
31
"ఒరేయ్, నీకిదేం న్యాయం కాదురా!"
"ఏమిట్రా అది?"
"శారద సుఖం కోసం లతను త్యాగం చెయ్యమని చేయ్యావట. ఆఖరకు మమ్మల్ని కూడా సుఖంగా బ్రతక నియ్యవా?"
రాజ్ మౌనం వహించాడు.
"ఈ అర్ధం లేని త్యాగాలతో మా జీవితాలను నాశనం చేసుకోమంటావు? మేమేం తప్పుచేశామని నాకీ శిక్ష?"
"గోపీ, ఇప్పుడు మించి పోయిందేముంది?"
` "అలా అడిగే కన్నా ఇక ఇప్పుడు మిగిలిందే ముంది అని అడుగు. నీ జీవితం నీ యిష్టం. కానీ మా జీవితాలతో చెలగాటలాడడం నీకు న్యాయం కాదు. అసలు నీకేం అధికార ముంది అలా ఆజ్ఞాపించడానికి?"
"గోపీ, నేను ఎవ్వరినీ ఏం చెయ్యమని ఆజ్ఞాపించ లేదు."
"ఆజ్ఞాపించలేదు కానీ సూచించావు."
'గోపీ , ఎందుకలా ఆవేశ పడతావ్? ఆవేళ నువ్వు ఏమన్నావు?"
'అంటే అదే పట్టుకొని నా సుఖాన్ని నాశనం చేయడానికి పూనుకున్నావన్న మాట."
"నేను నీ సుఖాన్ని నాశనం చేసేంత నీచుడి ననుకున్నావా?"
"కానీ ఇప్పుడు చేసిందేమిటి? శారద కోసం లతకు అన్యాయం చేయమంటావు. ఆమె గతేమిటి?"
"ఏమీ కాదు. నువ్వు భ్రమ పడుతున్నావు. శారదను పెళ్లి చేసుకొని చూడు, నీకెంత సుఖ ముంటుందో ! లతకేం? ఈనాడు కాకున్నా రేపు ఈ విషయాలు మరిచిపోయి మరొకరిని వివాహమాడి జీవితం సుఖంగా గడప గలదు. కానీ శారద కు ఆ అవకాశం అంతగా లేదు. అందుకే అ బాధ్యత నువ్వు వహిస్తావని ఆశ పడ్డాను. తన ఒక్కగా నొక్క కూతురు సుఖ పడుతోందన్న మీ మామయ్య ఆత్మ కూడా శాంతిస్తుంది. తర్వాత నీ యిష్టం."
"అది నా వల్ల కాదు. లత తిరుపతి లో అసిస్టెంట్ లెక్చరర్ గా పని చేస్తోందట. ఈ దినమే వెళ్ళుతున్నాను. నా కోరిక అంగీకరిస్తుందనే నమ్మకం తోనే పోతున్నాను. వెంట బెట్టుకోస్తాను."
* * * *
"ఇందూ, లతకు ఉద్యోగం చెయ్యవలసిన ఖర్మేం పట్టింది? సంపాదించింది చాలకనా లేక దండించే వారు లేకనా?" కోపంగా అడిగాడు రావు.
"పోనీలెండి, ఏదో సరదా పడింది."
"సరదా ఏమిటి? ఊరు గాని ఊళ్ళో ఒంటరిగా ఉద్యోగం చెయ్యడం సరదానా? అంతకయితే ఈ ఊళ్ళో వేయించ లేకపోదుమా?"
"దాని మనశ్శాంతి కోసం ఈ ఊరు విడిచి వెళ్లి కొద్ది రోజులు అక్కడ ఉండి రావడమే మంచిది లెండి."
"ఏం మంచిదో , ఏమో! బుద్ది గడ్డి తిని ఎవరినో ప్రేమించడం , పెళ్లి చేసుకోలేక త్యాగాలనే పేరుతొ విరమించు కోవడం, దానికి మనశ్శాంతి కోసం దూరంగా పారిపోవడం , చేత కాక పొతే చచ్చిపోవడం -- ఛ! ఛ మనుషులెంతగా దిగజారి పోతున్నారు!" విసుగుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు రావు.
* * * *
టెన్నిస్ రాకేట్ ఊపుకొంటూ హుషారుగా వస్తుంది వసంత.
"ఓ, మిసెస్ రాజశేఖరం గారా! నమస్తే! చాలా రోజులకు కనిపించారు."
సురేష్ వ్యంగ్య పూరితమైన పలుకులు విని "సురేష్' అంది అర్ధం కాక.
"ఆశ్చర్య పోతున్నారా! తిరిగి ఎందుకు కనిపించానా అని బాధ పడుతున్నారా? ఎలాగైనా కలెక్టరు గారి శ్రీమతి వారు. అఫ్ట్రారాల్ ఒక మునసబు గాడిని ;లెక్క పెడతారా! అదంతా పెద్ద వారైనా మీకే చెల్లుతుంది."
అర్ధం కాని బాధ. వివరించి చెప్పలేని ఎత్తి పొడుపు పలుకులు, విశేషం కనిపించని విషయం . ఆశ్చర్యపోయింది.
"ఏమిటి, సురేష్, ఆ మాటలు?"
"ఎందుకైనా సమర్ధులు. ఉద్యోగం ఊడగొట్టించి తెలియనట్లు మాట్లాడతారు?"
"సురేష్, ఏమిటి నువ్వనేది? నీ ఉద్యోగం నేను ఊడగొట్టించానా?"
"మీరు కాకపొతే మీ వారు. నీతో స్నేహం చేసినందుకు గాను మంచి ఫలితమే దక్కింది."
'సురేష్, వివరంగా చెప్పు . ఏం జరిగింది?"
"నీకు నిజంగానే తెలియదా?"
"నిజం. నా మాట నమ్ము."
"నా మీద అనుమానంతో ఎంక్వయిరీ చేసి రిపోర్టు పంపమని ప్రభుత్వం మీ వారిని కోరింది. వారు జడ్జీ గారితో సంప్రదించి ఈ పని చేశారు. నీకు స్నేహితుడి నని ఇంతటితో వదిలి పెట్టారు. లేకుంటే చేతులకు అరడండాలు కూడా పడేవి."
'అంత అన్యాయం జరిగిందా?"
"ఏం, జరిగితే ఏమిటి? మీరు మీరు ఒక్కటి."
'సురేష్!"
"నా కవమానం, అన్యాయం జరిగితే మధ్యన నీకు ఎందుకు ఈ బాధ?"
"సురేష్!"
"ఎందుకలా అన్నీ తెలియనట్లు ఆశ్చర్యపోతావు?"
"నన్నిలా నిందించటం నీకు న్యాయం కాదు."
"ఒకరిని నిందించడానికి నాకేం హక్కుంది?"
"ఇలా ఎత్తి పొడుపు మాటలనడం నీకు ధర్మమా! ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు?"
"చెయ్యమన్న పని తప్పకుండా చేస్తావా?"
"ఆ."
"అయితే మీ వారికి విడాకు లిచ్చేయ్!"
"సురేష్!"
"ఏం? చేత కాదంటావు కదూ?"
"ఆలోచించే ఈ మాటలంటూన్నావా ? నా గతి ఏం కాను?"
"నేను ఉన్నాగా? నిన్ను నేను పెళ్లి చేసుకొంటాను."
"సురేష్!"
"నమ్మలేవు కదూ?"
"ఇన్నాళ్ళూ స్నేహం చేసింది నమ్మక పోవడానికి కాదు, సురేష్. ప్రయత్నిస్తాను."
సురేష్ తృప్తిగా నిట్టూర్చాడు.
తను వారికీ విడాకులు ఇవ్వాలా? ఇచ్చి ఈ సురేష్ ను పెళ్లి చేసుకోవాలా? ఊహూ. అది సాధ్యం కాదు. కానీ ఎలా? మాటిచ్చానే? ఈ కాలంలో మాటకు విలువ లేదు. కానీ ఈ దెబ్బతో వారిని ఒక అట ఆడించవచ్చు. దానితో తానాశించిన పగ, ప్రతీకారం కూడా తీరుతాయి. విడాకులిస్తానని బెదిరిస్తే తప్పక లొంగుతాడు. అప్పుడు ఈ సురేష్ కధే వదిలేస్తే సరిపోతుంది. అలాగే చేయాలని నిశ్చయించుకుంది.
* * * *
"ప్రియమైన బావగారి పాద పద్మములకు నమస్కరించి లత.
బావా,
ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ పని చేయలేక పోతున్నాననే అని కొరతగా ఉంది. నీకు కోప మోస్తుంది కదూ-- వచ్చిన సరే చేయక తప్పదు.
మొన్నననగా గోపీ వచ్చాడు. చాలా ఆశతో, కోపంతో వచ్చాడు. పాపం అతని పరిస్థితి చూస్తె జాలి వేస్తుంది, బావా! నేను నిర్దాక్షిణ్యంగా నా నిర్ణయాన్ని చెప్పేశాను. ఎంతగా బాధపడ్డాడో! ఒక మంచి పని చేయడానికి కొందరి మనసులు నొప్పించాలిగా? కోపంతో ఏమేమో అన్నాడు. అనడం అతని విధి. పడడం మన బాధ్యత. ఆఖరకు నిందంతా నీకోచ్చిందే అని బాధపడుతున్నాను. ఏం చెప్పినా వినిపించుకోకుండా అదినమే వచ్చేశాడు. అతనికి నచ్చ చెప్పి ఒప్పించే బాధ్యత నీకే వదిలి పెడుతున్నాను.
నీకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేసినందుకు క్షమిస్తావు కదూ?
ఇక ఇక్కడి జీవితం ఒకవిధంగా బాగుంది. హాస్టల్ లో ఉండాలంటే మససోప్ప లేదు. అందుకని వేరే గది అద్దెకు తీసుకొని ఉంటున్నాను. ఇప్పుడిప్పుడే చెయ్యి కాల్చుకోవడం కూడా నేర్చుకుంటున్నాను. అందువల్ల పని ఎక్కువగా ఉంటుంది. మనసు మళ్ళకుండా ఉండడానికి ఇవన్నీ సాధనాలు. అనుకొన్నదాని కంటే ఎక్కువ ప్రశాంతంగానే ఉంటుంది మనసు. కానీ అప్పుడప్పుడు మీరంతా జ్ఞాపకాని కి వస్తే ఇక్కడి నుండి పరుగెత్గ్తి రావాలనిపిస్తుంది.
బావ ఒక ఉత్తరం వ్రాశాడు. అక్కయ్య లో మాత్రం ఏ భావం కనిపించకుండా ఉంది. కానీ ఆమె మనసులో ఎక్కువగా బాధపడుతుంటుందని అనుకొంటున్నాను.
చిత్ర విచిత్ర మనస్తత్వాలు కలిగిన విద్యార్ధులతో మెలగడం సరదాగానూ, వింతగానూ ఉంది. చదువుకున్న చదువునంతా ఇలా అందరికీ చెప్పడం ప్రతిఫలంగా డబ్బు పుచ్చుకోవడం -- ఒక విచిత్రానుభవమే. క్రొత్త క్రొత్త వ్యక్తులతో పరిచయం -- ఆ పరిచయం అభివృద్ధి చేసుకుంటే ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో నని భయంగా కూడా ఉంది. అప్రుడి వై ఉండి నువ్వు నాకు ఇంతటి కఠిన శిక్ష విదిస్తున్నావే అని తొలుత తప్పుగా అర్ధం చేసుకొన్నాను. కానీ ఇప్పుడు అందులోని నిజానిజాలు తెలుసుకొని సిగ్గుపడుతున్నాను. గర్వం కూడా నాలో ప్రవేశించింది సుమా!
వసంత అక్కయ్య కు నా నామస్కారములు తెలియ జేసేది. రజియా -- పాపం ఆమెను తలుచు కున్నపుడెల్లానా మదిలో గర్వంతో విర్రవీగి నేల రాలిపోయిన ఒక గులాబి పువ్వు మెదులుతుంది, బావా! వేరొకరు అందుకోకూడదు. అందకొన్న వారికి దక్కని అదృష్ట హీనం. గోపీ పెళ్ళికి శారద ను నా చేతులతో అలంకరించాలనే బుద్ది పుడుతుంది. అప్పుడే అంత గొప్ప దానివయ్యావా అనుకోకు. చిన్న తీరని కోరిక. అది తీరకుండా ఉంటేనే బాగుంటుంది. తీరిపోయిన నాడు దానికి విలువె లేదు. మీ ముద్దు చెల్లాయి సుగుణ కు నా ఆశీస్సులు.
ఇట్లు,
లత."
చిన్నగా నవ్వుకొన్నాడు రాజ్
* * * *
