Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 50


    అని వెళ్ళబోతూ ఆగి భార్యతో అన్నాడు---

 

    "అమ్మాయితో కాఫీ పంపించు!"

 

    ఆ తర్వాత అతను తిన్నగా అబ్బాయిగారున్న గదిలోకి వెళ్లేడు-

 

    గదిలోకి వచ్చిన లక్ష్మీపతిని చూస్తూ అన్నాడు జాకీ---

 

    "మనిషిని పోలిన మనుషులుంటారు జాగర్తని మొన్నా మధ్య ఎవడో స్టేట్ మెంటిచ్చేడు."

 

    "ఇచ్చే వుంటాడు" అన్నాడు లక్ష్మీపతి.

 

    "నేనూ అదే ఇవ్వాలనుకుంటున్నాను!"

 

    "వద్దొద్దు! మీరేం ఇవ్వక్కర్లేదు!" అన్నాడు లక్ష్మీపతి ఖంగారుగా.

 

    "ఇట్సాల్ రైట్... చెప్పవలసిందేదో చెప్పడం నా డ్యూటీ!"

 

    "మీరు చెప్పిందంతా వినేసేను గనక ఇంకేం చెప్పడాలుండవను కుంటాను."

 

    ఆ ప్రకారంగా వాళ్ళ సంభాషణ యింకెంతసేపు జరిగేదో గాని అంతలో పద్మ కాఫీ తీసుకొచ్చింది.

 

    "మా అమ్మాయి పేరు పద్మ!" అన్నాడు లక్ష్మీపతి.

 

    "హల్లో..." అన్నాడు జాకీ.

 

    "కాఫీ ఇవ్వమ్మా! మనక్కావల్సినవారేలే!"

 

    పద్మ టేబిల్ మీద కాఫీ పెట్టి అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోయింది.

 

    ఆ చర్యకు లక్ష్మీపతి వర్రీ అయ్యాడు. కాఫీ వెంటనే దాచుకుని జాకీతో అన్నాడు---

 

    "చదువుకున్న పిల్లేగాని-సిగ్గెక్కువ!"

 

    "అయ్ లైకిట్!"

 

    "సంతోషం! కాఫీ పుచ్చుకోండి."

 

    జాకీ కాఫీ చప్పరించి ఆనందంగా అన్నాడు-

 

    "ఫెంటాస్టిక్!"

 

    "అమ్మాయే చేసింది! ఆ మాటకొస్తే వంట చేయడంలో ఆమెకు ఆమె సాటి!"

 

    "పేరు బాగుంది. క్వాలిఫికేషన్లు బాగున్నాయి. యూ ఆర్ లక్కీ!"

 

    "పెళ్ళి చేద్దామనుకుంటున్నాను!"

 

    "ఎవరికి?"

 

    "మా అమ్మాయికి?"

 

    "వెరీ నైస్! వరుడ్ని వెతికేరా?"

 

    "ఏమీ అనుకోనంటే చెబ్తాను."

 

    "చెప్పండి!"

 

    "విన్న తర్వాత తొందర పాటెక్కువని నన్ను తిట్టకూడదు."

 

    "అప్పుడేమంటానో ఇప్పుడొద్దు!"

 

    "మా అమ్మాయికి తగిన వరుడు మీరే!"

 

    "అదుగో! దాన్నే తొందరపాటంటారు!"

 

    "ఆ మాటనొద్దని ముందే మనవి చేసేను. మనసులో వున్న మాటేదో కక్కేసేను. ఇక మీ నిర్ణయమేమిటో వినాలని వుంది బాబూ!"

 

    "మరి నా క్వాలిఫికేషన్లు కూడా మీకు నచ్చాలిగా! నా పేరు జాకీ! తల్లితండ్రుల్లేరు. ఆస్తిపాస్తుల్లేవు"

 

    "అవన్నీ అనవసరం!" అన్నాడు లక్ష్మీపతి నిబ్బరంగా.

 

    "ఫెంటాస్టిక్ నేనెవర్నో ఏమిటో తెలుసుకోకుండానే పిల్లనిచ్చి పెళ్ళిచేస్తారా?"

 

    "చేస్తాను."

 

    "ఆ తర్వాత గొడవలేవైనా జరిగితేనో?"

 

    "జరగవని హామీ యిస్తాను."

 

    "కాగితం కలం తీసుకోండి!"

 

    "అవెందుకిప్పుడు?"

 

    "హామీ యిస్తానన్నారుగా. అదేదో అక్షరాల్లో వుండటం మంచిది."

 

    కాగితం కలం తీసుకున్నాడు లక్ష్మీపతి.

 

    "జాకీ స్టెయిల్ గా నిలబడి సిగరెట్ కాలుస్తూ డిక్టేట్ చేస్తున్నాడు-

 

    "జాకీ అనబడే జాకబ్ కి---రాయండి!"

 

    లక్ష్మీపతి జాకీ చెప్పే వాక్యాలను రాస్తున్నాడు-

 

    "నా పిల్లనిచ్చి పెళ్ళి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. అతని పుట్టుపూర్వోత్తరాలు, అతని మంచి చెడ్డలు నాకు అనవసరం. ఇది నా సమ్మతిమీద వ్రాసి యిచ్చిన పత్రం- ఆ కింద సంతకం చేయండి"

 

    లక్ష్మీపతి సంతకం కూడా చేశాడు. ఆ కాగితం జాకీ పుచ్చుకొని అన్నాడు.

 

    "కంగ్రాట్స్! మీ అల్లుడవడానికి నాకిప్పుడు ఎల్లాంటి అభ్యంతరం లేదు. ముహూర్తం ఎప్పుడు మావా?"

 

    "ఎప్పుడోనా? 31 అర్ధరాత్రి!"

 

    "దీన్నే తొందరపాటంటారు. ఓ.కె! ఓ.కె! అంటే పెళ్ళి యింకా రెండురోజులుందన్న మాట. వెరీగుడ్!" అన్నాడు జాకీ.


                                                                   32


    "ఎల్లుండే నా పెళ్ళి" అన్నది పద్మ.

 

    పిడుగులాటి ఆ వార్తకి కృష్ణమూర్తి తట్టుకోలేకపోయాడు. లేచి నించున్నాడు. నిలబడి ఒక్కోమాటా కసిగా కోపంగా వత్తి పలుకొతూ అన్నాడు.

 

    "ఏమిటీ! ఎల్లుండి...నీ పెళ్ళా?"

 

    "కూచో! ఎవరయినా చూస్తే బావుండదు! నా పెళ్ళికి తప్పకుండా రమ్మని చెప్పడానికి వచ్చాను. వస్తావుగా!" అన్నదామె కళ్ళొత్తుకుంటూ... దీనంగా...

 

    "పద్మా!" అన్నాడు కృష్ణమూర్తి ఆందోళనగా.

 

    "నువ్వు నా పెళ్ళికొస్తే... కడసారి నిన్ను చూసుకుంటాను... నా మెళ్ళో మూడుముళ్ళూ పడకముందే ప్రాణాలు విడుస్తాను... ఆ క్షణంవరకూ ఛాన్సుందిలే కృష్ణా... అప్పటికయినా నన్ను నువ్వు పెళ్లాడవచ్చు కదూ?" అన్నదామె.

 

    ఆ హోటల్లో ఒక మూలగా ఆ ఇద్దరూ కూర్చునివున్నారు. ఆమె చెప్పిందంతా విన్న కృష్ణమూర్తి ఓర్చుకోలేక పోతున్నాడు.

 

    కసికసిగా తన క్రాపుని చెరిపేసుకున్నాడు.

 

    "వరుడెవరని అడగవే! నువ్వు అడక్కపోయినా చెప్పడం నా డ్యూటీ. ఆ సత్యంగారున్నారే---వారబ్బాయి!" అన్నది పద్మ.

 

    ఆ వార్తకి కృష్ణమూర్తి గభాలున లేచి నించుని ఖంగారుగా అడిగాడు.

 

    "ఎవరూ? సత్యంగారబ్బాయా?"

 

    "అంతేమరి! నాన్న కోరిక కూడా అదేగదా! నేను కోటీశ్వరుడి కోడల్ని కావాలి!"

 

    "ఇంతకీ వాడెక్కడ?" అడిగాడు కృష్ణమూర్తి.

 

    "ఎవడు?"

 

    "వాడే! ఆ సత్యంగారబ్బాయి?"

 

    "మా ఇంట్లోనే ఉన్నాడు."

 

    "వాడి సంగతి నాకు వదిలెయ్? ఈ పెళ్ళి జరగదు. జరగనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు!"

 

    "హు---ఇంకేం ధైర్యం!"

 

    "ప్లీజ్ పద్మా! వర్రీ చేయకు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. వాడు- వాడెవడన్నావ్?"

 

    "సత్యంగారబ్బాయ్!"


                                                                 *  *  *


    బందరు పొలిమేరల్లో వున్న ఇల్లది-ఔ

 

    ఊగుడు కుర్చీలో సత్యం ఊగుతున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS