Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 52


    కృష్ణమూర్తి ఆలోచిస్తున్నాడు.

 

    లక్ష్మీపతి ఇల్లు---

 

    జాకీని పెళ్ళికొడుకును చేస్తున్నారు. లక్ష్మీపతి ముచ్చటపడుతున్నాడు.

 

    ఊరి చివరి ఇల్లు.

 

    తనని కట్టేసిన కుర్చీని అతికష్టమ్మీద సుబ్బారావు దగ్గరికి లాక్కు వచ్చాడు కృష్ణమూర్తి. తనచేతి కట్లను సుబ్బారావు నోటి సమీపానికి వచ్చేలా చేసేడు. ఆ తర్వాత అన్నాడు-

 

    "కొరకండి! త్వరగా కొరకండి!"

 

    సుబ్బారావు ఆ పనికి ఉపక్రమించేడు.

 

    ఊళ్ళో ఒకానొక క్లబ్బు...

 

    అందరూ సందడిగా ఉన్నారు. "హేపీ న్యూ ఇయర్" తాలుకు పాట ప్రారంభమైంది.

 

    ఆ పాట ఊరి చివరి ఇంట్లోకూడా వినిపిస్తోంది.

 

    కృష్ణమూర్తి, సుబ్బారావుల కట్లు విప్పబడి వున్నాయి. అయితే గదిలోంచి బయటకు వెళ్ళాలంటే గది తలుపులు బంధించి వున్నాయి.

 

    కృష్ణమూర్తి సుబ్బరావుకి సైగచేసేడు. సుబ్బారావు కృష్ణమూర్తి మీద కలబడ్డాడు.

 

    ఇప్పుడు వాళ్లీద్దరూ ఉత్తుత్తి ఫైటు ప్రారంభించారు. ఆ వరస చూసిన జాకీ మనుషులు తలుపులు తెరచి గదిలోకొచ్చేరు.

 

    అంతే!

 

    వచ్చినవాడ్ని వచ్చినట్టు ఉతుకుతున్నాడు కృష్ణమూర్తి. అతను ప్రళయరుద్రుడై విజృంభిస్తున్నాడు. చాతనైన సాయం చేస్తున్నాడు సుబ్బారావు.

 

    బేగ్రౌండులో హేపీ న్యూ ఇయర్ పాట వినిపిస్తూనే వుంది.

 

    లక్ష్మీపతి ఇంట్లో....

 

    పెళ్ళి తంతు ముగిసే కాలం దగ్గిర పడుతోంది. అక్కడ కూడా హేపీ న్యూ ఇయర్ పాటే వినిపిస్తోంది. అంచేత పురోహితుడు చదివే మంత్రాలు గాల్లో కొట్టుకుపోతున్నాయి.

 

    పద్మ చేతిలో విషం సీసావుంది. దాన్ని గట్టిగా పట్టుక్కూచుంది. జాకీ చేతిలో మంగళసూత్రముంది. మంత్రాలు మంగళ సూత్రధారణ వరకు వచ్చేయి కాబోలు---జాకీ మంగళసూత్రంతో లేచి నించున్నాడు.

 

    పద్మ చేతిలో వున్న విషంసీసా బిరడ వూడింది.

 

    అంతలో---

 

    ఎక్కడ్నుంచి వచ్చేడోగాని---కృష్ణమూర్తి సుడిగాలి లాగా మంటపమెక్కడం---జాకీ దవడమీద ఒక్కటిచ్చుకోడం ఒకేసారి జరిగేయి.

 

    అంతలావు దెబ్బ దవడమీద పడేసరికి జాకీ తట్టుకోలేక గాల్లోకి ఎగిరి మరీ కిందపడ్డాడు. కింద పడ్డవాడిని లేపి మరీ ఉతుకుతున్నాడు కృష్ణమూర్తి.

 

    లక్ష్మీపతికి వరసేం అర్ధం కాలేదు. ఆ యుద్ధం ఆపడానికి రెండడుగులు వేసేడు.

 

    కృష్ణమూర్తి చాచికొట్టిన దెబ్బకి జాకీ మళ్ళీ ఎగిరిపడ్డాడు. అయితే ఇప్పుడతను నేలమీద పళ్ళేదు. తిన్నగా పోలీసుల చేతుల్లో పడ్డాడు పోలీసుల పక్కనే సుబ్బారావు నిలబడి ఉన్నాడు.

 

    పోలీసుల్ని చూడగానే జాకీ గుడ్లు తేలేసేడు. పోలీసులిని చూడగానే లక్ష్మీపతి ఆందోళన పడ్డాడు.

 

    "ఏమిటీదంతా?" అనడిగేడు పోలీసుల్ని.

 

    "వీడు గొప్ప చీటరు మిమ్మల్ని మోసగించి మీ కూతుర్ని పెళ్ళి చేసుకుంటున్నాడు" అన్నాడు ఇనస్పెక్టరు.

 

    ఆ మాటకి జాకీ విదిలించుకుని అన్నాడు---

 

    "నేనేం మోసం చేయలేదు!"

 

    "నోర్ముయ్! సత్యంగారబ్బాయినని చెప్పి ఈ పెళ్ళి చేసుకుంటున్నావ్! అవునా!" అడిగేడు ఇన్ స్పెక్టరు.

 

    "అంటే? ఇతను సత్యంగారబ్బాయి కాదా?" అడిగేడు లక్ష్మీపతి!

 

    "కాదు!" అన్నాడు ఇన్ స్పెక్టరు.

 

    ఆ మాటతో లక్ష్మీపతి గుండె పట్టుకున్నాడు. కుప్పలా నేలకొరిగి పోయేవాడే. అన్నపూర్ణమ్మ అతన్ని ఆదుకుంది.

 

    ఇన్ స్పెక్టరు చెబుతున్నాడు---

 

    "వీడి పేరు జాకబ్! వీడి మీద బోలెడు చీటింగ్ కేసులున్నాయి. మా కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. క్షణం ఆలస్యమైతే మిమ్మల్ని కూడా మోసం చేసేవాడే!"

 

    లక్ష్మీపతి కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి. జాకీ అంటున్నాడు---

 

    "ఇన్ స్పెక్టరు! పాత కేసులుంటే వుండొచ్చు. అందుకు నన్ను అరెస్టు చేయండి. అంతేగాని ఈ మనిషిని నేనేం మోసం చేయలేదు. నా పేరు జాకీ అనే చెప్పేను. సత్యం గారబ్బాయిని కాదన్నాను. అయినా సరే-తనకి తగ్గ అల్లుడిని నేనే అని నన్ను మొహమాటం పెట్టేరు. ఇదుగో చూడండీ కాగితం!"

 

    అని జేబులోంచి కాగితం తీసి ఇన్ స్పెక్టర్ కిచ్చేడు.

 

    ఇన్ స్పెక్టరు ఆ కాగితం చదివి ఏమిటన్నట్టు లక్ష్మీపతి కళ్ళల్లోకి చూసేడు.

 

    అప్పుడు లక్ష్మీపతి కళ్ళల్లో నిజంగానే పశ్చాత్తాపం కనిపించింది. గొంతు పూడుకు పోగా అన్నాడు---
    "డబ్బు ఇన్ స్పెక్టర్! డబ్బు! డబ్బు మీద ఆశ నాకళ్ళు కప్పింది. నా మెదడ్ని పాడుచేసింది. ఆ స్థితిలోనే నా పిల్ల గొంతు కోయడానికి కూడా సిద్ధపడ్డాను. క్షణం, ఒక్కక్షణం ఆలస్యమైతే నా కుటుంబం యావత్తు సర్వనాశనమై ఉండేది. సమయానికి దేవుడిలా వచ్చేరు. మీకెట్లా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావడంలేదు."

 

    ఇన్ స్పెక్టరు జాకీని తీసుకుపోతూ లక్ష్మీపతితో అన్నాడు--

 

    "ఆ చెప్పే థేంక్సేవో ఈ సుబ్బారావుగారికి చెప్పండి. ఇక్కడి గొడవ వీరే రిపోర్టు చేసేరు."

 

    లక్ష్మీపతి సుబ్బారావు వేపు తిరిగేడు.

 

    ఎక్కడ తనకి థేంక్స్ చెప్పేస్తాడోనన్న భయంతో సుబ్బారావు గబగబా అనేసేడు-

 

    "నేను నిమిత్తమాత్రుడిని. మీకేదైనా సాయంచేస్తే ఆ చేసినవారు ఇదిగో ఈ కృష్ణమూర్తి!"

 

    లక్ష్మీపతి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగేయి.

 

    చేతులు చాచి కృష్ణమూర్తిని చేరుకున్నాడు. అతనిని ఆత్మీయంగా కావిలించుకున్నాడు.

 

    అతని చేష్టకి పద్మ ఆనందించింది. అన్నపూర్ణమ్మ తన ఆనందాన్ని కన్నీటితో ప్రదర్శించింది.

 

    కృష్ణమూర్తి చేతులు పట్టుకున్నాడు లక్ష్మీపతి-

 

    "చిన్నవాడివైనా నీది గొప్ప హృదయం మేస్టరూ! నాదే పాడుబుద్ధి. లేకిబుద్ధి పాపిష్టి డబ్బు నీ దగ్గిర లేదనే వంకతో నిన్ను దూరం చేసుకున్నాను. అయినా-నా క్షేమం కోరుకున్నావ్! ఆపదలో ఆదుకున్నావ్! మేస్టరూ- నాకు తగిన అల్లుడివి నువ్వే! ఇదే ముహూర్తానికి నా పిల్లని పెళ్ళాడి నన్ను మావను చేసుకో."

 

    అని పద్మ చేతుల్ని కృష్ణమూర్తి చేతుల్లో ఉంచేడు. ఆ ప్రేమికులిద్దరూ లక్ష్మీపతి కాళ్ళను తాకేరు.

 

    మంగళ వాయిద్యాలు మిన్ను ముట్టేయి.

 

    సరిగ్గా అప్పుడే సత్యం కారు దిగేడు.

 

    సత్యాన్ని చూడగానే లక్ష్మీపతి మొహం తిప్పుకున్నాడు.

 

    "మొహమెందుకు తిప్పుకుంటావ్? అడగదలుచుకున్న దేదైనా వుంటే అడుగు! ఎందుకిట్లా చేసేనని కోపంకదూ? నేనీ ప్రయత్నం తలపెట్టక పోతే ఈ కృష్ణమూర్తి నీకు అల్లుడయ్యేవాడు కాదు. నీ పాపం నీకు తెలియాలన్నా ఈ కుర్రాడి గుణం అర్ధం చేసుకోవాలన్నా-ఇల్లాంటి ప్రయత్నమేదో చేయాలనుకున్నాను. చేసేను! అర్ధమైందా?" అన్నాడు సత్యం.

 

    "అంటే-ఇదంతా కావాలనే చేసేవా?" బిక్కమొహం పెట్టుకుని అడిగేశాడు లక్ష్మీపతి.

 

    "లేకపోతే సరదాపడి చేసేననుకున్నావా? లుక్ హియర్ లక్ష్మీపతి ఇంకో వార్త కూడా చెబుతాను. గుండె దిటవు చేసుకో!" అన్నాడు సత్యం.

 

    ఏం చెబుతాడో విందామని అందరూ కుతూహలంగా ఎదురు చూస్తుండగా-సత్యం నూతన వధూవరులను చేరుకున్నాడు. వాళ్ళని దగ్గరకు తీసుకున్నాడు. ఆ తర్వాత అన్నాడు-

 

    "ఈ కృష్ణమూర్తి మా అబ్బాయి-హీ ఈజ్ మై సన్!"

 

    అంతే-

 

    కృష్ణమూర్తి మినహాయించి ఎక్కడి వాళ్ళక్కడ శిలా ప్రతిమ నిలబడపోయేరు.

 

    లక్ష్మీపతి మాత్రం అమాంతంగా సత్యం గారి కాళ్ళమీద పడ్డాడు.


                                                              * శుభం *

                   (తరువాయి భాగం నుంచి "మా నాన్న ప్రేమకథ" అనే నవల వస్తుంది.)


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS