Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 46


    "ఆ విషయాలన్నీ మరిచిపో" అతని బాధను చూడలేక పోయింది రజియా.
    "మరిచిపోవడం అంత తెలికయితే నేను ఆపని ఎప్పుడో చేసేసే వాడిని. అన్నట్లు ఈ ఉదయం ఏం జరిగిందో తెలుసా? నన్ను ఇక్కడికే కలెక్టరు గా పోస్ట్ చేశారు. ముందున్న కలెక్టరు గారు రిటైరు కావడం తో ఆ సందర్భంలో విందు చేశారు. అ తర్వాత వారిని ఇంటి వరకూ సాగనంపి ఇంటి కెళ్ళాను. ఎవరెవరో వచ్చి చూసి పోసాగారు. అది చూసి ఇదేం ధర్మసత్రమా అంటూ కేకలు వేస్తోంది. మర్యాదకు వచ్చిన వారికి క్రొత్త కలెక్టరు గారనే అభిమానంతో వచ్చిన వ్యక్తులకు కాఫీ యివ్వడం తప్పయింది. ఆమె నేలా అర్ధం చేసుకోవాలో తెలియక చస్తున్నాను."
    "నువ్విక ఇక్కడే ఉంటావన్న మాట. మంచిది. ఇంక ఆ విషయాలన్నీ మరిచిపో. పిక్చర్ కి వెళ్దాం పద."
    కలెక్టరు గారిని చూసిన దియేటర్ ప్రోపయిటర్ , మేనేజరూ గౌరవంగా లోపలికి తీసుకు వెళ్లి కూర్చో బెట్టారు. లోపలికి అడుగు పెడుతూ ముందు వరుస లో ఉన్న వసంత నూ, సురేష్ నూ చూశాడు రాజ్. వీరిని చూసిన సురేష్ కంగారు పడ్డాడు. వసంత నిర్లక్ష్యంగా తల త్రిప్పేసుకుంది.
    "మన క్రొత్త కలెక్టరు గారను కుంటాను." వెనుక నుండి ఒక గొంతు వినిపించింది.
    రాజ్ ఓరగా వెనక్కు చూశాడు. నలుగురు వ్యక్తులు.
    "ఔను. వారి ప్రక్క నున్న ఆవిడెవరో అర్ధం కావడం లేదు" అంది మరో గొంతు.
    "వారి శ్రీమతి కాబోలు" మూడవ గొంతు మెల్లిగా పలికింది.
    "ఏడిశావు! వీరి శ్రీమతి అదిగో అక్కడ మొదటి వరుసలో ఆ మునసబు గాడితో కూర్చొని కులుకుతోంది చూడు."
    "అయితే భార్యను విడిచి తాను కులాసాగా వేరే స్త్గ్రీలతో గడుపుతున్నాడన్నమాట."
    "నోరు ముయ్యండి.  వాళ్ళిద్దరినీ అనవసరంగా అంటే పాపం చుట్టుకొంటుంది. వారు ఎప్పటి నుండో ఇలాగే ఉన్నారు. చెక్కుచెదరని స్నేహం, పవిత్రమైన ప్రేమ, అర్ధం చేసుకోలేక పోయినా విమర్శలకు తక్కువ లేదు. తెలియనప్పుడు నోరు మూసుకొని పడి ఉండండి. అంతేకానీ ఇలా పిచ్చిపిచ్చిగా వాగవద్దు." అంది అంతవరకూ మౌనంగా ఉన్న నాలుగో గొంతు.
    "సరేలేవోయ్ మహా చెప్పొచ్చావు! మొన్న ననగా ఆ 'పిడుగు' పత్రిక లో పడ్డది ఆ మహా శయుడి భార్య విషయమే కదూ? రేపు వీరి విషయం కూడా పడుతుంది. అంతే."
    "ఛీ, మీరు మనుషులు కాదు" అంది అదే కంఠం. వారి మాటలు వినలేక పోతున్నారు రాజ్, రజియా లు.
    "ఇంతకూ అంత అందాల రాశిని లోబరచు కొన్న ఆ సురేష్ అదృష్ట వంతుడు."
    "ఎంత అందముంటే ఏం ప్రయోజనం? బుద్ది నీచపు బుద్ది."
    "ఏమిటి భగవంతుడా నాకీ పరీక్ష! నన్ను పరీక్షిస్తున్నావా! ఎందుకు నాకీ శిక్ష!' మూగగా వాపోయింది రాజ్ హృదయం. రజియాకు లేచి వారిని ఆ చెంపా ఈ చెంపా వాయించాలని పించింది. కానీ కారణం తెలిస్తే అందరూ అల్లరి పాలు కాక తప్పదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడ దనుకోంది.
    "లే, రాజ్ . వెళ్ళిపోదాం" అంది మౌనంగా అనుసరించాడు.
    "చదువుకొన్నా సంస్కారం లేని మృగాలు!" కసిగా తిట్టింది రజియా కారులో కూర్చుంటూ.
    విరక్తిగా నవ్వాడు రాజ్.
    ఎవరి మీద తను కోపం చూపాలి? అవమానం కలిగించే వసంత పై కోపగించు కోవాలా? వసంత ను లోబరచుకొన్న సురేష్ ను అసహ్యించు కోవాలా? అందుకు వేలెత్తి చూపెట్టే సంఘాన్ని చీదరించు కోవాలా? ఇలాంటి పరిస్థితులు కలిగించిన ఆ దేవుడిని తిట్టాలా? ఇటువంటి బ్రతుకు బ్రతుకుతున్న తననే నిందించు కోవాలా? ఏది చెయ్య గలడు? ఏది చెయ్యకూడదు?
    "అది వారి తప్పు కాదు, రజీ! అనాది నుండీ వస్తున్న ఆచారం. ఎదుటి వ్యక్తుల బలహీనతను యెగతాళి చేయడం మానవ నైజం. అది వారి కలవాటు. అదే వారికి ఆనందం; కాలక్షేపం కూడా. ఇది ఎప్పటికీ మారదు."
    "సారీ రాజ్. మనశ్శాంతి కోసం ఇక్కడి కొస్తే ఇక్కడా ఎదురుదెబ్బే తగిలింది."
    "మరేం ఫరవాలేదు లే. ఇంత మాత్రానికే భయపడితే ఎలా? ఇంకా ముందు ముందు చూడాలి. ఏం చూడవలసి వస్తుందో? ఏం వినవలసి వస్తుందో?"
    మొండిగా నవ్వాడు రాజ్.
    "అబ్బ! ఊహించ లేని ఓర్పు. తలచుకోలేని మొండి తనం. అన్నింటినీ ఎదురించి నిలువగలిగే ధైర్యం. ఆత్మాభిమానం పై దెబ్బతీసే జీవిత భాగస్వామి నీచపు చరిత్ర. వీటిని భరించగలిగే మొండి శక్తి. ఏనాడైనా ఇవన్నీ కలిసి ఎదురు తిరిగితే? అప్పుడు రాజ్ జీవితం ఏమవుతుంది?' ఊహించలేక పోయి కారును నెమ్మదిగా నడుప సాగింది రజియా.
    
                             *    *    *    *
    "శారద జీవితం తలుచుకుంటే భయం వేస్తోంది , వదినా!"
    "అవును, రాజూ. ఇంత త్వరలో ఆమె పై విధి వక్రించడం శోచనీయం."
    "నాన్నతో కోట్లాడి బావను కాదని తాను కోరిన వ్యక్తిని పెళ్ళాడింది. అదృష్ట వంతురాలనే అనుకొన్నాం. ఆమె మురిపెం కొన్నాళ్ళ యినా నిలువలేదు. ఆమె కోరికలు తీరలేదు. ఆమె సంసారపు క్రొత్త ఆశల పైన మెరుగు ఇంకా మాయలేదు. అత్యంత రసభరితం కావలసిన జీవితం ఎడతెగని దుఃఖ మాయం కావడంతో ఆమె లేత హృదయం ఎంతగా పరితపిస్తుందో?"
    'ఆనాడు బావను కాదని పెళ్లి చేసుకొన్న ఆమెకు ఇంతలో ఈ వైధవ్యం ప్రాప్తం కావడం చాలా విచిత్రం గా ఉంది బావా!"
    "విచిత్రం కాదు, లతా! త్వరపడి తను నిర్ణయాల కై ప్రాకులాడి పెద్దల మాటలు వినకుంటే ఇంతే అవుతుందని అని దేవుడు ఒక అనుభవాన్ని చూపించాడు. కానీ ఇంత త్వరలో ఆమె ఆ భగవంతుడి పాలనకు బలి అయిందంటే బాధపడకుండా ఉండలేం."
    అర్ధం కాని నిగూడార్ధం . జీవితాన్ని అర్ధం చేసుకోమని చెప్పే సందేశం. దాగి వున్న నిజం. నమ్మవలసిన సత్యం. ఉదాహరణ చూపించే ప్రయోగం. లోకానికి దిష్టి బొమ్మలా ఉండే జీవిత సత్యం.
    "అందువలన ఏమైనా ప్రయోజన ముంటుందంటావా, బావా!"
    "ఉండాలనే ఆశతోనే అది జరిగింది. ఆమెకు ఆ దౌర్భాగ్యం జరగడం వలన ఆమె కాదు, ఆమె అప్తులంతా బాధపడాలి. ఆ బాధను అందరూ అనుభవించాలి. ఒకరి తప్పుకు ఒకరే కాదు వారిపై ఆధారపడ్డవారు కానీ, వారికి సంబంధించిన వారు కానీ శిక్ష అనుభవించక తప్పదు."
    "ఇప్పుడు ఆమె జీవితం అలా మ్రోడు పోవలసిందేనా , రాజూ?"
    "గత్యంతరం లేదు. కానీ ఒకటే ఉపాయం. ఆమె సుఖం కోసం మరొకరు తమ సుఖాన్ని త్యాగం చెయ్యవలసి వస్తుంది. గోపీ ఏమన్నాడో తెలుసా? లతే గనుక నా జీవితంలోకి ప్రవేశించ కుంటే నేను శారదను నాదాన్నిగా చేసుకొని ఉండేవాడిని. కానీ ప్రస్తుతం...." అని ఆగిపోయాడు.
    అదిరిపడి బావ మొహం లోకి చూసింది లత. పరోక్షంగా ఎవరినో త్యాగం చెయ్యమనే ఉద్భోధ. ఎవరి పట్ల నో జాలి, ఎవరి మీదనో విశ్వాసం, అంతలోనే విధి పై అవిశ్వాసం. సందిగ్ధావస్థలో మనసును పీడించే కోరిక.
    "శారద అభాగ్యురాలు. ప్రస్తుతం నిస్సహయ స్థితిలో ఉంది. దేనికీ నోచుకొని దురదృష్టవంతురాలు. ఆమె జీవితానికీ, ఒకదారి , ఒక వెలుగూ చూపించి ఆమెకు తిరిగి సంఘం లో, ఈ ప్రపంచం లో పోగొట్టుకొన్న హక్కులను ఇవ్వాలి. అలా చేయగలిగిన వారి జీవితం సార్ధకమవుతుంది."
    మాటలలోని భావం, మనసులోని కోరికను కొంచెం కొంచెంగా బయటికి చూపిస్తుంది. ఆలోచన అనేది ఉంటె చాలు పూర్తిగా అర్ధం. చేసుకొని కీర్తి పొందగల మహత్తర సందేశం. అవగతం చేసుకొంటే ఫలితం తప్పక లభిస్తుంది.
    "నువ్వు చెప్పింది నిజమే, రాజూ! నిస్సహాయులకూ , అభాగ్యులకూ విధి క్రూర కోరల పాలిట బడ్డ అసహయులకూ నిస్వార్ధంతో సహాయం చేసిననాడు ఈ మనవ జన్మే చరితార్ధం అవుతుంది."
    'శారద ఆధారం లేనిది. ఒకవేళ ఉందనుకొన్నా అది పరాయివారిదిగా కాబోతుంది. ఆ ఆధారాన్ని మనం గ్రుడ్డిగా స్వంతం చేసుకొని అన్యాయం చెయ్యడం కంటే అలోచించి ఆమెకే దాన్ని వదిలి పెట్టడం భావ్యం. ప్రయత్నిస్తే మనకు సంఘం లో బ్రతకడానికి మరి కొన్ని హక్కులు, ఆధారాలు ఉన్నాయి. వాటి వలన మనం జీవితాన్ని అత్యంత సుఖంగా గడుపుకోలేకున్నా కనీసపు బ్రతుకును బ్రతగ్గలం. అందుకు గూడా నోచుకోని ఆమెకు అన్యాయం చేసే ఆ సుఖం. ఉండీ ఒకటే, లేకా ఒకటే. మన కర్తవ్యం మనం చేయగలిగిననాడే నిజమైన ఆత్మ సంతృప్తి ఆనందం లభిస్తాయి."
    స్వరూపం లేని బావ మాటలకు ఒక రూపాన్ని ఏర్పరచు కొంది లత. విధిని చూపుతున్నారు కానీ, చెయ్యమని నిర్భందించడం లేదు. ఒకరి సుఖం కోసం తహతహ. మరొకరి త్యాగం కోసం దుఃఖం.
    బావను చూసింది. చూపు మరల్చు కొన్నా దప్పుడే. సూటిగా చెప్పలేని అజ్ఞ. ఎదురుగా అడగలేని అభ్యర్ధన. నలిగిపోయింది మనసు. విరిగిపోయింది ఉత్సాహం. నిశ్చయించుకొంది హృదయం.
    "వస్తాను, వదినా. వస్తా, లతా!' అని రాజ్ వెళ్ళిపోయాడు. ఆ కడసారి చూపులో సందేశం. అవకాశ మిచ్చే భావం.
    "బావ చెప్పింది అర్ధం చేసుకోన్నావా, లతా?' తల ఊపింది లత. ఎందుకు బావ తనకే ఈ కఠిన శిక్ష విధించాడు? తనుకన్నా ఆప్తులు లేరు. అటువంటి తనకే సుఖాన్ని వద్దని దుఃఖాన్ని జీవితపు బాటగా స్వీకరించమని బోధిస్తున్నాడు. తనేం తప్పు చేసింది? సుఖంగా జీవించడానికి తన అర్హత లేదా? ఎవరి కోసమో తన బ్రతుకును పాడు చేసుకోవాలా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS