Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 54


    "పథకం వేశాను. లలితను ప్రేమించాను. మనకి మనిషి చెప్పుకునే కులాల పట్టింపులేదు. మనక్కావలసింది కుల మొక్కటే. డబ్బు కులం! లలితని పెళ్ళాడి వెంకటరత్నం చౌదరీని తిందామనుకున్నాను. లలిత గొప్ప నటీమణి గనుక నా చేతుల్లోంచి జారిపోయింది. అక్కడితో ఒక వెలుగు దూరమైంది.
    'బి.ఏ. పాసయ్యాను. ఎమ్మేకి వెళ్ళాను. బక్క నాన్నని నడుం విరిగేలా తన్ని డబ్బులు మింగాను. ఆ బక్క మనిషి నా గురించి మొదట్నుంచీ తలొంచేశాడు. నాన్నా డియర్ నీ ప్రాణం యివ్వు, దాంతో నాకు పనుందని అడిగితే- అంతకంటేనా చిట్టీ పుచ్చుకో బాబూ అనేయగల అతి మంచి దుర్మార్గుడాయన. అందుకే ఆ పేదవాడు అప్పుల్లో మునిగి యస్ ఓ యస్ అంటున్నాడిప్పుడు. వాటే ఫాల్ మైడియర్ ఫాదర్! మే గాడ్ పనిష్ యూ!
    "యూనివర్శిటీలో పద్మ కనిపించింది. మొగుడుపోయి అదేడుస్తున్న కాలాన్ని తెలివిగా వాడుకోవాలనుకున్నాను. పద్మ వివరాలు కనుక్కుని తృప్తి చెందాను. వేట ప్రారంభమయ్యింది. ఏడవకేడవకు పద్మా, నువ్వేడవకు. నువ్వేడిస్తే నేనేమైపోవాలి? పోయినవాళ్ళ గురించి మనం యెంతేడుస్తే ఏం ప్రయోజనం చెప్పు? లే. నేనున్నాను. ఈ హృదయంలో నీకోసం యింత జాలినీ, ఇంత ప్రేమనీ అభిమానాన్నీ దాచాను. అదంతా నీది. నీదే పద్మా అని కవిత్వం చెప్పాను. ఎంతకీ నావేపు నుంచే కథ నడిచింది గానీ, అటునుంచి ఒక వాక్యం కూడా నడవలేదు. పద్మగానీ, మావగానీ సామాన్యులు కారు, వారంతే. మగవాడి ఆసరాతో అవసరమున్న పందిపిల్ల పద్మ. బురదనుంచి పుట్టిన పువ్వని భ్రమపడ్డానే గాని, ఆ పువ్వు నిండా బురదున్నదని గ్రహించలేకపోయాను. పద్మని పంకజమనూ నీ బొందనూ నేనేమీ పట్టించుకోను. నువ్వాశ్చర్యపోవద్దురా అబ్బీ!
    "ఆల్ రైట్, నేను విధవా వివాహం చేసుకుని సమాజంలో ఒక గొప్ప స్థానాన్ని సంపాయించేసి, మావగాడి ఆస్థికి వేటకుక్కనైపోయాను. బిజినెస్ - ఇక్కడ న్యాయం, అన్యాయం, ధర్మం, అధర్మం ఆ పద్దులేమీ ఉండవు. ఉన్నదల్లా డబ్బు. ఆ డబ్బు ఎన్ని రకాలుగా, ఎంతెంత గడ్డితిని సంపాయించాలనే తాపత్రయం. అదే ఉన్నదిక్కడ. పెళ్ళాంతో సంబంధం లేదు. పేద నాన్నని తలుచుకునేందుకు టైం లేదు.
    "మావ జీనియస్. దొంగని వెతికిపట్టుకుని వాడి చేతిలో తాళం చేతుల్నుంచి, వాడి చుట్టూతా కొందరు భటుల్నుంచాడు. దొంగ వెధవ. ప్రతి మూమెంటునీ మైక్రో ద్వారా లాగేసి ప్రాణాలు తినేస్తున్నాడు.
    "నా పెళ్ళయ్యేముందు కొన్ని ఆంక్షలు. ముఖ్యమైనది - నాకు తల్లీ తండ్రీగానీ, అక్క తమ్ముళ్ళూగానీ, చెల్లీ వుండకూడదు. నేనప్పుడు నవ్వేసి 'యస్' అన్నాను. ఆనక నా పెళ్ళి. అనగా ఉరి. ఒరే సుబ్బారావ్! నువ్వూ నీలాంటి అమాయకులంతా మంచివాళ్ళురా బాబూ! మీకు సుఖాలు తప్ప నీడలు తెలీవు. నేను నీడల్లో వుండి సుఖపడి ఛస్తున్నానర్రోయ్ అనే భ్రమని మీకు కలిగించేస్తున్నాను.
    "నాన్న ఉత్తరం రాశాడు. ఆర్థికంగా చితికిపోయాట్ట. మరేమవుతాడేం? ఎప్పటికయినా ఎగిరి పారిపోయే ఈ పక్షిని నమ్ముకున్న ఆ మనిషేమవుతాడేం? మూలధనానికి నష్టం రాదని నామీద ఆయన శరీరంలో వున్న ప్రతి నెత్తుటి బొట్టునీ వెచ్చించినందుకు ఏమవుతాడేం? పిల్లవాడిని వ్యాపార లక్షణంగా పెంచాడు. ఆ వ్యాపారం ఇప్పుడు దివాలా తీసింది. ఐ.పి. పెట్టేశాక్కడ. చెల్లి పెళ్ళిట సుబ్బారావ్! పెళ్ళి, తమ్ముడికి క్షయట. అమ్మకేదో తెలీని మాయరోగమంట! భయంకరం రా బాబూ!
    "నేను ఈ దుఃఖాలు వినకూడదు. ఈ కష్టాలు తెలుసుకోకూడదు. ఇవన్నీ తెలుసుకుంటే మావగాడి వేటకుక్క యేమైపోగలదో వూహించావా? అందుచేత ఇవేమీ నాకు తెలీకూడదు. గనక నాకొచ్చే ఉత్తరాలూ, కబురూ అన్నీ యిక్కడ సెన్సార్ జరుగుతాయి. ఏవో కొన్ని దారుణాలు మాత్రం అప్పుడప్పుడూ తెలుస్తుంటాయి.
    "ఏపిల్ పండులాగున్నాను అనుకుంటారు గదరా మీరు? ఓరి వెధవలూ! నా నరనరంలోనూ స్థానం చేసుకున్న విషప్పురుగుల సంగతి మీకేం తెలుసురా? నేను దయ్యాన్ని, పెద్ద భూతాన్ని. ఈ ప్రపంచంలో జరిగే అవినీతికీ, దుర్మార్గానికీ ప్రతిబింబాన్నేను. మందెక్కువయిన మాటలు కావురా యివి. ఇవా? నిన్ను చూచిం తర్వాత నా గుండె తలుపులు తెరుచుకున్నాయి. ఓపిగ్గా వినంతే. ఇదెందుకిలా జరిగింది. చెప్తాను విను.
    "నాకు కొన్ని శాపాలున్నాయ్. నడుం విరిగిన నాన్న శాపం, కుమిలి కుమిలేడుస్తున్న అమ్మ శాపం, నన్ను నమ్ముకున్న నా చిట్టి చెల్లాయీ, తమ్ముళ్ళ శాపం. తెలిసిందిరా అబ్బీ! ఇన్ని శాపాలతో బాటు నా దుర్మార్గం. ఇంకెక్కడరా నేను సుఖించేది? ఓరి పిచ్చీ! నేను నిత్య దుఃఖితుడినిరా. నాకు సుఖం లేదు. నాకెప్పుడో జ్ఞానోదయం కలిగింది. అప్పట్నుంచీ నేను లోలోన ఏడుస్తూనే వున్నాను. ఎంతో ఖరీదయిన నా కన్నీరు వృధా అవుతూనే ఉంది."
    ఇంత కథా చెప్పి సీసావేపు చూచి నవ్వేశాడు.
    "అయ్యా బాబోయ్! చాలా తాగేశాను" అన్నాడు.
    ఆ తర్వాత అతని తలని బల్లమీదుంచి వలవలా ఏడవడం ప్రారంభించాడు. నాకు జాలి కలిగింది. అతని భుజమ్మీద చేయి వేశాను. చేతినతనలాగే పట్టేశాడు. నా చేతితోనే అతని కన్నీరుని తుడుచుకున్నాడు.
    "ఎంత చల్లని చేయిరా నీది దుర్మార్గుడా! మా అమ్మమాటలాగా, మా నాన్న మనసులాగా నీ చేయి యెంత చల్లనిదిరా సుబ్బారావ్! అదృష్టవంతుడివి. అందుకే నీలో నేను నా వాళ్ళనందర్నీ చూచుకున్నాను.
    థాంక్స్, వెరి మెనీ థాంక్స్. అప్పుడే నువ్వెళ్ళకు. ఇవాళ మనిద్దరం కలిసి భోజనం చేద్దాం. భోజనం పూర్తవగానే నీకోసం నా కారు రెడీగా వుంటుంది. దాన్లో నువ్వెళ్ళిపో. మళ్ళా నాకు కనిపించకు. నువ్వు కనిపిస్తే - నేనిలా గుండె బద్ధలయ్యేలా ఏడుస్తారా! అబ్బీ! అందుచేత నువ్విక నాక్కనిపించకు. అరే - అదేమిట్రా పిచ్చిలోకమా?నువ్వేడుస్తావెందుకురా? ఏడవకొరేయ్ - నా క్కోపం వొచ్చేస్తుంది. ఏడవకంతే. అన్నాడతను.
    చిత్రం - ఈ మనిషిని నేనెందుకు క్షమించాను?

                                                             *   *   *   *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS