గాలి తాకిడి కి ఆగలేని వృక్షం లా ఊగిపోయింది ఆమె హృదయం. కానీ అతడి పరిస్థితి ని అర్ధం చేసుకొని నెమ్మది పొందగలిగినా రాజ్ కనిపించడనే బాధ ఆమెను అణువణువున కోత పెట్టసాగింది.
"అమ్మా, మీకోసం ఎవరో వచ్చి ఆ ప్రక్క గదిలో కూర్చొని ఉన్నారు. చాలా సేపైంది."
వంటలక్క మాటవిని ఆ ఆలోచనలు అప్పటికి కట్టి పెట్టి ప్రక్క గదిలోకి పోయింది.
"ఆశ్చర్యం! వసంత! సోఫాకు అనుకోని కూర్చొని ఉంది. తన రాజ్ ను దూరంగా తరిమి వేసిన పిశాచి, భర్తకు మనశ్శాంతి లేకుండా చేసి జీవితం నుండి పారిపోయే లాగా చేసిన రాక్షసి.
మితిలేని కోపం. ఏం చెయ్యలేని నిస్సహాయత. మరిగిపోయింది ఆమె మనసు.
వసంత కనురెప్పలు మూత పడుతుండగా మెల్లిగా "అక్కయ్యా!' అంది.
ఆ పిలుపుకు ఆశ్చర్యపోయి లొంగిపోయిన రజియా. ఆ కంఠం లోని దీనత్వానికి కరిగి పోయింది రజియా.
గబగబా ఆమె దగ్గరికి పోయింది. మత్తుగా జోగుతుంది, వసంత.
"వసంతా! ఏమైంది నీకు?' అని ఆమెను కదిపింది.
అంతవరకూ వసంత చేతిలో ఉన్న ఒక చిన్న సీసా క్రింద పడింది. విషం. అదిరిపడింది రజియా. ఆత్రుత హెచ్చి లేవబోయింది.
"వద్దక్కయ్యా! ఏం చెయ్యద్దు." అంటున్న వసంత మాటలు వినిపించు కోకుండా రజియా అక్కడే ఉన్న సిరంజి కి మందేక్కించి ఇంజెక్షన్ నిచ్చింది.
"మరేం ప్రయోజనం లేదక్కయ్యా! చాలాసేపయింది. మృత్యు వాత బడే నన్ను రక్షించు కోవాలనే నీ ఆత్రుతకు కృతజ్ఞురాలీని."
"వసంతా, నువ్వు మాట్లాడకుండా కాసేపు పడుకో."
"అక్కా అని పిలిచే అదృష్టం లేకుండా ఆఖరి సరిగా నన్ను చెల్లీ అని పిలువవా అక్కయ్యా!"
ఆమె దీనపు పలుకులు వింటున్న రజియా కు దుఃఖ మాగడం లేదు.
అనుకొన్న ఆనందాన్ని పూర్తిగా పొందలేక అనుకోని అఘాతాలకు బలై , కుమిలి కృశించి మట్టిలో కలవడానికి సిద్దమై ఉన్న జీవి. యుక్తాయుక్త విచాక్షణలు తెలియక కళ్ళు మూసుకొని తిరిగి తప్పు తెలుసుకొనే లోపల గమ్యస్థానం మాయమై పోగా అలమటించి జీవితాన్నే చాలించుకోన దలుచుకొన్న నిర్భాగ్యపు బ్రతుకు. ఐశ్వర్య గర్వం. అందమనే అహంకారం, ఆకర్షణా గర్వానికి తోడై, విజయ దుందుభి మ్రోగిస్తుండగా అర్ధం లేని పంతాలకు, ప్రతీకార వాంఛకు పోయి చెంత నున్న జీవిత సౌఖ్యాన్ని కాలదన్ని తిరిగి అందుకొనే శక్తి లేక జీవితానికే పరిసమాప్తి నిస్తున్న దౌర్భాగ్యపు జీవితం.
"చెల్లీ!"
"ఒక్కసారి నన్ను ఆలింగనం చేసుకోవూ?'
రజియా ఆపుకోలేని దుఃఖం తో వసంత ను ఆలింగనం చేసుకొని బుజ్జగించింది.
"అక్కయ్యా, అయన వెళ్ళిపోయారు. నన్ను క్షమించలేదు. నువ్వయినా నన్ను క్షమిస్తావా?"
మాట్లాడలేక తల ఊపింది రజియా.
"చాలు. ఇక నిశ్చింతగా చచ్చిపోతాను. ఒక్క కోరిక. వారు ఎప్పటికైనా తిరిగి వస్తారు. అప్పుడు వారికి నేనివ్వలేని సుఖాల్ని నువ్విస్తావు కదూ?"
"వసంతా!"
"బాధపడకక్కయ్యా! నీ దైవాన్ని నేను లాక్కోన్నాను. కానీ ఆ దైవాన్ని ఆరాధించే విధం తెలియని మూర్ఖురాలిని. నీకొక్క దానికే ఆ శక్తి ఉంది. వారు ఎప్పటికి నీ వారే'!"
"వసంతా!"
"పోనీలే, అక్కయ్యా! అదంతా ఎందుకు? నా కోరిక తీరుస్తావు కదూ?"
"అలాగే."
చిరునవ్వు నవ్వింది వసంత. ఆ నవ్వులో ప్రాణం లేదు. కాంతి లేదు. అది నవ్వు కాదు. జీవితాన్ని అపహసించడం.
"అక్కయ్య , నేను కలలో చనిపోయేప్పుడు వారు కనిపించారు. కానీ ఇప్పుడు రాలేదు కదూ? వారు రారు. నాకు తెలుసు. అందుకై నేనే పోతున్నాను. ' కళ్ళు మూసుకోంది.
శాశ్వతంగా మూతబడ్డాయా కళ్ళు.
* * * *
"రజియా , ఈ ఘోరం విన్నావా?"
"ఇప్పట్లో ఏ ఘోరాలు వినలేనన్నయ్యా!"
'అయ్యో! నే చెప్పేది వినిపించు కోవే! విమానం కూలిపోయింది."
"మా బ్రతుకులే కూలిపోయినప్పుడు ఏ విమానం కూలిపోతే మనం ఏం చేయగలం?"
"అది కాదమ్మా! రాజూ మనకిక లేడు."
నెత్తిన పిడుగు పడింది.
"ఏమిటీ? ఏమిటన్నయ్యా నువ్వనేది?"
"అదేనమ్మా! నిన్న రాజూ బయలుదేరిన విమానం నిన్న మధ్యాహ్నమే కూలిపోయింది."
"ఆ!" అవాక్కయి అచేతనంగా కూలబడింది . ప్రపంచమంతా గ్రిర్రున తిరుగుతున్నట్లయింది. తాను భూమి లోకి క్రుంగి పోతున్నట్లనిపించి కేక వేయబోయి చేతకాక అలాగే సోఫాలో స్పృహ తప్పి పడిపోయింది.
అప్పుడే స్పృహ లోకి వచ్చిన సుగుణ తన పాపాయిని చూసింది మొదట. పండు వంటి బాబును చూచి మురిసిపోయింది ఆ హృదయం. బాబును అప్పుడే ఎత్తుకోవాలనిపించింది. కానీ నర్సు వారించడం తో ఆ ప్రయత్నం మానుకొంది. ప్రక్కనే ఉన్న అమ్మను చిరునవ్వుతో చూసింది.
ఎవరి కోసమో గదంతా కలయ జూసింది. కానీ కావలసిన వ్యక్తీ కనుపించలేదు.
నేనిక్కడున్నాను అని కేర్ మని ఊరుకున్నాడు పాపాయి. గదికి ఓ మూల కిటికీ నుండి బయటికి చూస్తున్న తండ్రి కనిపించాడు.
"నాన్నా!"
పలుకలేదు. అతనికి తెలుసు ఆమె ఎందుకు పిలుస్తుందో.
"నాన్నా!"
వేనుతిరగక తప్పలేదు.
"అన్నయ్య ఏడీ?
మౌనమే మేలనిపించి అపనే చేశాడాయన.
"నాన్నా! నిన్నే, నాన్నా! అన్నయ్యకు కబురంపు. వచ్చి తన మేనల్లుడి కి ముద్దులు ప్రసాదిస్తాడు."
"సుగుణా! ఇంకెక్కడి అన్నయ్య! అంతా అయిపోయిందమ్మా! మీ అన్నయ్య పరలోకం చేరుకున్నాడు."
"నాన్నా!" గట్టిగా అరిచింది సుగుణ కోపంతో.
"నిజమే నమ్మా! ఇప్పుడే ఈ వార్త తెలిసింది."
తల్లి మాటలు విని "ఏమిటీ/ అన్నయ్య చచ్చిపోయాడా? నేను నమ్మను. నేను పోయి అన్నయ్య ను పిలుచు కొస్తాను." అని గబుక్కున లేచి శక్తి లేక నర్సు పట్టుకోనేంత లో క్రింద పడిపోయింది. కూర్చొని రేడియో వార్తలు వింటున్న ఆనంద్ ఉలిక్కిపడి గాభరాగా ఆ వార్త లోని నిజానిజాలు తెలుసుకోవాలని మేడ పై నుండి పరుగెత్తుతూ మెట్ల పై పడిపోయాడు.
వంట చేసుకొంటున్న ఇందిర నిశ్చేష్టితయై పోయింది. గరిటె చేయి పొయ్యిలో పడి కాళింది.
టెలిగ్రాం చదువుకొన్న లత తెలివి తప్పిపోతూ షాక్ తిన్నదానిలా క్రింద పడిపోయింది.
రాజ్ ఫోటో ముందు నిలబడి మెడలోని మంగళ సూత్రం కళ్ళ కద్దుకొని భక్తితో పూజిస్తున్న శారద ఫోటో గాలి తాకిడికి క్రిందపడి వ్రక్కలై పోవడం చూసి వెంటనే అర్ధం చేసుకోలేక పోయింది.
అల్లుని చావుకు ఎడ్వగలిగిన స్థితిలో ఉన్నది ఒక్క మేనత్త మాత్రమే.
* * * *
పెను తుఫాను లో చిక్కుకున్న ఓడలా ఊగిపోతుంది రజియా. నా రాజ్ చనిపోలేదు --ఘోషిస్తుంది ఆమె హృదయం. నన్ను వదిలి పోడు. నేను నమ్మను. నా రాజు బ్రతికే ఉన్నాడు. తప్పక తిరిగి వస్తాడు అదే ఆశ. అంతలోనే నిరాశ.
ఆశ చేత దడదడ లాడే హృదయం. నిరాశ తో గుండెలు పిండే బాధ. అగ్ని పర్వతాలు పగిలిపోయే వేడి. లోకాన్ని కప్పేసే చీకటి. దాన్ని పారద్రోల లేని ఆశ అనే వెలుగు కిరణం నిస్సహాయ స్థితిలో కనుమరుగైంది. అంతా చీకటి. కటిక కాళరాత్రి భయం కలిగించే సందర్భం . అసహ్యం కలిగించే బ్రతుకును ఏం చేయలేక పోతుంది, వెలుగు అస్తమించింది. చీకటి విజ్రుంభించింది. ఎన్నటికీ ఎడతెగని చీకటి. సమసి పోనీ కారు చీకటి కబళం చేందుకు ముందుకు వస్తుంది.
"రజీ."
ఆ పిలుపు విని ఉలిక్కిపడింది. ఆ పిలుపు వేయి ఏనుగుల శక్తి నిచ్చింది. ఆశలు చిగురించాయి. అంతలోనే పండిపోయాయి. చూచింది. రాజ్. కానీ అస్పష్ట ఆకారం. దూరంగా ఉండి పిలుస్తుంది. అ పెదవుల పై అదే చిరునవ్వు. రమ్మని ఆహ్వానిస్తున్నాడు. పరుగెత్తింది.
హటాత్తుగా మాయమయ్యాడు.
పిచ్చిదానిలా చుట్టూ కలియజూసింది.
అదిగో అక్కడ. అదే నవ్వు. అవే కళ్ళు. కానీ చూపులేమిటి? చేర రమ్మని పిలిచీ పరితాపం కురిపిస్తున్నాయి.
వెంట బడింది. ఎక్కడి కో పోతుంది.
తిరిగి అదృశ్య మయ్యాడు రాజ్. భయంగా చుట్టూ చూసింది.
ఎదురుగా సముద్రుడు. వెక్కిరిస్తున్నాడు. భయంకరమైన వాతావరణం లో భయం మరిచిపోయి కళ్ళు చిట్లించుకొని చూసింది.
ఇసుక లో కూర్చొని చిరునవ్వులు ఒలక బోస్తున్నాడు. ఆనందంతో అతని పై పడిపోయింది.
శరీరానికి చల్లటి ఇసుక తగిలి ఎగతాళి చేసింది. పిచ్చిగా ఎలుగెత్తి అరిచింది. ఏడిచింది. మొర వినే దిక్కు లేదు. శబ్దం చేస్తే ఎక్కడ పలుక వలసి వస్తుందోనని సముద్రుడు మౌన వ్రతం పట్టాడు.
"రజీ!"
తలఎత్తి పైకి చూసింది . ఎత్తున నిలబడి చేయెత్తి పిలుస్తున్నాడు.
"రాజ్, వచ్చెయ్యి. " అరిచింది గట్టిగా.
"నే రాలేను, రజీ!" అలాగే సముద్ర మధ్యల లోకి వెళ్ళిపోయాడు రాజ్.
"నేనే నీ దగ్గరికి వస్తాను, రాజ్."
అందుకోవాలని పరుగెత్తింది. అల ఆమెను కప్పేసింది. తిరిగి కనిపించలేదు. ఏమీ ఏరుగనట్లు సముద్రుడు హోరు మంటున్నాడు. కనుకు తీస్తున్న పక్షులు ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి తిట్టుకుంటూ తిరిగి నిద్రకు ఉపక్రమించాయి. చంద్రుడు మబ్బులలో నుండి మెల్లగా బయటకు వస్తున్నాడు. చల్లని గాలిలోకి మేఘాలు వర్షపు జల్లులను కురిపించాయి. ఎవ్వరూ కన్నీరు కర్చలేదని దయతలచి మేఘ రాజు జలజల కన్నీరు కురవగా ఏడిచాడు.
'ఛీ , అకాల వర్షమేమిటి?" అని నిద్రా భంగ మొందిన మానవులు తిట్టుక్జున్నారు. అది చూసి భయపడి మేఘరాజు ఊరకుండి పోయాడు.
రైలు దిగి ఇంటికి వచ్చారు ఖాన్ గారు. గడపలో తల కొట్టు కొంది.
"రజియా !" పిలిచారు . జవాబు లేదు.
నౌకరు ను లేపి అడిగాడు. వాడు బిక్క చూపులు చూశాడు.
ఇల్లంతా వెదికాడు. కనిపించలేదు. తనకోసం స్టేషన్ కు వచ్చిందేమో తిరిగి వస్తుందని ఎదురు చూశాడు.
తెల్లవారే వరకూ నిరీక్షించాడు. అంతులేని ఎడతెగని నీరీక్షణ. కన్న కూతురి కొరకు ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడైనా కనిపిస్తేనా? ఎప్పుడైనా తిరిగి వస్తేనా?
ఆ నిరీక్షణ అంతు లేదు. అతని ఆశకు చావు లేదు.
ఎవ్వరూ పట్టించుకోని ఆ పిచ్చి వాడి ఆవేదన ఎవరు వినాలి? అర్ధం కాని ఆ గాధ విని ఏం చేయాలి?"
అందుకే ఏదీ చేతకాని ఈ లోకానికి ఏమీ చెప్పకూడదు. దేన్నీ చూపించ కూడదు. పరి సమాప్తం లేని జీవితాలు. ఆనందం, సుఖం ఎరుగని బ్రతుకులు. అదృష్టానికి నోచుకోని దౌర్భాగ్యపు జీవులు. వారి కధ ఎన్నటికీ అంతం కాదు. కాలచక్రంలా సాగిపోతుండవలసిందే. ఆగడానికి అవకాశమూ లేదు, తీరికా లేదు. మార్చడానికి శక్తి లేదు, అధికారం అంతకన్నా లేదు.
(సమాప్తం)
