సుబ్బారావుమీద జాకీకి మండుకొచ్చింది-
"నోరు ముయ్యి! మూసేయ్ నోర్!" అన్నాడు జాకీ.
"నోరు మూసుకున్నా అంతరాత్మ ఊరుకోదురా! అది మీటింగులు పెడుతుంది" అన్నాడు సుబ్బారావు.
"అంతరాత్మని అవతల పెట్టు. అది వున్నవాడెవడూ బాగుపడడు. అట్లా అని రాసిస్తా! నాకేసే తీసుకో! అంతరాత్మని ఆర్పేసి ఆరేళ్ళయింది. ఇప్పుడు హాయిగా బతుకుతున్నాను! మీలాగా ఉద్యోగాలు చేయకుండానే ఊళ్లేలుతున్నాను. హవ్? చేదెబ్బ దానికి తిరుగులేదు. నా చెయ్యే నాకింత ఫుడ్డు పెడుతుంది అందుచేతనే చెప్పేది విను. అడిగినంత డబ్బు వాడు ఎందుకిచ్చేడో నీ కనవసరం! ఖర్చయింది పోగా మిగిలిన దాన్తో ఖుషీగా బతుకు దట్సాల్!"
"అమ్మో! మాట తప్పితే సత్యంగారు నాగుడ్లు పికేస్తారు!"
"అసలా సత్యమే లేకుండా పోతేనో?"
"అదెట్లా?"
"పాతిక వేలుంటే చూడు. వాడి పీడ విరగడవుతుంది!"
"ఆపని చేస్తే ఏభై వేలిస్తాను!"
"అదీ మాట! ఆ డబ్బు నా మొహానకొట్టు! వాడు బతికుంటే ఒట్టు! రెండ్రోజుల్లో లేపేస్తాను! ఓకె! ... బిక్కమొహం పెట్టమాకు. చెయ్యి కలుపు!" అన్నాడు జాకీ.
సుబ్బారావు బెదురుతూనే చెయ్యి అందించేడు.
"సత్యం-యూ ఆర్ గోయింగ్ టు హెల్!" అన్నాడు జాకీ.
* * *
సత్యంగారిల్లు.
అర్ధరాత్రి. చీకటిగా వుంది. జాకీ సత్యం గారి పడగ్గదికున్న పైపు లైను పుచ్చుకుని ఎక్కుతున్నాడు.
ఎంతో శ్రమపడి సత్యంగారి పడగ్గదిలో అడుగు పెట్టేడు. జేబులోంచి చాకు తీసి బటన్ నొక్కేడు. తళతళా మెరుస్తూ వుంది చాకు.
మెల్లిగా సత్యంగారి మంచం వేపు నడుస్తున్నాడు జాకీ!
సత్యం ఆదమరచి నిద్రపోతున్నాడు.
జాకీ ఆ మంచంవేపు మరో అడుగువేసేడు.
అంతే!
ఎక్కడున్నాయో గాని నాలుగువేపుల్నుంచీ లైట్లు అతని మొహమ్మీద ఫ్లాష్ వెలిగినట్లు ఫట్ ఫటా వెలిగేయి.
దెబ్బతో జాకీ ఖంగారు పడిపోయేడు.
కత్తి పారేసేడు.
ఆ తర్వాత అతని చెంపలు పేలడం ప్రారంభించేయి. రెండు బలమైన చేతులు అతని చెంపలమీద ఎడాపెడా నాట్యం చేస్తుంటే-జాకీ గుక్క తిప్పుకోలేకపోయేడు.
ఆ విధంగా అయిదు నిమిషాలపాటు ఆ విన్యాసం సాగడంతో జాకీ కుప్పలా నేలమీద కూలబడిపోయేడు.
కూలిన వాడిని మూటలాగా లేవనెత్తి అడుగుతున్నాడు సత్యం---
"ఎవర్నువ్వు?"
"నేనెవడో అడక్కండి! సమయానికి లైట్లెలా వెలిగేయి?"
"ఇది సత్యంగారిల్లురా ఫూల్! ఒక కోటీశ్వరుడి భవంతి. అంచేత నా జాగ్రత్తలు నాకుంటాయి! చెప్పు... ఎవరునువ్వు?"
"కొంచెం ఊపిరి పీల్చుకోనివ్వండి. సమస్తం చెబ్తాను!"
* * *
లక్ష్మీపతి ఇంట్లో...
ఆ గది తలుపు తెరుచుకుంది. గుమ్మంవేపు పద్మ ఆత్రంగా చూసింది.
అన్నపూర్ణమ్మ!
ఆ తల్లి చేతుల్లో పళ్ళెముంది. ఆ పళ్ళెంలో కొత్త బట్టలున్నాయి. పసుపుంది. కుంకుమ వుంది. ఆ తల్లి నిబ్బరంగా వుంది.
"అమ్మా!" అన్నది పద్మ.
"అన్నపూర్ణమ్మ పద్మను ప్రేమగా దగ్గిరకు తీసుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అన్నది-
"ఈ ఇంటిలో నీకు సుఖంలేదు తల్లి! వెళ్ళిపో!"
"అమ్మా!"
"కన్నతల్లిగా నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నానమ్మా! ఇదిగో సారె! సంతోషంగా స్వీకరించి వెంటనే ఇక్కడినుంచి వెళ్ళిపో, నీకు నచ్చిన మనువే చేసుకో. మాకు దూరంగావుండి సుఖంగా బతుకు!"
"ఆమె మాటలకు పద్మ కరిగిపోయింది.
అమ్మా అంటూ ఆమెను కౌగిలించుకొంది.
* * *
కోనేరు సెంటర్లో సైకిల్ షాపు.
శాస్త్రితోపాటు పనిచేస్తున్నాడు కృష్ణమూర్తి. అతన్ని చూస్తుంటే శాస్త్రి కడుపు తరుక్కు పోతోంది. అంచేతనే అన్నాడు.
"చూస్తూ చూస్తూ వాడి కూతుర్నెందుకు లవ్ చేసేరు సార్? వాడెంత నికృష్టపు ముండా కొడుకో నాకు తెలుసు. వాడి గుణంలో వాడే సాటి. పోనీండి అయిందేదో అయిపోయింది. ఇంక మీ ఊరెళ్ళిపోండి"
"దాని కింకా టైముంది శాస్త్రి!"
"ఏమిటో మీదో చాదస్తం. ఏదీ తిన్నగా చెప్పరు. ఏ పనీసవ్యంగా చేయరు. అసలు మీ పూర్తి హిస్టరీ ఏమిటో నాకు వివరంగా చెప్పగలరా సార్?"
"దానిక్కూడా టైముంది శాస్త్రి!"
"అమ్మో మిమ్మల్ని మాట్లాడించడం నాదే తప్పండి!" అన్నాడు శాస్త్రి విసుగ్గా.
విసుగ్గా అనడమే గాకుండా అక్కడినుంచి విసుగ్గానే లేచేడు. లేచిన మనిషి అడుగు ముందుకు వేయకుండానే ఆగిపోయాడు.
సైకిల్ షాపు ముందు పద్మ నిలబడివుంది.
ఇప్పుడామె కొత్త పెళ్ళికూతురిలాగా ధగధగా మెరిసిపోతుంది.
ఆమెను చూసిన శాస్త్రి "సార్" అంటూ కృష్ణమూర్తికి సైగ చేసేడు.
కృష్ణమూర్తి లేచి నించున్నాడు. పద్మని ఆత్రంగా చేరుకొని అడిగేడు-
"ఇక్కడికి రావడం మీనాన్న చూసేడా?"
"లేదు!"
"మీ అమ్మ?"
"ఆవిడే నన్నిక్కడికి పంపించింది!"
"పద్మా-"
"మన పెళ్ళి మనల్నే చేసుకోమంది."
"............"
"ఆలోచించకు కృష్ణా! రా పోదాం!"
"కానీ-"
"ఆడపిల్లను, ఇంతకంటే సిగ్గు విడిచి అడగలేను. మా నాన్న గురించి భయపడకు. మన పెళ్ళయిపోతే మనల్నేం చేయలేదు- అక్షింతలు వేయడం తప్ప! పరిస్థితులు కలిసి రాకపోతే ఎదురు తిరగాలి. తప్పదు."
కృష్ణమూర్తి నసుగుతూ అన్నాడు-
"మన పెళ్ళి ఇట్లాగే జరగాలనుకుంటే-అది ఎప్పుడో జరిగిపోయేది దయచేసి ఇంటికి వెళ్ళిపో!"
