కుప్పగా కూలిపోయింది వసంత. అంతా అయిపొయింది. ఉన్న ఒక్క ఆశ కూడా ఎగిరిపోయింది. భరించలేని బాధ. పుట్టెడు దుఃఖం. దహించి వేసే పాపం -- ప్రాయశ్చిత్తం లేక విలవిలలాడుతుంది. కాపాడే దిక్కు లేక అలమటించిపోతుంది హృదయం. ఓదార్చే అప్రుల కోసం అర్రులు చాచింది మనసు. ఎక్కడా ఎవరూ సంప్రాప్తం కాక ఒంటరిగా కుమిలి పోయింది. ఆబాల ఆవేదనను అర్ధం చేసుకొని ఆదరించలేని లోకం. నీ గర్వానికి , అహంభావానికీ తగిన శాస్తి జరిగింది లెమ్మని పరిహసించే పరిస్థితులు . కాలం నిస్సహాయతను చాటి చెపుతుంది.
ఒక్క ఆశ స్పురించగా టైం చూసుకొంది. ఆశా కిరణం కనుచూపు మేర దూరంలో కనబడింది. ఒక్క పరుగున బయట పడింది.
ఆశా కిరణం అందుకోవడం తనకు చేతకాదని అందుకు సరిపోయిన వ్యక్తీ వేరే ఉన్నారని తెలిసినా తొందరపాటు ఆ విషయాన్ని విస్మరింపజేసింది.
రెస్టారెంటు గది లోపల కూర్చొని ఉన్న రాజ్ మస్తిష్కం లో ఆలోచనలు పరుగెడుతున్నాయి. మాతృదేశం వదిలి పరాయి దేశాలకు వెళ్ళిపోతున్నాడు. అక్కడ తను ఏకాకి. ఇక్కడ అందరినీ వదులుకొని ఆ నిస్సహాయ జీవితాన్ని కోరుకొని వెళ్లి పొదలుచుకున్నాడు. లోకం తనను అపార్ధం చేసుకొంటుంది. కానీ తనవారు -- అందులో తన రజియా తనను అర్ధం చేసుకొంటుందో లేదో? తన హృదయానికి మారు రూపమైన ఆమె సరిగ్గా అర్ధం చేసుకోలేని నాడు తన పై తనకే నమ్మకం ఉండదు. ఆనంద్, గోపీ తను లేకుంటే బాధపడతారు. లత ఏడుస్తుంది. అన్నయ్య, వదిన ఏడుస్తారు. సుగుణ -- పండంటి బిడ్డను కనబోతూ తనకు మేనల్లుడి ని చూపించాలని ఆశపడి ఈ వార్త వింటే తల్లడిల్లి పోతుంది. రజియా ఈ అఘాతానికి తట్టుకోలేదు. పిచ్చిదై పోతుంది. ఏ అఘాయిత్యానికి పాలుపదకుండా చూడు భగవాన్! అని వాపోయింది అతని హృదయం.
"విమానం బయలుదేరడానికి పదిహేను నిమిశాలుంది." ఎవరో మైక్ లో చెప్పినారు.
గుండె దడదడ లాడుతుండగా దిటవు పరచు కొని లేచాడు. ఎదురుగా ఉన్న వసంత ను చూసి అవ్యక్తంగా మూలిగిందా ఆవేదన పూరిత హృదయం.
ఇరువురిలో ఆవేదన -- పైకి చెప్పలేని బాధ మసలుతుంది. ఒకరి హృదయం బాధతో గూడు కట్టుకు పోయింది. మరొకరిది పశ్చాత్తాప పూరితమైన కన్నీటితో గూడు కట్టుకొని ఉంది.
కళ్ళలో మెదిలే కన్నీటితో ఆశ పొడసూపిన చూపులతో నిలబడి ఉంది వసంత. చిరునవ్వు పెదాల పైకి తెచ్చుకొన్నాడు రాజ్.
"నాకు వీడ్కోలు ఇవ్వడానికి ఎవ్వరూ లేరే అని బాధపడుతున్నాను. ఆ కొరత నువ్వు తీరుస్తున్నావు . కృతజ్ఞుడ్ని , వసూ!"
క్రుంగి పోయి ఉన్న మనసును మరింత క్ర్రుంగదీశాయి. భరించలేక భర్త పాదాలకు చుట్టుకుపోయి "నన్ను ఈ ఒక్కసారి క్షమించండి." అంది.
"నిన్ను క్షమించడానికి నాకేం హక్కు ఉంది? అదీ గాక నువ్వు ఇప్పుడెం తప్పు చేశావు?"
"చచ్చిన పామును ఇంకా చావగొట్టకండి. నా తప్పు తెలుసుకొన్నాను. ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించను."
"వసూ, ఇంతవరకూ అయినది చాలు. ఇంకా నన్ను మోసగించటానికి ప్రయత్నించ వద్దు."
"అయ్యో!" మీకెలా నచ్చ చెప్పగలను? నా మాట నమ్మండి. దగ్గరున్న జ్యోతి ని తెలుసుకోలేక గ్రుడ్డి గా వెలుగును వెతుక్కుంటూ పోయాను. నా తప్పు తెలుసుకొన్నాను. నన్ను మన్నించండి."
"ఆ నమ్మకం ఎప్పుడో పోయింది. రాలిపోయిన మొగ్గ వికసించదు. శిధిలమై పోయిన ఆలయంలో దేవుడు ఉండడు."
"ఈ ఒక్కసారికి క్షమించండి. స్త్రీకి భర్తే దైవం అని తెలుసుకొన్నాను. నన్ను అన్యాయం చెయ్యకండి."
"నేను నీకేం అన్యాయం చెయ్యడం లేదు. నీ ఆస్తి నీ పేరనే వ్రాసేశాను. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను."
వసంత బాధగా తల అడ్డంగా తిప్పింది.
"నాకవేమీ అక్కరలేదు. మీరు కావాలి."
"ఆ విషయం ఇప్పుడు తెలుసుకోన్నావా! నీ ఆటలకు అడ్డుగా పెట్టుకొనేందుకు నే నింకా అవసరమా?"
"నన్ను మన్నించండి. ఇంకెప్పుడూ ఇలా చేయను. నా బ్రతుకు బండలు చేయకండి. నా యీ ఒక్క కోరికా మన్నించండి."
"అసంభవం. వసూ! ఇక నేను నీకు భర్తగా సంఘం లో జీవించలేను."
"నన్ను మీరు భార్యగా స్వీకరించవద్దు." ఒక్క దాసిగా ఉండనివ్వండి. మీ పాదసేవ చేసే భాగ్యం కలుగ జేయండి. నా పాపాల్ని కడిగేసుకుంటాను. ఈ జీవితానికది మాత్రం ప్రసాదించండి. చాలు."
"వసూ, ఇదంతా మాని ఇంటి కెళ్ళి హాయిగా ఉండు." అన్నాడు రాజ్.
"నాకు హాయి వద్దు. మీరెక్కడుంటే నేనూ అక్కడే. నన్ను మీతో తీసు కేళ్ళండి."
"ఎందుకూ? నన్ను అక్కడ కూడా మనశ్శాంతి కి దూరం చేయ్యాలనా? అనుకొన్న వాటికి దూరమై జీవితంలో అవమానాలతో, బాధతో కుళ్ళి కుళ్ళి చచ్చిన నాకు అక్కడ గూడా ప్రశాంతి ని కలుగ జేయకూడదనా/ నేను నీకేం అపకారం చేశానని ఇలా పీదిస్తున్నావు?"
చెవులను మూసుకోంది వసంత.
"క్షమించండి. నేను మీ వద్ద ఉంటె మీకు సుఖమూ, శాంతీ లేనప్పుడు నేను మీకు కనపడను. ఎక్కడైనా మీరు సుఖంగా ఉంటె అంతే చాలు."
ఆ మాటలు విని ఆమె మొహం లోకి చూశాడు. మూర్తీభవించిన శోక మూర్తి లా ఉంది వసంత. ఇంత త్వరగా ఇంత మంచి నిర్ణయం చేసుకోగలిగింది. అలాగే దాన్ని తిరిగి కూడా మార్చుకో గలదు. ఎలాగైనా కొన్నాళ్ళయినా దూరంగా ఉండి పోవాలి. ఆ తర్వాత చూసుకోవచ్చును, అని నిశ్చయించుకిని ఎయిర్ బాగ్ చేతికి తీసుకొని ముందుకు సాగిపోయాడు రాజ్. కదిలిపోతున్న అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది వసంత.

33
సాయంకాలానికి సుగుణ కాన్పు విజయవంతంగా పూర్తీ చేసి ఇంటికి వచ్చింది రజియా. వస్తూనే బల్ల పై నున్న కవరు ఆమె దృష్టి లో పడింది. రాత్రి నుండి తను సుగుణ దగ్గరే ఉంది. ఇదిఎక్కడి నుండి వచ్చిందా అని చూసింది. నాన్నగారు మర్నాడు వస్తున్నారే అని సంతోష పడింది. సోఫాలో చేరగిల బడిన ఆమె అక్కడే ఇంకొక కవరు ఉండడం చూసి విప్పి చదువుకొని నెత్తిన పిడుగు పడినట్లు అదిరిపడి మళ్ళీ చదువుకొంది.
"రజీ,
మానవుని పాపాలకు ఒక హద్దంటూ ఉన్నట్లు నా సహనానికి కూడా ఒక హద్దు ఉంది. మానవుని పాపాలు పండినప్పుడు అనుకోని అనర్ధమే సంభవిస్తుంది. అలాగే నాలో ఒర్చుకొనే శక్తి నశించి పోయింది. విసిగిపోయాను. జీవితం అంటే విరక్తి పుట్టింది. కాని చనిపోయేంత దుర్భలుడ్ని కాదులే. ఇక ఇక్కడ ఈ బ్రతుకు గడపడం దుర్బరం అనిపించింది. అందుకే ఇక్కడ లోపించిన మనశ్శాంతి అక్కడైనా దొరుకుతుందేమో ననే ఆశతో దూర దేశాలకు వెళ్ళిపోతున్నాను. అపార్ధం చేసుకోక అర్ధం చేసుకొని జాలిపడతావనే ఆశిస్తున్నాను. మనశ్శాంతి దొరకక పోయినా ఇక్కడ పోగొట్టు కున్న గుణాలను తిరిగి సంపా దించాలనే ఆశతో పోతున్నాను. తిరిగి రాగలననే ఆశ ఇప్పట్లో లేదు. మూయబడిన నా హృదయ కవాటాలు తిరిగి అక్కడైనా తెరుచుకుంటాయనే ఆశ మిగిలింది. అది ఫలించిన నాడు తిరిగి వస్తాను. లేకుంటే లేదు. జీవించి ఉండి తిరిగి వస్తే తప్పక కలుసుకొంటాను. నీకు చెప్తే నా ప్రయత్నాన్ని కొనసాగనివ్వవనే నీకు చెప్పలేదు. క్షమించగలిగితే క్షమించు.
ఇట్లు,
నీ అని చెప్పుకోలేని
రాజ్."
