"సరే సింగినాదంగారూ! మీ అసలు పేర్లు తెలిసేవరకు మిమ్మల్ని ఈ పేర్లతోనే పిలుస్తాను" అన్నాడు సాహస్.
వాళ్ళు తెచ్చిపెట్టుకున్న కోపం ప్రదర్శిస్తూ వెనక్కి నడిచి మిగతా ఆటవికులతో కలసిపోయారు.
తర్వాత వాళ్ళందరూ కోలాహలంగా అరుస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయారు.
"మన ప్రోగ్రాం ఏమిటి? ముందుకా? వెనక్కా?" అన్నాడు అంకుష్.
"ఇందులో అడిగేదేముంది. ముందుకే!" అన్నాడు సాహస్.
ఇద్దరూ ముందుకు నడవడం మొదలుపెట్టారు.
* * * *
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి ప్రెసిడెన్షియల్ పాలెస్ లో-
ప్రొఫెసర్ అన్ వేషితో మాట్లాడడం పూర్తిచేసిన సర్వాధికారి సంతోషం పట్టలేక గబగబ చేతులు రుద్దుకున్నాడు.
తర్వాత విజయగర్వంతో అక్కడున్న అందరివైపు చూసి "ప్రాబ్లెం సాల్వ్ డ్! మన సమస్య తీరిపోయింది" అన్నాడు పెద్దగా.
"ఏ సమస్య? డబ్బు సమస్యేనా తీరిపోవడం?" అంది సర్వాధికారి భార్య చతుర ఆత్రంగా.
"అవును" అన్నాడు సర్వాధికారి.
"అంటే...యూనివర్శల్ బ్యాంకు వాళ్ళు అప్పు ఇస్తామన్నారా?"
"అవును! అవును! అన్ వేషి ఇస్తానన్నాడు. కొన్ని బిలియన్ డాలర్లు. కొన్నాళ్ళపాటు దేశాన్ని నడిపించవచ్చు"
"అన్ని బిలియన్ లూ దేశం కోసమే ఖర్చుపెడతారా ఏమిటి ఖర్మ? ఎవరన్నా వింటే నవ్విపోగలరు! మీకు భార్యాబిడ్డలు ఉన్నారు. వృథా ఖర్చు చేయకండి" అంది చతుర గృహస్తు ధర్మాన్ని గుర్తుచేస్తూ.
"నువ్వూరుకో! ఏం చేయాలో నాకు తెలుసు" అని భార్య దగ్గర మేకపోతు గాంభీర్యం ఒలకపోశాడు సర్వాధికారి.
ఆ తర్వాత అన్నాడు -
"అందరూ వినండి! త్వరలో వామనాస్త్రం ప్రయోగిస్తున్నాం. దాని ప్రభావానికి లోనుకాకుండా కొంతమంది దగ్గరవాళ్ళని సేవ్ చేయాలి. ప్రగతీ! పద పక్కరూములోకి వెళ్ళి మనం లిస్టు తయారుచేద్దాం" అన్నాడు.
ఆ మాట వినగానే ప్రగతి మనసు జంకింది.
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి తోటి పక్కరూంలోకి తను ఒక్కతే.
పక్కరూము అంటే అది సర్వాధికారి రెస్టు రూం.
అందులోకి తను...
అతని ఉద్దేశ్యం తనకి అర్థం అవుతూనే వుంది.
అనుకోకుండానే సర్వాధికారి భార్య చతుర వైపు చూసింది ప్రగతి.
ఆమె కళ్ళు అసూయతో విషం కక్కుతున్నాయి.
దేవుడిమీద భారం వేసి సర్వాధికారితో పాటు పక్కగదిలోకి నడిచింది ప్రగతి.
సర్వాధికారి, ప్రగతి పక్కగదిలోకి వెళ్ళగానే...
చతుర తన సెక్రటరీతో రహస్యంగా చెప్పింది.
"జాగ్రత్తగా విను. ఈ పిల్ల ఇవాళ ఈ గేటుదాటి ప్రాణాలతో బయటకి పోవడానికి వీల్లేదు! అర్థమైందా? జాగ్రత్త!"
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారితో కలసి పక్కనే వున్న అతని పర్సనల్ రూంలోకి నడిచింది ప్రగతి.
వెళ్లడమయితే ధైర్యంగానే వెళ్ళింది గానీ ఆ గదిలోకి ప్రవేశించగానే ఆమెకి ఒక్కసారిగా గుండెజారిపోయినట్లనిపించింది.
ఒక మొగాడితో తను...ఒంటరిగా ఈ గదిలో!
మొగాడితో కాదు - ఒక మొగ పశువుతో.
అవును మరి! ఈ సర్వాధికారి కంటే పశువులు చాలా నయం కదా!
చాలా పెద్ద పొరపాటు చేసిందా తను?
ఇప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళిపోతే....
తను ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కోగలనన్న ధైర్యంతో ఇతనితోబాటు లోపలికి వచ్చింది గానీ...
ఇప్పుడా ధైర్యం లేదు తనకి.
ప్రగతికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి.
వెనక్కి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలయి చటుక్కున వెనుదిరిగింది.
ఆ ఊహ ఆమె మనసులో మెదలకముందే తను గ్రహించేసిన వాడిలాగా ఒక్క ఉదుటున తలుపుకి అడ్డంగా నిలబడ్డాడు సర్వాధికారి.
అప్పుడు వినబడింది ఒక శబ్దం.
పెద్ద గాజువస్తువు ఏదో కిందపడి భళ్ళున పగిలినట్లుగా!
చటుక్కున వెనక్కి చూశాడు సర్వాధికారి.
