Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 55


    "మీరు కావచ్చు. నేను కావచ్చు... మనం ప్రేమించకూడదు. అది బూతు. ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోడం వామనరావు దృష్టిలో నేరం. ప్రేమలూ దోమలూ లేకుండా- పెద్దవాళ్ళు తెచ్చిన సంబంధాన్ని కళ్ళు మూసుకుని ఒప్పుకోవాలి. మూడు ముళ్ళూ వేయాలి. అప్పుడే అది పెళ్ళవుతుంది. పెళ్ళికి ముందు ప్రేమ తప్పు. పెళ్ళయ్యేక ప్రేమించు. అది ఒప్పు".

 

    చెత్తబుట్టలో వేసిన కార్డు ముక్కలు ఒకదాన్తో ఒకటి పోట్లాడుకుంటున్నాయి. వలయాలుగా తిరుగుతున్నాయి. కవిగారి కామెంట్రీ నడుస్తూనే వుంది.

 

    "ఇంత విడ్డూరమైన సిద్ధాంతం తయారు చేసుకున్న వామనరావు సొంత కథ-అంటే ప్లాష్ బాక్-ఇక్కడ చెప్పుకోవడం చాలా అవసరం."

 

    కొన్ని ఫొటోల సాయంతో ప్లాష్ బాక్ వేగంగా నడుస్తోంది. ఫోటోలతోపాటు వారి వారి సంభాషణలుకూడా వినిపిస్తుంటాయి.

 

    వామనరావు, అతని తండ్రి ఆ ఫోటోలో కనిపిస్తున్నారు. తండ్రి గారు కిటికీ ద్వారా శూన్యంలోకి చూస్తున్నారు. వామనరావు తాపీగా వున్నాడు.

 

    "సుభద్రను ప్రేమించేను నాన్నా!"

 

    "ఎవరా సుభద్ర!"

 

    "నా ప్రేమ!"

 

    ఇప్పుడు ఫోటో మారింది. ఈ ఫోటోలో తండ్రిగారు కొంచెం సీరియస్ గా కొడుకు వేపు చూస్తూ వున్నారు. వామనరావు నిబ్బరంగా నిలబడి వున్నాడు.

 

    "ఆ సుభద్రకి తల్లిదండ్రులెవరు? అన్న దమ్ము లెవరు? వాళ్ళ కులమేమిటి? మత మేమిటి?"

 

    "ప్రేమకివన్నీ పాయింట్లు కావునాన్నా! ఇవన్నీ తెలుసుకునేంత తీరుబడి వుంటే, ప్రేమించుకోడానికి టైమే వుండదు. అంచేత నాకు సుభద్ర ఒక్కర్తె తెలుసు. ఆమెను ప్రేమించడమే తెలుసు. ఆమెను పెళ్ళాడటమే తెలుసు".

 

    ఫొటోలో వామనరావు కుర్చీలో కూర్చుని వున్నాడు. తండ్రి నిలబడి సాధిస్తున్నాడు.

 

    "ఆ మాటకొస్తే పెళ్ళాడేందుకు చాలా మండి ఆడపిల్లలున్నారు. మీ మేనత్త కూతురుంది. మీ మేనమామ కూతురుంది. మీ అక్కయ్య కూతురుంది. వాళ్ళంతా మనకి దగ్గిరవాళ్ళు. వాళ్ళల్లో ఎవర్నైనా పెళ్ళిచేసుకో."

 

    "అప్పుడది కేవలం పెళ్ళే అవుతుంది నాన్నా! ప్రేమలేని పెళ్ళి నాకిష్టంలేదు. అయ్ హేటిట్!"

 

    వామనరావు భుజాలమీద చేతులుంచేడు తండ్రి.

 

    "ప్రేమించిగాని పెళ్ళి చేసుకోనంటావ్. అంతేగా. టెలిగ్రామిచ్చి మన బంధువుల్లో ఆడపిల్లల్ని పిలిపిస్తాను. వాళ్ళలో నీ కిష్టమైన అమ్మాయినే ప్రేమించి పెళ్ళి చేసుకో"

 

    "పెద్దలు తెచ్చిన ఆడపిల్లలు ప్రేమకు అనర్హులు నాన్నా!"

 

    "వామనరావ్!"

 

    ఇప్పుడు ఫోటోలో తండ్రి విసిగిపోయి కుర్చీలో కూర్చున్నాడు. వామనరావు నిలబడి లెక్చరిస్తున్నాడు.

 

    "నేన్నిజమే చెబుతున్నాను నాన్నా! ఆ పెద్దలకు లక్షలు కనిపిస్తాయి. కులం, గోత్రం, వంశం, మతం ఇవే కనిపిస్తాయి. ప్రేమించే హృదయం కనిపించదు. ఆ హృదయం ప్రేమించే వాడికేక నిపిస్తుంది."

 

    ఇప్పుడు తండ్రి చిందులు తొక్కుతుంటే, వామనరావు గుమ్మానికి చేరగిలబడి వింటున్నాడు.

 

    "కనిపిస్తుందిరా కనిపిస్తోంది. పెళ్ళయి ఆర్నెల్లు గడవగానే ఆ ప్రేమకి తెరపడిపోతుంది. చీదరింపులూ చికాకులూ ఎక్కువవుతాయి. ఛీ పొమ్మంటే ఛీ పొమ్మనుకుంటారు. కొంచెమాగి-సౌమ్యంగా) నాయనా-కన్నబిడ్డ సుఖమేమిటో కన్న వాళ్ళకే తెలుస్తుందిరా. నా మాట విని, నే తెచ్చిన సంబంధాలో నీ కిష్టమైన పిల్లని చేసుకోరా. సుఖపడతావ్."

 

    "నా సుఖ మేమిటో నాకు బాగా తెలుసు. కన్నవారి మీద గౌరవముంది కనుకనే నా పెళ్ళి గురించి చెప్పేను. ఆశీర్వదించండి."

 

    తండ్రి కాళ్ళు పట్టుకునే ప్రయత్నంలో వామనరావు వుంటే తండ్రి తన కాళ్ళను లాక్కునే దృశ్యం ఇప్పుడు ఫోటోలో వుంది.

 

    "నా మాట కాదన్న తర్వాత-నా కాళ్ళు తాకే అర్హతగానీ, హక్కు గానీ నీకు లేవు. పోరా పో! ఈ ఇంట్లో నీకింక స్థానంలేదు. నీ ప్రేమనే పెళ్ళాడి సుఖపడు. వెళ్ళు".


                                                               *  *  *


    మిలట్రీ మేజరు దుస్తుల్లో వామనరావు, అతని పక్కన సుభద్ర ఇద్దరూ సముద్రపు ఒడ్డున నడుస్తున్న దృశ్యం-

 

    "మీరు తొందరపడ్డారేమోనని భయంగా వుంది."

 

    "కొన్ని విషయాల్లో ఆలస్యం చేయకూడదు. మిలట్రీ మనిషిని సుభద్రా. ఒక్కటే మాట. ఒక్కటే తూటా. గురి తప్పడానికి వీల్లేదు. నీ ప్రేమ నాక్కావాలి. నిండా నూరేళ్ళు నీ ప్రేమలోనే బతకాలి. ఇది నా సిద్ధాంతం. స్ట్రెయిట్ క్వచ్చన్. మన పెళ్ళి నీ కిష్టమేనా."

 

    వామనరావు సుభద్రల వివాహం ఫోటో, బాజాభజంత్రీలు నేపథ్యంలో.

 

    ఉయ్యాల్లో పిల్లాడు ఉయ్యాల కటూ ఇటూ వామనరావు. సుభద్రలు ముగ్గురూ ఆడుకుంటున్నారు.

 

    ఫొటోల వ్యవహారం ముగిసింది.

 

    వామనరావు ఇల్లది. ఆ ఇంట్లో పూజగది.

 

    సుభద్ర దేవీ ధ్యానంలో నిమగ్నురాలై వుంది. వామనరావు యూనిఫారంతో, బూట్ల కాళ్ళతో గదిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆమె దేవి వేపు చూపు నిలిపే గంభీరంగా అనేసింది.

 

    "ఆగండక్కడ!"

 

    తనని చూడకుండానే, తాను వస్తున్నట్లు గ్రహించిన సుభద్రశక్తికి ఆశ్చర్యపోతూ ఆగిపోయేడు.

 

    "ఎక్కడెక్కడో తిరిగొచ్చిన కాళ్ళతో పూజ గదిలోకి రావద్దు... వెళ్ళండవతలకి."

 

    వెనక్కి వెళ్ళిపోతూ అనుకుంటున్నాడు-చేతులు చరుచుకుంటో..

 

    "డామిట్ భక్తి ఎక్కువై పోయింది. ఎక్కడెక్కడో తిరిగొచ్చిన కాళ్ళతో పూజ గదిలోకి రాకూడదట. నా ప్రేమ ఎక్కడుంటే అక్కడికి రావడం నా హక్కు. దటీజ్ మై రైట్."

 

    సుభద్ర ప్రసాదంతో వచ్చింది. భర్తకి బొట్టుపెడుతూ అంటోంది-

 

    "లలితాంబికా! మా వార్ని కాపాడు తల్లీ."

 

    వామనరావు విసుగ్గా అడిగేడు-

 

    "హు ఈజ్ దిస్ లలితాంబిక? నా సేప్టీ నాకు బాగా తెలుసు. ఎవర్నీ ప్రాధేయపడకు!"

 

    ప్రసాదమిస్తూ అన్నది సుభద్ర-

 

    "ఆ అమ్మలేనిదే ఈ సృష్టే లేదండీ? ప్రాధేయపడినా, ప్రార్థించినా తప్పుకాదు. తెలుసుకోండి."

 

    చేతిలోవున్న ప్రసాదాన్ని గబుక్కున మింగబోయేడు వామనరావు. సుభద్ర ఆదుర్దాగా అరిచింది.

 

    "కళ్ళకద్దుకోండి!"

 

    వామనరావుకి హీటెక్కిపోయింది.

 

    "నో! నేనద్దుకోను. ఈ బ్లడీ ఫార్మలిటీస్ తో నా ప్రాణాలు తీస్తున్నావ్. నన్ను చంపినా ఫర్లేదు గానీ- ఈ పిచ్చి పనులతో నా ప్రేమ కూడా చచ్చిపోతోంది. అయ్ కాంట్ స్పేరిట్. మైండిట్" అంటూ కళ్ళకద్దుకునే ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS