"అంతేనా?"
"నామాట విను!"
"కృష్ణా!"
కృష్ణమూర్తి ఆమెకు మరింత దగ్గిరగా వచ్చి అన్నాడు-
"మన పెళ్ళి మీ నాన్న చేయకపోయినా, మా నాన్న చేస్తాడు! మా నాన్న సంగతి నాకు బాగా తెలుసు. నా సుఖంకోసం తాను ఓడిపోయేందుక్కూడా వెనుకాడడు. నేను గెలవలేని పరిస్థితిలో ఆయన తప్పకుండా ఓడిపోతాడు. ఆయన ఓడిపోతే మన పెళ్ళికి మీ నాన్న కూడా అభ్యంతరం చెప్పడు!"
"నువ్వు చెప్పేదేమిటో నాకేమీ అర్ధం కావడంలేదు!" అన్నది పద్మ విసుగ్గా.
"ప్లీజ్ పద్మా! వివరాలడక్కు ధైర్యంగా వుండు. 31 అర్ధరాత్రి పెళ్ళి పీటలమీద కలుసుకుందాం! ఓ.కే? రా నాతో! మీయింటి దగ్గిర దిగ పెడతాను!"
అని ఆమె చెయ్యి పుచ్చుకుని కదిలేడు.
30
సత్యంగారింట్లో ... సత్యం గది...
కాళ్ళూ చేతులూ కట్టివేయబడి జాకీ నేలమీద పడివున్నాడు. అతని ముందు సత్యం సింహంలాగా నిలబడి వున్నాడు.
సత్యం చేతిలో బెల్టుంది. జాకీ వంటిమీద చొక్కా చిరిగిపోయి ఉంది. అంతమేరా వాతలు కనిపిస్తున్నాయి.
జాకీ నీరసంగా అంటున్నాడు---
"మీరెంత ఉతికినా నా కథ అంతే! అక్షరం తేడా లేకుండా చెప్పేసేను. మీరు నన్ను నమ్మాలి. సుబ్బిగాడిచ్చిన ఏభై వేలు నా దగ్గరే వున్నాయి. అవి తీసుకుని నన్నొదిలేయండి. వెళ్ళిపోతాను."
సత్యం కూడా కొంచెమో గొప్పో అలిసి వున్నాడేమో-చెయ్యి చేసుకోడం మానేసి సోఫాలో కూచుంటూ అన్నాడు---
"సో! ఇంత కిరాతం తలపెట్టింది సుబ్బారావన్న మాట!"
"సార్! వాడినేమీ అనకండి! వాడిని రెచ్చగొట్టింది నేను. యాభై వేలు దక్కుతాయన్న ఆశతో మీ పవరేమిటో తెలీక మిమ్మలిని ఈజీగా మర్డర్ చేసేద్దామనుకున్నాను. చివరికి మీరే నన్ను కైమా చేసేసేరు! ఇల్లాంటి అనుభవం నాకిదే మొదటిసారి సార్! వళ్ళు హూనమై పోయింది!" అన్నాడు జాకీ.
జాకీ మీద సత్యానికి పిసరంత జాలి కలిగింది-
"నీ వృత్తి ఇదేనా?"
"ఉద్యోగం దొరికితే ఇందులో కాలు పెట్టే వాడిని కాదు సార్. తప్పక చేరేను.
"ఆల్ రైట్! సుబ్బారావు యిచ్చిన యాభై వేలూ వుంచుకో!"
"థేంక్యూ సార్?"
"నేనింకో పాతిక వేలిస్తాను!"
వేళాకోళం చేస్తున్నాడో నిజంగానే అంటున్నాడో తెలీక "సార్" అనేసేడు జాకీ.
"నిజంగానే యిస్తాను!" అన్నాడు సత్యం.
"అమ్మో! ఇదెక్కడి న్యాయం సార్? మీ మీద హత్యా ప్రయత్నం చేసినందుకు నన్ను పోలీసుల కప్పగించాలి. లేదూ-జాలి కలిగితే పొమ్మని విడిచిపెట్టాలి. అదీ ఇదీ గాకుండా ఇంకో పాతిక వేలిస్తానంటే-నాకేమిటోగా ఉంది సార్? ఘొల్లున ఏడ్చేయాలని వుంది!"
"ఏడవకు పాతికవేలూ ఊరికే ఇవ్వను. నువ్వొక అమ్మాయిని అర్జంటుగా పెళ్ళి చేసుకోవాలి?"
"అమ్మో! పాతికవేలివ్వడంతో పాటు పెళ్ళి కూడానా సార్? వద్దు సార్! నన్ను ఏడిపించకండి సార్!"
"నోర్ముయ్! చెప్పినట్లు చెయ్యి. అంతే!"
"పాతికవేలు తీసుకోవచ్చనుకోండి... పెళ్ళి విషయమే కొంచెం ఇబ్బంది సార్! నా చరిత్ర తెలిసిన వారెవ్వరూ పిల్లనివ్వరే!"
"అదేదో నాకు వదిలెయ్! పెళ్ళిచేసుకో! అంతే!"
అది కలో నిజమో జాకీ నిర్ణయించుకోలేక పోతున్నాడు. వచ్చిన వాడ్ని వచ్చినట్టే పచ్చడి చేసి, పాతికవేలు డబ్బిస్తాను. పెళ్ళాడు అనే పెద్దమనిషిని ఏ పేరుతొ పిలవాలి?
సత్యం జాకీకి వివరాలు బోధిస్తున్నాడు...
"బందర్లో లక్ష్మీపతి అనే లోఫరొక డున్నాడు."
* * *
లక్ష్మీపతి ఇంట్లో...
నెత్తిన గుడ్డేసుకుని, నోట్లో ధర్మామీటరు పెట్టుకుని వున్నాడు లక్ష్మీపతి.
అతని వంట్లో బాగోలేదు ఇంట్లో బాగోలేదు. మనసు బాగోలేదు. మొత్తం ప్రపంచమే బాగోలేదు.
అల్లాంటి పరిస్థితిలో...
లక్ష్మీపతి ఇంటిముందు కారాగిన శబ్ధమైంది.
నోట్లోంచి ధర్మామీటరు తీసేసి గుమ్మం దగ్గిరకొచ్చి నిలబడ్డాడు లక్ష్మీపతి.
కారు దిగుతున్నవాడు సాక్షాత్తు సత్యంగారు.
సత్యాన్ని చూడగానే ఇనప్పెట్టెని చూసినంత పనైంది లక్ష్మీపతికి. ధర్మామీటరూ, నెత్తిమీద గుడ్డా తీసిపారేసి దాదాపు పరుగెత్తుతున్నట్లు వేగంగా అతనివేపు నడిచేడు 'రండి...రండి' అంటూ.
గదిలోంచి పద్మ, హాల్లోంచి అన్నపూర్ణమ్మ సత్యాన్ని చూసేరు అలిగి వెళ్ళిపోయిన మనిషి మళ్ళా ఎందుకొచ్చాడో వాళ్ళకి అర్ధంకాలేదు.
లక్ష్మీపతి సత్యాన్ని కౌగలించుకున్నాడు. అప్పుడు కూడా అతను ఒక పెద్ద భోషాణాన్ని ఫీలింగుతో పరవశిస్తున్నాడు.
ఆ విన్యాసం క్షణంసేపు సాగింది. ఆ పైన సత్యంగారిని చెయ్యిపట్టుకు లోపలికి తీసుకొస్తూ అంటున్నాడు---
"తమరు మళ్ళి నా మొహం చూడరనుకున్నాను. నే చేసిన తప్పు క్షమించేసి వచ్చినందుకు నేను ధన్యుడ్ని."
"తప్పు నీదికాదు లక్ష్మీపతి! నాది!" అన్నాడు సత్యం.
"అమ్మమ్మ! నామీద అభిమానంతో మీరంత మాటనేస్తే నేను విన్లేను!"
"నే న్నిజమే చెబ్తున్నాను. నాకే ఒక కూతురుండి, ఆ పిల్ల పెళ్ళి అల్లాంటి ఆఫ్టరాల్ గాడ్తో చేయగలనా అని అడిగేవ్! అప్పుడు సరైన సమాధానం చెప్పలేక పోయాను. ఆలోచిస్తే నువ్వు చెప్పిందే నిజం. ఆ పెళ్ళి నేనేకాదు---డబ్బున్న వాడెవడూ చేయడు. మనక్కావల్సింది అంతస్థు. ఆ సంగతి మనవరకు వస్తేగానీ తెలీదు. సో... జరిగింది మరిచిపో. ఇక జరగబోయేది ఆలోచిద్దాం" అన్నాడు సత్యం సోఫాలో కూచుంటూ.
సత్యం పక్కన ఒదిగొదిగి కూచుంటూ అన్నాడు లక్ష్మీపతి---
"నామీద దయతో వచ్చేరు. అదే పదివేలు. చెప్పండిప్పుడు! నేనేం చేయాలి?"
"నాతో వియ్యమొందాలి!" అన్నాడు సత్యం గంభీరంగా.
అంతమాట వినగానే తుళ్ళిపడ్డాడు లక్ష్మీపతి. కలలో కూడా ఊహించని మాటకి, తన అంతస్థుని పెంచేసే వరాలమూటకి. అంచేత ఆనందాన్ని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్న సమయంలో సత్యం తన జేబులోంచి జాకీ ఫోటో తీసియిస్తూ అన్నాడు---
"ఫోటో చూడు!"
చూసేందుకే ఫోటో తీసుకున్నాడు లక్ష్మీపతి. అయితే అందులో అంతటి కంటికి జాకీ బొమ్మ కనిపించడం లేదు. కరెన్సీ నోట్లు కనిపిస్తూ అతన్ని పరమానందభరితుణ్ని చేసేయి.
