Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 53


                               మా నాన్న ప్రేమ కథ

 

    అదొక అందమైన మేడ.    

 

    సినీమా సెట్టులాగా వున్న ఆ మేడలో ఒక సినిమా కంపెనీ వుంది. ఆ మేడలోకి వెళ్ళేముందు ఒక బోర్డు కనిపిస్తుంది.

 

    "మారుతీ చిత్రాలయ" అని ఆ బోర్డు మీద రాసి వుంది.

 

    ఆ మేడ ఎంత బావుందో... ఆ మేడ తాలూకు హాలు కూడా అంత బాగుంది. అందమైన సోఫాలు, ముచ్చటైన కుర్చీలూమ్ బీరువాలూ...

 

    ఆ హాలు చాలా పెద్దది గనక, దాన్ని రెండు భాగాలు చేసేందుకు ఖరీదైన సిల్కు తెరని కర్టెన్ గా కట్టేరు. తెరబయట అతిధులు, తెర లోపల నిర్మాత, దర్శకులు!

 

    తెర లోపల...

 

    నిర్మాతా దర్శకుల మధ్య ఒక ఫైలు తెరవబడివుంది. ఇద్దరి తలలూ ఆ ఫైలుకి అంకితమయ్యేయి. సీరియస్ గా చూసేస్తున్నారు.

 

    ఆ సమయంలో...

 

    ఆఫీసు బోయ్ ఖంగారుగా వచ్చి, ఖంగారుగానే ఒక స్టేట్ మెంటిచ్చేడు...

 

    "కవిగారు వచ్చేసేరండి!"

 

    నిర్మాత, దర్శకులిద్దరూ ఫైల్లోంచి తలలు తీసి, బోయ్ వేపు తిప్పేరు.

 

    దర్శకుడు చాలా తాపీగా అన్నాడు-

 

    "రమ్మను."

 

    లాల్చీ పైజమాల్లో నిండుగా వున్నాడు రచయిత. కళ్ళజోడు అతని ఆకారానికి గొప్ప అలంకారం తెచ్చి పెట్టింది.

 

    గంభీరంగా నడచి వెళ్ళాలనుకున్నాడు. కానీ, ఆ నడక ప్రాక్టీసు చేయక పోవడంవల్ల దాదాపు గెంతుకుంటో తెరలోకి దూరి పోయేడు-'నమస్కారం. నమస్కారం' అనుకుంటో...

 

    నిర్మాత కుర్చీ చూపెడుతూ కూర్చోండి అన్నాడు.

 

    కవి కూర్చున్నాడు.

 

    దర్శకుడు సిగరెట్ పాకెట్ కవిగారి ముందుంచేడు.

 

    ఒక సిగరెట్ తీసి ముట్టించుకుని మిగిలిన సిగరెట్లతో సహా ఆ పెట్టెను లాల్చీ జేబులోకి తోసేసేడు.

 

    "కథ చెప్పండి." అన్నాడు నిర్మాత.

 

    కవిగారు గట్టిగాసిగరెట్టు దమ్మొకటి పీల్చి, కళ్ళు మూసుకున్నాడు.

 

    ఆ ముద్రలో మూడునాలుగు నిమిషాలు ఖర్చుచేసి-కళ్ళు విప్పి-మరో దమ్ము పీల్చి, గంభీరంగా ప్రారంభించేడు కథని.

 

    "అది మగధదేశం. ఆ దేశాన్ని శ్రీశ్రీశ్రీ విక్రమ సింగు మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఒకనాడు సింగుగారు గుర్రమెక్కి వేట కెళ్ళేరు."

 

    (కవిగారి కథని తెరమీద చూస్తున్న అనుభూతిలో వున్నారు దైరెక్టరూ, ప్రొడ్యూసరు. అంచేత దృశ్యం నడుస్తోంది. సింగుగారెక్కిన గుర్రం దార్లో మకారు చేసింది. రెండుకాళ్ళూ ఎత్తి సింగుగారిని నేలపాలు చేసింది. దృశ్యం అక్కడో ఆగిపోయింది.)

 

    డైరక్టరు కొంచెం చిరాకు పడుతూ అన్నాడు-

 

    "మాకుజానపద కథలొద్దు. గుర్రాలూ, లొట్టిపిట్టలూ మాకుగిట్టవు"

 

    కవిగారు చెక్కు చెదరకుండా, నిబ్బరంగా మరో దమ్ములాగి అన్నాడు.

 

    "ఆల్ రైటాల్ రైటండీ! ఇంకో రికార్డు పెడతాను."

 

    నిర్మాత ఉత్సాహంగా అన్నాడు.

 

    "ఆ పెట్టేదేదో మంచి రికార్డు పెట్టండి!"

 

    కవిగారు ఇంకో దమ్ములాగే ప్రయత్నం చేయగా-సిగరెట్టు పూర్తిగా తగలబడి పోయినట్టు తెలిసింది. అంచేత మరో సిగరెట్ కోసం చెయ్యిజాపేడు.

 

    ఆ చేతికి నిండు సిగరెట్ పాకెట్ అందింది. అందులోంచి ఒకే ఒక్క సిగరెట్ లాగి, పెదాల మధ్య నుంచి మిగతా సిగరెట్లతో సహా, ఆ పెట్టెను లాల్చీ రెండో జేబులో తోసేడు.

 

    సిగరెట్ ముట్టించుకుని హొయలుగా పొగ వదులుతూ కధా ప్రారంభం చేసేడు.

 

    "శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఆలస్యంగా నిద్ర లేచేడు. లక్ష్మీదేవి శ్రీవారి పాదాలచెంత కూచుని, ఆ పాదాలను సుతిమెత్తగా వత్తుతోంది...   

 

    (కనీసం కిందటి కథలోనైనా దృశ్యం నడిచింది. ఇప్పుడదీ లేదు. అంచేత నిర్మాత విసుక్కుంటో అన్నాడు)

 

    "పౌరాణికం తర్వాత చేద్దాం- ఇప్పుడొద్దు."

 

    రచయిత లేచి నించున్నాడు. వెళ్ళి పోయేందుకు లేచేడేమో అనుకున్నారు. కానీ నిలబడి చెబుతున్నాడు కథని-సీరియస్ గా!

 

    అతను చెబుతున్న ప్రకారం దృశ్యం నడుస్తోంది.

 

    "అది అర్థరాత్రి. కన్ను పొడుచుకు చూచినా కనిపించని కటిక చీకటి రాత్రి. కీచురాళ్ళ రణగొణ ధ్వని. ఎక్కడో దూరంగా ఒక వీధి కుక్క సణుక్కుంటోంది.

 

    "అదుగో అదే ఇల్లు. ఆ ఇంట్లో శ్రీమతి అరుంధతీదేవి వుంటోంది అది బాత్ రూం (గంభీరంగా) అది బాత్ రూం. సమయం రాత్రి పది. శ్రీమతి అరుంధతీదేవి స్నానానికి సిద్ధమైంది. బాత్ రూం గోడకి బల్లిలాగా అతుక్కున్న ఓ ఆకారాన్ని చూసి షాక్ తిన్నది. అది బల్లికాదు. పెనుపర్వతం. భీభత్సంగా వున్నాడు. నోట్లో ఏదో వుంచుకుని కసాపిసా నముల్తున్నాడు. నముల్తూనే ఒక్కో అడుగు ముందుకి వేస్తున్నాడు. అర్ధనగ్నంగా వున్న అరుంధతీదేవి వద్దు వద్దు అని గొణుక్కుంటోంది. అతను క్రూరంగా నవ్వుతున్నాడు. ఆమెను చేరుకున్నాడు. అకస్మాత్తుగా అతని రెండుచేతులూ అరుంధతీదేవి మెడని చేరుకున్నాయి. ఆమె మెడ అతని చేతుల్లో బిగుసుకుపోతుండగా కెవ్వున కేక పెట్టింది..."

 

    పొలికేక. చావుకేక. ఆ కేకతో దృశ్యం మాయమైపోయింది. ఇప్పుడు మారుతీ చిత్రాలయ ఆఫీసులో కేవలం కుర్చీలే వున్నాయి వాటి మీద మనుషుల్లేరు.

 

    ఒక మూల-

 

    దర్శన నిర్మాతలు ఒకరినొకరు కౌగలించుకుని వణికిపోతున్నారు. క్షణం తర్వాత కౌగిలినుంచి బయటపడ్డారు.

 

    అటు ఇటూ చూసేరు.

 

    "కవిగారెక్కడ?" అడిగేడు నిర్మాత.

 

    "అవునెక్కడ?" అన్నాడు దర్శకుడు.

 

    సోఫా కింద నుంచి డైలాగు వినిపించింది-

 

    "ఖంగారు పడొద్దు! నేనిక్కడే వున్నాను"

 

    అంటూ సోఫాకిందనుంచి పాక్కుంటూ వెలుగులోకి వచ్చేడు కవి. పూర్తిగా బయటకొచ్చేసి-చొక్కా దులుపుకుంటో అన్నాడు-

 

    'వద్దండి బాబూ! మనకీ క్రైం కథ లొద్దు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS