"అద్భుతం" అన్నాడు లక్ష్మీపతి.
"వాడే మా అబ్బాయి! ఇన్నాళ్ళూ నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ రోజే చూశాను. విజయవాడ మనోరమలో వున్నాడు. గది నెంబరు నూటనాలుగు!"
"కనిపించిన వాడ్ని వదిలేసి రావడం ఏం మర్యాద చెప్పండి?"
"నేను కనిపిస్తే రెచ్చిపోయి అక్కడ్నించి కూడా పారిపోతాడు."
"అదేం పాపం?"
"పాపం కాదు! మా పాలిట అదొక శాపం! వాడికి డబ్బంటే రోత. మనిషిని మనిషిగా చూడాలేగాని అతని వెనకున్న డబ్బుతో కొలవ కూడదంటాడు. నేను కనిపిస్తే వాడికి డబ్బే కనిపిస్తుందిట. అంచేత విసుక్కుంటాడు."
"కుర్రతనం."
"ఏమితనమో? నువ్వొక పనిచేయాలి!"
"చెప్పండి."
"వాడ్ని మీ యింటికి తెచ్చుకో!"
"చిత్తం! పువ్వుల్లో పెట్టుకు తెస్తాను!"
"అక్కడతో అయిపోలేదు. వాడికేం చెప్పి ఒప్పిస్తావో నాకనవసరం. డిసెంబరు 31 అర్ధరాత్రి కల్లా వాడికి నీ కూతుర్నిచ్చి పెళ్ళి చేసేయాలి!" అన్నాడు సత్యం గంభీరంగా.
ఆ మాటకి పులకించిపోయేడు లక్ష్మీపతి. ఎంతో వినయంగా సమాధానం చెప్పేడు.
"అంతకంటేనా? ఆ వేళకి వచ్చేయండి. అక్షింతలు వేయవచ్చు!"
"నేను వస్తే కథ అడ్డం తిరగొచ్చు. అంచేత ముందువాడు మూడు ముళ్ళూ వేసేస్తే ఆ తర్వాత నేనెప్పుడైనా రావచ్చు.
"మీ యిష్ట ప్రకారమే జరిపిద్దాం!"
"విజయవాడ వెళతారా!"
"ఇప్పుడే వెళతా!"
"జాగ్రత్త! వాడో తిక్క వెధవ! నువ్వేం అడిగినా సరైన సమాధానం చస్తే చెప్పడు. అవేం పట్టించుకోవద్దు!"
"ఛీ పొమ్మన్నా సర్దుకుపోతాను!"
"అన్నా అనవచ్చు! తమరు నిశ్చితంగా ఉండండి. ఆ కల్యాణమేదో నేను చేస్తాను. మీరు చూస్తారు!" అన్నాడు లక్ష్మీపతి నిబ్బరంగా.
* * *
విజయవాడ మనోరమలో కవుంటర్...
కేలండరు కాగితం చించేడు. ఇప్పుడక్కడ డిసెంబరు 28 మెరిసింది---
లక్ష్మీపతి హోటల్ మెట్లెక్కుతున్నాడు.
104 గదిలో జాకీ ఫుల్ సూట్ లో వున్నాడు. టై సర్డుకుంటుంటే ఫోన్ మోగింది. జాకీ ఫోన్ తీసుకున్నాడు.
ఫోన్లో సత్యం గొంతు వినిపించింది---
"వస్తున్నాడు జాగ్రత్త!"
"మీరేం వర్రీ అవకండి సార్! మర్డర్లకంటే చీటింగ్ నాకు చాలా ఈజీ!"
"అనుకున్నది అనుకున్నట్లుగా జరక్కపోతే డొక్క చించుతాను!"
సత్యంగారి వార్నింగుతోపాటు పాటు గదిలో బజరు కూడా మోగింది. జాకీ హడావిడిగా అన్నాడు.
"వచ్చేశాడు సార్! నన్ను తిట్టడం మానేసి దీవించండి!" అని ఫోన్ పెట్టేసాడు.
ఆ తర్వాత సిగరెట్ ముట్టిస్తూ స్టయిల్ గా 'కమిన్' అన్నాడు.
లక్ష్మీపతి రెండు చేతులూ జోడించి మరీ వస్తున్నాడు.
జాకీ అతనివైపు ప్రశ్నార్ధకంగా చూస్తూ 'యస్' అన్నాడు--- సిగరెట్ పొగ అతని మొహమ్మీద వదులుతూ...
"నీ పేరు కృష్ణమూర్తి కదూ?"
"సారీ-అయామ్ జాకబ్! సింపుల్ గా జాకీ అని పిలిస్తే చాలు!"
లక్ష్మీపతి ఆ సమాధానం పట్టించుకోలేదు. అతనికి సత్యం గారి వార్నింగు చెవుల్లో ఇంకా వినిపిస్తూనే వుంది - 'నువ్వేం అడిగినా సరైన సమాధానం చస్తే చెప్పడు...'
"సత్యం గార్తో నిన్ను చాలాసార్లు చూసేన్నాయనా!" అన్నాడు లక్ష్మీపతి.
"హు ఈజ్ సత్యం?"
"అయ్యో! అదేమిటి నాయనా! వారిమీద నీకెంత కోపమైతే మాత్రం కన్న తండ్రిని పట్టుకుని-"
"జాకీ హీటుక్కి పోయి అన్నాడు-
"నీ ఓల్డ్ మన్-నువ్వెవరో రాంగ్ నెంబరు కొచ్చినట్టున్నావు! నాకు తండ్రిగానీ, తల్లిగానీ లేరు. అండర్ స్టాండ్!"
అప్పుడు కూడా లక్ష్మీపతి బెంగపడలేదు. అతని చెవుల్లో సత్యం గారి వార్నింగ్ యింకా రింగుమంటూనే వుంది.
"పోన్లే బాబూ-అవన్నీ నీకూ నాకూ అనవసరం! నా గురించి ఇక చెప్పుకోవాలంటే..."
అంటూ కూచోబోయాడు. జాకీ అతనివేపు చిరాగ్గా చూసేసరికి మనసు మార్చుకుని నిలబడి వుండే తన వివరాలు చెప్పడం ప్రారంభించేడు-
"బందర్లో కొంచెమో గొప్పో పేరున్న కంట్రాక్టర్ని పేరు లక్ష్మీపతి..."
31
సుబ్బారావు ఇల్లు...రాత్రి...
ఎక్కడ్నించి తెచ్చుకున్నాడో ఏమోగాని ఒక కట్ట వార్తాపత్రికలు సుబ్బారావు ముందున్నాయి.
అందులో ఇంగ్లీషు, తెలుగు-రెండు జాతులున్నాయి.
ఒక్కో పేపరూ ఆసాంతం చాలా జాగ్రత్తగా చదువుతున్నాడు.
ఆ విడ్డూరం అతని భార్య చాలా సేపట్నుంచీ చూస్తూనే వుంది.
అసలీమధ్య సుబ్బారావు వాలకం సవ్యంగా లేదు. రాత్రిళ్ళు నిద్రపోడు. పగలు ప్రశాంతంగా వుండలేడు. సెలవు పెట్టి ఇంట్లో కూచున్నాడు. ప్రతి చిన్న విషయానికీ ఉలికులికి పడుతున్నాడు. పిల్లలు జాగ్రత్తని భార్యని పలుమార్లు హెచ్చరిస్తున్నాడు.
ఏం జరిగిందో ఏమిటో అక్షరం చెప్పడంలేదు.
"చాలా పొద్దుపోయిందండీ!" అన్నదామె.
"ఫర్లేదు. నువు పడుకో!"
"అయినా-ఇంత రాత్రివేళ ఆ చదవడమేమిటి?"
"వార్తలకోసం!"
"ఏముంటాయి వార్తలు?"
"ఏవైనా వుండొచ్చు. కోటీశ్వరులు కొందరు ఖూనీ అయిపోవచ్చు."
"ఖూనీనా?"
"అవును. అంత ఆశ్చర్యపోతావే? అది కూడా వార్తే మరి! నువ్వు పడుకో!" అని పేపర్లో తల పెట్టేసేడు సుబ్బారావు.
అతని భార్య అతనివేపు వింతగా చూస్తుండిపోయింది.
* * *
లక్ష్మీపతి ఇంటిలో.
కూతురికీ, భార్యకీ లక్ష్మీపతి తన థియరీ వివరిస్తున్నాడు---
"నేను కలలుగన్న సంబంధమిది. సత్యంగార్తో వియ్య మొందడమంటే స్వర్గం చేతికి చిక్కినట్టే?
ఏమిటర్ధమవుతోందా? అబ్బాయిని మనింటికి తీసుకురావడానికి నేనెంత అవస్థపడ్డానో మీకనవసరం. అతనికి సకల మర్యాదలూ జరగాలి. అందులో ఏవైనా పొరపాటు జరిగాయో మీ ప్రాణాల్తీస్తాను జాగ్రత్త!"
