రాజా తిరిగి వచ్చేసింది. సుందరాన్ని మరింత ద్వేషించసాగింది. పూర్వంలాగే మా ఇంటికి వస్తూంది. సుందరం జరిగిందంతా మరచాడు. మామూలుగా మాట్లాడుతున్నాడు. రాత్రింబవళ్ళు తపిస్తున్నాడు-అమెరికా వెళ్ళాలని! పీనాసితనం ఎక్కువయింది. బీడీ మానేశాడు.
రాజా అతనికోసం ఏమీ తెచ్చిపెట్టడంలేదు. సుందరం పకోడీలు మానేశాడు. ఉప్పు తినడం మానేశాడు. చప్పని కూరలు తింటున్నాడు.
రాజా పెళ్ళి జరిగిపోయింది. కొన్ని నెలల తరువాత పుట్టింటికి వచ్చింది. అప్పుడు సుందరానికి ఊరగాయ గుర్తుకు వచ్చింది.
"వదినా! రాజాను పిలవండి. ఇప్పుడిహ ఆమె ముఖాన తిలకం తీర్చి ఉంటుంది. వందల విలువగల చీరలు కడ్తుంటుంది" అన్నాడు సుందరం.
రాజా అత్తగారివాళ్లు మోసం చేశారని శాంత చెప్పింది. వాళ్ళీపెళ్లి సరకులు అరువు తెచ్చారట. రాజా మొగునికి చిన్న దుకాణం ఉందట. పుట్టింటినుంచి అయిదువేలు తెమ్మని రాజాను పంపించారట. పాపం తండ్రి బాధ చెప్పలేం.
భోజన సమయంలో శాంత ఉప్పువేసిన కూర సుందరానికి వేసింది. ఇద్దరికీ పోరు జరిగింది.
"నా కూరలో ఉప్పెందుకు వేశావ్?"
"నాకేం తెలుసు- ఉప్పు నీకు విషమని?"
"అవును. ఉప్పు నాకు అమృతమనా మీరనుకునేది?"
"కాక. అమృతాన్ని మించిందే" శాంత తక్కువ తిన్నదేంకాదు. 'రాజా పకోడీలు తెచ్చిపెట్టినప్పుడూ, ఊరగాయలు తినిపించినప్పుడూ ఉప్పు నీకు అమృతాన్ని మించిందే'
అప్పటికి రాజా వచ్చేసింది.
'నన్నింకా మీరు మరువనట్లున్నారు' అన్నది.
ఎవరూ మాట్లాళ్ళేదు. అంతా మౌనం వహించారు.
'నీ పేరు-నీ పేరెవడు తలచాడు? వదిన విషాన్ని గురించి మాట్లాడుతూంది' సుందరం మెల్లగా అన్నాడు.
రాజాను చూచాను. రెండుమూడు నెలల్లోనే మారిపోయింది. సాదా నూలుచీర కట్టుకుంది. పెదవుల మీద వెలుగు లేదు. ముఖాన కాంతిలేదు. ఆమెను చూచి నిండుగా ఉండిన ఇల్లు అమాంతంగా రిక్తం అయినట్లు అనిపించింది. నేను సుందరాన్ని చూచాను. రాజాను చూడకుండడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
'ఏమిటాలోచిస్తున్నావు సుందరం? వదిన నీకు ఊరగాయలు పెట్టడం లేదా?' రాజా అడిగింది.
"సుందరం అమెరికా వెళ్ళకముందే ఇంగ్లీషువాడైపోయాడు. ఊరగాయలెక్కడ తింటాడు? ఉప్పు కూడా వదిలేశాడు' శాంత సాగదీసింది.
"ఉప్పు వదిలాడా? అయితే నన్నూ మరుస్తాడు" రాజా నవ్వింది. "అప్పగింతలప్పుడు ఓదార్చడానికి కూడా రాలేదు కృతజ్ఞుడు. వదినా! నిజం ఈ మగవాళ్ళవి రాతి గుండెలు! ఇతనితోకాక అమ్మాయితో ఇంత స్నేహం చేసిఉంటే ఎంత ఏడ్చేదో ఇప్పుడు"
"ఏంచేయను రాజా! స్త్రీ హృదయం నాకెలా వస్తుంది? నేను మగాణ్ణి." సుందరం సిగ్గుపడిపోయాడు.
"బొట్టెందుకు పెట్టుకోలేదు?" శాంత అడిగింది.
"పెట్టుకున్నాను. రాలిపోయినట్లుంది." వేలితో నొసలు చూచుకుంటూ అన్నది.
అది విన్నాడు సుందరం. లేచాడు అల్మారీ తెరిచాడు. పుస్తకాలు వెదకసాగాడు.
"సుందరం! రారాదూ-ఇలా కూర్చో! నా బొట్టు నీ పుస్తకాల్లో ఉందని వెదుకుతున్నావా?" రాజా అన్నది.
"అవును, నీ బొట్టు ఇందులోనే ఉంది. నీ పెళ్ళికి బహుమతి ఇవ్వలేకపోయాను" అంటూ తన బ్యాంక్ పాస్ బుక్ తెచ్చి రాజాకు అందించాడు.
"ఎనిమిదివేలు!!" రాజా కళ్లు తిరిగాయి. శాంత ఉలిక్కిపడ్డది.
"ఇంత కఠినశిక్ష విధించకు సుందరం!" రాజా చేతులు వణుకుతున్నాయి.
"నీ పెదవులకు లిప్ స్టిక్ లేదు. నొసట బొట్టులేదు" అలిగినట్లు అన్నాడు సుందరం.
సుందరం అమెరికా వెళ్ళలేదు. మద్రాసుకు బదిలీ అయింది. అతడు ఉత్తరాలు రాయలేదు. ఉద్యోగం కూడా ఊడిందని విన్నాను. వాడు నా తమ్ముడు కాదు. భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోలేని బుద్ధిహీనుడైన మిత్రుడు. అలాంటివాడు నాకెందుకు గుర్తుకొస్తాడు?
సుందరం డబ్బుతో రాజా భర్తకు కలిసివచ్చింది. అప్పుడప్పుడూ కారులో రాజా మా ఇంటికి వచ్చేది. ఆమె లిప్ స్టిక్ పెదవులు ఎంతో బావుంటాయి. ఆమె కూర్చుంటే గది సాంతం వెలిగేది, ఆమె పట్టుకుంటే గ్లాసు పగిలేది. శాంత బాల్కనీ నుంచి ఆమె కారును తాకే కుర్రాళ్ళను కోప్పడాల్సివచ్చేది. ఆమె తన ఇరుగు పొరుగుల్తో చెప్పేది, రాజా తన స్నేహితురాలనీ-వాళ్లు చాలా ధనికులనీ.
నేను సుందరం కథ రాయలేదు. మంచిదయింది. రాస్తే ఉప్ప చప్పగా ఉండేది. పదేళ్లు గడిచిపోయాయి. ఇవ్వాళ సుందరం వచ్చాడు. ఏదో గారడీ జరిగినట్లు సుందరం వెంట్రుకలు తెల్లబడ్డాయి. పళ్లు ఊడిపోయాయి. అతన్ని చూస్తుంటే కొంటె పిల్లవాడు తెంపి, నలిపి పారవేసిన పూవులా కనిపించాడు. మిగిలిన బీడీ ముక్క జేబులో వేసుకున్నాడు. గోడకు ఉన్న పటం చూచాడు. అందులో రాజా, ఆమె పిల్లలు ఉన్నారు.
"ఎవరు! మీ పొరుగింటి రాజాయేనా! అయితే ఇప్పటికీ ఆమె లిప్ స్టిక్ వాడుతూంది. ఖరీదైన చీరలు అలంకరించుకుంటూంది. అచ్చా! కారు కూడా ఉందా! బావుంది, చాలా బావుంది!" అన్నాడు సుందరం.
అతని చేతులు వణుకుతున్నాయి. జేబులోంచి బీడీ ముక్క తీశాడు. నోట్లో పెట్టుకున్నాడు. భవిష్యత్తును గురించి ఆలోచించినట్లున్నాడు. బీడీ ముక్క నోట్లో నుంచి తీశాడు. మళ్ళీ జేబులో వేసుకున్నాడు. అతడు నావైపు చూచాడు. చాలా గర్వంగా చూచాడు. అమెరికా వెళ్ళివచ్చినట్లు చూచాడు. అక్కడినుంచి ఏదో డిగ్రీ తెచ్చినట్లు చూచాడు. గొప్ప సూటులో ఉండి మెరిసిపోతున్నట్లు చూచాడు. అన్నాడు:
"మనిషి తన గతాన్ని ఎన్నడూ మరువలేడనే కథాకారులు ఎంత అబద్ధాల కోరులు!"
* * * *
