Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 54


    ముగ్గురూ ఆయాసపడుతూ కుర్చీలో కూర్చున్నారు.

 

    'సినీమా తీయాలంటే ఏదో ఒక కథ కావాలికదా!" అన్నాడు డైరక్టరు.

 

    "క్రైం కథలూ, కష్టాలూ, కన్నీటి కథలూ నాకు పడవు. అందరూ హాయిగా నవ్వుకునే కధే కావాలి!"

 

    కవిగారు గాలిపీల్చుకున్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో సిగరెట్ పాకెట్ తీసుకుంటో-దాన్ని పైజమా జేబులో తోసేసుకుంటో అన్నాడు.

 

    "ఆ సంగతేదో ముందే చెబుతే ఇంత భీభత్సం జరిగేది కాదుగదా వదిలేయండి. నువ్వు కథగదా మనక్కావల్సింది అయితే కాచుకోండి. ప్రారంభిస్తున్నా! అదొక ఊరు. మీఊరు కావచ్చు, మా ఊరుకావచ్చు. ఏ ఊరైనా కావచ్చు. అదొక ఊరు".

 

    ఊరు కనిపిస్తోంది రద్దీ రోడ్డు కార్లూ, బస్సులూ, ఆటోలూ, మనుషులూ హడావిడిగా కనిపిస్తున్నారు. కవిగారు కామెంట్రీ వినిపిస్తూనే వుంది.

 

    "ఆఊళ్ళో వామనరావు ఉన్నాడు ఆఊళ్ళో అతనికో ఫేక్టరీ వుంది.స్కూటర్ల తయారీ ఫేక్టరీ అది. ఫేక్టరీ వుందంటే మరి చెప్పక్కర్లేదు. బాగా డబ్బున్నవాడే. ఆ ఫేక్టరీకి వెడదాం పదండి".


        
    "వామన్ స్కూటర్స్" అనే బోర్డున్న పెద్ద ఫేక్టరీ అది. అక్కడ స్కూటర్లవీ తయారయ్యే తతంగం కనిపించింది.

 

    ఆ ఫేక్టరీ ముందు ఖరీదైన కారు ఆగింది. ఆ కార్లోంచి వామనరావు కిందికి దిగేడు.

 

    అతని బొమ్మ ప్రీజ్ షాట్లో నిలిచి పోయింది.

 

    ఫుల్ సూట్లో వున్నాడు. చెయ్యెత్తు మనిషి నెత్తిమీద టోపీ చిత్రం వుంది. చేతిలో బెత్తంలాటి స్టిక్ వుంది. మరోచేతిలో సిగరెట్ పైప్ వుంది. కళ్ళద్దాలున్నాయి. మొత్తానికి బహుగొప్పడాబుసరి గానూ-హుందాగానూ వున్నాడు. వయస్సు ఏభైదాటి వుంటుంది.

 

    ఆ బొమ్మమీద కవిగారి కామెంట్రీ నడుస్తోంది.

 

    అతనే వామనరావ్. రిటైర్డ్ మిలట్రీ మేజరు. వామన్ స్కూటర్స్ కంపెనీకి యజమాని. గుణంలో పులి. టైగర్. ఆ నడక చూడండి. తెలుస్తుంది.

 

    వామనరావు గంభీరంగా నడిచేడు. ఒక ఫ్రేంలో వామనరావు నడుస్తుంటే మరో ఫ్రేంలో భయంకరమైన పులి నడుస్తోంది. అది గాండ్రిస్తోంది.

 

    ఈ విన్యాసంలో వామనరావు ఆఫీసు ప్రవేశం చేస్తుండగా-ఎవడో ప్యూను 'అయ్యగారొస్తున్నారు' అనే ప్రకటనచేసి బొమ్మలా నిలబడి పోయేడు.

 

    ఆ ప్రకటన వినగానే ఆఫీసులో యావన్మందీ కిందా మీదా పడిపోతూ...ఖంగారు పడిపోతున్నారు.

 

    వామనరావు ఆఫీసు హాల్లో కనిపించగానే యావన్మందీ లేచి నించున్నారు.

 

    వామనరావు ముక్కుకి సూటిగా పోతూనే పక్కనున్న గుమాస్తాని అతనివేపు చూడకుండానే వేలితో సైగచేసేడు. తన దగ్గిరకి రమ్మని!

 

    గుమాస్తా ఎంతో వినయంగా వచ్చి, వామనరావు ఎదుట నిలబడ్డాడు. వామనరావు ఆ గుమాస్తా చొక్కాకి గుండీ పెట్టేడు. అప్పటిగ్గాని గుమాస్తాకి తెలీలేదు. గుండీ పెట్టుకోని విషయం!

 

    వామనరావు సామ్యంగా మాటాడినా పిడుగులు పడుతున్నట్టే వినిపిస్తోంది.

 

    "గుండీలు పెట్టుకోకుండా ఆఫీసుకి రావడం నేరం. ఈ సంవత్సరం నీ ఇంక్రిమెంటు కట్!"

 

    అంత మాటవిని తట్టుకోలేక, సంజాయిషీ చెప్పుకునే ప్రయత్నంగా గుమాస్తా పొడిమాటలేవో సంధించేడు.

 

    "క్షమించాలి సార్. అసలేం జరిగిందంటే."

 

    అప్పుడు గర్జించేడు వామనరావు.

 

    "సంజాయిషీ అడగలేడు. సంజాయిషీలు అడిగి చెప్పించుకోవడం నాకిష్టం లేదు. అయ్ హేట్ బ్లడీ ఎక్స్ ప్లనేషన్స్!"

 

    అంటూ పెద్ద పెద్ద అంగల్తో అక్కడ్నించి కదిలేడు. మరో గుమాస్తా దగ్గిర ఆగేడు. గుమాస్తా వణికిపోతున్నాడు. అతని మీదికి ఒరిగి పోతూ అడిగేడు.

 

    "నిన్న సాయంత్రం గంట ముందు ఆఫీసులోంచి వెళ్ళిపోయేవు. అవునా?"

 

    గుమాస్తా కృంగిపోతూ సమాధానం చెప్పేడు.

 

    "యస్సర్!"

 

    గుమాస్తా మీదికి మరింత ఒరిగిపోతూ, మరింత గంభీరంగా అడిగేడు వామనరావు.

 

    "మొన్న మార్నింగు రెండు గంటలు ఆలస్యంగా వచ్చేవు. అవునా?"

 

    గుమాస్తా మరింత కృంగిపోతూ అన్నాడు.

 

    "యస్సర్!"

 

    ఇక ఇప్పుడు మాటల్లేవు. పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయి. సమాధానంగా మేకపిల్ల అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఈ గాండ్రింపులూ, అరుపుల్తోపాటు-పులి మేకల బొమ్మలుకూడా కనిపించేయి.

 

    పులి మేకని భోంచేసిన దృశ్యం పూర్తయింది!

 

    ఇప్పుడు వామనరావు మరో దిక్కుకి అడుగులు వేస్తున్నాడు. అక్కడ వినయంగా నిలబడ్డ శివరామారావుని చూడగానే వామనరావులో ఉత్సాహం ఉప్పొంగి పోయింది.

 

    "కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ శివరామారావు! సేల్స్ మేనేజరుగా నువ్వు చేసిన బిజినెస్ ఎక్స్ ట్రార్డినర్లీ గుడ్!"

 

    అంటూ శివరామారావుతో కరచాలనం చేసేడు. శివరామారావు చెయ్యి పచ్చడైపోయింది. అయినా దాచుకుంటో ఎంతో వినయంగా "థాంక్యూ సార్!" అన్నాడు.

 

    "సెక్రటరీ!" అని పిలిచేడు వామనరావు.

 

    బాణంలాగా వచ్చేడు సెక్రటరీ వయస్సుకి పెద్దవాడే.

 

    "మిస్టర్ శివరామారావ్ కి అయిదువేల రూపాయలు బహుమతిగా ఇస్తున్నాను. ఆర్డరురాసి తీసుకురండి. సంతకం చేస్తాను" అన్నాడు వామనరావు.

 

    "యస్సర్" అన్నాడు సెక్రట్రీ. "కైండాఫ్ యూ సార్" అన్నాడు శివరామారావు.

 

    వారి మాటల్ని చెవి నేసుకోకుందా వెళ్ళబోతున్న వామనరావుకి ఎవరో కసిక్కున తుమ్మినట్లు వినిపించింది.

 

    ఠక్కున ఆగిపోయేడు. ఆ తుమ్మిందెవరో చూద్దామని నాలుగు దిక్కులా దృష్టి సారించేడు. దానికి పులి గాండ్రింపు కూడ తోడయ్యింది.

 

    క్షణం తర్వాత.

 

    "సెక్రటరీ!" అన్నాడు వామనరావు.

 

    "యస్సర్!" అన్నాడు సెక్రట్రీ.

 

    "ఆఫీసులో తుమ్మడాల్లేవని బోర్డు కట్టండి!" అని ఆర్డరు వేసి తన గది తలుపు తోసుకుని లోపలికి వెళ్ళిపోయేడు వామనరావు.


                                                                *  *  *


    ఆఫీసు గదిలో సింహాసనమెక్కి కూచున్న వామనరావుకి, తన టేబుల్ మీద పెండ్లి పిలుపు' కార్డు కనిపించింది. చేతుల్లోకి తీసుకున్నాడు.

 

    శివరామారావు పెళ్ళి కాబోలు-అతని గొంతుతోనే ఆ కార్డు చదవబడింది.

 

    ఆ కార్డు వివరం ఇట్లా వుంది.

 

    "ఈ నెల తొమ్మిదో తేదీ సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగే మా ప్రేమ పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించ ప్రార్థన. భవదీయులు శివరామారావు, మేరీ.

 

    చదవడం పూర్తికాగానే వామనరావుకి వళ్ళుమండిపోయింది. 'హో ప్రేమ వివాహం' అనుకుంటో ఆ కార్డుని ముక్కలు చేసి చెత్త బుట్టలో పారేస్తూ.

 

    'అయ్ హేట్ లవ్! అయ్ హేట్ లవ్ మేరేజెస్" అన్నాడు.

 

    ఆ మాట మీద కవిగారి కామెంట్రీ కూడా నడిచింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS