Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 53


    నాతోపాటు చదువుకుని, ఉద్యోగానికీ - హోదాకీ సంబంధించినంతవరకూ నన్ను మించిన నా స్నేహితులనేక మంది వున్నారు. వాళ్ళని చూచినప్పుడు నేను అసూయ చెందను. వాళ్ళు నన్ను 'తక్కువ' చేస్తే మాత్రం నేను బాధపడతాను.
    రవీంద్రభారతిలో నేనొక నాటక ప్రదర్శనకి వెళ్ళాను. నాటకం ప్రారంభించేముందు అక్కడ హాజరైన పెద్దలు కొందరు వేదికమీదకొచ్చి తెలుగు నాటకాల గురించి మాట్లాడారు. ఆ వక్తల్లో భగవంతం గూడా వుండటం వల్ల నేనమితంగా సంతోషించాను.
    భగవంతం ఆంద్ర రాజధానిలో కీర్తి ప్రతిష్టలందుకున్నాడంటే ఆనందించాను. అతననేక సాంఘీక కార్యకలాపాల్లో చేయి కలుపుతుంటాడని నేనిక్కడికొచ్చిన తొలి దినాల్లోనే విని వున్నాను.
    ఈ సమాజంలో 'అరుదైన' ఒక ఘనకార్యం తెగింపుతో చేసిన ప్రతి తెలివిగల మనిషీ, ప్రముఖుడేనని నా ఉద్దేశం. విధవా వివాహం మాటల్లో సులువేమోగానీ, అనుభవానికది పరీక్షని నా అభిప్రాయం. అంతటి విలువైన మార్గాన్ని భగవంతం అనుసరించి, తద్వారా అతను వెలిగిపోతున్నాడు.
    కొన్నేళ్ళ క్రితం అతని ఆవేశాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. అతని కలలన్నీ నాకు గుర్తున్నాయి. అతను నమ్మిన సిద్ధాంతాన్ని-అతను అనుసరించి లాభం పొందుతున్నాడు. భగవంతం ఎంతకైనా తగును!
    ఆ నాటకం పూర్తయిం తర్వాత నేనతన్ని కలుసుకొనేందుకు బయటకి వెళ్ళాను. అతనో నల్లటి కారు పక్కన నించుని సిగరెట్టు కాలుస్తున్నాడు. అతని చుట్టూతా కొందరు మనుషులు నించున్నారు. వాళ్లందరికీ అతను ఏదో విషయాన్ని విపులీకరించి చెబుతున్నాడు. వాళ్ళది శ్రద్ధగా వింటున్నారు.
    నేను వాళ్ళందరికీ కొంచెం దూరంలో నిలబడివున్నాను. ఉన్నపళంగా భగవంతాన్ని చేయెత్తి పిలిచేంత చొరవ నాకిప్పుడు లేదు. ఇప్పుడతను ఖరీదుగా ఎదిగి వున్నాడు. అతని మొహంలోనూ, అతను కట్టుకున్న దుస్తుల్లోనూ ఒక వింత వెలుగు, ఒక హోదా స్పష్టంగా కనిపించింది. అక్కడికీ అతను నావేపు చూచిన ప్రతిమాటూ, నేను అతనితో మాటాడాలనే ఉత్సుకతని సాధ్యమైనంత స్పష్టంగా తెలీజేసుకున్నాను.
    కానీ, అతను నన్ను పట్టించుకొనే స్థితిలో లేడు. నోటితో పిలవకపోయినా, అతని హోదాకి తగ్గ విధంగా కళ్ళతోనైనా పలుకరించవచ్చుగా. అదీ జరగలేదు.
    అభిమానం చంపుకునేందుకు మనసొప్పక నేనక్కడ్నుంచి కదిలొచ్చేశాను. భగవంతమనబడే ఓ ఫ్లీడరు గుమాస్తా కొడుకు - జాతకం తిరిగి ప్రముఖుడైనంత మాత్రాన ఇంత తలబిరుసా? మనిషి బుద్ధే యింతా? లేక అది కొందరికే వర్తిస్తుందా?
    అతను బంగారాన్నే తింటూండవచ్చు. అతను అమృతాన్నే ఆరగా ఆరగా తాగుండొచ్చు. అతను ఇంద్రభవనంలోనే కాపురం వుండొచ్చు - కాని అతని అదృష్టానికి నేను ఈర్ష్య చెందను. కానీ, చిన్ననాటి మిత్రుడిన్నేను. ఇది అతనెందుకు మరచిపోయాడు?
    నేనిన్ని అనుకున్న తర్వాత గొప్పవాళ్ళందరిమీదా నాకు కోపం వచ్చేసింది. నా ముందునుంచి పోతున్న ప్రతి కారునీ, ప్రతి ఖరీదైన మనిషిని కసిగా చూశాను. చాలా దూరం నడిచి వచ్చేసింతర్వాత, నా బక్క కోపానికీ, అల్పత్వానికీ సిగ్గుపడ్డాను.
    చిక్కడపల్లి దగ్గర పడుతూండగా, నా వెనగ్గా కారు హారను వినిపించింది. ఉలిక్కిపడి రోడ్డుకి పక్కగా తొలిగాను. పేవ్ మెంటుమీద నిలబడిపోయాను. ఆ కారు సరిగ్గా నా ముందుకొచ్చి ఆగింది.
    ఆ కారులో భగవంతాన్ని చూశాను. నా మనసులో గూడు కట్టుకొన్న శంకలన్నీ మటుమాయమై పోయాయి. చాలా ఆనందంగా నవ్వగలిగాను.
    డ్రైవరు వెనుక తలుపు తెరిచి నించున్నాడు.
    "రా, వొచ్చి నా పక్కన కూచో!" అన్నాడు భగవంతం.
    ఒక్క గెంతులో కారులో కొచ్చి కూర్చున్నాను. నేను కూచున్న తర్వాత కారు కదిలింది.
    "దేవుడిలా కనిపించి, మళ్ళా అంతలోనే మాయమైపోయావు. నువ్వు హైదరాబాదు వచ్చినట్టు తెలిసింది కానీ, కలుసుకోడం పడేలేదు. ఎక్కడుంటున్నావ్?"
    "చిక్కడపల్లిలో."
    "భార్యా పిల్లలూ...."
    "వాళ్ళంతా బందరులోనే వున్నారు. రేపాదివారం వెళ్ళి తీసుకొస్తాను."
    "అంతా క్షేమమా?"
    నేను తలూపాను. అతనో సిగరెట్టు నాకిచ్చాడు. అతనూ ఒకటి ముట్టించి పొగని నింపాదిగా వొదిలి అన్నాడు.
    "మావగారి బిజినెస్ లో చేరాను. లక్షలమీద సాగుతోంది. మొన్నీమధ్యనే నాకోసం ఒక ఇల్లు కట్టించారాయన. కొడుకయినా, అల్లుడైనా - నేనొక్కడ్నే. ఎలా వుంది నా కథ!"
    "బాగుంది."
    "ఇంతందమైన కథతో చోటుచేసుకునేందుకు నేనెంత ప్రయత్నించానో తెలుసా?"
    "తెలీదు. కానీ, వూహించాను."
    "ఈజిట్? అయితే ఆ తమాషా ఏమిటో చెప్పు వింటాను."
    "ఇప్పుడు కాదు, మరోనాడు చెబుతాను."
    "వాయిదా ఎందుకట?"
    "నేనూహించింది నిజమని ముందు తెలియాలి."
    "ఆల్ రైట్, అలాగే దాచుకో" అన్నాడు తను.
    మా కారు ఓ అందమైన 'భవంతి' ముందు ఆగింది. ఇద్దరం దిగాము. గేటు దగ్గిరున్న మనిషి భగవంతానికి తలొంచాడు.
    ఎంతో ముచ్చటైన గదిలో నేనొక్కడ్నీ వున్నాను. పండువెన్నెల్లాంటి లైటు వెలుతురు, సన్నగా చక్కని రేడియో సంగీతం, పంకా సున్నితమైన శబ్ధం. అదంతా మనసుని అలరించే వాతావరణం. ఇక్కడిలాగే యుగాలు గడిచిపోతే బాగుండుననిపించింది.
    భగవంతం బట్టలు మార్చుకు వచ్చాడు. ఇప్పుడతను దొరబాబులా వున్నాడు. వస్తూనే అన్నాడు.
    "ఒక గంటలో భోజనం రెడీ అవుతుంది. ఆకలిగా వున్నా సరే, నోరు మూసుక్కూర్చోవాలి, వీలవుతుందా?"
    "నిజం చెప్పాలంటే నాకిప్పుడక్కర్లేదు."
    "అది ఆరోగ్యానికి మంచిది కాదోయ్ సుబ్బారావ్! పద్మ ఫ్రెండ్సుతో సినిమా కెళ్ళిందట. పరిచయం చేద్దామనుకున్నాను."
    "నిన్ను చూశానుగా - వేరే మీ ఆవిడ్ని చూడక్కర్లేదు."
    "అదేమిటి?"
    "అదంతే. ఒక లెక్క. నువ్వింత ఆనందంగా వున్న మనిషివి. ఒకటీ ఒకటి రెండు. అనగా...."
    "ఆపు. లెక్కల మాష్టారూ! నీ లెక్క తప్పింది. ఒకటీ, ఒకటీ, ఒకటే."
    నాకర్థం కాలేదు. అదోలా అతనివేపు చూశాను. అతనక్కడ్నుంచి లేచి ఓ బీరువా దగ్గర ఆగాడు. దాన్లోంచి ఓ సీసా తీశాడు. సీసాతో రెండు గ్లాసులూ పట్టుకోచి నా ముందున్న బల్లమీదుంచాడు.
    "ఇది మందు. మనిషికి మంచి టానిక్కు. మనిషి ఏడ్చినప్పుడూ నవ్వినప్పుడూ బాగా పనిచేస్తుంది. దీని ఖరీదు ఎనభై రూపాయల చిల్లర. వాడబడే మనిషి సత్తాని బట్టి ఈ ఒక్క సీసా ఒకేసారి పుచ్చుకోనూ వచ్చు. లేదూ - ఆరగా ఆరగా వారం రోజులూ వాడుకోవచ్చు. సాధారణంగా నేనీ పాళ్ళని దృష్టిలో పెట్టుకోను. ఎంత దొరికితే అంతా పుచ్చుకుంటాను. నువ్వు నాకు మిత్రుడివి. అతిథివి. నీకేం అభ్యంతరం లేకపోతే, నీ ముందుంచిన గ్లాసులోకి నీ ఇష్టమొచ్చినంత వొంచుకో" అన్నాడతను.
    "నాక్కావలసినంత అభ్యంతరముంది. నాకొద్దు."
    "వెల్ సెడ్! చాలామంది చాలా వాటికి భయపడి ఛస్తారు. నే తాగితే నీకేమైనా అభ్యంతరమా?"
    "వుండదు."
    "దేవుడు నిన్ను కాపాడాలి! చూడు నాయనా సుబ్బారావూ నా విశ్వరూపం! నేను తాగుతా, నా కథంతా చెబుతాను. నువ్వు నోరు మూసుకుని అదంతా విను. కథ పూర్తయిన తర్వాతనే నీ సందేహాలు వింటాను. తెలిసిందా? భగవంతం కథ ఈ చుక్కతో ప్రారంభం! వినింక!
    "ఆఫ్టరాల్ ఓ ఫ్లీడరు గుమాస్తా కొడుకున్నేను. నా పేరు భగవంతం. ఈ భగవంతానికి ఒక విశాలమైన హృదయముంది. ఆ హృదయంలో బంగారుకలలనేకం. ఈ భగవంతానికి బోల్డు ప్రపంచం వుంది. తమ్ముళ్ళూ చెల్లాయిలూ వెరశి ఆరుగురున్నారు. వాళ్లందరిమధ్యా ఆ యింట్లో భగవంతానికి సుఖం లేదు. తండ్రని చెప్పబడే ఆ పూర్ ప్లీడర్ గుమాస్తా జీవితం పరుగుపందెంలో ఆరు దశాబ్దాలు వెనకపడిపోయి ఆయాసంతో అడుగు వేయలేకపోతున్నాడు. ఇది భగవంతానికి ఒక గొప్ప డిస్ క్వాలిఫికేషన్! వింటున్నావా సుబ్బారావ్! ఈ స్వీయకథ మరో మనిషికి నేను ఛస్తే చెప్పను. నువ్వు నా చెలికాడివి, నా ప్రాణానివి. అందుచేత ఈ ఛాన్స్ నీకు దక్కింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS