Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 48


    మీ దగ్గర డబ్బుల్లేకపోతే మీ చొక్కాలు తాకట్టు పెట్టండి. అండర్ స్టాండ్. కమాన్ ప్రసాదం! మనం చివరి చైర్ కి పోదాం. డర్టీ క్రీచర్స్!" ప్రసాదం చేయి పట్టుకుని అవతలకి లాక్కుపోయాడు రామిరెడ్డి.    
    నల్లుల్లాగా బల్లకి అతుక్కుపోయారు మిగిలిపోయిన ఆ యిద్దరూను!
    కాఫీతాగి బైటకొచ్చేసిం తర్వాత రామిరెడ్డితో ప్రసాదం బిక్కుబిక్కుమంటూ అన్నాడు.
    "నువ్వు గనక సరిపోయింది. ఒక్కడూ నోరెత్తలేదు. అదే నేనైతే కలబడి కొట్టేవారు."
    "పోనీ ప్రసాదం! వాళ్ళతో మనకేంపనిగాని, యెలా చదువుతున్నావ్? మూణ్ణెల్లలో పరీక్షలున్నాయి మరి"
    "......."
    "బైదిబై - కాంపిటీషన్లో ఐ స్టుడ్ సెకండ్"
    "చెప్పావ్ కాదే? హార్టీ కంగ్రాచ్యులేషన్స్. బలే వాడివి. ఇంత మంచి విషయాన్ని ఇంతసేపు దాచావా? అయినా పొరపాటు నాదేలే. సెకండెవరో గూడా ఆడలేదు. ఎంతకీ నా గురించి నేను ఆలోచించుకుంటున్నాను. క్షమించు."
    "బలే. ఎంత పాఠం చదివేవోయ్ ప్రసాదం? ఇదంతా నా కోసమే."
    "అది కాదు రెడ్డీ!"
    "డోంటాక్. పొగడ్తలొద్దు. ఇవాళ సినిమా ఖర్చు నాది. వొస్తావా?"
    "సినిమానా? నయం."
    "రమ్మన్నది నరకానికి కాదుగా."
    "వార్డెన్ కళ్ళల్లో కారం కొట్టి సినిమాకెళ్ళి, మళ్ళా రావడమంటే...."
    "రోజూ మేమెళ్ళడం లేదుటయ్యా?"
    "నాకు భయం రెడ్డీ!"
    ప్రసాదం భుజం తట్టి చెప్పేడు రామిరెడ్డి.
    "హాస్టల్ గోడ ఈజీగా దూకొచ్చు. దూకిం తర్వాత మన ఆచూకీ నరమానవుడికి తెలీదు."
    "పోనీలే బాబూ! కావలిస్తే ఆదివారం మాట్నీకి వెడదాం గానీ ప్రస్తుతం నన్నొదిలేయ్."
    "ఈ చిన్ని వెంచర్ చేయలేని వాడివి, రేపొద్దున్న నువ్వు కలెక్టరెలా అవుతావోయ్?"
    ప్రశాదంలో కొట్టొచ్చినట్టు మార్పు కనిపించడంతో రామిరెడ్డి మరి మాటాడలేదు. అలా గార్డెన్ వేపు తీసుకెళ్ళి, తన అభిప్రాయాన్ని ప్రసాదంతో చెప్పుకున్నాడు.
    "చూడు ప్రసాదం! ఎ వయస్సులో కావలసిన సరదాలు ఆ వయసులో చేస్తేనే అందం. ఒప్పుకుంటావా? కనుక నువ్వూ నాలాగా తిరిగెయ్. అంటున్నాని కాదు గానీ ఇందువల్ల నీ 'యాంబిషన్స్' మట్టికొట్టుకుపోవు, నిక్షేపంగా ఐ.ఏ.ఎస్. కాగలవు. నన్నుచూడు నేనూ నీలాగానే చదువుకుంటున్నాను. అవునా? అయితే నీలాగా ఇరవైనాలుగ్గంటలూ పుస్తకాలు తిరగేయడం లేదు. అందులో సుఖమూ లేదు. నన్నడుగితే మనిషికి రిక్రియేషనుతో అవసరమెంతైనా వుంది. రోజుకింతసేపని రిలాక్సవ్వాలి. అది మంచి చేస్తుందేగాని హాని చెయ్యదు. నా మాటవిని కొంచెం పట్టించుకో. నే చెప్పినట్టు ప్రయత్నించు. జస్ట్ ట్రైఫరిట్. నువ్వలా మారగలిగిననాడు నిన్నీ జంతువులు తినలేవు. పైగా నువ్వంటే టెర్రర్ తో హడలి ఛస్తారు. అలా అని రాసివ్వగలరు. ఆలోచించు"
    ప్రసాదం ఆలోచనలో మునిగిపోయాడు.
    _రాత్రి రెండు దాటింది. గదిలో ప్రసాదం ఒక్కడూ కూర్చున్నాడు. అతను అప్పటికే రెండు సిగరెట్లు కాల్చాడు. మూడోది కూడా బలవంతం మీద వెలిగించాడు గానీ విపరీతమైన దగ్గు రావడంతో దాన్ని యాష్ ట్రేలో కుక్కి కొంచెం మంచినీళ్ళు తాగి నడుం వాల్చాడు. తలాపక్కనున్న అలారం టైం పీస్ సుతిమెత్తని శబ్దం చేస్తోంది. ఆ శబ్దంలో రామిరెడ్డి చెప్పిన ప్రతిమాటా వినిపిస్తోంది_ప్రతిధ్వని టైపులో.
    నిజమే. జీవితానిక్కావలసింది కలెక్టరు గిరొక్కటే కాదు. ఇంకా చాలా కావాలి. సుందరమైన అనుభవాలు సంపాదించుకోవాలి. తోచనప్పుడల్లా నెమరేసుకోడానికి. రామిరెడ్డి జ్ఞాని. అందుచేతనే అంత మహత్తరంగా వెలిగిపోతున్నాడు.
    అలారం మోగడంతో ఉలిక్కిపడ్డాడు ప్రసాదం. టైం పీస్ ని తీసుకుని అలారం ఆపాడు. టైంపీస్ లో కోడి, తన పిల్లల్తో ఆడుకుంటోంది. ఆ ఆట సరదాగానూ వుంది. ఆ వేళకి తలుపు తెరుచుకున్నది.
    "మే ఐ కమిన్ ప్లీజ్" వేణు సరదాగా అన్నాడు.
    "ప్లీజ్ కమిన్"
    వేణు తలుపేసి వచ్చి బట్టలు మార్చకుండానే కేంప్ కాట్ మీద వాలిపోయాడు. కాలికున్న బూట్లతో వింతైన చప్పుడు చేస్తూ అన్నాడు.
    "సినిమా బాగుంది. దేవతలు తీయవలసిన సినిమా అది. అందుచేతనే ఇంగ్లీషు సినిమాలంటే నాకంత యిష్టం."
    "ఇప్పుడు నువ్వు గోడదూకే వచ్చావా వేణూ?" కుతూహలంగా అడిగాడు ప్రసాదం.
    "ఎగ్జాక్ట్లీ! గోడదూకడమనే ఆర్టు హైస్కూల్లో వున్నప్పుడే నేర్చుకున్నాను."
    "సినిమాలో మా రామిరెడ్డి కనిపించాడా?"
    "ఆహా. అతనూ ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడు తొంభై మూడోగది పేట్రేగి పోతూండొచ్చు."
    "ఎందుకనిట?"
    "ఫూల్! తాగొచ్చాడు. గోడ దూకేప్పుడు తూలి పడబోతే నేను సాయం చేశాను. కనీసం థాంక్సయినా చెప్పలేదు."
    రామిరెడ్డి గురించి ఈ విధమైన రిపోర్టు ప్రసాదానికి నచ్చలేదు. టైంపీస్ లో వున్న కోడి సంతానంతో ఆడుకోడం ప్రారంభించాడు. మధ్యలో అడిగాడు వేణు.
    "టైంపీస్ బాగుంది కదూ?"
    "ఐ లైకిట్!"
    "శకుంతల గుర్తుకొచ్చినప్పుడల్లా టైంపీస్ ని పగలగొట్టాలనిపిస్తుంది కానీ, దాన్ని మామయ్య నాకిచ్చాడు. శకుంతలకి నేనంటే నిర్లక్ష్యమైనా, మామయ్యకి నేను ప్రాణం. మీ రామిరెడ్డి నన్ను తినేస్తున్నాడు కానీ లేకపోతే రెణ్నెళ్ల క్రితమే శకుంతల నాదయ్యేది. రామిరెడ్డి గురించి నీకేం తెలీదు గురూ! అతనా ఫస్ట్ క్లాస్ రోగ్. క్లాసులెక్కొట్టి సినిమాలకే కాదు. క్లబ్బుకెళ్ళి పేకాట ఆడతాడు. అతని చుట్టూ అప్పులు. అయినా ఇవేం తెలీనీకుండా పేట్రేగి పోతున్నాడు. అంతా షో..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS