Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 46


    తండ్రి ఆవేశం గమనించి కృష్ణమూర్తి భయపడ్డాడు. వెంటనే తండ్రి చేతులు పుచ్చుకున్నాడు.

 

    సత్యం కృష్ణమూర్తివేపు జాలిగా చూశాడు.

 

    "వాడిని చంపి నేను ఉరికంబం ఎక్కుతానని భయపడుతున్నావా? పిచ్చివాడా? షూట్ చేసిగానీ, కత్తితో పొడిచిగానీ వాడిని చంపనురా! వాడి మెదడులో డైనమేట్లు పేలుస్తాను. వాడి గుండెల్లో అగ్నిగుండాలు సృష్టిస్తాను. చూస్తావుగా కన్నా-నా ప్రయోజకత్వం?" అన్నాడు సత్యం.

 

    కృష్ణమూర్తి ఏమనుకున్నాడో ఏమో ఆత్రంగా అన్నాడు---

 

    "కారు ఆపు నాన్నా?"

 

    "ఆపితే?"

 

    "నేను తిరిగి వెళ్ళిపోతాను?"

 

    "ఎక్కడికి? ఆ లక్ష్మీపతిగాడింటి కేనా? వెళ్ళి వాడి కాళ్ళమీద పడతావా?" సత్యంగారబ్బాయినని నిజం చెబుతావా?" కోపంగా అడిగాడు సత్యం.

 

    "చెప్పేవాడినయితే-ఆ పని ఎప్పుడో చేసి వుండేవాడిని!"

 

    "మరి? ఎందుకు వెళతానిప్పుడు?"

 

    "31 డిసెంబరు ఇంకా పూర్తికాలేదు."

 

    "కన్నా?"

 

    "క్షమించు నాన్నా? మన పందేనికి గడువు యింకా వుంది. అ తరువాతనే యింటికి వస్తాను! కారాపు!"

 

    సత్యం సడన్ బ్రేకు వేసి కారు ఆపాడు. కృష్ణమూర్తి కారుదిగి డోరు మూశాడు.

 

    సత్యం కొడుకుతో అన్నాడు---

 

    "ఏ ఆశతో కారు దిగావో నాకు తెలీదు. కానీ ఒక్కమాటివ్వు!"

 

    "ఏమిటది?"

 

    "ఎట్టి పరిస్థితుల్లోనూ అఘాయిత్యం తలపెట్టకు"

 

    "అంటే?"

 

    "ప్రేమరా కన్నా! ప్రేమ! అది ఎంతపనైనా చేయిస్తుంది. చేస్తుంది. నీ పెళ్ళి ఆ పిల్లతో జరగదని తెలిశాక నీ ప్రేమ నిన్ను స్థిమితంగా ఆలోచించనివ్వదు. ఆత్మహత్యకు ప్రోత్సహించవచ్చు. నీ పంతం నీ పట్టుదలతో నాకు దూరం కావచ్చు. నువ్వు దూరమైతే కన్నా- నాకు బతుకే ఉండదు. మైండిట్!" అని సత్యం కారు స్టార్టుచేసి తూనీగలాగా వెళ్లిపోయాడు.

 

    కృష్ణమూర్తి నిట్టూర్చాడు.

    
                                         29


    డిసెంబరు 25, క్రిస్మస్.

 

    చర్చి దగ్గర కోలాహలంగా వుంది. రోడ్డుమీద నడుస్తున్న సుబ్బారావు చర్చినీ, అక్కడి సందడినీ చూడగానే సడన్ గా ఆగిపోయాడు.

 

    ఏసు దేవుడి రూపం అతని గుండెల్లో నిలిచింది!

 

    అమాయక జనం అజ్ఞానంతో ఆ దేవుడికి శిలువ వేసేరు. జనం కోసం ఆ దేవుడు ప్రాణాలర్పించేడు ఒక మతాన్ని భూలోకంలో దించేసేడు.

 

    మరి తానో-

 

    చెల్లెలి పెళ్ళికోసం బలిపశువయ్యేడు. శిలువ ఎక్కేడు. సరిగ్గా వారం రోజుల్లో-డిసెంబరు 31 వస్తుంది. ఆనాటికి తన ప్రాణాలిచ్చేయాలి.

 

    ఆ మాట జ్ఞాపకం వచ్చేసరికి సుబ్బారావు నిలువెల్లా వణికిపోయేడు.

 

    చర్చిమీద గంటలు వినిపిస్తున్నాయి.

 

    ఆ గంటలు విని కొంచెం తెప్పరిల్లేడు. అడుగు ముందుకు వేయబోతుండగా-ఎవరో అతన్ని "సుబ్బారావ్" అని పిలిచేడు.

 

    సుబ్బారావు ఆగిపోయేడు.

 

    అతనివేపు వస్తున్న ఆ వ్యక్తి ఫుల్ సూటులో వున్నాడు. ఎంతో ఠీవిగా వున్నాడు. పెద్దపెద్ద అంగలేసుకుంటూ వస్తున్నాడు.

 

    అతన్ని చూడగానే సుబ్బారావు ఆనందంగా అన్నాడు.

 

    "జాకీ!"

 

    జాకీ అనబడే జాంబ్ సుబ్బారావుని వాటేసుకున్నాడు సంతోషంగా.

 

    "హేపీ క్రిస్మస్ టూ యూ!" గొణిగేడు సుబ్బారావు.

 

    వాళ్ళ కౌగిలింత ముగిసింది.

 

    "ఈ ఊళ్ళోనే వుంటున్నావా?" అడిగేడు జాకీ.

 

    "అవును. ఆర్టీసీలో ఉద్యోగం. మనం కలుసుకుని ఎన్నేళ్లయింది?"

 

    "నీ పెళ్ళికొచ్చేను."

 

    "ఎక్కడుంటున్నావ్? ఏం చేస్తున్నావ్?"

 

    "అడక్కు! నా వివరాలు తెలుసుకుంటే నీ ఆరోగ్యం చెడిపోగలదు. కమాన్-లెటజ్ సెలబ్రేట్ ది డే!" అన్నాడు జాకీ.

 

    సరే అనడానికి మనసూ, కాదనడానికి నోరూ రాలేదు సుబ్బారావుకి. అంచేత బొమ్మలా నిలుచుండిపోయేడు.

 

    "అదేమిట్రా గొప్ప డల్ కొట్టేస్తున్నావ్! కలసి పెరిగేం, కలిసి చదువుకున్నాం. కలవక కలవక ఇన్నేళ్ళకు కలుసుకున్నాం. సరదా చేసుకుందాం రారా అంటే రాయిలా నించుంటావేమిట్రా ఫూల్?"

 

    "నా పరిస్థితి బాగులేదురా!"

 

    "ఒరే చెత్తగా మాట్లాడకు! నాతోరా! కొంచెం మందేసుకో సెటిలవుతావ్!"

 

    "వద్దు! తాగుడు నాకు పడదు!"

 

    "పడదో పడుతుందో-అదంతా నాకు విడిచిపెట్టు. ముందిక్కడ్నించి కదులు క్విక్. ఊ!"

 

    అని అతని చెయ్యి పట్టుకుని దూరంగా ఆగి వున్న కారు దగ్గిరికి లాక్కుపోయేడు.


                                                             *  *  *


    లక్ష్మీపతి దిగుల్తో మనిషి సగం తగ్గిపోయేడు. మంచాన పడకపోయినా అతని స్థితి ఆ స్థాయిలోనే వుంది-

 

    అన్నపూర్ణమ్మ వచ్చి అడిగింది-

 

    "భోజనానికి లేవండి!"

 

    లక్ష్మీపతి ఆమె వేపు సూటిగా చూస్తూ అన్నాడు.

 

    "నాక్కావల్సింది అన్నం కాదే! చిటికెడు విషం! నీ కూతురూ నువ్వూ నన్ను కుందేలు చేసేరు. దేవుడిలాటి సత్యంగారు అలిగి వెళ్లిపోయారే! ఆయన సాయంతో కోటీశ్వరుడి నవుదామనుకున్నాను. దరిద్రం నా నెత్తిమీద రాజ్యం చేస్తుంటే కోట్లు ఎట్లా దక్కుతాయి? దక్కవు. ఎరక్కపోయి-ఆ డ్రామా పెళ్ళికి ఆయన్ని పెద్దగా పిలిచాను. కోపం తెప్పించి నా కొంపమీదికి తెచ్చుకున్నాను. వెళ్ళవే వెళ్ళు? నన్ను మాట్లాడించకు! పో!"

 

    అన్నపూర్ణమ్మ నిట్టూర్చింది. లక్ష్మీపతి ధోరణికి సిగ్గుపడింది. ఈ మనిషికి డబ్బు మరి ఏ ఇతర గొడవలూ పట్టనందుకు ఆమె అసహ్య పడింది.

 

    అంచేత భార్యగా తన పాత్రపోషణ మరిచిపోయింది. భర్తని బతిమాలే డ్యూటీకి అక్కడ్తో చుక్క పెట్టేసి అక్కడ్నించి వెళ్ళిపోయింది.


                                                            *  *  *


    బందరు గెస్టుహవుస్ లో...

 

    జాకీతో పాటు సుబ్బారావు కూడా తాగుతున్నాడు.

 

    మోతాదు మించి పుచ్చుకోవడం వల్ల సుబ్బారావు స్టడీగా లేడు. అంతకు మునుపు ఎంతవరకు తన కథ చెప్పాడోగాని ఇప్పుడతను 31 డిసెంబరు గురించి మాట్లాడుతున్నాడు-

 

    "అంచేతొరేయ్! ఇవాళ క్రిస్మస్! అంటే-నేను బతికి బట్టకట్టేది యింకా వారం రోజులే! కొత్త సంవత్సరం చూడను. ఆ భాగ్యం నాకు లేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS