నలుగురూ నాలుగు రకాలుగా అనుకొన్నారు. లెక్కపెట్టడం అలవాటు లేడులాగుంది. ఆ ఎత్తి పొదుపులను ఎడురించాలనే చేతకాని ధీరత్వం. నలిగిపోయింది. నలుగురి కాలక్షేపానికి పాలు పడ్డారు. అది వారికి ఆటంకం కాదు. అదిలించే ఆప్తులు, దండించే పెద్దలు లేని వారికి అధోగతే ప్రాప్తం. కూతురిని మండలించినా ఫలితం లేక కుమిలి పోయారు ఆనందరావు గారు.
మామగారికి ప్రమాదం అన్న టెలిగ్రాం చూసి ఉన్న పాటున రైలెక్కాడు రాజ్. సెకండ్ క్లాసు లో కూర్చున్న అతనికి మనశ్శాంతి లేకపోయింది. హౌరా మెయిల్ చిన్నగా పోతుందేమిటా అనుకొన్నాడు.
ఎదురు సీట్లో ఎవరో కునికి పాట్లు పడు తున్నారు. అతని చేతిలో పత్రిక ఉండనా పోనా అంటూ ఊగుతోంది గాలికి. గాలికి ఆ పత్రిక రాజ్ కాళ్ళకు చుట్టుకొంది. దాన్ని తీసి ప్రక్కన పెడుతూ దాని పై ఉన్న ఫోటో చూసి క్రింద పడబోయాడు. సంబాళించుకొని తిరిగి చూశాడు 'పిడుగు' వార పత్రిక. విమర్శక పత్రికలలో పేరొందిన వార పత్రిక.
పెద్ద పెద్ద అక్షరాలతో 'ఆనందం కోసం తహతహ లాడే అందాల విలాసిని.' అని ఫోటో ఉంది. వసంత.
'వయసు ఉంది. ధనముంది. అందం లో అందరినీ మించింది. గౌరవం , హోదాలకు లోటు లేదు. కానీ కావలసింది అది కాదంటూ భర్త నూ, కన్న తండ్రినీ మోసం చేసి అర్ధం లేని ఆనందాలకు పోయి మోసగింపబడుతుంది.......'
ఇక చదువ లేక ఆ పత్రికను విసిరి కొట్టినాడు రాజ్.
దానిలోని నిజానిజాల కన్న జరిగిపోయిన అవమానం బాధపెడుతుంది. నలుగురి లో తలవంపులు. సమాజంలో వేలెత్తి చూపబడ్డ ఈ వార్త వినే కాబోలు ఆ ముసలి ప్రాణానికి అపాయం.
అల్లుడిని చూసిన ఆనందరావు గారు ఆఖరు క్షణాల్లో కూడా ఆనందంగా నవ్వారు.
"నే వచ్చాగా మామయ్యా? మరేం భయం లేదులే.' ఓదార్చే ప్రయత్నించాడు రాజ్.
"ఇంకా ఎందుకోయ్ భయం? అది తీరిపోయింది.
రాజ్ ఏమీ మాట్లాడలేక పోయాడు.
"శేఖరం , నేను నీకు అన్యాయం చేశాను. పండువంటి నీ బ్రతుకు నాశనం చేశాను. అందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. నీ కన్యాయం చేసినందుకు గాను నాకు భగవంతుడు తగిన శిక్ష విధించాడు.'
"మామయ్యా! ఇప్పుడా గొడవంతా ఎందుకు? మాట్లాడకుండా పడుకోండి."
"కాదు , నన్ను మాట్లాడ నివ్వు. వంశ గౌరవం, పరువు ప్రతిష్ట లూ అన్నీ మట్టిలో కలిసిపోయాయి. అందుకు చింత లేదు. నిన్నూ నీ పై ఆధార పడ్డ మరోకరినీ గొంతు కోశానే అనే బాధ అంతిమ ఘడియల్లో నన్ను పీడుస్తోంది. దైవ స్వరూపుడవైన నీకు బలవంతంగా ఒక రాక్షసిని అంట గట్టాను."
"మామయ్యా!"
"ఉష్. నువ్వు మాటలాడకు. నాకు అంతా తెలుసు. నువ్వు వసంత ను ద్వేషిస్తూ ఉండేవాడివని నాకు తెలుసు. కానీ నా స్వార్ధం దాన్ని ఆలోచించని య్యలేదు. ఆనందమయం కావాల్సిన నీ జీవితం నా స్వార్ధానికి బలి పెట్టాను. మీ ఇద్దరినీ విడదీశాను. ఆ పాపానికి నాకు ప్రాయశ్చిత్తం లేదు. పువ్వుల పొదలో ఉన్న నిన్ను ముళ్ళ కంచే లోకి విసిరేశాను. ఎందుకు? నా కూతురు సుఖం కోసం. దాని భవిష్యత్తు కోసం. కానీ కొన్ని జీవితాలను మార్చే శక్తి మనలంలేదనే సత్యం తెలుసుకొన్నాను. కానీ, శేఖరం.... "
"మీరు విశ్రాంతి తీసుకోండి, మామయ్యా. తర్వాత మాట్లాడుదురు గానీ."
"విశ్రాంతి త్వరలోనే లభిస్తుంది లే. నువ్వు నాకొక మాటివ్వాలి?"
"చెప్పండి, మామయ్యా!"
"దానికి మంచి చెడులూ ఇంకా తెలియవు. నువ్వు ఎప్పటికీ దానికి అన్యాయం చెయ్యకూడదు."
ఆ కోరిక విని ఏమీ జవాబు చెప్పాలో తోచలేదు.
తనపై ఎంత జాలి చూపించినా తిరిగి అదే స్వార్ధం. అదే మమత. విచిత్రమైన స్వార్ధం. అందుకేనేమో మానవుడి ని మించిన స్వార్ధం ఎవరి లోనూ లేదన్నారు.
"ఏమిటి ఆలోచిస్తున్నావు?మళ్ళీ స్వార్ధ పూరితమైన కోరికనే కోరుతున్నాడే అని బాధపడుతున్నావా?"
"కాదు, మామయ్యా! నేనూ మనిషినే. నాలో ఓర్పు కూ, సహనానికీ హద్దు ఉంది. మంచితనం మితిమీరితే ఆపదల పాలు కావలసి వస్తుంది. మానవ సహజమైన గుణాలను అధిగమించడానికి నేను దేవతను కాదు. కానీ మామూలు కన్నా ఎక్కువగా సాధ్యమైనంత వరకూ మీరు కోరినట్లే చేస్తాను. కానీ సమయం మించి పోయినప్పుడు నేను మాత్రం చేయగలిగింది ఏమీ ఉండదు!"
"చాలు. నువ్వు అంతమాత్రం మాటిస్తే చాలు . నీకు సహాయం చేసినందుకు గానూ నిన్ను నా స్వార్ధానికి బలి పెట్టినాను. ఎందుకో తెలుసా? నీకు నరకాన్ని స్వర్గంగా మార్చగలిగే శక్తి ఉందని నాకు తెలుసు. కానీ అదృష్ట హినుల జీవితాలను ఎవరూ మార్చలేరు. నేడు నాకా కోరిక లేదు. కనీసం ఈ భూమి పై నా బిడ్డ బ్రతక గలిగితే చాలు. నన్ను క్షమించు'.'
అంతిమ ఘడియల్లో కూడా తనవారనే మమకారం, మమత విచిత్రం. అన్నీ వదిలించుకు పోవాలనే తాపత్రయం కొందరికి ఉండగా తనవారి సుఖ జీవనానికి కట్టు దిట్టాలు చేయాలనే అపేక్ష మరి కొందరిది. అంతలో నే స్వార్ధం, అంతలోనే నిస్వార్ధం.
"మీరు నెమ్మదిగా కళ్ళు ముసుకు పడుకోండి."
"అవును అదిగో నాకోసం పిలుపు వస్తోంది. ఇక నాకిక్కడ పని లేదు."
శాశ్వతంగా మూత బడ్డాయా కళ్ళు.

30
"రాజ్, ఎందుకలా దిగులు పడిపోతావ్?"
"ఏం చెయ్యను, రజీ? ఇంట్లో ఒక్క క్షణం శాంతీ లేదు, సుఖమూ లేదు. అండగా ఉన్న మామయ్య కూడా కరువై పోయాడు. భార్య స్వాతంత్యాన్ని , స్వేచ్చ ను ఒకదారికి తీసుకు వచ్చే హక్కు లేని చేతకాని వాణ్ణి. నలుగురి లో ధైర్యంగా తలెత్తుకు తిరిగే అర్హత లేనివాణ్ణి. ఎందుకూ కొరగాని దౌర్భాగ్యుడ్ని. ఏం చూసుకుని ధైర్యంగా ఉండమంటావు?"
"నేనెక్కడికి పోయాను, రాజ్? నా హృదయం లో నీకు శాంతం, సుఖం వున్నాయి అన్నావు. అది జ్ఞాపకం లేదా?"
"నువ్వే లేకుంటే ఎప్పుడో ఈ జీవితం నుండి పారిపోయి ఉండేవాడిని. అప్పుడప్పుడు ఈ బాధ భరించలేక ఎక్కడి కైనా పారిపోవాలని పిస్తోంది."
"ఛ. అంత బేలవై పొతే ఎలా, రాజ్?"
"ఏం చెయ్యను, రజీ? వసంత దృష్టి లో నేనొక యంత్రాన్ని. స్వేచ్ అన్ చేస్తే ఆడాలి, ఆఫ్ చేస్తే ఆగిపోవాలి. నేను భర్త నన్న మాటే ఆమె మరిచి పోతోంది. ఆమె కోరికలు తీర్చాలి, ఆమె చెప్పినట్లు వినాలి. ఆమెకు కష్టం కలిగించే పని చేయకూడదు. ఆమె ఆనందం కోసం ఆమె చెప్పినట్లల్లా చేసినా తృప్తీ , ఆనందమూ ఉండవు. ఆమె ఎప్పుడూ నన్ను అవమానించడానికీ, బాధించడానికీ ప్రయత్నిస్తూంటుంది. అర్ధం కాని మొండి తనం, పట్టుదల , చిన్న పిల్లలను ఆడుకున్నట్లు అడుక్కోవాలనే అపేక్ష, ఏమన్నా నోరు తెరిచి ఏమీ అనడే అనే ఆకాంక్ష , ఏమైనా అంటే తిరుగుబాటు -- ఇదంతా చూస్తుంటే కొరకరాని కొయ్యలా, గుండెల్లో కాపురముండే జ్వాలలా ఉంది. అమాయకత్వమూ, కాదు, తెలివి తక్కువతనమూ కాదు. అర్ధం లేని గర్వం. ప్రతీకార వాంఛ. ఇవే మెదులు తుంటాయి. ఆమె మదిలో. ఎన్నాళ్ళ ని ఈ జీవితం గడపడం?"
