Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 44


    "బావ లోపలున్నాడు . పిలుస్తానుండండి." అని వెనుదిరిగిన శారద అక్కడే ఉన్న గోపీని చూసి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.
    పోతున్న శారదను చూసి అర్ద్రమైన కన్నులను తుడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు గోపీ.
    "ఏమిట్రా యిది?" తడబడుతూ అడిగాడు రాజ్.
    "ఏముందీ? ఎవరు చేసిన ఖర్మకు ఎవరు బాధ్యులు? అనాడంత సంతోషంగా తాను వరించిన వరుడి ని ఉత్సాహంతో పెళ్లి చేసుకొంది. నేడు విధి ఆమె పాలిటికి వైధవ్యాన్ని ప్రసాదించింది. అంతే." విరక్తిగా చెప్పాడు గోపీ.
    'అసలు విషయమేమిట్రా?"
    "అతను ఇంజనీరుగా? ఏదో ప్రాజెక్టు దగ్గర పని చేస్తుండగా ప్రమాదం వల్ల క్రింద పడి మరణించాడు."
    "ఊ" అని రాజ్ చేత్తో తల పట్టుకొన్నాడు.
    "ఆనాడు నువ్వన్నట్లు పెళ్లి ఆగిపోయి ఉంటేనే దాని జీవితం బాగుండేదేమో?"
    "పెళ్లి చేసుకొని జీవితంలో ఏమీ సుఖాలు అనుభవించకుండానే విధి ఆమె పట్ల కఠినంగా ప్రవర్తించింది. కోరి పెళ్లి చేసుకొన్నందుకు ఇదా ఫలితం? ఏమీ అనుభవించకుండానే అన్నీ అనుభవించినట్లు ఈ స్థితికి వచ్చింది. హు . ఎంత క్రూరమైనది విధి!"
    'దాన్ని చూస్తుంటే గుండె తరక్కుపోతోందిరా! లత నా జీవితంలో ప్రవేశించ కుంటే శారద ను ఇప్పట్లో వివాహం చేసుకొని ఉండేవాడిని. ఈ కారణంగా ఆ వివాహం కూడా వాయిదా వెయ్యదలచు కొన్నాను. ఈ దురదృష్టాన్ని చూడకుండా మామయ్య వెళ్ళిపోయాడు. అదృష్టవంతుడు."
    నిట్టుర్పు విడిచాడు రాజ్.
    సంతోషకరమైన వార్తా వినిపిద్దామని వస్తే చావు కబురందింది. లత పెళ్లి విషయం నిశ్చయించాలని వస్తే ఆ ఆశ వదులుకొంటే మంచిదని పిస్తుంది.
    "నీకో శుభవార్త చెప్పాలని వచ్చానురా! నన్ను అసిస్టెంట్ కలెక్టరు ట్రయినింగ్ కు రమ్మని ఆర్డర్స్ వచ్చాయి. ట్రెయినింగ్ కు గుంటూరు కెళ్ళాలి."    
    "వెరీగుడ్. నా ఆప్త మిత్రుడు వి. నువ్వు కలెక్టరు వు అవుతుంటే నాకు అంతకన్నా సంతోషకరమైన విషయమేముందిరా!" పొంగి పోయాడు గోపీ.
    ఆ రాత్రి పడక పై కూర్చొని ఆలోచించు కుంటున్నాడు రాజ్. అతని దృష్టి లో గోపీ మేడులుతున్నాడు. ఒక వైపు దీనపు చూపులతో శారద నిలబడి ఉంది. మరొక వైపు లత ఆనందంతో చూస్తూ ఉంది. ప్రపంచం శారదను కనీసం కన్నెత్తయినా చూడటం లేదు. అలాగే ప్రపంచాన్ని తలెత్తి ధైర్యం గా చూసే ధైర్యం శారదకు లేదు. ఆ అధికారం అమెకు లేకపోయింది. లత లోకం చేత చూడబడుతుంది. లోకాన్ని ధైర్యంగా చూస్తూ చిరునవ్వులు చిందిస్తుంది. ఆమె కేప్పటికైనా ఈ లోకంలో ఒంటరిగా బ్రతికే అర్హత ఉంది. కానీ శారద -- ఆమెకు ఆ అర్హత లేదు, అదృష్టమూ లేదు. ఒక తోడూ కావాలి. ఆమె కున్నది ఒక్కటే తోడు. అదే గోపీ. కానీ గోపీ లతకు స్వంత మైపోతున్నాడు. గోపీ ఆసరా లేకున్నా లత జీవించ గలదు. కానీ శారద కు అది చేత కాదు. చేతనైనా లోకం ఆమెనలా బ్రతక నియ్యదు.
    అలాగే ఆలోచనలతో సతమత మవుతూ ప్రక్కపై మేను వాల్చాడు. నిద్ర పట్టక అటూ ఇటూ దోర్లినాడు.
    "ఏమండీ!" అన్న పిలుపు వినిపించి వసంత ను చూశాడు. దీనంగా తననే చూస్తుంది.
    ఆమె పిలిచిందనుకొని "ఏమిటి, వసూ" అన్నాడు సౌమ్యంగా.
    ఆ గొంతు విని మరీ దిగజారి పోయింది వసంత. అందులో తనపట్ల కాఠిన్యమూ లేదు, ద్వేషమూ లేదు. ప్రేమ నిండుకొని ఉంది.
    "నేనంటే మీ కిష్టం లేదా?"
    అర్ధం లేని ప్రశ్న. ఆశ్చర్యాన్నే ఇచ్చింది.
    "అని ఎవరు చెప్పారు?"
    "మరి ఒకనాడైనా నన్ను చేరదీసి లాలించకుండా దూరంగా ఉంటారెందుకు?"
    చెప్పలేని జవాబు. నవ్వు వచ్చింది రాజ్ కు. చిన్నగా నవ్వాడు. అతన్ని పెనవేసుకు పోయింది వసంత.
    ఆ రాత్రి అతనికి ఏమేమో చెప్పి తనివి తీరా ఏడవాలని పొంచింది. అతనితో మాట్లాడుతూ ఎప్పుడూ అతని తియ్యని మాటలు వింటూ కూర్చోవాలని ఇష్టంగా ఉందని అతనితో చెప్పాలని పించింది. తహతహలాడే ఆమె హృదయానికి. తన ప్రవర్తన కు క్షమాపణ వేడుకొని ఇంకెప్పుడూ అతనితో శాశ్వత సుఖాలు అనుభవించాలని నిశ్చయించుకొంది. కానీ ఏ ఒక్కటీ చెప్పలేకపోయింది. ఏదీ చెయ్యలేక పోయింది . అ బలమైన కౌగిట్లో , ఆ లాలన లో మధుర క్షణాలతో సుఖ నిద్రతో ఆ రాత్రి గడిపింది.
    ఉదయమే లేచాడు. ప్రక్కనే ఇంకా నిద్ర పోతున్న వసంత ను చూశాడు. చిరునవ్వు గులాబీ పెదాలోపై చిందులాడుతుండగా నిద్రపోతుంది. ఆ అందమైన పెదాలను ముద్దు పెట్టుకోవాలని పించి ఆ పనే చేశాడు.
    ఉత్సాహంతో లేచాడు. ఎన్నడూ లేని ఉత్సాహం . అంతులేని ఉత్సాహం.
    "అమ్మాయ్ , మరి ప్రయాణాని కన్నీ సిద్దం చేసుకోన్నావా?' అడిగారు ఆనందరావు గారు.
    వసంత భర్తను చూసింది. పేపరు చదువుకొంటూ ఓరగా తన వైపు చూస్తున్నాడు.
    "నేను ఈ ఊరు విడిచి ఎక్కడికీ వెళ్ళలేను , నాన్నా!"
    "వసంతా!" గట్టిగా అన్నారు ఆనందరావు గారు.
    "క్షమించండి , నాన్నా! అంతే."
    "ఛ" అని బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయారాయన.
    "వసూ !' పిలిచాడు రాజ్.
    "ఊ" అని వెనుదిరిగింది.
    ఆమె భుజాల పై చేతులుంచి ఆ కళ్ళలోకి సూటిగా చూశాడు. తల వంచుకోంది వసంత.
    "నువ్వు నిజంగానే అంటున్నావా ఈ మాట?"
    జవాబు చెప్పలేక పోయింది. అతనితో వెళ్ళిపోవాలని ఉంది. కానీ ఏదో పెంకితనం. అర్ధం లేని స్వాతంత్యం. బలవంతం చేస్తారనే ఆశ-- ఆకాంక్ష.
    "ట్రెయినింగ్ అయిపోతే అక్కడే పని చేయవలసి ఉంటుంది." ఆలోచించుకోనేందుకు అవకాశం. కానీ అది కాదు తనకు కావలసింది. అధికార పూర్వకమైన అజ్ఞ కావాలి.
    "నా వెంట రావడం నీ కిష్టం లేదా?"
    "ఉహూ."
    అప్పటికయినా కోపంతో ఎందుకు రావు అని అడుగుతాడని ఆశించింది. అది జరుగలేదు.
    "సరే, నీ ఇష్టం." వెళ్ళిపోయాడు.
    అర్ధం కాని తత్వం రాత్రే అంతులేని ఉత్సాహాన్నిచ్చింది . అంతలోనే ఆ ఆశను చంపేస్తుంది. అడుగంటా నాశనం చేస్తుంది. బహుశా తన కోరికలూ తీర్చుకోవడానికి అది ఒక ఎత్తేమో? కావచ్చు. కాకపోనూ వచ్చు. సందిగ్ధావస్థ లో సమస్యలను సృష్టిస్తుంది. అధికారం చెలియించకూడదు. అది చేస్తే అనర్ధమే దాపురించవచ్చు. మధ్యన మామగారి మనసు నొప్పి పడవచ్చు. అందుకే గత్యంతరం లేక తన పనిలో నిమగ్నుడై పోయాడు రాజ్.
    
                           *    *    *    *
    రాజ్ వెళ్లి పోయినప్పటి నుండి రజియా మనసే లోపించింది. డిస్పేన్సరీ లో కూర్చున్నా మెదడు పని చెయ్యదు. ఒంటరిగా కూర్చుంటే అవే ఆలోచనలు. క్రొత్త ఊళ్ళో భోజన సౌకర్యం సరిగా అమరిందో లేదో ననే ఆవేదన ఆమెను వెన్నాడు తుంది.
    సాయంకాలం ఒంటరిగా తమ సాంకేతిక స్థలానికి పోయి కూర్చుంటే పరిసరాలు తన ఒంటరితనాన్ని గేలి చేస్తున్నాయి. సముద్రుడు వెక్కిరిస్తున్నాడు. రాజ్ ప్రక్కన లేకుంటే ఆ ప్రదేశమంతా నిర్జీవమై, నిస్సారమై , నిరుత్సాహంగా ఉన్నట్లు తోస్తుంది. క్రింద నున్న ఇసుక చేతిలోకి తీసుకొంటే ఆ ఇసుక రేనువులలో అదే స్వరూపం. ఏ పని చేయాలన్నా అదే రూపం జ్ఞాపకం వస్తుంది. నిద్ర పోవాలనుకుంటే కన్నులలో మెదులు తుంటాడు. ఒక పని చేయాలని అనిపించదు. ఊరికే కూర్చోవాలనీ అనిపించదు. క్షణ క్షణానికీ ఆ మొహం, ఆ మాటలూ జ్ఞాపకానికీ వచ్చి కలవరాన్ని రేపుతాయి. ఒంటరిగా కూర్చున్నప్పుడు అడుగుల చప్పుడు వినిపిస్తే అతడేనేమోనని జాగ్రత్తగా వింటుంది. తిరిగి నిరాశ. అదే నిరుత్సాహం. అప్పుడప్పుడు "రజీ" అని పిలిచినట్లయి ఉలిక్కిపడుతుంది. ఎందుకు తనింత బెలై పోతుంది? తన హృదయాన్ని ఇంతగా వశ పరచుకొని తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు.
    ఆ భావాల నంతా ఉత్తరాల్లో వెళ్ళ గ్రక్కుతుంది. "రాజ్, నువ్వు ఎప్పుడూ నా కనులలో మెదులు తుంటావు. నీ రూప మెప్పుడూ నా హృదయం లో వెలుగుతుంటుంది. కానీ నిన్ను చూడాలని నా కళ్ళు , నీ మాటలు వినాలని, నా హృదయం ఎప్పుడూ తహతహ లాడుతుంటాయి. దీనికి విముక్తి ఎప్పుడో!"
    మనిషి విలువ దగ్గరగా ఉన్నప్పటి కంటే దూరంగా ఉన్నప్పుడే పెరుగుతుందన్న విషయం వసంత విషయంలో నిజమయింది. భర్త వెళ్ళిపోయినప్పటి నుండీ ఏ పనీ చెయ్య బుద్దిపుట్టదు. అలంకరించు కోదు. ఎవరి కోసం అలంకరించుకోవాలని ఎదురు తిరుగుతుంది మనసు. అప్పుడప్పుడు భర్త దగ్గరికి వెళ్ళిపోవాలని నిశ్చయించు కొంటుంది. కానీ తండ్రి ముందు ఆ విషయం చెప్పడానికి అభిమానం అడ్డు వస్తుంది. ఎప్పుడూ మనసులో రగిలే బాధ తీరదమేలా? ఏంతో ప్రీతిగా భర్త ఉత్తరాలు వ్రాశాడు. జవాబు వ్రాయాలను కొంటూనే వ్రాయలేక పోయింది. ఆ ఉత్తరాలు రావడం లేదు.
    ఆ బాధ నుండి తప్పించు కోవడానికి క్రొత్త స్నేహితులను సంపాదించు కొంది. ఉదయం లేచి వారితో కబుర్లు చెప్పుకోవడం , సాయంకాలం టెన్నిస్ నేర్చుకోవడం పరిపాటయింది. మొదట మహిళా మండలికి వెళ్ళింది. కానీ అక్కడ సూటి పోటీ మాటలనూ, విమర్శలనూ భరించలేక టెన్నీస్ క్లబ్ లో చేరింది.
    అక్కడే సురేష్ అనే ఒక యువకునితో పరిచయమయింది. సురేష్ మునసబు. అందగాడు, అభిరుచులు గలవాడు. ఇంకేం కావాలి? స్నేహం అధికమయింది. ఆ బాధను మరిచి పోవడానికి ఆ ఆనందం కావాలి అనుకొంది.
    పిచ్చి ఊహ, పిచ్చి అభిప్రాయాలు , అభిరుచులు. వీటిలో పడి కాలం సాగిపోతుంది. తప్పు కప్పి పుచ్చాలని మరో తప్పు చేసే మానవ యత్నం. అర్ధం లేని ఆనందం. అక్కరకు రాని ఆత్మ విశ్వాసం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS