ఆనాటి రాత్రి ఏదో అలికిడికి మెలుకువ వచ్చింది. చూస్తే సుందరం బాల్కనీలో తిరగాడుతున్నాడు. తెల్లవారి సుందరం బీడీ సాంతం ఒకేసారి కాల్చేశాడు. బేబీకి లెక్కలు చెప్పలేకపోయాడు. పాలకూర తెమ్మంటే పొట్లకాయలు తెచ్చాడు. రూపాయి ఇచ్చి చిల్లర తీసుకోవడం మరిచిపోయాడు.
గంటలో శాంత తిట్లన్నీ మరిచాడు.
"వదినా! ఇవ్వాళ రాజా రాలేదేం?" అని అడిగాడు.
"రాజా ఇక్కడికి రావాలంటే సిగ్గుపడుతూంది. ఇహ నువ్వు కూడా ఆమెతో పరాచికాలు మానెయ్- ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు! పెళ్ళి అయింతర్వాత మీ ఇష్టం"
శాంత వంటింట్లో గిన్నెలు సర్దింది. నేను పేపరు చాలాసార్లు చదివేశాను. సుందరం మాత్రం బూడిద చేతుల్తో పళ్లెం పట్టుకుని అలాగే కూర్చున్నాడు. అతడు చప్పున లేచాడు. పళ్లెం పడేశాడు. బూడిద చేతుల్తో నన్ను పట్టుకొని ఏడ్చేశాడు. నేను చకితుణ్ణయినాను. ఎందుకు ఏడుస్తున్నాడో అర్ధంకాలేడు. నేను నా కథల్లో మానవ ప్రకృతిని అనేక కోణాల్నుంచి పరిశీలించాను. హీరో వలపుటగ్గిలో మండుతాడు. అప్పుడు సూర్యచంద్రులు చేష్టలు ఉడుగుతారు. వాతావరణం ఉదాసీనం అవుతుంది. ఆకాశం కన్నీరు కారుస్తానని శపథం చేస్తుంది. కాని సుందరం విషయంలో అలా జరగలేదు. నా సహితంగా ప్రకృతి సాంతం ఊపిరి బిగపట్టి చూడసాగింది. అందువల్ల అతనిని ఓదార్చినవారు లేరు. అతడే తెములుకున్నాడు అన్నాడు.
'నేను రాజా ప్రాణం తీయలేను. వదిన నాకూ ఆమెకూ పెళ్ళెందుకు నిశ్చయించింది? నేను ఇంత సంతోషం భరించలేను. పిచ్చివాణ్ణయిపోతాను'
మళ్ళీ ఏడ్పు సాగించాడు.
నాకేమీ అర్థంకాలేదు. అతకని ఈ సంబంధాన్ని శాంత ఎలా అతికించింది? ఈ పిసినారి వెధవంటే రాజాకు పడేదేకాదు. ఆమెకు సుందరం విషయంలో ఉన్నది ద్వేషమా? ప్రేమా? నేను కథాకారుణ్ణి, కథలల్లుతాను. కాని ఈ ఇంట్లో ఇన్ని వలపు కోరకాలు వికసించాయని ఎరుగను. ఇక్కడ ప్రేమ పరిమళాలు గుబాళించాయని గమనించలేదు. నేను ద్వేషపు ముళ్లు మాత్రం ఏరుతున్నాను. రాజా సుందరాన్ని ద్వేషిస్తుందనుకున్నాను. సుందరం ఆమెకోసం అంత ఖరీదైన చీరలు ఏడనుంచి తెస్తాడు? ఆమె ఫ్యాషన్లు, వృధా ఖర్చులు ఎలా భరిస్తాడు? వలచిన ఆడది అంత త్యాగం చేయగలదా? అలాంటి రాజాను తలచుకొని ఆశ్చర్యపోయాను.
సుందరం ఏడుస్తూనే ఉన్నాడు.
శాంతను విషయం అడిగాను. ఆమె కిలకిలా నవ్వింది. "మీ దోస్తుకు చెప్పండి- మొదట ముఖం కడుక్కోమని. రాజా వీణ్ణి పెళ్ళాడుతుందని నేనెప్పుడన్నాను? రాజా తండ్రి ఆమెకోసం బంగారంలాంటి వరుణ్ణి చూశాడు. చాలా పెద్ద వ్యాపారం ఉందట వాళ్ళకు."
శాంత నవ్వుతుంటే నాకు ఏడుపు వచ్చింది.
సుందరం రాత్రికి ఆలస్యంగా వచ్చాడు. ఇంకా రాత్రి ఏమిటి? ఓటమి పులుముకున్న అతని ముఖంలో విజయ చిహ్నాలైన వేల దీపాలు వెలుగుతున్నాయి. అతడు కొన్ని ప్యాకెట్లు, బండల్స్ తెచ్చాడు. వాటిలో చీరలున్నాయి. చెప్పులున్నాయి. మేకప్ సామగ్రి ఉంది. ఇంకేమేమి ఉన్నాయోగాని వాటితో టేబుల్ నిండిపోయింది. అతడు సంతోషంతో ఊగిపోతున్నాడు.
"వదినా! ఇవన్నీ రాజాకు పసందు అవుతాయిగా? ఏదో మామూలు సామాను. ఇకనుండి రాజా తన ఇష్టప్రకారం కొంటుంది." సంతోషంలో మాట తడబడుతూ అన్నాడు.
"కాని నువ్వు ఇంత డబ్బు ఎలా ఖర్చుచేశావు?" శాంత అడిగింది. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది.
"నా రాజాముందు డబ్బొకలెక్కా వదినా! రాజా చిరునవ్వు కోసం నా ప్రాణాలిస్తాను. నేను అమెరికా ఎందుకు వెళ్తాను-రాజాకోసం! నేను ఆమెరికా వెళ్తే రాజా ఇక్కడ మహారాణిలా ఉంటుంది."
శాంతకు ఎందుకో భయం అవుతూంది.
సుందరం తెచ్చిన బహుమతులన్నీ చాటుగా శాంత రాజాకు అందించింది.
ఇహ మా ఇద్దరి మనసు మనసులో లేదు. నా బుర్ర బొత్తిగా పనిచేయడం లేదు. తరువాతి అధ్యాయం ఎలా ప్రారంభించాలో అర్థం కావడంలేదు. సుందరానికి జీవితం ప్రసాదించాలా? హాలాహలం ప్రసాదించాలా?
రాజా మా ఇంటికి రావడం మానేసింది. ఆమెకు విలువైన బట్టలతోనూ, నగలతోనూ సరిపోతూంది. ఆమె తండ్రి రెండువేలు అప్పు తెచ్చాడు. పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయినాయి. ఆ ఇంటి రూపమే మారిపోయింది. పెండ్లి ఏర్పాట్లు సందడితో వెలిగిపోతూంది. సుందరం ఆనందానికి అంతులేకుండా ఉంది. పెళ్ళికి ఏమేమి చేయాలను శాంతను అడుగుతున్నాడు.
"రాజా తండ్రికి నన్ను గురించిన వివరాలన్నీ తెలుసునా? ఆఫీసువాళ్లు నా పిసినారితనం గురించి చెప్పలేదుకదా!" సుందరం నన్ను అడిగాడు.
"అవును. నిన్ను గురించి అన్నీ తెలుసు వారికి" అన్నాన్నేను. నేను నా కొత్త కథ ముగింపుకు గురించి ఆలోచిస్తున్నాను.
"నిజం?" సుందరం లేచి కూర్చున్నాడు 'అయినా....' అని నసిగాడు.
నా కథకు చివరి పేరా రాస్తూ 'అందుకే వాళ్లు మరో వరుణ్ణి ఎన్నుకున్నారు' అన్నాను.
సుందరం ముఖ కవళికలు వింతగా మారాయి. చావుబతుకులు నా ఆధీనంలో ఉంటే నాకు నేనే ఉరిశిక్ష వేసుకునేవాణ్ణి. భగవంతుడు బతికిఉన్నవాడికి కాలిచచ్చే శిక్ష విధిస్తే నాకు అది తప్పదు. ఆరోజు-ఆ క్షణంలో ఎన్నెన్ని చూశాను! పిడుగులు కురిసేది చూశాను. తనువు నుండి ప్రాణం ఎగిరిపోవడం చూశాను. మొక్క నుండి పూలు రాలడం చూశాను. ఎన్నెన్ని చూచాను ఆ క్షణంలో!
ఆనాడూ సుందరం ఇదే గదిలో కూర్చున్నాడు. పట్టపగలు కటిక చీకట్లు పర్చుకున్నాయి. ఏడుపు నా గొంతులో ఉబుకుతూంది, సుందరాన్ని చూచాను. అతని బాధ భరించరాకుండా ఉంది. అతని గొంతు పిసికి భవబంధాల నుండి విముక్తుణ్ణి చేయాలనిపించింది.
మూడోరోజు ఆస్పత్రికి వెళ్ళేప్పుడు నా కాళ్లు వణికాయి. నర్సులను చూస్తుంటే భయం ముంచుకొస్తూంది. ఏ నర్సు ఏ వార్త చెపుతుందో?
గుమ్మంలో సుందరమే కనిపించాడు. చాలా మామూలుగా ఉన్నాడు. ఏమీ జరగనట్లే ఉన్నాడు. నన్ను చూచాడు. పక్కమంచపు రోగిని గురించి ప్రస్తావించాడు. ప్రక్కరోగికి మూత్రపిండాల జబ్బు, పాపం చాలా బాధపడుతున్నాడు.
నాకు నిరాశ ఎదురయింది. సుందరాన్ని కథానాయకుణ్ణి చేయరాదని నిశ్చయించుకున్నాను. ఏమిటిది? ప్రేమించేవాళ్లు ఇలాగే ఉంటారా?
సుందరం ఆస్పత్రి నుంచి వచ్చిన రాత్రి పడుకున్నాడు. ఉదయం చూస్తే మంచం ఖాళీగా ఉంది. అతడు లేడు. మాయం అయినాడు. నాకు భయం అయింది. వణికిపోయాను. ఎందుకంటే వలపు కథల చివరి అధ్యాయం రాయడానికి బయలుదేరాడా అని. మధ్యాహ్నం వరకూ అంతటా వెదికాం. అతని ఏడువేల రూపాయలు నా పేర రాసిన పత్రం కోసం ఇల్లంతా గాలించాం. పత్రం దొరకలేదు. అల్మారీలో పుస్తకాల కింద పడివున్న పాస్ బుక్ నన్ను చూచి నవ్వుతూంది.
రాత్రికి శాంత వినిపించిన వార్త ఏమంటే-రాజా కూడా ఇంటినుంచి మాయం అయిందని! రాజాను సుందరం లేవదీసుకుపోయాడని రాజా తల్లి అనుమానం. పోలీసుకు రిపోర్టు చేయమంటుంది. రాజా తండ్రికి అది ఇష్టంలేదు. కూతురు ఇష్టప్రకారమే వాళ్లిద్దరికీ పెళ్లిచేయాలని అతని అభిమతం.
తెల్లవారి లేచి చూస్తే సుందరం కనిపించాడు. పంపు దగ్గర ముఖం కడుగుతున్నాడు. నా గుండెకు పోటులాంటిది వచ్చింది-అవును ఏడువేలు రూపాయిలు పోగొట్టుకున్న వ్యధ! తరవాత రాజా శాంతకు చెప్పిందేమంటే తాను స్వయంగా సుందరాన్ని బలవంతం చేసిందని, తనను కాదనలేక సుందరం తనవెంట వచ్చాడని. జరిగిందేమంటే వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఒక హోటల్లో గది తీసుకున్నారు. తనను పెళ్ళాడ్తే రాజా కష్టాలు పడాల్సివస్తుందని సుందరం చెప్పాడు. రోజూ కనీసం ఒక కొత్తచీర తేగల భర్త కావలెనన్నాడు. ఆమె పెదవుల వెలుగు నిలిపేవాడూ, ముఖకాంతిని రక్షించగలవాడు భర్తగా ఉండాలని బోధించాడు. అతడు తన పేదరికాన్ని గురించి వివరించాడు. అమెరికా వెళ్ళడం తన జీవితలక్ష్యం అన్నాడు. రాజాను పెళ్ళాడితే తానేమీ చేయలేనన్నాడు.
