Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 50


    "మరి ఆస్తి నీకు రాదు."
    "అచింత మీకేం అక్కరలేదు" అని విసురుగా ఫోను క్రింద పెట్టేసింది.
    ఆలోచించే కొద్ది తల తిరిగి పోతుంది. తాను చేసిన ఒక్కొక్క పని ఆమెను కలత బడుతున్నాయి. ఎలాగైనా వారు ఇంటికి వస్తారు. అప్పుడు ఎలాగైనా వారి కాళ్ళ పై బడి తన తప్పులకు క్షమాపణ వేడుకోవాలి. అది లేకుంటే తను చచ్చైనా పోవాలి.
    "వసంతా!"
    ఉలిక్కిపడి చూచింది.
    "నువ్వా! ఎందుకొచ్చావిక్కడికి ?" కోపంతో అంది.
    "కోపపడకు , వసంతా! జరిగిన దానికి క్షమాపణ చెప్పి పోవడానికే వచ్చాను."
    "సురేష్! నువ్వేం చెప్పక్కర లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో."
    "వెళ్లి పోవడానికే వచ్చాను. కానీ, పొయ్యే ముందు రెండు మాటలు చెప్పి పోదామను కొని వచ్చాను."
    "ఏమిటది?"
    "నే చేసిన తప్పులకు నా ఉద్యోగం ఊడింది. ఆ కోపంతో ప్రతీకారం చెయ్యాలని నీతో ఆ మాట చెప్పాను. అందుకు ఇప్పుడు చింతిస్తున్నాను."
    వసంత పలుకలేదు.
    "చేసిన తప్పులకు ఫలితాలు కనిపించేంత వరకూ చేసిన తప్పులు మనకళ్ళ కగుపించవు. నువ్వు అబలవు. అబలలకు స్వతంత్యంగా ఆలోచించే అలవాటు లేదు. నేనేదో బుద్ది తక్కువగా చెప్తే ఆలోచించకుండా నువ్వు ఇంతపని చేస్తావను కోలేదు. మీవారు దైవ స్వరూపులు. వారిని నీ ప్రవర్తన తో ఇలా బాధించడం న్యాయం కాదు. నీకు మొదటే ఈ మాట చెప్పాలను కున్నాను. కానీ నీ అందం అనుభవించాలనే కోరిక అడ్డుపడి చెప్పలేదు. నేడు నా వలన ఒక సంసారం నాశనం కావడం నే చూడలేను. నాకూ ఒక భార్య ఉంది."
    "ఆ!"
    "అవును. నాకు పెళ్లయింది. కానీ నాకు సరిపడే అందం లేదని ఆమెను పుట్టింట్లో వదిలేశాను. నేడు వారు విడాకు లివ్వడానికి సిద్దపడ్డారు. నేను నిరాదరించిన భార్యే నాకు విడాకు లిస్తున్నదంటే నా గుండెలు పిండయిపోతున్నాయి. మీవారు నిన్నెప్పుడూ నిరాదరించలేదు. పైపెచ్చు నీ ప్రవర్తనను క్షమించి, కోపాన్ని దిగమ్రింగుకొని ఉన్నారు. నువ్విప్పుడు చెయ్యబోయే పని వారు ఏనాడో చేసి ఉండవచ్చు. నేనెందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో. మనం బాధపడ్ద్దప్పుడు గానీ ఇతరుల బాధ అర్ధం చేసుకోలేక పోతాం. నేను నీకు చేయబోయిన పాపానికి ఫలితంగా నాకక్కడ కీడు జరుగ బోతూంది. అంతే కాదు. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. వాడికి అపాయంగా ఉంది రమ్మని టెలిగ్రాం వచ్చింది. అది కూడా నా పాప ఫలితమే ననుకొంటాను. నేను పోయి నా వారిని రక్షించుకోగలననే ధైర్యం ఉంది. నా భార్య నా మాట వింటుందనే నమ్మకమూ ఉంది. నేను అనుకుంటే అటు అక్కడ విడాకులు తీసుకొని ఇక్కడ నిన్ను పెళ్లి చేసుకోగలను. జీవితంలో ఒకసారి తప్పు చేసి తిరిగి అదే చేసేంత నీచం మరొకటి లేదు. నిన్ను ప్రార్ధిస్తున్నాను. నా మాట విని మీవారిని క్షమాపణ గోరి నీ జీవితాన్ని సుఖంగా మార్చుకో. అందులో గల ఆనందం నీకేక్కడా లభించదు."
    వసంత అతన్ని చూసి ఆశ్చర్య పోయింది. ఇంత దీనంగా ప్రార్దిస్తున్నాడేమిటా అనుకొంది.
    "నీకర్ధం కాదు, వసంతా! నా గుండెలలో మండే జ్వాల కన్నా నూరు రెట్లు ఎక్కువగా మీవారి హృదయం ఆహుతై పోయి ఉంటుంది. ఇప్పటికే అతని మనస్సు కఠిన పాషాణ మై పోయి ఉంటుంది. వారు నీకోసం తన బాధను దిగమ్రింగి చిరునవ్వుతో గడుపుతున్నారు. ప్రేమించిన వారి ని పెళ్లి చేసుకోలేక అగ్ని జ్వాలలు మండే హృదయంతో ఉన్న వారిని నువ్వు ఆ మంటల నార్పవలసినవి పోయి అగ్ని స్థానం లో ఉంటె ఏనాడో చచ్చిపోయి ఉండేవాణ్ణి. అతని బాధలో కనీసం వెయ్యో వంతు అర్ధం చేసుకో గలిగి ఉంటె నీ హృదయం పశ్చాత్తాపంతో వ్రక్కలై పోయి ఉండేది. నీ ప్రవర్తన తో నలుగురి లో తలెత్తుకు తిరగలేక కుమిలి పోతున్న వారు దుఃఖాన్ని ఊహించ గలిగి ఉంటె నీవు ఇక్కడే శీల వై పోయి ఉండేదానివి. నీ కన్నీరు కాలువలు కట్ట ప్రవహించి నిన్ను ఎక్కడికో దూర తీరాలకు తీసుకుపోయి ఉండేవి. భర్తను ప్రేమించలేని నీ ఆనందం, సౌఖ్యం, స్వేచ్చ ఎందుకూ కొరగావు. వీటిని ఆశించే బదులు చావే మేలు."
    "సురేష్!" బాధగా అరిచింది వసంత.
    "క్షమించు , వసంతా! ఆవేశం లో అన్నీ అనక తప్పలేదు. కానీ ఇప్పటి కైనా నీ కళ్ళు తేరు. నేనెందుకు చెపుతున్నానో , నా ఆవేదన ఏమిటో అర్ధం చేసుకో. వస్తాను.' తిరిగి చూడాకుండా వెళ్ళిపోయాడు సురేష్.
    సురేష్ మాటలు చెవుల్లో గింగురు మంటుండగా అక్కడే కూలబడింది. అశాంతి తో ఇల్లంతా తిరిగింది. ప్రతి వస్తువూ తనను వెక్కిరిస్తున్నాయి. ప్రతి అణువూ తనను అసహ్యంగా చూస్తున్నాయి.
    ఇక అక్కడ ఉండలేక కారేసుకొని భర్త కోసం అన్ని చోట్లా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. చీకటి పడింది. భర్త ఇంటికి రాకపోవడంతో ఇంట్లోకి పోవడానికి భయపడి బయట గేట్లో నిలబడింది. వీధి చివరివరకూ దృష్టి సారించి వస్తాడేమో నని ఎదురు చూస్తుంది.
    "అమ్మా, రెండు రోజుల నుండి అన్నం లేదు. ఆకలిగా ఉంది. కాస్త అన్నం పెట్టండమ్మా. ఒకప్పుడు బాగా బ్రతికిన దాన్ని. ఇప్పుడు చేసిన పాపాలకు ఈ గతి పట్టింది."
    వసంత ప్రక్కకు చూసింది.
    ఒక బిచ్చగత్తె, ఒక రోగిష్టి భర్తను లాగుడు బండిలో కూర్చోబెట్టి దీనంగా అడుగుతుంది. ఆ బిచ్చగత్తె భర్తను చూస్తె ఒళ్ళు జలదరించి పోయింది.
    "లోపలికి రా" అని వసంత లోపలికి వెళ్లి ఒక పది రూపాయల నోటు ఆ బిచ్చగత్తె కిచ్చింది.
     ఆ బిచ్చగత్తె అనుమానంగా చూసి అది చేతిలో పడడంతో ఆనందంతో పొంగిపోయింది.
    "ఈ డబ్బుతో ఏం చేస్తావు?' అంది వసంత.
    "ముందు మావారి రోగం బాగు చేయిస్తాను."
    "ఏమిటీ/ ఇచ్చిన డబ్బు ఆ రోగిష్టి వాడికి ఖర్చు పెడితే నీ కడుపుకు? అదీగాక నీ ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు."
    "నాకెందుకమ్మా, ఆ సుఖాలన్నీ! వారు బాగుంటే అంతే చాలు. వారి కడుపు నిండితే నేనూ తృప్తిగా తిన్నట్లే."
    "ఆ రోగిష్టి వాడిని వెంట బెట్టుకు తిరగడం కంటే, వాడి కోసం నువ్వు బాధపడే కంటే నీదారి నువ్వు చూసుకోకూడదు?"
    "ఎంత మాటన్నవమ్మా! భర్తను వదిలెయ్య మంటావా? భర్తను ప్రేమించలేని బ్రతుకెందుకమ్మా? భర్త విలువ తెలుసుకోలేని భార్య మనుగడే నిష్ఫలం. భర్తే దైవం. అతని పాదసేవలో అనిర్వచనీయమైన ఆనందముంది . అది అందరికీ లభ్యం కానిది. ఈ ధర్మాన్ని మానవుల మై ఉండి మనం నిర్వర్తించలేకుంటే మన ఘనత ఏమిటి? భర్త ఎటువంటి వాడైనా భర్తే. పతీపతుల సంబంధం అంత సులభంగా తెగేది కాదు. అది పవిత్రం. స్వయంగా అనుభవిస్తేనే గాని ప్రయోజనాలు తెలియవు. నీకింకా పెళ్లి కానట్లుంది. అనుభవించి చూడమ్మా నా మాటల్లో ఎంత సత్యముందో తెలుస్తుంది. నువ్వు దానం చెయ్యకున్నా సంతోషిస్తాను కానీ ఇలాంటి ఉపదేశాలు చెయ్యకు తల్లీ." అని అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది ఆబిచ్చగత్తే.
    అలాగే లోపలికి పోయి కూర్చుంది. బిచ్చగత్తె మాటలు చెవుల్లో గింగురు మంటున్నాయి.

                         *    *    *    *
    వసంత భర్త కోసం ఊరంతా వెదికింది. ఎక్కడా అగుపించలేదు. విసుగుతో వేసారి ఇంటికి వచ్చింది. ఆశ్చర్యం. ఇంట్లో నుండి సూట్ కేస్ తో బయటకు వస్తున్నాడు. ఆనందం లో అడ్డుపడి ఏడిచింది. కానీ రాజ్ హృదయం కరగలేదు. కఠినంగా శపించి వెళ్ళిపోయాడు. బ్రతుకు నిరర్ధకం దుర్భరం అనిపించి ఆత్మహత్య చేసుకోంది వసంత.
    ఆఖరి ఘడియల్లో వచ్చాడు. కన్నీటితో కనిపించి "ఇదేమిటి , వసూ" అన్నాడు.
    చిరునవ్వు నవ్వుంది వసంత.
    ఆఖరుసారిగా నైనా అతణ్ణి చూచానన్న ఆనందంతో శక్తి నంతా కూడగట్టుకొని లేచి "ఇప్పటికైనా నన్ను క్షమించరా' అని భర్త పాదాల పై పడింది.
    "వసూ" అని రాజ్ ఆమెను పక్కన జేర్చుకొన్నాడు. మనసు ఏమేమో చెప్పాలని వాపోతుండగా చెప్పే శక్తి లేక తన నిస్సహాయ స్థితికి కుమిలిపోయింది.
    "వసూ , ఇంత అన్యాయం చేయడం నీకు న్యాయమా?" పేలవంగా నవ్వింది వసంత.
    "ఉన్నన్నిన్నాళ్ళు మిమ్మల్ని వేధించాను. ఇప్పుడు అందుకు తగిన శిక్షే విధించు కొన్నాను. మీరు బాధపడకండి."
    "వసూ!"
    "ఒక్కసారి ఆప్యాయంగా ఆఖరి కోరిక కోరుతున్నాను. ప్రేమగా ఒక్కసారి ముద్దు పెట్టుకోండి."
    "వసూ" అని తన పెదవులను ఆప్యాయంగా ముద్దిడుకొన్నాడు.
    చాలు. జీవితానికా సంతృప్తి , వరమూ చాలు. తన ఆఖరి కోరికకు తనే నవ్వుకొంది. అంతకు మునుపు జీవితం పై ఆశ పోయింది. కానీ ఇప్పుడు తిరిగి ఆశ కలుగుతుంది. అర్హత లేని ఆశ. వారి కౌగిట్లో నే ప్రాణాలు విడవాలని కోరుకొని అలాగే చేసింది. తన పాపాలకు పరిహారం అదే.

                             *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS