Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 55


                                     జాలి కథ

    నరసరాజు వున్నాడు. అతడు చాలా మంచి మనిషి. హుందాగా వుండేందుకు అతనెప్పుడూ ప్రయత్నించడు. అయినా అతను దర్జాగా వుంటాడు. మీదు మిక్కిలి నరసరాజు అందమైన మనిషి. నిలువెత్తున దబ్బపండు ఛాయలో మెరిసిపోయే మనిషతను.
    నరసరాజుకి గత చరిత్ర అంటూ వున్నది. చెప్పుకోదగ్గది అతని కాలేజీ రోజులు. వాళ్ళ క్లాసులో ఒకేఒక్క అందమైన ఆడపిల్ల వుండేది, ఆ పిల్ల పేరు సీత.    
    వాళ్ళ కాలేజీలో కుర్రాళ్ళు చాలామంది ఒక్క సీతంటేనే ప్రాణం పెట్టేవారు. ముఖ్యంగా వాళ్ళ క్లాసు సర్వవేళలా పచ్చగా అందంగా వున్నదంటే కారణం సీత అని తెలిసినవాడు నరసరాజు! ఒక్క సీత, ఏభైమంది సందడికి ఆవలంబనమని తెలిసి సీతకి విలువ ఇవ్వడం ప్రారంభించాడు.
    సరిగ్గా అతనద్దెకున్న వీధిలో చివరి ఇల్లు సీత వాళ్లది. కొంచెం పాతదీ. పెంకుటిల్లు. దూరాన్నుంచి చూచినా, దగ్గరే వుండి పరిశీలించినా ఆ ఇల్లు మాసిపోయినట్టు కనిపించేది. వాళ్ళ దొడ్లో బాదం చెట్టు మాత్రం సీతలాగా అందంగా వుండేది.
    నరసరాజుకి ఆ యింటిని, ఆ యింట్లోని సీతని చూచి నొచ్చుకునేవాడు. అంత అందమైన సీతకి ఆ మాసిపోయిన ఇల్లు నచ్చలేదని అతనా దారివెంట వొచ్చే ప్రతీమాటూ అనుకునేవాడు.
    నరసరాజు సీతమీద జాలి వున్నట్టే దేవుడిమీద కొంచెం భయం వున్నది. భయమెందు చేతంటే దేవుడు చాలా తమాషాలు చేయగలడనే సిద్ధాంతానికి సీత అనే ఆడపిల్ల ఉదాహరణగా నిలిచిపోయిందావటాని. అంత అందమైన సీత అంత పేదరికంలో నివశించడం నరసరాజు కిష్టం లేదు.
    ఏదో ఒకరోజున సీత లక్షాధికారిణైపోవాలి. సీత చేతులలో వందలూ పదులూ యెల్లప్పుడూ నలిగిపోతుండాలి. రాజభవనం లాంటి బంగళాలో సోఫాలమీదా, పంకాలకిందా దాస దాసీల మధ్య సీత బతకాలి. సీత అందం అప్పటికి గాని రాణింపుకు రాదు.
    పేదరికమనే ఒక పెద్ద మచ్చ సీత అందాన్ని ఏ కొంచెమైనా భంగపరుస్తుందని నరసరాజు వుద్దేశం. అందుచేత అతనలా అనుకునేవాడు.
    నరసరాజెన్నడు తనని గురించి కలలు కనేవాడు కాడు. అదతనికిష్టం లేదు కూడాను. ఏనాడైనా, ఏదైనా అందంగా వూహించాలని తాపత్రయపడితే అది కేవలం సీత గురించే అయ్యేది. చాలాకాలం గడిచిన తర్వాత సీత గురించి అతని ఆలోచనలు పెద్ద గ్రంథమైపోయినట్టు గ్రహించి - అసలీ రకమైన కార్యక్రమం వెనక అతనికీ, సీతకీ ఏదయినా బంధమంటూ యేర్పడ్డదేమోనని ఆత్మపరీక్ష చేసుకున్నాడు. సీత అనే ఆడపిల్ల మీద కేవలం జాలి అనే మాట వెనక మరే విధమైన రంగు లేదనే పచ్చి నిజాన్ని అతను గర్వంగా ఒప్పేసుకున్నాడు.
    నరసరాజు వెనక అతని మనుష్యులనేకమంది వున్నారు. ప్రాణం పెట్టే ఆత్మీయులముందు సీతతో స్నేహం యేమంత చెప్పుకోదగ్గది కాదు గనక సీతతో స్నేహం చేయాలనే సాధారణమైన కాలేజీ విద్యార్థిలా అతను ఆశలు పెంచుకోలేదు. అందుచేత అతను కేవలం "సీత స్నేహ"మనే ఒక మహత్తరమైన ఆటలో ప్రేక్షకుడిగా మాత్రం మిగిలిపోయాడు.  
    నరసరాజు వాళ్ల క్లాసులో సీతముందు వెలిగిపోవాలనుకునే కుర్రాళ్ళ జాబితాలో ప్రముఖుడు వెంకట్రావు. ఈ వెంకట్రావు ఏ శ్రీమంతుల బిడ్డడో గాని యెల్లప్పుడు పచ్చగా కనిపించేవాడు. వెంకట్రావుని చూచినప్పుడంతా నరసరాజెన్నో గాలిమేడలు కట్టుకునేవాడు. భగవంతుడి దయవల్ల ఈ వెంకట్రావుకి సీతతో స్నేహం దినదినాభివృద్ధి చెంది ఓ శుభముహూర్తాన సీతని పెళ్ళి చేసుకునే నిర్ణయం కలిగితే అప్పుడిక సీతకి దిగులుండదు.
    నరసరాజుకి సీత తండ్రి అనేక తడవలు కనిపించాడు. ఆయనెప్పుడూ తలొంచుకు నడుస్తుంటాడు. తలొంచుకు నడుస్తున్నప్పుడు ఆయనేదో భయంకరమైన బరువును మోస్తున్నట్టు నరసరాజుకి భ్రమ కలుగుతుంది. ఆయనలా తలొంచుకు నడుస్తున్నప్పుడేదో విషయం గాఢంగా ఆలోచిస్తున్నట్టూ వుంటుంది.
    సీత విషయమే ఆయన ఆలోచిస్తున్నట్టు గమనించి మరింత కుంగిపోయాడు నరసరాజు.
    సీత తండ్రిపేరు సుబ్బారావుగారే. సుబ్బారావుని అతి పేదరికం లోంచి కొంచెం పైకొచ్చిన మనిషికింద జమకట్టి కాలక్రమేణా యధాస్థానాన్ని అలంకరించిన పెద్దమనిషిగా భావించాడు నరసరాజు.
    నరసరాజుకి ఆ యింటి విషయాలన్నీ తెలుసు. పనిమనిషి నర్సమ్మ ఆ యింటి భోగట్టా ఆద్యంతం అతనికి మునుపెప్పుడో చెప్పింది. అడిగింది నరసరాజు. యజమాని గనక మరేం దాచకుండా చెప్పింది. చెప్పి కొసమెరుపన్నట్టు సాలోచనగా నవ్వేసి.
    "ఇన్నడుగుతున్నారు. అసలు విషయం చెప్పారుగాదే" అన్నది.
    అప్పుడు నరసరాజు యిబ్బందిగా తలూపుతూ అనేశాడు.
    "మరేం లేదు. సీత.... అదే, సీతమ్మ నాతోపాటు చదువుకుంటుందిలే, అందుకే అడిగాను మరేం లేదు."
    నర్సమ్మ అసంతృప్తిగా అతని మాటాలకించి వెళ్ళిపోయింది. అయినా, ఏ రోజుకా రోజు సీత వాళ్ళ విషయమేదో ఒకటి నరసరాజు చెవి నేస్తూనే ఉంది.
    సుబ్బారావుగారు రిటైరయిన లెక్కల మాష్టారు. పేపరు మీద లెక్కల్లో ఆయనెప్పుడూ పరాజయం పొందలేదేమో గానీ, జీవితం లెక్కల్లో ఆయన చాలాసార్లు తప్పడం రివాజైపోయింది.
    సుబ్బారావుగారికి నలుగురాడపిల్లలు. ముగ్గురి పెళ్లెలాగో చేయగలిగారు కానీ, మూడో కూతురు పెళ్ళయిన రెండో ఏడాదికే వైధవ్యాన్ని వెంట పెట్టుకుని పుట్టిల్లు చేరుకుంది. పుట్టింటికి వచ్చిన పడుచు పొద్దస్తమానమూ విస్తళ్ళు కుట్టి సుబ్బారావుగారి సంపాదనలో కొంతైనా సాయపడుతోంది. మూడో కూతురు సౌభాగ్యం సుబ్బారావుగారికి కనువిప్పు కలిగించిన మీదట నాలుగో అమ్మాయి సీతని కాలేజీలో చేర్పించారు. ఆడది మగదక్షత మీద ఆధారపడకుండానే జీవితాన్ని సుందరంగా గడుపుకునేందుకు మార్గం చదువని ఆయనకి తట్టింది. అందుచేత ఆయన సీతకి ఆ ఏర్పాటు చేశారు. అందుచేతనే సీతమీద నరసరాజుకి అంత జాలి.
    నరసరాజుకి ఒక్కో తడవ ఆవేశం ముంచుకొస్తుంది. ఆ పళంగా సుబ్బారావుగారి దగ్గరికెళ్ళి -
    "మీకేం ఫరవాలేదు. లెక్కల మేష్టారూ! మీ అమ్మాయి చాలా బాగా చదువుతోంది. ఫరవాలేదు. ఈ పరీక్షలోనే గాదు మరే పరీక్షలోనైనా మీ అమ్మాయి సునాయాసంగా గట్టెక్కుతుంది. నన్నడిగితే సీత జీవితానికొచ్చిన ఢోకా ఏమీలేదని నేను చెప్తాను. కనక మీరలా తలొంచుకు నడవద్దు అస్తమానమూ ఆలోచిస్తూ కనిపించవద్దు" అని హామీ ఇవ్వాలనిపించేది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS