ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చుట్టూ చీకటిగా ఉంది. రాజ్ వచ్చాడేమోనని పైకి పరుగెత్తి లైటు వేసింది. కానీ ఖాళీ పడక ఫక్కున నవ్వింది. దీపం వెకిలిగా నవ్వుతుంది. గాలి గబుక్కున గదిలోకి వచ్చి భయాపేట్టింది. నిశ్శబ్దం, ఒంటరి తనం గేలి చేస్తుండగా కళ్ళు మూసుకొని ప్రక్క పై పడుకొంది.
మగత నిద్ర . ఆ నిద్రలో భయంకరమైన కలలు. కలలు కరిగిపోతే కళ్ళు తెరిస్తే తిరిగి భయం. కళ్ళు మూసుకొంటే ఆవేదన. చీకటిని చూస్తె భయం. వెలుగులో ఉండాలంటే ఏవగింపు. ఆలోచనలు మదిలో మెదిలితే జలదరింపు. మెదలకుంటే కాలం నిలిచి పోతుందనే భయం.
ఉదయం లేచి వచ్చేటప్పటికి నౌకరు ఒక కవరు చేతికిస్తూ "అమ్మా, అయ్యగారు ఇచ్చి పోయారు." అన్నాడు.
"అయ్యగారోచ్చి వెళ్ళిపోయారా! నన్నెందుకు లేపలేదు? నీకు బుద్ది ఉందా! ఫో అవతలకి." అంది పట్టరాని కోపంతో వసంత.
వాడలా వెళ్ళిపోగానే వణికే చేతులతో కవరు విప్పింది. లోపల ఉన్న ఉత్తరం క్రింద పడిపోయింది. వారి దస్తూరి కనబడుతుంది. మనసు కీడు శంకిస్తుండగా దాన్ని తీసింది.
"వసూ,
నీకు ఏం చెప్పాలో, ఎలా చెప్తే నీకర్ధ మవుతుందో నాకు తెలియడం లేదు. నువ్వు విదాకులనే కోరావు. అంటే నేను నీకు భర్తగా ఉండ తగనని కదూ? దాని బదులు నేను ఈ ప్రపంచంలో ఉండ తగనని అని ఉంటె సంతోషించేవాడిని. కుటుంబ గౌరవం ఫణంగా పెట్టి నాకు దూరం కావాలని కోర్టు కేక్కడానికి సిద్దపద్దావు. నేను దాని కోసం నీకు దూరం కాక తప్పదు. నేను నీకు అంతటి అపకారం ఏం చేశాను? ఈనాడు నా మనస్సు నిన్ను యేవో ప్రశ్నించాలని ఏమేమో చెప్పాలని పీడిస్తుంది. అందుకు ముఖా ముఖి కంటే ఈ విధంగానే తెలియజేయడం మేలనుకోన్నాను.
నువ్వు మొదటి రాత్రి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని ప్రశ్నించావు. అన్నీ తెలిసే అడిగావు. నిజమే అని ఆనాడు ధైర్యంగా చెప్పలేక పోయినా ఇప్పుడు చెపుతున్నాను. నాకిష్టం లేకపోయినా ఆరాధించిన దేవతను వదిలి నిన్ను పెళ్లి చేసుకొన్నాను. అందుకు కారణం నువ్వు ఊహించు కోగలిగింది తప్పు. నీ అందం కోసం, నీ ఆస్తి కోసం భ్రమపడి రజియాను వదులుకొని నీ పాలిటి భర్తగా దాపురించాననుకోన్నావు కదూ? చాలా పోరపడ్డావు వసూ!
బహుశా నీకు జ్ఞాపక ముందను కొంటాను. ఒకనాడు ప్రేమ బిక్ష పెట్టమని అర్ధించావు. అప్పట్లో నిరాకరించినా ఆ మరునాడే నా అంతరాత్మ అంగీకరించమని ప్రభోధించింది. నీ అహంభావంతో ఆనాడే నా దానివి కావలసిన దానివి తప్పించుకొని, ఊహించుకోకుండా నాభార్య వయ్యావు. రజియాను పోగొట్టు కొన్నానన్న బాధలో కూడా నిన్ను ప్రేమించడం నేర్చుకొన్నాను. కానీ నువ్వు ఎదుటి వారి హృదయాలను అర్ధం చేసుకొని ప్రవర్తించడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. అది నీ తప్పు కాదేమో? మనకు మానవజన్మ నిచ్చింది జంతువులా ప్రవర్తించడానికి కాదు. నాకు తెలుసు -- నీలో ఏదో ప్రతీకార వాంఛ రేగుతుందని. ఏనాటి కైనా నీ మనసు మారుతుందని ఆశించాను.
కానీ నా ఆశ నిరాశ అయింది. తిన్నదాంట్లో కారం ఎక్కువగా ఉండి నీళ్ళు త్రాగితే అవి కాస్తా ఉప్పునీరు అయితే ఆ పరిస్థతి ఊహించుకో. మొదటి రాత్రి, ఉద్యోగం లో చేరే ఉద్యోగి వలె నిబంధనలు అనుసరించవలెననే అజ్ఞ నీ నుండి వచ్చింది. అప్పటి నా పరిస్థితి తలుచుకొంటే నవ్వు వస్తుంది. అజ్ఞాపించే అధికారం ఉండీ అధికారాలకు లోబడే భర్తలు ఎవ్వరూ ఉండకూడదని దేవుణ్ణి ప్రార్దిస్తుంటాను.
నువ్వు నా మనస్సును రాయిగా మార్చేశావు . కఠిన మెరుగని నాకు కాఠిన్యాన్ని అలవరచు కొమ్మని చెప్పావు. నా సహనాన్ని నశింప చేశావు. నలుగురి లో నగుబాట్ల యి గౌరవం పోయే విధంగా ప్రవర్తించావు. అప్పటికీ ఏమూలో నాలో శక్తి ఉండి నిలబడ గలిగాను. అప్పుడే నాలో శక్తి నశించి ఉంటె ఈనాడు మనం ఈ పరిస్థితుల్లో ఉండేవారం కాము. ఇన్నాళ్ళూ నువ్వు నన్ను ఒక భర్తగా ఎంచుకున్నావో లేక ఒక సేవకుడి గా చూశావో అనే సందేహం కలుగుతుంది. కానీ నీ నుండి నేను సేవలను అందుకోలేదు. ఆశించలేదు కూడా! కనీసం భర్త పట్ల భార్య చేపే అనురాగం కాకపోయినా విధి నైనా నిర్వర్తించ లేదు. అందుకు చింత పడలేదు.
నేను విచిత్ర పరిస్థితులలో నిన్ను పెళ్లి చేసుకొని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కున్నాను. ఒక అమాయకురాలి కి అన్యాయం చేసినందుకు అది శాస్తి అని తృప్తి పడుతున్నాను. కానీ లోక నిందకూ, మానవత్వానికి కట్టుబడిన వారు ఎన్నటికీ సుఖపడలేరు అన్న మాటలకు నిదర్శనంగా నా జీవితం నిలిచిపోతుంది. స్వసుఖానికి ఆశించక పరుల తృప్తికి ఆశించిన నాడు కలిగే ఫలితమిదేనని బుద్ది చెప్పావు. ఆనాడు నిస్వార్దానికి కట్టుబడి ఉంటె ఈనాడీ దుస్థితి సంభవించి ఉండేది కాదు. పరుల సొమ్ము తిని వారికే ద్రోహం తలపెట్టి ఉంటె నా జీవితం కూడా సౌఖ్యావంతంగా గడిచి పోయి ఉండేది. అది చేతకాక నేడు ఈ విపత్కర పరిస్థితులకు లోనై భర్యను వదిలి పెట్టి పారిపోయిన అసమర్దుడ్ని అనిపించుకొంటాను. అందుకు ఇప్పుడు భయపడడం లేదు. బాధ పడను. అంతకన్నా గత్యంతరం లేదు. ఏదైనా ఉందీ అంటే అది ఆత్మహత్యే.
కానీ అది చేసుకోదలుచు కోలేదు. నీ నుదుటి కుంకుమ చెరపడానికి నా కదికారం లేదు కదూ? అది చేరిగిపోతే నీకు లోకంలో ఇప్పుడున్న స్థానం ఉండదు. నీ ఆనందం నశిస్తుంది. నీ స్వేచ్చ అరికట్ట బడుతుంది. అందుకే ఆ పని చెయ్యదలుచు కోలేదు.
మీ నాన్నగారి ఆస్థి మోసం తో గ్రహించానని అటువంటి భర్త వద్దని కోర్టు కు పోయావు కదూ? మీ నాన్నగారు ఆస్తి నాపేర వ్రాశాడని నాకన్నా ముందు నువ్వు తెలుసుకున్నావు . వసూ, నీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకక్కరలేదు. అంతా నీ పేరే వ్రాసేశాను. ఇక ఇప్పుడు నా పై పూర్తిగా కోపం పోయిందను కుంటాను. ఇక నైనా నీ మానం మర్యాద కోసం ఆ కేసు ఉపసంహరించుకొంటావను కుంటాను. లేక నీకు విడాకులు కావలసి ఉంటె అందుకు ఏర్పాటు చేశాను. మీ లాయరు గారితో సంప్రతిస్తే ఆ చిక్కు తీరిపోతుంది.
ఇక నీ స్వేచ్చనూ, స్వాతంత్యాన్నీ అరికట్టే హక్కు ఎవ్వరికీ లేదు. ఉందీ అంటే అది నీ మనస్సు. దాన్ని ఏనాడో చంపుకోన్నాను. నీ భోగ భాగ్యాలతో నీ యిష్టం వచ్చినట్లు ఉండవచ్చు. నీవు ఆనందంగా నువ్వు ఎన్నుకొన్న రెండవ భర్తతో ఉండవచ్చు. ఎవరి అభ్యంతరమూ ఉండదు. మీ క్రొత్త కాపురానికి నేను నా శుభాకాంక్షలు అందజేయ గల అర్హుడినని తోస్తే అంగీకరించు.
ఇంత కఠినంగా ఎలా మారిపొయ్యావా అని ఆలోచిస్తున్నావు కదూ? పరిస్థితులు మానవుడిని రాక్షసుడు గా మారుస్తాయి. అసలు నాతో పెళ్లి ఒక పీడకల అనుకో. భానుమూర్తి, ప్రకాశం మొదలగు వారిలా నేనూ నీ జీవితం లో ప్రవేశించి మరలి పోయానని అనుకో. అది సులభమే నీకు. నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అడుగుతావేమో? చెప్పడం మరిచాను. ఎక్కడైతే అన్ని సుఖాలూ లేవనుకొన్నా అదృష్టవశాత్తూ పొందగలిగి వాటిని దక్కించు కోలేక అవమానాల పాలయి బాధలలో మరిగి, ఏడుపుతో కృశించి పోయి, మంచితనం, సహనం, కోల్పోయానో , ఆ చోటు నుండి దూరమై పోయి వాటిని తిరిగి సంపాదించుకోగాలనే ఆశతో దూర దేశాలకు వెళ్లి పోతున్నాను. తిరిగి కనిపిస్తానని భయపడకు. జీవితంలో ఇక నీకు కనిపించదలుచు కోలేదు. మూసుకుపోయిన ఈ హృదయపు కవాటాలు ఇక ఎవ్వరి కోసం తెరుచుకోవు.
ఇట్లు,
నీ అని చెప్పుకో కూడని
రాజ్."
