Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 49


    శుభ సూచకమైన సన్నాయి మేళం గట్టిగా వినపడుతుంది. పచ్చటి తోరణాలు , రంగు రంగుల అలంకరణ లు. చూడ ముచ్చటగా ఉంది. ఇంటి లోపల ముత్తయిదువుల హడావుడి. పేరంటాల పిచ్చాపాటి. చిన్న పిల్లల కేరింతల ఆటలు. చాలా ఉత్సాహంగా ఉంది.
    కారు దిగి రజియా సరాసరి లోపలికి వచ్చింది. ఒక గదిలో సుగుణ ను అలంకరిస్తున్నారు. రజియాను చూసి సుగుణ ఆదరంగా వచ్చి కౌగలించుకొని "వదినా" అంది. రజియా ను సుగుణ ఇంకా వదినా అనే అంటుంది. అది విని నవ్వుకొంది రజియా. రజియా ప్రేమగా ఆమెను లేవనెత్తి చేతిలో ఉన్న పాకెట్టు ఇచ్చింది. సుగుణ ప్రేమతో దాన్ని అందుకొని ప్రక్కన పెట్టి వెనుక ఇంకా ఎవరైనా వస్తారేమోనని చూసింది.
    "ఎవరు? మీ అన్నయ్యేనా?' అడిగింది రజియా నవ్వుతూ.
    "అవును, రాలేదా?"
    "ఆఫీసులో పని ఉందట. తర్వాత వస్తానన్నాడు."
    "అవునులే. ఆయనగారికి నాకన్నా ఆఫీసు పనే ఎక్కువ."
    "నువ్వు కూడా అలా అంటే ఎలా, సుగుణా? ఎంతో ముఖ్యమైన పని లేకుంటే తన చెల్లాయి దగ్గరికి రాకుండా ఉంటాడా? ఇంకా సేపటి లో వస్తాడులే."
    "ఏమో వదినా! అన్నయ్య రాకుంటే అసలీ తతంగమంతా వ్యర్ధమే. అన్నయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం అందుకోవాలి. అదే ఆశ."
    "ఫరవాలేదులే. నీకోరిక తప్పక తీరుతుంది. త్వరగా నీ అలంకరణ కానీ."
    ముస్తాబు చేసి ముచ్చటగా కుర్చీ లో కూర్చో బెట్టి మచ్చుకు రెండు పాటలు పాడారు ముత్తయిదువలు. అందమైన అలంకరణ లో అలరారుతున్న సుగుణ ను అత్యంత ఆనందంతో చూచాడు సుగుణ భర్త. చిలిపి చూపుల మధ్య సిగ్గుముంచుకు రాగా నేలచూపులు చూసింది. ఆ సీమంతపు శుభసూచక ఘడియల్లో రాబోవు నూతన వ్యక్తీ గురించి భావాలు చెలరేగుతున్నాయి. వానాకాలపు మబ్బు లాంటి ఆ సౌందర్యాన్ని కన్నుల పండువుగా చూస్తున్నారు. వరుణ దేవుణ్ణి మించిన గర్వంతో కూర్చొని ఉన్నాడు సుగుణ భర్త. కూతురిని ఆ పరిస్థితులలో చూసి మురిసి పోతున్నారు దంపతులు. కలగబోయే మనుమడిని ముద్దాదాలనే అపేక్ష. ఏ కష్టాలు లేకుండా సుఖంగా జరిగిపోతున్న కుమార్తె సంసారం కావలసిన దాని కన్నా ఎక్కువ తృప్తి నే ఇస్తుంది.
    సుగుణ -- చిన్న మొక్కగా ఉండి ఎదిగి వృక్షమై చిగురించి ఫలదాయకం కూడా కాబోతుంది. తనకు ఏమీ లేదు. తుఫాను పాలిట బడి ఎందుకూ కొరగాని మ్రోడులా నిలిచి పోయింది. చిగురించ నోచుకోని చెట్టు -- నవ్వుకొంది రజియా. ఏమీ లేదనుకొన్న ఆమెకు అన్నీ లభించాయి. అన్నీ ఉన్నాయను కొన్న తనకు ఒక్కటీ లభించలేదు. ఏ కోరికలూ పెంచుకొని జీవితం సుఖ ప్రదం, ఫలదాయకం. అన్ని కోరికలూ పెంచుకొని జీవితాన్ని కోరుకున్నందుకు దుఃఖ మయమైన నికృష్ణ జీవితం. ఎదురు లేని దేవుడి న్యాయ పరిపాలన అన్యాయాలకు తావులేని భగవంతుడి రాజ్యం. ఇదే శాసన మైతే మానవుడిలో కోరికలు కలిగించడం కూడా తప్పే. అప్పుడు సుఖమనే మాటను ప్రతి ఒక్కరూ మరిచి పోవలసి ఉంటుంది.
    కార్యక్రమం లయిపోయింది. దిష్టి తగుల గలదని లోపలికి తీసుకు పోయారు. సుగుణ మనసు ఆరాట పడుతుంది. పెట్టుకొన్న నగలు తీసి విసురుగా ప్రక్కన పారేసింది.
    "ఏమిటి, సుగుణా , అంత విసుగుకు కారణం?
    సుగుణ జవాబు చెప్పలేదు.
    "మీ అన్నయ్య రాలేదనేనా? వస్తుంటాడు లే." ధైర్యాన్ని ఇచ్చింది రజియా.
    "ఆ. భలే వచ్చేవాడే! అయినా ఒక జిల్లా కలెక్టరు గారు ఒక సామాన్యు రాలైన చెల్లెలిని చూడటానికి ఎండుకోస్తాడు?"
    "నువ్వామాట అంటావని తెలిసి ఉంటె అసలు నేను వచ్చెవాడినే కాదు."
    "అన్నయ్యా!' యెగిరి గంతేసి వెనుదిరిగింది సుగుణ. గుమ్మంలో నిలబడి చిరునవ్వుతో చూస్తున్నాడు రాజ్.
    "రాజ్, నువ్వు రాకుంటే సరాసరి మీ ఆఫీసు కే వచ్చేసి ఉండేది మీ చెల్లెలు. చూడు, ఆ నగలేలా క్రింద పారేసిందో?"
    సుగుణ రాజ్ పాదాలకు నమస్కరించడానికి ముందుకు వచ్చింది.
    "ఊ. అలా కాదు. నగలన్నీ పెట్టుకొని."
    క్షణం లో తిరిగి అలంకరించుకోంది సుగుణ.
    చంద్రుణ్ణి దాచుకొన్న మేఘం లా నడిచి వస్తున్న సుగుణను చూసి తనకో చెల్లాయి లేదన్న బాధ మరిచిపోయాడు . ఎంతో ఉత్సాహంతో దగ్గరికి వచ్చిన సుగుణ , తీరా దగ్గరికి వచ్చాక సిగ్గుతో కుంచించుకు పోయి పైట చెరగు నిండుగా కప్పెసుకొని నమస్కరించింది.
    "నీకు నీ భర్త ఆదరాభిమానాలు ఎప్పటికి ఉండాలని ఆ భగవంతుడి ని ప్రార్ధిస్తుంటానమ్మా."
     కృతజ్ఞత తో చూసింది సుగుణ.
    "సుగుణా, ఆనాడు నీతో ఒక విషయం చెప్పాను. జ్ఞాపకం ఉందా! నీ కడుపున పుట్టి నీ ఋణాన్ని తీర్చుకోలేక పోతున్నానే అని కొరతగా ఉంది."
    "ఫో అన్నయ్యా!' సిగ్గుతో కళ్ళు చేతులతో కప్పెసుకోంది . రజియా నవ్వింది.
    సుగుణ ప్రక్కన రజియా ను పోల్చి చూశాడు. సుగుణ లో నిండైన సంతోషం. చిరునవ్వు , ఆనందం. రజియా లో అన్నీ కొరతగానే ఉన్నాయి . కారణం అదే.
    అతని మనస్సులో తన గురించే ఆలోచనలు రేగుతున్నాయని పసిగట్టింది రజియా. వలదని కళ్ళతోనే సైగ చేసింది.
    "వసంత వదినను తీసుకు రాలేదేం, అన్నయ్యా?"
    "ఆవిడ గారు కనిపించలేదు. అంతే ఈ మధ్య చాలా బిజీగా ఉందిలే." నవ్వాడు రాజ్.
    ఏడవలేక నవ్విన నవ్వు.
    "అయితే మమ్మల్ని మరిచి పోయినట్లేనా?"
    "ఆనంద్ అన్నయ్యా! గోపీ అన్నయ్యా! మీరు ఎలాగూ తప్పకుండా వస్తారని నాకు తెలుసు."
    "ఊ. ఈ మధ్య మాటలు కూడా పట్టుబడ్డాయిలే."
    "పోనీలే. పొరపాటయింది క్షమించ లేరా, అన్నయ్యా!"
    "క్షమించాం ఫో!" గర్వంగా అన్నాడు ఆనంద్. అందరూ గట్టిగా నవ్వేశారు.
    ఇంతలో ఒక నౌకరు ఒక వెండి ఉయ్యాలను పట్టుకొచ్చాడు. అది చూసి ఆశ్చర్య పోయింది సుగుణ.
    "ఇది ఎవరు తీసుకొచ్చారు?"
    "నేనే అమ్మా, చెల్లెమ్మా!" చిలిపిగా చూశాడు రాజ్.
    "నువ్వా! ఇప్పుడది ఎవరు తీసుకు రమ్మన్నారు?" కోపం చూపిస్తూ అంది సుగుణ.
    "ఎవరు తీసుకు రమ్మన్నారో చెప్పనా! నీ కడుపులో ఉన్న మా మేనల్లుడు."
    కోపమంతా ఎగిరిపోయింది.
    ఆనంద్, గోపీ తమ చేతుల్లో ఉన్న పాకెట్లు సుగుణ కిచ్చారు. భక్తిగా వాటి నందుకోంది సుగుణ.  

                   

                                   32
    బల్ల పై ఉన్న సమన్లు చూసి ఆశ్చర్య పోయాడు రాజ్. వసంత విడాకులు కోరే విషయం లో తమను కోర్టు కు హాజరు కమ్మని కోర్టు వారి పిలుపు. వణికిపోయాడు రాజ్. నమ్మనూలేక పోయాడు. ఫోన్ లో తమ లాయరు తో మాట్లాడి అది నిజమని తెలుసుకొని తల చేతులతో పట్టుకొని సోఫాలో కూలబడ్డాడు.
    అవకాశమిస్తే కబళించే భయం ఆవహించింది. ఆత్మాభిమానాన్ని చంపి అవమానాన్నిచ్చె విడాకులు. అవే కావాలని కోరుకుంటుంది  సహధర్మ చారిణి అని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్య. భయంకర రూపంతో విడాకుల కోరలతో నాలుక చాచుకొని కాటు వేయడానికి సిద్దంగా ఉంది. చనిపోయేది ఆత్మ కాదు. ఆత్మ కున్న అభిమానం, ఆదరం, ఆప్యాయత, కరుణ, ప్రేమ, దౌర్బల్యం అన్నీ చచ్చి పోతాయి. లోకంలో పరువును పోగొట్టి, మర్యాదను మంట గలిపి, గౌరవాన్ని గర్హనీయంగా మార్చి వేస్తాయి. ఆదరణ, ఆప్యాయతల బదులు క్రోధ కాఠిన్యాలు అలుముకొని, ప్రేమను పోగొట్టి ద్వేషాన్నిచ్చి , దుర్భాలత్వాన్ని పోగొట్తో దౌర్జన్యాన్ని , అభిమానాన్ని చంపి జీవితం పై నిరాశ ను, లోకం పై అసహ్యాన్ని కలిగించే పరిస్థితి ప్రాప్తమయింది. ఎదుర్కొని బ్రతుక వచ్చు. కానీ ఆ బ్రతుకు బ్రతికే కన్నా దూరంగా ఎవ్వరూ లేని చోట ఒంటరిగా గడపడం మేలు. ఆ అవమానాన్ని ఎదుర్కోవడం కన్నా చావడం మేలు.
    అడుగుల చప్పుడైంది. ఆలోచనలు కట్టి పెట్టి తలెత్తి చూశాడు. వసంత. కోపం పెచ్చు పెరిగింది. అధికారం గుర్తుకు వచ్చింది. సహనం నశించి పోయింది.
    "వసూ!' గర్జించాడు.
    ఆ గర్జనకు దద్దరిల్లిన హాలులో భయపడి వెనుదిరిగింది వసంత. రౌద్రకారం తో నిలబడి ఉన్న భర్తను చూసి నిజంగానే వణికిపోయింది .
    "ఏమిటిది?"
    చూచింది. కోర్టు వారి సమను. వణుకు మరింతగా ఎక్కువై పోగా గుండె దిటవు పరచుకొంది.
    కోపంతో రాజ్ చెయ్యి పైకెత్తాడు. మరుక్షణం లో వసంత చెంప ప్రేలిపోయేదే. కానీ ఎదురుగా ఉన్న ఫోటో చూసి ఎత్తిన చెయ్యి దించేశాడు.
    "వసూ, నేను నీకేం అపకారం చేశాను? నన్ను ఆఖరుకు కోర్టుకు కూడా ఎక్కించి పరువు తీస్తున్నావు?"
    వసంత పలుకలేదు.
    "సరే. నీ యిష్టం వచ్చినట్లు చేసుకో" అని అక్కడి నుండి బయటికి వచ్చేశాడు.
    వసంత "ఏమండీ" అని అతని వెంట పడింది. కానీ అప్పటికే దాటిపోయాడు.
    వసంత దిక్కు తోచక అక్కడే కూలబడింది.
    ఫోను తీసింది.
    "హల్లో, లాయరు గారా! నేను వసంత ను మాట్లాడుతుంట. మనం కోర్టులో పెట్టిన కేసు ఉపసంహరించు కునేటట్లు చూడండి."
    "అది కాదమ్మాయీ. తీరా ఇప్పుడు....." ఆ మాటలు ఆవైపు నుండి వినిపించెంతలో వసంత విసుగ్గా "అవేం నేను వినదలుచు కోలేదు. ఎలాగైనా సరే అది ఉపసంహరించుకుంటామని కోర్టు వారికీ తెలియ జేయండి." అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS