Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 52


    నాకప్పుడు కోపమొచ్చింది. అందుచేత నేను కటువుగా అన్నాను.
    "అందుకే నీతో స్నేహం చేయడమంటే నాకు చెడ్డ చిరాకు. ఎదుగూ బొదుగూ లేని నూర్రూపాయల గుమాస్తా లాగా ఇప్పట్నుంచే నీకెందుకంత దిగులు? ప్రస్తుతం మనం చదువుకుంటున్నాం. మనముందు నిచ్చెనలూ, పాము నోళ్ళూ వున్నాయి. ఈ వైకుంఠపాళిలో మనం నిచ్చెనే ఎక్కుతామో పాము నోటనే పడతామో యిప్పుడే ఆలోచించకూడదు. ఇప్పుడు మనం చేయవలసింది ఒక్కటే - పుస్తక పారాయణం. ఈ కర్తవ్యం ముందు కానివ్వు. తర్వాత దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇటుచూడు భగవంతం! నీకంటే నాదేం పొడిచేసే జాతకం కాదుగదా! నన్ను చూడు నిమ్మకి నీరెత్తినట్టు నేనెంత ప్రశాంతంగా బ్రతుకుతున్నానో. నాలాగా నువ్వెందుకుండలేవూ?"
    "నువ్వు నీలాంటి వాళ్ళంతా ఫూల్స్ రా, ఫూల్స్. నేను ఫూల్ ని కాదు. నేను 'రేపటి మనిషి'ని. కొన్ని పదుల సంవత్సరాల ముందర మనిషిని! నాకోసం, ఆ కాలాన్ని బంగారం చేసుకునేందుకు నేనిప్పట్నుంచే ప్రయత్నించాలి. అవునా, అలాంటిదిప్పుడేమయిందో తెలుసా సుబ్బారావ్...."
    అతని గొంతు పూడుకుపోతుందని తెలిసి నేను వారించాను కోపంగా -
    "ఆడపిల్లలా ఏడవకు. ఏడవకుండా చెప్పదలచుకున్నది ఖచ్చితంగా చెప్పేయ్."
    "వెంకటరత్నం చౌదరిగారమ్మాయిని నేను ప్రేమించాను."
    ఆ మాట వినడంతోటే ఉలిక్కిపడ్డాను. భగవంతం 'ఆశ'ని తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను. ఎంతయినా, మరీ యింత విడ్డూరమా? ఈ రోజు లెలాంటివి? ఎక్కడో కథల్లో తప్ప - ఈభూమ్మీద వర్గపోరాటం ప్రతిమూల సాగుతూనే వుంది గదా! ఒకరి దగ్గర కొలువు చేస్తున్న మనిషి కొడుకు ప్రేమించడమా? అందునా ఆ కామందు కూతురినా? ఇంత తెగింపా? రాజకుమారిని తోటమాలి కొడుకు కలలోనైనా కన్నెత్తి చూడకపోవడం జీవితం. ఈ వ్యత్యాసాన్ని భగవంతం ఎందుకు తెలుసుకోలేదు.
    "మరి ఈ ప్రేమ సంగతి మీ నాన్నకి తెలుసా?"
    "నా ప్రేమ సంగతి మా నాన్నకెందుకు తెలియాలి? పైగా నేను చౌదరిగారమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిస్తే మా నాన్న గుండె ఆగిపోతుంది. మా నాన్న చౌదరి దగ్గర నేలకంటుకుపోయి బతుకుతాడు. ఆ మనిషి ముందు మా నాన్న తలెత్తి తిరగడు గదా! కనక, నిజమేమిటో తెలుసా సుబ్బారావ్, మా నాన్న-వాళ్ళింట్లో గుమాస్తాగాడు కాకపోతే లలిత నాకు దక్కేది. నా ప్రేమ చచ్చిపోవడానికి ముఖ్య కారణం మా నాన్న. కేవలం ఈ ఫ్లీడరు గుమాస్తా! షేమ్."
    "మరెందుకనుకున్నావ్. ఈ బోడి పరీక్షలు నాకో లెక్కగాదు. నాక్కావలసినది నాకు దొరికితే ఈ చదువుల్నీ, ఈ పరీక్షల్నీ అవతలకి తోలి పారేస్తాను.... ప్రేమిస్తున్నట్లు నటించి, నాకు పిచ్చెత్తించి, మరో గొప్ప వెధవని పెళ్ళి చేసుకుంటోంది లలిత! ఈ భగవంతం ప్రేమ నంబర్ వన్. రేపు నెంబర్ టూ గూడా నన్నీరకంగానే 'దగా' చేస్తే నేనేనాటికి బాగుపడేది సుబ్బారావ్! చెప్పు".
    "ప్రేమ లేకపోతే బతకలేవా?"
    "బుద్ధి లేని ప్రశ్న. చెబితిని గదా నేను మీలాంటి చవటని కాను. కాదనీ! డబ్బున్న బంగారు పక్షినే ప్రేమిస్తాను. నా గీత బాగుండాలే గానీ, దానివల్ల నేనేం సాధిస్తానో నువ్వు కళ్ళారా చూచి అదిరి చస్తావ్."
    నేను లేచి నిలుచున్నాను.
    "వెళ్ళిపోతున్నావా!"
    "నువ్వెందుకేడుస్తున్నావో తెలీక ఓదార్చి కారణం కనుక్కోమని నన్ను మీ నాన్న పంపాడు. నువ్వు మహా గొప్ప మేధావివని తెలిసింది. అందుచేత మరి నోరెత్తకుండా వెళ్ళిపోతున్నాను."
    "నన్ను క్షమించానని మనస్ఫూర్తిగా చెప్పి వెళ్ళిరా బాబూ!"
    నాకు నవ్వొచ్చింది. హేళనగానే అన్నాను -
    "నేను నిన్ను క్షమించడమా?"
    "అవును. నువ్వే నన్ను క్షమించాలి. నా వాగుడు నీ మనసుకి కష్టం కలిగిస్తే క్షమించి మరీ వెళ్ళు - అంతేగాని సలహాలివ్వకొరేయ్! నీమీద అపరిమితమైన గౌరవం సుబ్బారావ్! నువ్వు తలుచుకుంటే నన్ను క్షణంలో మార్చి పారేయగలవు. ఆ పనిమాత్రం చేయొద్దని ప్రాధేయపడుతున్నాను. అంతే!"
    ఏం చెప్పాలో తోచక తలొంచుకొని వచ్చేశాను.
    - ఆ తర్వాత భగవంతం బి.ఏ. పరీక్ష పాసైనప్పుడుగానీ, అతని ఎమ్మేకి విశాఖపట్టణం వెళ్ళినప్పుడు గానీ, నేను సంతోషించలేకపోయాను. నాకు వీలుకాని పై చదువులకి అతను నోచుకున్నాడనే ఈర్ష్య కాదిది.
    భగవంతం కొరకు, కేవలం ఆడంబరాల నిమిత్తం ఆ ఫ్లీడరు గుమాస్తా వినియోగిస్తున్న డబ్బునీ, త్యాగాన్నీ చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుండేది. కొడుకు ఉజ్జ్వల భవిష్యత్తు నిమిత్తం తండ్రి ఎన్నెన్ని త్యాగాలు చేసినా, ఎంత నెత్తురు ఖర్చు పెట్టినా విచిత్రమనిపించలేదు. కాని, తండ్రి ప్రేమనీ, వాత్సల్యాన్నీ, ప్రేమనీ ఆధారం చేసుకొని అర్థంలేని విలాసాల్లో మునిగే కొడుకు ప్రవర్తన నాకు గిట్టదు. భగవంతం విశాఖపట్టణంలో వెలిగిస్తున్న జీవితం నాకెప్పటికప్పుడు మిత్రుల ద్వారా తెలుస్తూనే ఉండేది. ఇక్కడ వాళ్ళ నాన్న వేలకి వేలు అప్పులు చేస్తుండడం గూడా గమనించిన మనిషిని గనక - బొమ్మా బొరుసూ రెండూ చూస్తున్నాన్నేను.
    అరవై అయిదు చివర్రోజుల్లో భగవంతమే నాకో ఆశ్చర్యకరమైన వార్త పంపాడు. మనిషి ప్రేమించాల్సిందే. అదేం బూతు కాదు. అయితే ఆ ప్రేమ వెనక ఇతరమైన ఉద్దేశం కూడదంటాను.
    భగవంతం పెళ్ళి చేసుకోబోతున్నాడు. వధువు పేరు పద్మ. పద్మ భగవంతానికి క్లాసుమేటు. ఇంతవరకూ బాగానే ఉంది. పద్మ విధవని చదివినప్పుడు భగవంతానికున్న చొరవ ప్రమాదమనిపించింది నాకు.
    ఆ ఉత్తరం పుచ్చుకొని భగవంతం వాళ్ళింటికి వెళ్ళాను. అంతక్రితమే భగవంతం చేయనున్న ఘనకార్యం తెలిసి అతని తల్లి శోకదేవతే అయ్యింది.
    "విన్నావా నాయనా సుబ్బారావూ, మావాడు మమ్మల్నెలా ఉద్ధరిస్తున్నాడో. వంశంలో లేనిపని వాడు చేసేస్తున్నాడు. ఇన్నేళ్ళూ పెంచి పెద్ద జేసినందుకు వాడు మాకు చెల్లించే ప్రతిఫలం చూస్తివిగా. వాడికోసం ఈ మారాజెంత కష్టపడ్డారో నువ్వూ ఎరుగుదువుగా. వాడిని పువ్వులా పెంచారు నాయనా! కళ్ళల్లో పెట్టుకొని పెంచారు. ఆరుగురు పిల్లలున్నారింక. వాళ్ళందరి నోళ్ళూ కొట్టిపారేసి వాడినింత చేసేరు.'
    ప్లీడరు గుమాస్తా ఆ శోకదేవతని ఓదార్చ ప్రయత్నించారు.
    "ఏడవకే బాబూ, ఏడవకు. నీదంతా పిచ్చి గోల. మన రోజులిలా తగలడ్డాయని నోరు మూసుక్కూచో. వాడినైనా సుఖపడనివ్వు. ఎందుకీ రాద్ధాంతం. కాలముంది చూశావు, అదే వాడికి జవాబు చెబుతుంది! ఇవాళ వాడు విధవల్ని పెళ్ళాడాడు. రేపేమో.... నాయనా భగవంతం! విజ్ఞుడవై పోయావుటరా! పోనీలే నాన్నా నువ్వయినా సుఖపడు. మా చేయిదాటి వెళ్ళావు. నూరేళ్ళూ సుఖంగా వర్థిల్లు చిట్టీ!"

                                            *   *   *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS