Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 45


    లక్ష్మీపతికి కసెక్కిపోయింది. మాట్లాడే ఓపిక పూర్తిగా నశించింది. అంచేత గభాలున కృష్ణమూర్తి కాలరు పట్టుకుని ముందుకు గుంజేడు.

 

    కృష్ణమూర్తి తూలిపడ్డాడు!

 

    నేలమీద పడిన కృష్ణమూర్తిని కాలువేసి తొక్కబోయాడు లక్ష్మీపతి. క్షణంలోనో ఆ పని జరిగిపోయేదే!

 

    అంతలో--

 

    "లక్ష్మీపతి! అని గర్జించేడు సత్యం.

 

    సత్యంగారి గర్జనతో లక్ష్మీపతి భయపడ్డాడు. అంచేత అతని కాలు కృష్ణమూర్తి మీదకు గాకుండా నేలమీద కొరిగింది.

 

    సత్యం ఎర్రబడ్డ కళ్ళతో ... కొండంత ఆవేశంతో ... ఒక్కో అడుగు వేసుకుంటూ ... లక్ష్మీపతి ముందుకొచ్చి నిలబడ్డాడు.

 

    తండ్రి ఏం చెబుతాడోనని కృష్ణమూర్తి ఆందోళన పడుతున్నాడు.

 

    లక్ష్మీపతితో అంటున్నాడు సత్యం రోషంగా.

 

    "అదృష్టవంతుడివి లక్ష్మీపతి బతికి పోయేవ్!"

 

    "సత్యంగారూ!" అన్నాడు లక్ష్మీపతి బేలగా.

 

    "అవును! నీ అడుగు ఈ కుర్రాడి మీద పడివుంటే నీ ప్రాణాల్తీస్తేవాడ్ని యస్! నిజంగానే తీసేవాడ్ని. ఖంగారుపడకు. ఆ ప్రమాదం తప్పింది. పెళ్ళి పెద్దగా వచ్చేను. అది కూడా నువ్వు కోరితేనే వచ్చేను. క్షణం క్రితం వరకు ఈ కుర్రాడ్ని ఆకాశానికెత్తేవ్! నేనూ ఆనందించేను ఇప్పుడూ-నీకు అల్లుడవుతున్నాడనే నిజం తెలీగానే కాల్తో కొట్టడానికి సిద్ధపడ్డావు. పెళ్ళి పెద్దగా ఈ చర్యను నేను సహించను. సహించలేను. నీతి నీకు లేకపోవచ్చును గానీ నాకుంది! అండర్ స్టాండ్!"

 

    సత్యంగారి దాడి సహించలేకపోయేడు లక్ష్మీపతి. అట్లాగని ఎదురు తిరిగే దమ్ము అతనికి లేదు. అందుచేత నసిగేడు-

 

    "నిజమే అనుకోండి కాని చూస్తూచుస్తూ ఒక బికారి వెధవకి-

 

    "షటప్! నోర్ముయ్!" అరిచేడు సత్యం, ఖంగారుపడ్డాడు లక్ష్మీపతి.

 

    సత్యం మెల్లిగా కృష్ణమూర్తిని లేవనెత్తేడు. లక్ష్మీపతి వదిలేసి కృష్ణమూర్తితో అంటున్నాడు-

 

    "చూసేవా! ఇదీ లక్ష్మీపతి కేరెక్టరు!"

 

    అ మాటకి కృష్ణమూర్తి తల దించుకున్నాడు.

 

    మళ్ళీ సత్యమే అన్నాడు--

 

    "బాధపడకు మైడియర్ బోయ్! లక్ష్మీపతిని ఆ దేవుడు కూడా మార్చలేడు అతనిక్కావల్సింది డబ్బు! ఉన్నపళంగా నిన్ను దత్తత చేసుకున్నా-నువ్వే నా బిడ్డవని డిక్లేర్ చేసినా-అల్లుడూ అని నిన్ను కౌగలించుకుంటాడు. ఆ అవకాశం లేనందుకు బాధపడుతున్నాను, నువ్వు చేసిన మేలుకి శభాషంటాడు. అంటాడంతే! అది నోటినుంచి వచ్చేమాట-గుండె లోతునుంచి కాదు దటీజ్ మిస్టర్ లక్ష్మీపతి!"

 

    "సత్యంగారూ-" అని ఏదో మాట్లాడబోయేడు లక్ష్మీపతి.

 

    లక్ష్మీపతివేపు గుర్రుగా చూస్తూ అన్నాడు సత్యం.

 

    "ఎంత మంచివాడినో అంత చెడ్డవాడిని! అన్యాయం జరుగుతుంటే దేవుడయ్యేది డొక్క చింపేగలను. అల్లాంటి నన్ను పెళ్ళి పెద్దగా తీసుకొచ్చి నా కళ్ళముందే ఇంత కిరాతకం తలపెడతావా?"

 

    లక్ష్మీపతి గొణిగేడు.

 

    "నా సంగతి వదిలేయండి! మీరే నా స్థానంలో ఉంటే ఈ పెళ్ళికి అంగీకరించగలరా? దిక్కూదివాణం లేని ఒక ప్రైవేటు మేస్టర్ని అల్లుడిగా చేసుకోగలరా?"

 

    "నేనేం చేస్తానో నీకు తెలీదు! చెప్పినా నీచిన్న మనసు అర్ధం చేసుకోలేదు!"

 

    "అవున్లేండి! పద్మ మీ కూతురు కాదుగనక ఏవయినా మాట్లాడతారు. మీకే ఒక కూతురుండి-ఆ కూతురు ఇల్లాంటి పేదవాడ్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోగలరా? చెప్పండి సత్యంగారూ!"

 

    "ఇప్పుడు కావల్సింది నా విషయం కాదు. నా సూత్రాలు కావు ఈ పెళ్ళి నీకిష్టంలేదు! అవునా?"

 

    "అవును! ముమ్మాటికీ అవును?"

 

    "దెన్! దండించవలసిందీ, అదుపులో పెట్టుకోవాల్సిందీ-నీ కూతుర్ని. డబ్బుకి గడ్డితినే నీ కడుపున పుట్టి నీ గుణమేమిటో తెలిసి-అడ్రస్సు తెలీని ఒక అనామకుడికి మనసివ్వడం మీ అమ్మాయి తప్పు! మైండిట్! అయిందేదో అయిపోయింది! మీ అందరికీ అయిదంటే అయిదు నిమిషాలే టైమిస్తున్నాను. ఈలోగా ఈ కుర్రాడ్ని వదిలేసి-మీరు మీ ఇళ్ళకి వెళ్ళకపోతే నాకు పిచ్చెక్కుతుంది! నేను పిచ్చివాడినయితే ఏం చేస్తానో నాకే తెలీదు. అవుట్! వెళ్ళండిక్కడ్నించి!" అంటూ అరిచేడు సత్యం.

 

    లక్ష్మీపతికి తల కొట్టేసినంత పనయింది. ఈ ఫీలింగు అతనికి జీవిత కాలంలో తొలిసారిగా కలిగింది.

 

    అంచేత-

 

    పద్మ చేతిని పట్టుకు లాక్కుపోతున్నాడు. పద్మ "కృష్ణ" అంటూనే వుంది.

 

    కృష్ణమూర్తి వెళ్ళబోయేడు గానీ సత్యం అతని చేతిని పట్టుకుని ఆపేడు.

 

    సరిగ్గా అయిదు నిముషాల్లోనే ఆ కళ్యాణమండపం ఖాళీ అయ్యింది.

 

    సత్యం-కృష్ణమూర్తి ఇద్దరే అక్కడ మిగిలేరు.

 

    కృష్ణమూర్తి తండ్రి కళ్ళల్లోకి చూశాడు. సత్యం కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి!


                                      28


    హైదరాబాద్ రోడ్డుమీద కారు నడుస్తోంది!

 

    సత్యం డ్రయివ్ చేస్తున్నాడు. అతని పక్కనే కృష్ణమూర్తి కూర్చుని ఉన్నాడు.

 

    కారు అప్పుడే బందరు పొలిమేరలు దాటుతోంది. ఆ వరస గమనించి కృష్ణమూర్తి తండ్రిని అడిగాడు---

 

    "ఇప్పుడు మనం ఎక్కడికి వెడుతున్నాం?"

 

    "హైదరాబాదు. మనింటికి!" అన్నాడు సత్యం.

 

    "నాన్నా!" అన్నాడు కృష్ణమూర్తి దిగులుగా.

 

    సత్యం రోషంగా అంటున్నాడు-

 

    "అవునురా! సిగ్గులేకుండా ఇక్కడ ఎన్నాళ్ళుంటావ్? ఉండి ఏం సాధిస్తావ్?"

 

    "డిసెంబరు 31కి ఇంకా టైముంది నాన్నా!"

 

    "అంటే? ఇంత జరిగేక కూడా ఆ లక్ష్మీపతిగాడు నిన్ను అల్లుడ్ని చేసుకుంటాడనే నమ్మకం నీకింకా వుందా? పిచ్చిపిచ్చి ఆశలు పెంచుకోకు కిస్టుడూ! బుద్ధిగా నే చెప్పినట్టు విను. వాడి బాబులాటి సంబంధం చూస్తాను. ఎంతో వైభవంగా నీ పెళ్ళి జరిపిస్తాను. ఆ పెళ్ళికి వాడిని ప్రత్యేకంగా వాడిని పిలిపిస్తాను. పెళ్ళిపీటలమీద నిన్ను చూస్తాడు. నువ్వు నా బిడ్డవని అప్పుడే తెల్సుకుంటాడు. చేయి జారిపోయిన అదృష్టానికి గుండె ఆగి చస్తాడు. వాడి చావు నేను చూడాలి కిస్టుడూ! అదే నా ధ్యేయం!"

 

    "నాన్నా!" అన్నాడు ఖంగారుగా కృష్ణమూర్తి.

 

    "నా ఆవేశాన్ని చంపొద్దు. నిన్ను కొట్టేందుకు కాలెత్తాడు వాడు. నా కళ్ళముందే నా బిడ్డను కొట్టేంత ఘనుడావాడు? నిన్నెట్లా పెంచుకున్నానురా? ఎన్నడయినా నీమీద చెయ్యి చేసుకున్నానా? అలాంటిది-ఆ లోఫర్ గాడు నిన్ను అవమానించింది చాలక కొట్టడానికి కూడా సిద్ధపడతాడా? ఒరే-వెధవ పందెంలోపడి నా చేతులు కట్టుక్కూచున్నానురా లేకపోతే-ఆ కళ్యాణ మండపంలోనే వాడి ప్రాణాలు తీసివుందును. వదిలెయ్ అప్పటికి వాడు బతికి పోయాడు ఇంకా బతకడానికి వీల్లేదు. కుక్క చావు చావాలి? చంపుతాను!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS