ఎంకమ్మ
"ఎంకమ్మా! ఇంత ముసలిదానివి ఎలా అయినావు?"
ఇది ఈనాడు రాజా నన్నడిగిన ప్రశ్న. నా గదిలో పడుకొని వంటరిగా ఆలోచిస్తున్నాను-అవును నేను ఇంత ముసలిదాన్ని ఎలా అయ్యాను?
యవ్వనం చెప్పకుండా ఎలా జారిపోయింది? వార్ధక్యం ఎలా నా దరిచేరింది? ఏమో నాకేమీ జ్ఞాపకం రావడంలేదు.
బయట వాన జోరుగా పడ్తూంది. పక్కింటి అమ్మాయి కిటికీలోంచి చూస్తూ గునుస్తూంది- "కన్నయ్య నీకోసం ఎన్ని బాధలు సహించాను....."
బయట చాలా గొడవగా ఉంది. బాలకృష్ణ పిల్లలూ, కిట్టు పిల్లలూ అరుస్తున్నారు- అల్లరి చేస్తున్నారు. కిట్టు పెళ్ళాం వనిత మొగునితో పోట్లాడుతూంది. అయినా కిట్టు కాస్త నవ్వుతూ మాట్లాడాడా వనిత అన్నీ మరుస్తుంది. వాడి ఒక్క చిరునవ్వు చాలు- లోకంలోని సుఖాలన్నింటినీ మరుస్తుంది. మురుస్తుంది. లోకంలోని ఆడవాళ్ళందరూ తనకంటే తక్కువేనన్నట్లు భావిస్తుంది.
మనకు తల్లిదండ్రులంటే గౌరవం. భర్త అంటే గర్వం. పిల్లలంటే వాత్సల్యం. భగవంతుడు ఎక్కణ్ణుంచి తెచ్చిపెట్టాడో ఇవన్నీ? అన్ని శాస్త్రాల్లోనూ ఈ విషయాలే చెప్పబడినాయి. ఎవరికి గుండెలున్నాయి-వాటిని అతిక్రమించడానికి? గుండెలున్న ఆడది ముండ అవుతుంది-రాజా అవుతుంది- స్త్రీ జాతికి తలవంపులు తెచ్చే రూపం ధరిస్తుంది. లోకానికి స్త్రీ మీద చచ్చే సానుభూతి. సతీ సావిత్రీ అయి, నావలె నరకంలో మగ్గి మసి కావాలంటుంది. ఏమిటీ పాపిష్టి ఆలోచనలు? ఎందుకిలాంటి వంకర టింకర ఊహలొస్తాయి నాకు? కాటికి కాళ్లు చాపి కూర్చున్నాను. అరవై ఏళ్ళొచ్చాయి. ఇప్పటికీ ఎందుకీ జీవితాశ? నేనేదో త్యాగాలు చేశాననుకోవడం! ఇదీ ఒక భ్రమ! ఎంతోకాలం గడిచింది. నాకు చావు దగ్గర పడింది. ఇప్పుడెందుకు కంటపడింది రాజా నాకు? అవును. ఆమె నా మనసును మలినం చేసింది. నిజం.
నాకు గడచిన కథలు గుర్తొస్తున్నాయి. గతం నాముందు నిలిచింది. అదిగో కనిపిస్తూంది.
వాన జోరుగా పడుతుంది. పిల్లలు బడి మానేశారు. ఇంట్లో గొడవ చేస్తున్నారు. వర్షం తెగిన ప్రేమబంధాల్ను గుర్తుచేస్తుందంటారు. మానిన గాయాల్ని పచ్చి చేస్తుందంటారు. ఏమో! నాకెన్నడూ తెలియదు-ప్రేమని దేన్నంటారో? ఒకే వ్యక్తిని జీవిత సర్వస్వం అనుకుని జీవితం సాంతం ఎలా లాగుతారో? అన్ని కథల్లోనూ,సినిమాల్లోనూ ఈ విషయమే చెపుతుంటారు. ఏమిటో నాకు ఒక్క ముఖమూ గుర్తులేదు. నన్ను ప్రేమించినవాడు, లోకంలో అన్నింటినీ మించి నన్ను కోరినవాడు ఉంటే, చావు దగ్గరపడిన ఈ వయస్సులో తలచుకునేదాన్ని.
మా తెలుగువాళ్లలో కూతుళ్లు పెద్దవాళ్ళయి ఇంట్లోనే ఉండిపోతారేమోనని తల్లులు భయపడుతుంటారు. పుట్టింటినుంచి మెట్టినింటికి వెళ్ళేప్పుడు కూతురు మనసులో మరోరూపం ఉండరాదని జాగ్రత్తపడ్తారు. మా నాన్నా అలాగే తొందరపడ్డాడు. అందుకే వర్షాన్ని చూస్తే ఎవరూ గుర్తుకురారు- పుట్టిల్లు జ్ఞాపకం వస్తుంది. పల్లె వదిలాను. మావారితో పట్నం వచ్చాను. అప్పటినుంచీ వాన చూస్తే పుట్టిల్లు గుర్తుకువస్తుంది. పట్నం వాళ్ళకు వాన పీడలా కనిపిస్తుంది. వర్షం విలువ పల్లెవారికే తెలుసు-పంటలు పండించడం వాళ్ళకు తెలుసు. వాన వారికి ప్రాణంలాంటిది.
ఊళ్లో మా ఇల్లే పెద్దది. అంతకంటే పెద్దిల్లు ఆ ఊళ్ళోలేదు. మల్లేశం బాబాయి ఊళ్ళోకి ఒక భోగం రాజాను తెచ్చారు. ఆమెకోసం బాబాయి మా ఇంటిముందే మరో ఇల్లు కట్టాడు. అది మా ఇంటికంటే పెద్దది. మా బాబాయి డబ్బున్నవాడు. వారికి తాటివనాలున్నాయి-పొలాలున్నాయి. పశువులున్నాయి. అందువల్ల ఎవరూ నోరు మెదపలేదు. పెద్దమనుషులు నీళ్లు మింగి ఊరుకున్నారు. మాట మాట్లాడలేదు. మా చిన్నమ్మ నలుగురు పిల్లల తల్లి. ఆమెను ఇంట్లో వదిలారు. బోగందాని ఇంట్లో మకాం పెట్టారు.
నాకు అప్పుడు పదకొండేళ్లు, సిగ్గు మొగ్గలు వేస్తున్న వయసు. "పెళ్ళికొడుకు" అనే మాటవింటే వంట్లో రక్తం సాంతం వదనంలో చేరేది. మా రెడ్ల ఇళ్లలో ఈ వయసు పిల్లల్ను ఇళ్లల్లో ఉంచుకోరు. మా నాన్న అదివరకే ఇద్దరు కూతుళ్లకు చెరి ఇరవైవేలు పెట్టి మొగుళ్లను కొన్నాడు. నాకూ మంచి వరుణ్ణి తేవాలని డబ్బు కూడపెడ్తున్నాడు. అమ్మా, నాన్నా రోజూ గుడికి వెళ్ళేవారు. పంటలు బాగా పండాలని ప్రార్ధించేవారు. తునికి ఆకు వ్యాపారం బాగా జరగాలనీ లాభాలు రావాలనీ మొక్కేవారం. ఇదంతా దేనికోసం? నా పెళ్లికోసం.
నాకివన్నీ ఏమీ తెలియవు. నేను పుస్తకం తెరిచి కూర్చునేదాన్ని. నా మనసులో మాత్రం పెళ్లిని గురించిన ఆలోచనలు పరిభ్రమిస్తుండేవి. పెళ్ళంటే తొందర. ఏదో ఆతురత. త్వరగా జరిగిపోవాలనే రభస. ఇవన్నీ ఎందుకు కలిగాయంటే అమ్మ నన్ను చదువుకోవడానికి పంపేది. అందువలన ఆలోచనలు రాసాగాయి. అమ్మా నాన్నా ఉన్నప్పుడు నన్ను గదిలోకి ఎందుకు రానివ్వరు? ఇది అర్థం అయ్యేదికాదు.
నేను వెళ్ళేది చదువుకని. నేను ఏం చూసేదాన్నో ఎవరికి తెలుసు?
మల్లేశం బాబాయి ఇల్లు నేను చదువుకునే గదిముందు ఉంది. వారిద్దరి గదీ నాకు కనిపిస్తుండేది. బాబాయి, రాజా చిలకాగోరింకల్లా కనిపించేవారు. వారిని చూస్తే నాకు నిప్పులో పెట్టినట్లుండేది. కొలిమిలో కాల్తున్న ఇనుప సలాకలా అనిపించేది. కాస్త దెబ్బ తగుల్తే విరిగి ముక్కలైపోతాననిపించేది. ఇహ చదువుమీద ధ్యాస ఎక్కడ? పుస్తకం పారేసి పెళ్లికొడుకును గురించి ఆలోచించేదాన్ని. లోకం మరిచేదాన్ని.
రాజా చక్కగా అలంకరించుకునేది. సరిగ్గా ఆమెలా అలంకరించుకోవాలనే ఉబలాటం నాకు. రాజా ఏ రంగుల చీరలు కడ్తుందో అలాంటి చీరలే కట్టాలనిపించేది. రాజా ఎంత అందమైంది. ఎప్పుడూ కిలకిలలాడుతుంటుంది. కూనిరాగం తీస్తుంటుంది. మా ఇంట్లో ఎవరూ అంత సంతోషంగా ఉండడం చూళ్లేదు. మా అక్కలు అత్తగారి ఇంటినించి వచ్చేప్పుడు నిట్టూర్పులు విడుస్తూ వచ్చేవారు- వెళ్లేప్పుడు కళ్లు తుడుచుకుంటూ వెళ్ళేవారు.
రాజా నవ్వుతుంది. తుళ్లుతుంది. పాడుతుంది. ఇంట్లో ఉండే సంసార స్త్రీలు ఎందుకలా నవ్వలేరు? ఎందుకంత ఆనందంగా ఉండలేరు? అమ్మను అడుగుదామనుకున్నాను ఈ ప్రశ్న. కాని మింగేశాను. నోటమాట రాలేదు. నాకు తెలుసు అమ్మ ఇలాంటి ప్రశ్నలు సహించదు. అగ్గి బుగ్గి అవుతుంది. మెడలు వంగేపని చెప్తుంది- ఇహ మళ్లీ అలాంటి ఆలోచన రాకుండా!
బాబాయి రాజాకు తన చేత్తో తినిపించేవాడు. నేను చూస్తూ ఉండిపోయేదాన్ని. ఒకసారి పూలచెందు స్వహస్తాలతో రాజా తలలో సింగారించడం చూచాను. అప్పుడు నా గుండెలో నల్లనాగులు బుసలు కొట్టాయి. కిందికి దిగి వస్తే చుక్కమ్మ చిన్నమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి- 'వయసులో విర్రవీగుతారు ముండలు. ముసలితనం వస్తే ముష్టెత్తుకోవల్సిందే. చచ్చేప్పుడు కుక్కచావు చావాల్సిందే.'
చుక్కమ్మ చిన్నమ్మ నలుగురు పిల్లల్తో ఇంట్లో పడిఉంది. రాత్రింబవళ్ళు విసుర్రాయి ముందో పొయ్యిముందో పడిఉంటుంది. ముఖంనిండా దుమ్ము, బూడిద. చిరిగిన చీర కట్టుకుంటుంది. అయినా వాటిని లెక్కచేయదు. గేదెపాలు పితుకుతుంది. వాకిట్లో ఊడ్చి చల్లుతుంది. ముగ్గులు వేస్తుంది. పిల్లల బట్టలు ఉతుకుతుంది.
అమ్మ అంటుంది చుక్కమ్మ చిన్నమ్మ అత్తవారింటికి వచ్చిన కొత్తలో ఆమెను మించిన అందగత్తె ఆ ఊళ్లోనే ఉండేదికాదని-కాని ఇవ్వాళ ఆమెను చూస్తే ముఖాన ముడతలు పడ్డాయి. మల్లేశం బాబాయికి ఏదో మంత్రం వచ్చేలాగుంది అనిపించేది నాకు. కాకుంటే అంత అందమైన చిన్నమ్మను ఇంత వికారంగా చేసి, బోగంముండ రాజాను అప్సరసను చేస్తాడా? బాబాయి రాజాను వికారిని చేస్తాడేమో! కాని ఇప్పుడైతే అప్సర్సలాగుంది. అంత అందంగా ఉండి అంత నవ్వు ముఖంతో ఉండే ఆడదాన్ని మళ్ళీ నేను చూడలేను. బహుశా ఆడది అంత నవ్వుముఖంతో ఉండదేమో!
రాజా గుడ్డిదై-బిచ్చగత్తె అయి -చేతులో చిప్పతో బిచ్చానికి రావాలనిపించేది. అది నన్ను బిచ్చం అడుగుతుంది. నేను ఈసుగా చూస్తాను- అప్పుడంటాను- 'మా చిన్నమ్మను ఏడిపించి జీవితాంతం నవ్వాలనుకున్నావు కదూ' అని.
