సాహస్ అలా చెబుతుంటే నోరు తెరుచుకుని వింటున్నాడు అంకుష్.
ఇంకా చెబుతూనే వున్నాడు సాహస్. "డోగోన్ జాతి నీగ్రోల పాటల తాలూకు సారాంశం ఇప్పుడు నిజమే అని తేలుతుంది. ఆ పాటల్లో వర్ణించబడిన సిరియస్ ఎ, సిరియస్ బి అనే నక్షత్రాలు నిజంగానే ఆకాశంలో ఉన్నాయి. శాస్త్రజ్ఞులు సిరియస్ బీ నక్షత్రాన్ని ఫోటో తీయగలిగారు కూడా! అది అచ్చం ఆ ఆటవికుల పాటల్లో వర్ణనలో లాగే వుంది. ఇంతవరకూ మనకి కనబడింది."
"ఫాంటాస్టిక్!" అన్నాడు అంకుష్.
"అయితే ఆ నక్షత్ర ప్రాంతం నుంచి వచ్చిన మనుషులు ఎలా వున్నారట?" ఆ విషయం గురించి వాళ్ళ పాటలలో వర్ణించలేదా?"
"ఎందుకు లేదూ? ఆ వర్ణనల ప్రకారం అంతరిక్ష నౌక ఒకటి గిరగిరా తిరుగుతూ పెద్ద గాలి దుమారం లేపుతూ రక్తవర్ణంలో వున్న ఎగ్జాస్ట్ పొగలని వదులుతూ నేలమీదకి దిగి ఒక్క జెర్కుతో ఆగిందిట. అప్పుడొక జీవి దానిలోనుంచి బయటకి వచ్చింది. ఆ ప్రాణికి నాలుగు కాళ్ళు వున్నాయి. అది మనిషిలాగా లేదు. ఒక చేప ఆకారంలో వుంది. ఆ బుద్ధిజీవుల వల్ల మనుషులు ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నారు. ఆ బుద్ధిజీవి పేరు 'నోమ్మోస్'ట!"
"ఇంతకీ ఆ ఆఫ్రికన్ ఆటవికులకీ, పాటకీ అంతరిక్ష యాత్రికులకీ ఇప్పుడు ఈ ఆటవికులకీ ఈ స్పేస్ షిప్పుకీ సంబంధం ఏమిటీ?" అన్నాడు అంకుష్ తికమకగా.
చిన్నగా నవ్వాడు సాహస్. "నీ ప్రశ్నలోనే జవాబు కూడా వుంది అంకుష్. అచ్చం డోగోన్ జాతి నీగ్రోలలాగే ఈ ఆటవికులు కూడా ఒక పాటని పాడడమూ, అందులో ఒక మరుగుజ్జు సూర్యుడి గురించి, ఒక మరుగుజ్జు గ్రహం గురించి ప్రస్తావన వుండడం ఆకాశంలో ఒక ఫ్లయింగ్ సాసర్ లాంటిది కనబడడం - చాలా పోలికలు లేవూ?"
అంకుష్ అందుకు సమాధానం చెప్పేటంతలోనే అక్కడున్న ఆటవికులు వాళ్ళని చూసి ఒక్కసారిగా వీరావేశంతో కేకలు పెడుతూ ఉరికి రావడం మొదలుపెట్టారు.
మరుక్షణంలో వాళ్ళు సాహస్ నీ, అంకుష్ నీ చుట్టుముట్టేశారు. ఉగ్రంగా వున్నాయి వాళ్ళ మొహాలు. భీకరమైన గొంతులు, భీభత్సమైన సైగలు!
భాష అర్థం కావడంలేదు గానీ భావాలు అర్థం అయిపోతూనే వున్నాయి.
"కొట్టండి, నరకండి, చంపండి"
సాహస్ ఏం చేయాలో తేల్చుకునేలోపలే ఆటవికులలో నుంచి ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి తక్కిన వాళ్ళకి అడ్డంగా నిలబడి వాళ్ళని వారించారు. అయిష్టంగానే ఆగిపోయారు ఆటవికులు.
ఆ ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు.
అప్పుడు అర్థమయింది సాహస్ కి.
వాళ్ళు ఆటవికులు గెటప్ లో వున్నారు కాబట్టి వెంటనే గుర్తుపట్టలేకపోయాడు తను.
కానీ వాళ్ళని తను ఇంతకుముందు చూశాడు.
ఎక్కడా ?
ఈ కొండల్లోనే!
తాము నిచ్చెన దిగుతుంటే అది విరిగి పడిపోయింది వీళ్ళ పొలంలోని గడ్డిమోపు మీదే!
"ఓ! మీరా?" అన్నాడు సాహస్ తేరుకుంటూ.
వాళ్ళు ముఖాలు ముటముటలాడిస్తూ చూశారు.
"మేం అప్పుడే చెప్పాం. ఈ టెలిస్కోపు కొండ ఎక్కే ప్రయత్నం చేస్తే ప్రమాదం అని" అన్నారు జంట కవుల్లాగా.
"అవును! వింత వ్యక్తులు తప్ప ఇంకెవ్వరూ వెళ్ళకూడదని కూడా చెప్పారు" అన్నాడు సాహస్.
"అర్థం చేసుకోరేం! మీరు ప్రాణాపాయంలో వున్నారు" అన్నారు వాళ్ళిద్దరూ.
"మీరిద్దరూ మంచివారిలా కనబడుతున్నారు. మీలాంటివాళ్ళు ప్రక్కన వున్నప్పుడు ఇంక మా ప్రాణాలకేం భయం. అయినా ఒకటి చెప్పండి. ఈ ఆటవికులకి మా మీద ఒక్కసారిగా ఎందుకంత కోపం వచ్చింది? ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు?" అన్నాడు సాహస్.
"ఎందుకా? ఎందుకంటే...మీరు ఇక్కడ ఉండడం వల్లే దేవతలు ఇక్కడ దిగకుండా వెళ్ళిపోయారని వాళ్ళ అనుమానం"
"దేవతలంటే మా మాస్టర్స్. అంటే వాళ్ళే ఆకాశరథంలో వస్తారే... ఇదిగో మమ్మల్ని అనవసరంగా వాగిస్తున్నావు. మేము ఇంకేం చెప్పం - ఒక్క విషయం తప్ప"
"ఏమిటి ఆ ఒక్క విషయం"
"ముందుకు పోకండి. అడుగడుగునా ప్రమాదాలే"
"సరే! ఇంకొక్క సంగతి చెప్పండి"
"ఏమిటి?"
"మీ పేర్లేమిటి?" అన్నాడు సాహస్.
"ఏదోలెద్దు! సింగినాదం, జీలకర్ర"
