-

 

    "చచ్చిపోయి ఏలోకాన వున్నాడో గాని-ప్రేమించి పెళ్ళి చేసుకోవడం పరమ తప్పన్నాడు మానాన్న! ఆ ప్రేమ, పెళ్ళయ్యేక, ఎక్కువ కాలం బతకదనికూడా హామీ యిచ్చేడు. నా అనుభవంతో నాన్న మాట అక్షరాలా నిజమైంది."

 

    అప్పటికి కిటికీ దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల, ఇంకా ముందుకు వెళ్ళడానికి వీల్లేక అక్కడ ఆగిపోయి, గిర్రున వెనక్కి తిరిగి సుభద్రతో అంటున్నాడు.

 

    "సో నా మాటగానీ, నా సిద్ధాంతంగానీ నువ్వు పట్టించుకోవు. ఆల్ రైట్ (గట్టిగా అరిచేడు) ఆల్ రైట్ సుభద్రా! మనం విడిపోవడమొక్కటే ఈ సమస్యకి పరిష్కార మార్గం. ఇక నీ దారి నువ్వు చూసుకో."

 

    సుభద్ర కళ్ళనిండా నీళ్ళున్నాయి. ఆమె అసహనంగానే అడిగింది-

 

    "బెదిరిస్తున్నారా?"

 

    "కాదు హెచ్చరిస్తున్నాను."

 

    సుభద్ర ఓర్చికోలేక తన మనసులో మాట చెప్పేసింది-

 

    "హు అర్థంలేని మీ అశాంతికి బలైపోవడంకంటే-మా ఊరెళ్ళి నా బతుకేదో నేను బతకడమే మేలు. విస్తళ్ళు కుట్టి బతగ్గలను. అప్పడాలు చేసుకుని బతగ్గలను. పదిమంది బడిపిల్లలకు పాఠాలు చెప్పుకుని బతగ్గలను. నా బతుకు నేను బతకడానికి నేనెప్పుడూ భయపడనండీ! భయపడను."

 

    "సేసో! అంతవరకు ఎదిగేవన్నమాట! (గంభీరంగా) దెన్ లీవ్ డి హవుస్! వెళ్ళు...వెళ్ళిపో."

 

    సుభద్ర నిబ్బరంగా అనేసింది.

 

    "ఏ నోటితో మీరు పోపొమ్మని కసురుకుంటున్నారో, అదేనోటితో రారమ్మని ప్రాధేయపడే రోజు వస్తుందని తెలుసుకోండి!"

 

    "తెలుసుకోను. ఆ అవసరం నాకు రాదు. అటెక్కడికి?"

 

    "బాబు దగ్గరికి!"

 

    సుభద్రకి అడ్డం నిలబడి అన్నాడు.

 

    "వాడ్ని తీసుకుపోతావా?"

 

    "ఈ ఇంట్లో నాకులేని స్థానం బాబుకి మాత్రం ఎక్కడుంటుంది. ఇవ్వండి వాడ్ని!"

 

    వామనరావు గంభీరంగా అంటున్నాడు.

 

    "ఇవ్వను. ఇవ్వనంతే. వాడు నా దగ్గిరే పరగాలి. నేచేసిన తప్పు వాడు చెయ్యకుండా జాగ్రత్త పడతాను. పెళ్ళికి ముందు వాడు ఎవర్నీ ప్రేమించకూడదు. నేతెచ్చిన సంబంధమే వాడు చేసుకోవాలి. వాడే కాదు. వాడి బిడ్డ-వాడి బిడ్డ ఈ మొత్తం వంశమంతా కన్నవాళ్ళు తెచ్చిన సంబంధాలనే చేసుకుని సుఖపడాలి. ఈ సిద్ధాంతం తరతరాలు బతికేందుకుబాబు నా దగ్గరేవుండాలి. వుంటాడు."

 

    సుభద్ర పేలవంగా నవ్వేసి ఒక స్టేట్ మెంటు యిచ్చింది.

 

    "ఆవేశానిక్కూడా ఒక అర్థముండాలండీ. అర్థంలేని ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది."

 

    "యూ మీన్! నన్ను శపిస్తున్నావా? అయ్ టెల్యూ నీ శాపాలు నన్నేం చేయలేవు. టైమీజ్ షార్ట్. నీ రైలుకి వేళవుతుంది. అదిగో దారి!"

 

    అంటూ అతను వీధివేపు చెయ్యి చూపించేడు. ఆమె అతన్ని ఒకసారి నఖశిఖపర్యంతం చూసేసి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని అక్కడ్నించి గబగబా వెళ్ళిపోయింది.


                                                             *  *  *


    ఇప్పుడు మళ్ళా మనం వామనరావు ఆఫీసుగదికి వచ్చేసేం. ప్లాష్ బాకు పూర్తయిందని చెప్పడానికి చెత్తబుట్టలో శివరామారావు పెళ్ళి కార్డు తాలూకు ముక్కలు వలయాలుగా తిరగడం మానేసేయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS