"ఏం నిశ్చయించుకొన్నావు?"
"బావ ఉద్దేశ్యం అక్షరాలా పాటించదలుచుకొన్నాను."
'ఆలోచించే అంటున్నావా లేక బావ ప్రీతి కోసం ఈ నిర్ణయం చేసుకోన్నావా?"
";లేదక్కయ్యా! ఆలోచించే బావ ఈ మాట చెప్పాడు. మనం ఎంత ఆలోచించినా అంతకన్నా ఎక్కువ తెలుసుకోలేం. నిశాడంగా వివరించి చెప్పిన నిజాన్ని గురించి బావ లాంటి వ్యక్తీ చెప్పినప్పుడు దాన్ని గురించి ఆలోచించడం బుద్ది తక్కువే అవుతుంది."
"లతా!' దుఃఖం తో కూడిన ఆనందంతో చెల్లిని ఆహ్వానించింది ఇందిర.
ఆ చేతులలో వాలిపోయింది లత.
"లతా! ఈ విధి ప్రవాహానికి నువ్వు నిలబడగలవా?"
"పొరపడ్డావక్కయ్యా! బావ ఆశీర్వాదమూ, నీ ప్రేమా ఉన్నప్పుడు నేను చిరునవ్వుతో దేన్నయినా ఎదిరించగలను."
"లతా!' ఆనందంతో అరిచింది ఇందిర.
"ఎందుకక్కయ్యా అంత ఆనందం? మనం కీడు చేసినా మనకు మేలు చేసిన బావ మాట పాటించకుండా కృతజ్ఞత తెలుపలేని ఈ బ్రతుకు లెందుకు? అవీ కాక మనం చెయ్యబోయేదేం నీచమైన పని కాదు. ఒకరి జీవితాన్ని వెలిగించేది. అందుకు గర్వపడాలి. మన కడారి చూపించాడు. అందుకు అతడికి ,మనం కృతజ్ఞులం . సబబైన పని చేయడానికి మనం ఎందుకు సిగ్గు పడాలి అని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను."
* * * *
క్రొత్త సంవత్సరం, క్రొత్త కోరికలు, క్రొత్త అనుభవాలు కావాలనే అపేక్ష. మిత్రులకు క్రొత్త సంవత్సరపు శుభాకాంక్షలు. అధికారులను దర్శించు కోవడం, చిరునవ్వుతో పరస్పర కరచాలనం, శుభాకాంక్షలు అందజేసి తిరిగి పుచ్చుకోవడం -- చాలా హుషారుగా ఆనందంగా ఉంది.
వసంత ఉదయమే లేచి సురేష్ దగ్గరికి బయలుదేరింది. క్రొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలియ జేసుకొన్నారు పరస్పరం.
"క్షమించు, వసంతా! ఇవ్వాళ కాస్త పనుంది."
"ఏమిటది?"
"క్రొత్త సంవత్సరం గా? అధికారులను దర్శించు కోవాలి. మొదట జిల్లా జడ్జి గారిని, ఆ తరువాత జిల్లా కలెక్టరు గారిని " అని-- అదోలా చూశాడు సురేష్.
ఆమె ఉత్సాహమంతా చచ్చిపోయింది. ఛ, ఈ మగవారు ఎప్పుడూ ఇంతే. వెతుక్కుంటూ వస్తే నిరాశ పరచడమే నేర్చుకున్నారు -- అని కోపంగా వెనుదిరిగి ఇంటికి వచ్చేసింది.
హల్లో భర్తతో ఎవరో ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. బహుమతులకు, పూల మాలలకు తక్కువ లేదు అనుకోని విసురుగా పైకి వెళ్లి పోయింది. గదిలో కూర్చుంది. ఇంటి ముందు రంగు రంగుల కార్లు ఆగుతున్నాయి. ఎంత మందో వస్తున్నారు. వ్యాపారస్తులు, క్రింది అధికారులు అంతా తన భర్త కోసం వస్తున్నారు. గర్వంతో ఒకసారి విర్ర వీగింది. ఆమె మనసు. కిటికీ దగ్గరికి వచ్చి క్రిందికి చూసింది. హాలు నిండా వ్యక్తులే. వినయంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు తహశీల్ద్జార్లు. జిల్లా ఆఫీసర్లు వారితో నవ్వుతూ కబుర్లు చెపుతున్నారు. హోదా పెరిగింది ఆమె హృదయంలో. ఒక్కసారి భర్తతో అందరినీ పోల్చింది. ఎందులో కానీ ఎవ్వరూ గొప్పగా కనిపించలేదు. కానీ ఎందుకతన్ని తను ప్రేమించ లేకపోతుంది?
ఎవరో ఆడవారు వచ్చారు. ఏమిటది, వాళ్ళు వారినలా చూస్తున్నారు? వారి అందాన్ని త్రాగేసే కళ్ళతో చూస్తున్నారేమిటి? అయ్యయ్యో! వారికీ దిష్టి తగులదూ? అయినా వారికి సిగ్గు లేదూ? తన భర్తను అలా చూస్తారేమిటి? చిరునవ్వులు ఒలకబోస్తున్నారు. ఆకర్శించుకొని లోబరచు కోవాలనా? ఛ, ఛ, వారలాంటి వారేమీ కాదు. ఎప్పటికీ అటువంటి జాణలకు లొంగరు. మరీ అంత దగ్గరగా వచ్చి నిలువబడిందేమిటి ఆ జపాన్ సిల్కు చీరే కట్టుకున్నావిడ? మెడలో పూలదండ వేస్తుందేమిటి ఆ మైసూర్ సిల్కు చీరే కట్టుకున్న ఆ మహారాణి? తనెలా భరించడం? వెళ్లి ఆ చెంపా ఈ చెంపా వాయించేస్తే? తన భర్త పై అంత అధికారం వారికెవరి చ్చారు?
అమ్మయ్య! ఇప్పటి కైనా వెళ్ళిపోయారు. ఒక్కొక్కరే లేచి పోతున్నారు. అంతా వెళ్ళిపోయారు. వారు ఒక్కరే కూర్చుని ఆలోచిస్తున్నారు ఏమిటి? ఏమాలోచిస్తుంటారు?బహుశా తన విషయమే నెమో? అయినా తనను మనసులో నైనా తలుచు కుంటుంటారా?
ఎవరా వచ్చింది? రజియా . ఆమెను చూసి వికసించింది వారి మొహం. ఎందుకంత ప్రేమ? ఛ, ఛ , వారిని గురించి అనుకోవడం తనదే పొరపాటు. ఆమె వెంట ఎవరు? సుగుణ. సుగుణ ,మెడలో తాళి. అప్పుడ్ పెళ్ళయి పోయిందా? ఆమె చేతిలో కేకు. చిన్నపిల్లలా వారి దగ్గరకు పరుగెత్తు కొచ్చిందే! ఆమెను తన ప్రక్కనే కూర్చో బెట్టుకొన్నారేమిటి? అంత ఆప్యాయతా. ఆదరణా ఎందుకు? కేకును వారికి తినిపిస్తుంది. ఎంత సంతోషంగా తింటున్నారు వారు? గట్టిగా నవ్వుతున్నారు. వారి మాటలు తనకు వినబడడం లేదు. రహస్యలేమో?
ఆ వచ్చేదెవరు? ఆనంద్, గోపీ! ఆనంద్ ఏదో అంటున్నాడు. అందరూ నవ్వేశారు. తనకు లేదా అందులో పాలు పంచుకొనే అదృష్టం? కానీ అక్కడికి వెళితే అందరి ఎదుటా తను చిన్నదై పోతుంది.
ఓ! ఇంకేం? లతా, ఇందిరా కూడా వచ్చేశారు. బంధువులు. తనంటే వారి కేవరికీ పడదా? ఎందుకు సరిపోదు? అంతా అప్యాయంగానే మాట్లాడుతారు. కానీ, తనే ఏదో పాప బీతి వలన వారి దరి జేరలేక పోతుంది.
లత ఏమిటో అంటూ ఇల్లంతా చుట్టూ చూస్తుంది. ఎవరి కోసం? వారేదో చెపుతున్నారు. మొండిగా ఏదో పట్టుబట్టి నట్లయింది.
"అమ్మగారూ, అయ్యగారు పిలుస్తున్నారు."
"ఊ!" ఉలిక్కిపడింది వసంత.
పోవాలా, వద్దా? పోకుంటే బాగుండదు.
"మా అక్కయ్య కు క్రొత్త సంవత్సరపు శుభాకంక్షలతో మా ఈ చిన్ని కానుక." హటాత్తుగా లత వసంత ను పూల మాలతో అలంకరించింది.
అంతా చప్పట్లు చరిచారు.
వసంత ఆనందంతో పొంగిపోయింది. తను ఎంత చెడ్డదయినా తనను గౌరవిస్తున్నారు. ఎందుకు? వారి లాంటి భర్త ఉన్నందుకే! మరి తను ఈ ఆనందాన్ని పోగొట్టుకొని ఎందుకో ప్రాకులాడుతుంది.
కబుర్ల తో , కాఫీలతో కాలం గడిచిపోయింది. భోజనానికి వారిని అక్కడే ఉండి పొమ్మన్నాడు రాజ్. ఆ దినమంతా తమాషాగా ఆటలతో, నవ్వులతో గడిచి పోయింది.
సాయంకాలం అందంగా అలంకరించుకొని ఎదురుగా నిలబడి ఉన్న వసంత ను చూసి "ఏమిటి , వసూ, ఏం కావాలి?' అనడిగాడు రాజ్.
"మరి అలా షికారు కు వస్తారా?' తల వంచుకొని అడిగింది.
ఆశ్చర్యపదకుండా ఉండలేక పోయాడు . ఎన్నడూ లేనిది ఈనాడు ఈవిడకు తన అవసరం వచ్చిందా? కొంపతీసి ఎగతాళి పట్టించడానికి ఇదో ఎత్తు కాదు గదా?
"ఏమంటారు?"
"తప్పకుండా పద." అన్నాడు.
పొంగిపోయింది వసంత. అతను తన ప్రక్కనుంటే గర్వంగా ఉంది. అందరి చూపులూ తమ పైనే. ఎందుకో వారికా అసూయ? అప్పుడే పిచ్చాసుపత్రినుండి వచ్చిన వాళ్ళ వలె కళ్ళప్పగించి చూస్తున్నారు. తొలిసారిగా సిగ్గు అవహిస్తుందే -- ఇదేమిటి? వారిదెం పట్టించుకున్నట్లే లేదే?
కబుర్లు చెబుతున్నాడు రాజు. తను గుంటూరు లో ఉండగా ఎలా గడిచింది, ఎవరెవరితో పరిచయం జరిగింది అంతా వివరంగా చెప్తూ అప్పుడప్పుడు నవ్విస్తున్నాడు వసంత ను.
"మరి , వసూ , అక్కడొక తమాషా జరిగింది. తెలుసా?"
"ఏమిటండీ?" ముద్దుగా అడిగింది వసంత.
"ఎవరో ఒక పొగాకు వ్యాపారస్తుడితో తహశీల్దారు పరిచయం చేశాడు. అతడు కోటీశ్వరుడు. నన్ను చూడగానే విడిచి పెట్టకుండా వెంట పడ్డాడు. ఆ మహానుభావుడి కి ఒక కూతురుందట. నన్ను పెళ్ళయిందా అని అడిగాడు. అయింది అన్నాను నేను. అయితే మరి మీ శ్రీమతి రాలేదేం అని అడిగాడు. నేనేం జవాబు చెప్పక పోయేంతలో నాకు పెళ్లి కాలేదనుకొని ఒకరోజు మా యింటికి రండి అని పోరు పెట్టాడు. ఆ పోరు పడలేక ఒకసారి వెళ్లాను. అప్పుడు వాళ్ళమ్మాయి చేత కాఫీ తెప్పించాడు. నేను పెళ్లి చూపులకు వచ్చానని చెప్పాడట. అమ్మాయి బాగుందండీ అనడిగాడు. నేను తల ఊపాను. ఒకసారి ఎవరో వచ్చి అదృష్టవంతులు సార్ అన్నారు. అర్ధం కాక అదేమిటి అన్నాను. ఆ కోటీశ్వరుడి కి అల్లుడు కాబోతున్నారటగా అన్నాడు. హతోస్మీ, ఇదెక్కడి దౌర్జన్యం అనుకొన్నాను. ఇదేమిటండీ అని అడిగితె మీరేం చింత పడకండి , నా ఆస్తంతా అమ్మాయి పేర వ్రాసేస్తాను అన్నాడు. ఆ మర్నాడే టెలిగ్రాం రావడంతో వచ్చేశాను. లేకుంటే ఇంకా ఏం జరిగి ఉండేదో! అక్కడేమో అయన నేను మోసం చేశానని ప్రచారం చేశాడు."
"పోనీ, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేక పోయ్యారా?"
"నువ్వు నాకు విడాకులిచ్చినప్పుడు అలాగే చేసుకొంటాలే.' కొంటెగా జవాబిచ్చాడు రాజ్.
"పొండి" అంది వసంత సిగ్గుతో.
ఇంతలో ఎవరో ఆహ్హ హ్హ హ్హ అని గట్టిగా నవ్వుతున్నట్ల నిపించి అటు చూశారు. ఎవరో ఒక యువకుడు ఇసుకను చేతిలో పట్టుకొని నవ్వుతున్నాడు.
అక్కడున్న వారంతా అతన్ని తెల్లబోయి చూస్తున్నారు. ఆ యువకుడు గట్టిగా 'ఆడదాన్ని నమ్మకండి. అది రాక్షసి. మిమ్మల్ని చంపేస్తుంది." అని ఆరుస్తున్నాడు. అది చూసి ఆడవారు జడుసుకున్నారు.
అతడలాగే ఒక జంట దగ్గరికి పోయి "నా మాట విను. నీ భార్యను సముద్రంలోకి పారెయ్యి. లేకుంటే ఒకనాడు నువ్వే దాంట్లో పడిపోవలసి వస్తుంది." అన్నాడు. ఆ మాటలు వింటున్న యువతి తన భర్తను గట్టిగా పట్టుకొంది. అది చూసి మరింతగా నవ్వాడా పిచ్చివాడు. "ఊ. నా మాట ఎవ్వరూ నమ్మరు కదూ? ఆఖరకు మీరంతా చచ్చిపోతారు. పిచ్చివాళ్ళయి పోతారు. మీరు మనుషులు కారు. యంత్రాలు, ఆడవాళ్లు నడిపించే మర యంత్రాలు. నేనొక్కడ్నే స్వతంత్రుడ్ని" అని అక్కడి నుండి పరుగెత్తుకు వచ్చాడు.
వసంతను చూసి ఆగిపోయాడు.
"ఊ! నువ్వు అసలు రాక్షసివి. మనుషుల్ని హింసించి చంపుకు తినే అసలు భూతానివి. నిన్ను బ్రతకనియ్య కూడదు. చంపేస్తాను." అని చేతులు ముందుకు చాచాడు.
వసంత గడగడ వణికి పోయింది.
రాజ్ అతని మొహం లోకి చూశాడు. ఏదో గుర్తుకు వచ్చింది. మౌనంగా అతని రెండు చేతులకు తన చేతిని అడ్డం పెట్టాడు. ఆ పిచ్చివాడు రాజ్ ను చూసి మరోసారి గట్టిగా నవ్వి, "నువ్వు -- నువ్వు దానికి ప్రియుడివి కదూ! నా మాట విని దీన్ని చంపెయ్యి. లేకుంటే నువ్వు పిచ్చి వాడి వై పోతావు. వాళ్ళంతా నీ పైన రాళ్ళు వేస్తారు. నువ్వు పిచ్చి వాడివై పోతావు. పిచ్చి వాడి వై పోతావ్" అని అక్కడి నుండి ముందుకు పరుగెత్తి పోయాడు.
అలా పరుగెత్తి పోతున్న అతన్ని భయంగా చూసింది వసంత. జాలిగా చూశాడు రాజ్.
ప్రేమకు నిర్వచనమే పిచ్చి. ప్రేమకు మొదటి దశా పిచ్చి. అంత్య దశ కూడా పిచ్చే. భగ్న ప్రేమికులకు మిగిలేది అదే. ఆశించినది పొందలేనప్పుడు కలిగే మతి భ్రమణం. ఒకవేళ అది పొందవలెనన్నా దాని పైన పిచ్చే ఆ కోరిక రేకెత్తిస్తుంది. ప్రేమకు యువ జీవితమే నాంది. అదొక పిచ్చి లోకం కాబట్టే యౌవనమంతా పిచ్చి జీవితం. అసలు జీవితమే ఒక పిచ్చిగా సాగిపోతుంది. శరీరానికి బలాన్నిచ్చేవి పాలే అయినా వాటిలో నీళ్ళు కలవందే పనికి రావు అన్నట్లు విజ్ఞానాన్ని అలవరచు కొంటున్నామంటూ చదువు కొంటూనే , జీవితంలోకి అప్పుడప్పుడే అడుగు పెడుతున్న యౌవన ప్రాంగణానికి ఈ ప్రేమే లేకుంటే రాణించదాని ప్రతి వారి జీవితం లోకి ఏదో ఒక విధంగా ప్రవేశించే ఈ ప్రేమ మహత్యం చాలా గొప్పది. చిన్నప్పుడు చదువు కొంటూ ఇంగ్లీషు పదాల కర్ధం వ్రాసుకొని తెలుసు కొంటేనే గాని పాఠాలు అర్ధం కావన్నట్లు యౌవన జీవితంలో, జీవితాన్ని అర్ధం చేసుకోబోయే ముందు తమ హృదయాలపై ఈ ప్రేమను వ్రాసుకుంటేనే కానీ ముందు ముందు సుఖం లేదనే తత్వం గల వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దానికి అర్ధం తెలుసుకొని నేర్చుకోగలిగి నప్పుడు దానినే చులకన చేయడం సహజం.
"అతనెవరో గుర్తుందా, వసూ?"
ఆ ప్రశ్న వేయడం లో గల ఉద్దేశ్యం గ్రహించాలని చూసింది. కానీ అర్ధం కాలేదు. నిశ్చలత ప్రతిబింబిస్తుంది.
అతణ్ణి గుర్తు పట్టక పోవడమేమిటి? అతడు భాస్కర్ . తనను పెళ్లి చేసుకుంటానని ఏమేమో అన్నాడు. తను నిరాకరించింది. ఆఖరి రోజు తనను మళ్ళీ అడిగాడు. తను చీదరించు కొంది. కోపంతో నోటికి వచ్చినట్లు అని ఇందరి సుఖం హరించిన నీకు ఎక్కడా సుఖం ఉండదు అని శపించి మరీ పొయ్యాడు.
వారి శాపాలేమో తనను ఇప్పుడు ఇలా చుట్టూ ముట్టి హింసిస్తున్నాయి, నిట్టూర్చింది వసంత.
