Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 50


    "ఈ ప్రాక్టీసెన్నాళ్ళనుంచీ?" మళ్ళీ నిలదీసి అడిగారు.
    "......"
    "ఐవాంట్ యువర్ రిప్లై."
    "ఇవాళొక్కరోజే సార్!"
    ప్రసాదం జవాబు విని కుర్రాళ్ళందరూ ఘొల్లున నవ్వేశారు. ప్రసాదం తల దించుకుంటూండగా వార్డెన్ గట్టిగా అరిచాడు - 'షటప్'-
    నవ్వులాగిపోయాయి. ఈ హెచ్చరిక తనొక్కడి కోసం చేసిందో, నవ్వుతూన్న వాళ్లందర్నీ మందలించడమో అంతు బట్టింది కాదు, ప్రసాదం కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి.
    "ఇక కన్నీరొక్కటే తక్కువ. నిజం చెప్పాలి. ఇంతవరకూ ఎక్కడున్నారు?"
    అబద్ధం చెప్పాలని లేదు. అందుచేత నిజమే చెప్పాడు.
    "సినిమా కెళ్ళాను సార్."
    గుర్నాధమొక్కడూ నవ్వేడు. వార్డెన్ ఈ మాటు 'షటప్' అనలేదు. గుర్నాధం నవ్వు ఆపి ప్రసాదాన్ని అడిగాడు.
    "మీకసలు సినిమా కెళ్ళే అలవాటుందా కలక్టరు గారూ?"
    వార్డెన్ గుర్నాధం వేపు తమాషాగా చూట్టంతో- గుర్నాధం మరింత ఉత్సాహంగా అనేశాడు.
    "ఎక్స్యూజ్మీ సార్! మా ఫ్రెండొకడు ఈ ఊరొస్తున్నాడంటే రిసీవు చేసుకునేందుకు స్టేషను కెళ్ళేనండి. ఇతను పదకొండు ప్రాంతంలో ఆ రోడ్డుమీద భయం భయంగా తిరుగుతున్నాడండి. కావలిస్తే అతన్నే అడగండి సార్."
    "నిజమేనా ప్రసాదం?" వేణు అడిగాడు.
    'నిజమే' అన్నట్టు తలూపాడు ప్రసాదం.
    "పదకొండు గంటలకి సినిమా ఏమిటి?- వార్డెన్ అనుమానంగా అడగడంతో ఈ చర్చ కేవలం సినిమా గురించే కాదని ప్రసాదం భావించాడు. బెరుగ్గా సమాధానం చెప్పాడు.
    "వెళ్లాను సార్. ఇంగ్లీషు సినిమా."
    "అయ్యబాబోయ్! ఇంగ్లీషు సినిమానే" గుర్నాధం హేళన చేశాడు.
    "డోంట్ టెల్మీ ఎనీమోర్ స్టోరీస్. మీ గదిలో టైంపీసూ, వందరూపాయల చిల్లరా మీరేమైనా తీశారా? ఆన్సర్ టూది పాయింట్. దట్సాల్." వార్డెన్ కుండ బద్దలుకొట్టాడు.
    ప్రసాదం నెత్తిమీద పిడుగు పడినట్లయింది. జవాబు చెప్పేలోగా గుర్నాధం అందుకున్నాడు.
    "అతనికి ఆ టైంపీసంటే చాలా ఇష్టంట సార్. ఈ మధ్య డబ్బవసరంలో గూడా ఇరుక్కున్నాడు సార్."
    ప్రసాదం కాళ్ల కింద భూమి రెండు చీలికలైనట్టుంది. తను ఆశించిన కలక్టరు గిరి మన్నుగొట్టుకుపోయినట్టు భావించి, బంగారు భవిష్యత్తు బూడిదపాలైందని తెలిసిన మరుక్షణం అతను కుప్పలా నేలమీదికి ఒరిగిపోయాడు. అవమానభారంతో, దూరంగా రామిరెడ్డి కళ్ళొత్తుకుంటున్నట్టు లీలగా కన్పించింది.

                                          *   *   *

    ఈ కథ జరిగిన నెలరోజుక్కాబోలు రామిరెడ్డి ప్రసాదం వాళ్ళ వూరు వెళ్ళాడు. ప్రసాదం పొలం పనులు చూచుకుంటున్నాడని తెలిసిన మరుక్షణం బాధపడ్డాడు. ప్రసాదం వాళ్ళ పాలేరు తోడురాగా పొలానికి వెళ్ళాడు రామిరెడ్డి. దార్లో పాలేరు ప్రసాదం జబ్బు గురించి వింతగా చెప్పాడు. అదోరకమైన వ్యాధిట. దానికి మందు లేదుట. రాత్రిపూట ఏవో కలవరింతలుట. పగలస్తమానం పొలంలో పిట్టల్ని తోలడం పనిట.
    రామిరెడ్డికి భయం వేసింది.
    పొలం గట్టున ఓ చెట్టు నీడ కింద అందమైన కంబళి మీద ప్రసాదం కూర్చున్నాడు. అతని భుజాన ఫ్లాస్కుంది. చేతిలో ట్రాన్సిస్టర్ రేడియో వున్నది. తనెదుట భూమ్మీదికి వొరిగిన ఆకాశపుటంచుని నిశితంగా చూస్తున్నాడు ప్రసాదం.
    రామిరెడ్డి సక్కడ వదిలి పాలేరు తప్పుకున్నాడు.
    రామిరెడ్డి ప్రసాదం దగ్గరికి వెళ్ళాడు. భుజం తట్టి పలుకరించాడు. ప్రసాదం పేలవంగా నవ్వేసి కూచోమన్నట్టు సైగ చేశాడు.
    రామిరెడ్డి కూర్చోలేడు. పొంగివస్తూన్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్నాడు.
    "నన్ను క్షమించు ప్రసాదం! నీ జీవితాన్ని పాడుచేసింది నేను. వందమందిలో ఒక యోగ్యుడు అవమానం చెందుతూంటే - చేసిన నేరాన్ని దాచుకున్న పాపిని నేను. నన్ను క్షమించు."
    ప్రసాదం ఫ్లాస్కులో వున్న కాఫీని ఇద్దరికి పంచాడు. తల ఒంచుకునే అన్నాడు.
    "పొలం పనులకి మరో కొత్త ట్రాక్టర్ని కొనబోతున్నాం."
    రామిరెడ్డి రాయిలా నించునే వున్నాడు.

                                                         *   *   *   *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS