Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 49


    "ప్లీజ్, అతని గురించి చెడు చెప్పకు నాకు. మంచేమైనా తెలిస్తే చెప్పు. విని సంతోషిస్తాను."
    "ఫ్రెండు కదూ!"
    "అంతే కాదు. జీనియస్ గూడానూ."
    "వల్లకాదు."
    "నీకతనంటే జెలసీ"
    "కాదు, నామీద అతనికి పగ"
    "పోనీలే పడుకో."
    "ఎంతసేపని ఆ టైంపీసుని గుండెలమీద పెట్టుకుంటావ్. అవతలుంచెయ్. అన్నట్టు ఇవాళ ఇంతసేపు మేలుకున్నావే?"
    "రేపట్నుంచి నేను మేలుకునే ఉంటాను వేణు."
    "నువ్వు ఏదైనా పుచ్చుకున్నావా?"
    ప్రసాదం జవాబు చెప్పలేదు. వేణు వినదలచుకోనూ లేదు. అయిదు నిమిషాల్లో నిద్రపోయాడు. అతని నిద్ర చూస్తూంటే ప్రసాదానికి ఆశ్చర్యం వేసింది. తర్వాత అనుకున్నాడు.
    'వీళ్ళందరూ అదృష్టవంతులు."
    దూరంగా ఉన్న తారురోడ్డు మీంచి లారీల రొద వినిపిస్తోంది మంద మందంగా. ప్రసాదం మస్తిష్కంలో ఆలోచనలు రంగులు పులుముకుంటున్నాయి. వేణూ దగ్గర్నుంచి వస్తున్న ఖరీదైన సెంటు వాసన ప్రసాదాన్ని మరో లోకంలోకి తీసుకుపోయింది.

                                                                  *   *   *

    ఆ మరుసటిరోజు రాత్రి పది ప్రాంతంలో గదిలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు ప్రసాదం. రూమ్మేటు వేణు ఆ వేళకి స్వర్గమనే బజార్లో మజా చేస్తుంటాడు. రామిరెడ్డి అనుభవాల వేటలో తారస్థాయి నందుకుంటూ వుంటాడు. ఒక దిక్కుతోచని ప్రసాదమనే పురుగు గది దాటడమనే చిన్న సమస్యని భూతద్దం నుంచి చూచి భయపడిపోతున్నాడిక్కడ అని అనుకున్నాడు. ఆ పైన వేదాంతిలా నవ్వుకున్నాడు.
    మరోమారు తలదువ్వుకున్నాడు. కాలరు సర్దుకున్నాడు. తలుపుకి తాళం వేసి గోడవైపు పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాడు. గోడ చేరిం తర్వాత గుండెల్లో భయం కలుక్కుమన్నది. గుండె నిబ్బరం చేసుకుని గోడెక్కాడు. కిందికి దూకుతుండగా, బైటనుంచి రామిరెడ్డి కాబోలు లోపలికి సునాయాసంగా దూకేశాడు.
    రోడ్డుమీద అడుగుపెట్టి ప్రసాదం నవ్వుకున్నాడు. ఈ రోజు తనిష్టమొచ్చినట్టు తిరిగి రేపు సాయంత్రం తను చూసిన 'రాత్రి వింతలు' రామిరెడ్డికి చెప్పి అతనిచేత బేషనిపించుకోవాలి.
    గబగబా నడిచాడు. రెండు ఫర్లాంగులు నడిచిం తర్వాత రిక్షా దొరికింది. రూపాయిన్నర బేరంతో వూళ్ళోకి వచ్చి వాలాడు. రైల్వేస్టేషన్ రోడ్డులో అనుకోకుండా గుర్నాధం తారసిల్లాడు. అతన్ని తప్పించుకు వెళ్ళాలనిపించింది కానీ, ఆ పక్షి కంట్లో పడక తప్పింది కాదు. ట్యూబ్ లైట్ క్రింద నుంచున్న గుర్నాధం తనని పసిగట్టి, పొడిగా నవ్వి, సిగరెట్టు పొగ ఆకాశం మీదికి విలాసంగా ఒదిలి పక్కనున్న ఓ శిష్య పరిమాణువుతో కులాసాగా అన్నాడు.
    "పక్షి గూడు వదిలింది. ఇవాళ ఎవడి ఖర్మో కాలిందన్న మాట. శివోహం. గూడు దాటిన కలక్టరూ! క్షేమంగా తిరిగిరా!"
    వెనక్కొచ్చి మొహంమ్మీద రెండు వాయించేద్దామనుకున్నాడు. బక్కపీనుగ చచ్చిపోతాడనుకుని, ఆ ప్రయత్నం మానుకున్నాడు ప్రసాదం. థియేటరు దగ్గర నించున్న వేళకి రెండో ఇంటర్వెల్లు మిగిసింది. టిక్కెట్టు తీసుకుని వేణూ మెచ్చుకునే ఇంగ్లీషు సినిమాకి వెళ్ళాడు.
    వేణు చెప్పినట్లు ఆ సినిమాని దేవతలు తీయవలసింది. కాకపోగా మానవమాత్రుడు చూడతగ్గది కాదు. సినిమా నిండా ముద్దులూ, వెచ్చటి కౌగిలింతలూ, వెకిలి చేష్టలూను. ఇది ప్రసాదం నోటిమాట. కానీ, అతని గుండెలోని గొంతు మాట వేరు. అది తలచుకుంటూంటే ఒళ్లు పులకరిస్తోంది. మనసుకి అలరింపు కలుగుతోంది.
    హాస్టలు వరకూ తీయటి ఊహల్నెక్కి వచ్చాడు. నెమ్మదిగా. టైం చూసుకుని భయపడి పోయాడు. మూడు దాటి పది నిమిషాలై పోయింది, ఇప్పటివరకూ సుందరమైన ఊహలకి తలతాటిస్తూ నడిచివొచ్చిన ప్రసాదానికి తన ముందున్న హాస్టలుగోడ ఆకాశమంత ఎత్తు ఎదిగినట్లనిపించింది. మళ్ళా అంతలోనే రామిరెడ్డీ, వేణూ, గుర్నాధం - వగైరాలు గుర్తురావడంతో డాబామీద పిట్టగోడంతగా కుంగిపోయింది.
    ఈల వేసుకుంటూ గోడెక్కి కళ్ళు మూసుకుని సునాయాసంగా దూకేశాడు. కిందపడ్డవాడు మరి లేవలేకపోయాడు. వెయ్యేనుగులు తలమీద తిష్టవేసుకున్నట్టనిపించింది.
    ఎదురుగా దేదీప్యమానంగా లైట్లు వెలుగుతున్నాయి. బారులు తీర్చినట్లు కుర్రాళ్ళందరూ వరండాలో నించున్నారు. వాళ్ళందరి ముందు ఓ కుర్చీలో వార్డెన్ కూర్చున్నాడు. సముద్ర ఘోషలాంటి వాళ్ళ సంభాషణ ఫలానా వస్తువు గురించి అని తెలీడం లేదు.
    తను గోడదూకిన రెండు క్షణాల్లో సాగుతున్న ఘోష ఠక్కున ఆగిపోయింది. చీమ చిటుక్కుమన్నా శబ్దమయ్యేంత నిశ్శబ్దం. అంత నిశ్శబ్దాన్ని భరించలేకపోయాడు ప్రసాదం. పైపెచ్చు - బాణాల్లాంటి వీళ్ళందరి చూపులూ తనమీద కేంద్రీకరింప బడటంతో లేచి నించోటానికి భయం వేస్తోంది. అతి కష్టం మీద లేవగలిగాడు ముందుకో అడుగు వేశాడు.
    అందరి చూపుల్లోనూ ఉత్కంఠ వెలిగిపోతోంది.
    గోడలు దూకి సినిమాలకెళ్లడమను సుగుణం వార్డెన్ కి తెలిసుంటుంది. గనకనే ఈ వేళప్పుడిలా వచ్చాడు. ఎప్పుడు గుమ్మం దాటి ఎరుగని తను సినిమా కెళ్ళిన వైనం గిట్టనివాళ్ళు ఆయన చెవినేయడంతో ప్రసన్నమైన ఆయన మొహంలో నిప్పులు మండుతున్నాయి. ఇవాళ ఇంతమందిలో, ఆయన చేత చివాట్లు తినడమనే చరిత్రాత్మకమైన సన్నివేశం కొన్ని క్షణాల్లో ప్రారంభం కాబోతుందని తెలిసిన మరుక్షణం అతని నరాలన్నీ కత్తితో కోస్తున్నట్లు బాధ కలిగింది. ఆ కొంచెం దూరమూ వెయ్యి యోజనాల వరకూ పెరిగినట్టు భ్రమ కలుగుతుంది. అడుగులు తడబడుతున్నాయి. పెదాలమీద తడి ఆరిపోతోంది.
    దూరం దగ్గరవుతున్నకొద్దీ ప్రసాదం ఒణికిపోతున్నాడు. అడుగులు లెక్కపెట్టడం ప్రారంభించాడు. సరిగ్గా ఏభై ఆరు -
    "ఐయామ్ వెరీసారీ మిస్టర్ ప్రసాదరావ్!" వార్డెన్ మెత్తాగా అన్నా, దాని వెనకనున్న కర్కశత్వం గుండెల్ని, ఆయన చూపులు తనని కాల్చేస్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS