Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 46

గది కప్పుకు వేళ్ళాడుతూ ఉండవలసిన షాండెలెయిర్, ఆ గాజు దీపాల గుత్తి కింద పడిపోయి వేల ముక్కలుగా పగిలిపోయింది.
ఆ షాండెలెయిర్ తో పాటుగా కిందపడ్డాడు ఒక చిత్రమిన మనిషి. పొట్టిగా వున్నాడు.
రైలింజనులా పొడుగ్గా వున్న తల, అప్పటిదాకా బహుశా అతను షాండెలెయిర్ ను పట్టుకుని వేళ్ళాడుతూ వుండాలి.
"ఎవడ్రా నువ్వు?" అన్నాడు సర్వాధికారి ఉగ్రంగా.
"నా పేరు స్కైలాబ్" అన్నాడు అతను తాపీగా.
"నువ్వు స్కైలాబ్ అయితే ఏంటి? స్పేస్ షిప్ అయితే ఏంటి? ఎందుకొచ్చావు లోపలికి? ఎలా వచ్చావ్? అన్నాడు సర్వాధికారి మండిపడుతూ.
"రాదలచుకుంటే మార్గమే వుండకపోతుందా?" అన్నాడు స్కైలాబ్.
సర్వాధికారి విసురుగా తలుపు తీసి "గార్డ్స్ అని గావుకేక పెట్టాడు.
పదిమంది గార్డ్స్ ఒక్కసారిగా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు.
"షూట్ దట్ బాస్టర్డ్" అన్నాడు సర్వాధికారి.
గార్డ్స్ మిషన్ గన్ లు స్కైలాబ్ వైపుకు గురిపెట్టి ఠపఠపఠప గుళ్ళు రిలీజ్ చేశారు.
అయితే...
చిత్రంగా వాటిల్లో ఒక్క గుండు కూడా ఆ స్కైలాబ్ అనే వ్యక్తికి తగల్లేదు.
అతను ఈ క్షణంలో ఇక్కడ వున్నాడు!
మరుక్షణంలో అక్కడ వున్నాడు.
ఆ తర్వాత క్షణంలో సోఫా వెనక్కి వెళ్ళాడు.
ఒక మనిషి పరిగెడుతున్నట్లుగా లేదు అది. ఏదో పాము పకుతున్నట్లు జరజర వెళ్ళిపోతున్నట్లున్నాడు అతను. తుపాకులు కాల్చడం ఆపి అతను ఎక్కడ దాక్కున్నాడా అన్నట్లు అటూ ఇటూ చూస్తున్నారు గార్డ్స్.
ఒక్కసారిగా సోఫా వెనుక నుంచి లేచి నిలబడ్డాడు స్కైలాబ్.
గార్డ్స్ మళ్ళీ అతనివైపు తుపాకులు గురిపెట్టారు.
"వినాశకాలే విపరీత బుద్ధీ" అన్నాడు స్కైలాబ్ సర్వాధికారిని ఉద్దేశించి.
"షటప్ యూ బాస్టర్డ్" అన్నాడు సర్వాధికారి కోపంగా.
"షూట్ ఐ సే!"
తుపాకులు మళ్ళీ ఠపఠప పేలడం మొదలుపెట్టాయి.
ఈసారి స్కైలాబ్ ఆ గదిలోనే వున్న ఒక పెద్ద పెయింటింగ్ దగ్గరకు వెళ్ళాడు. అతని తాకిడికి ఆ పెయింటింగ్ కాస్త పక్కకు జరిగింది.
దాని వెనుక ఒక ద్వారం వుంది.
అందులోకి దూరి అదృశ్యం అయిపోయాడు స్కైలాబ్.
అప్పటిదాకా నోరు తెరుచుకుని చూస్తున్న ఒక గార్డ్ ఉత్సాహంగా అన్నాడు.
"చచ్చాడు సార్ వెధవ! ఆ ద్వారం గుండా వెళితే సొరంగంలోకి వెళ్తారు. ఆ సొరంగం వంద సొరంగాలుగా చీలిపోతుంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకున్న ఎవడూ ఇంతవరకూ ప్రాణాలతో వెనక్కి తిరిగిరాలేదు. హాంఫట్" అన్నాడు ఆనందంగా.
వెంటనే ఆ గార్డ్ దవడ పగిలేటట్లు కొట్టాడు సర్వాధికారి.
"ఆ సొరంగం సంగతి నీకెట్లా తెలుసు? అసలు వాడు లోపలికి ఎలా వచ్చాడు."
భయంగా అన్నాడు గార్డ్.
"ఆ సొరంగం సంగతి ఇక్కడున్న గార్డ్స్ అందరికీ తెలుసు సార్. కానీ వాడెట్లా లోపలికి వచ్చాడో మాత్రం ఎవరికీ తెలీదు."
"అట్లాగా! నీ గన్ ఇవ్వు" అన్నాడు సర్వాధికారి.
వినయంగా తన దగ్గరవున్న మెషిన్ గన్ సర్వాధికారికి ఇచ్చాడు గార్డు.
వెంటనే -
గన్ ఎయిమ్ చేసి అక్కడున్న గార్డ్స్ అందరినీ వరుసబెట్టి షూట్ చేసేశాడు సర్వాధికారి.
తర్వాత ప్రగతి వైపు తిరిగి అన్నాడు.
"ఈ సొరంగం రహస్యం నాకూ నీకూ మాత్రమే తెలిసి వుండాలి. ఇంకెవరికన్నా తెలిస్తే వాళ్ళు ప్రాణాలతో వుండకూడదు. ఇంకెవరికన్నా తెలుసేమో రహస్యంగా ఎంక్వయిరీ చేయి."
"యస్సార్" అంది ప్రగతి.
తనకి తక్షణ ప్రమాదం తప్పినందుకు సంతోషించాలో తన కళ్ళఎదుట ఒక్కసారిగా అంతమంది మరణించినందుకు విచారించాలో అర్థం కాలేదు ఆమెకి.
"ఆ లోపలకి వెళ్ళిన పొట్టి ఠింగణా...వాడి పేరేమిటి... స్కైలాబ్ వాడు వెనక్కి తిరిగిరాడు. ట్రాప్ అయిపోయిన ఎలుకలాగా లోపలే చచ్చిఊరుకుంటాడు. రెండు మూడు రోజులు పోయాక వాడి శవాన్ని బయటికి లాగించి శుభ్రం చేయించాలి" అన్నాడు సర్వాధికారి ప్రగతితో.
"యస్సర్" అంది ప్రగతి.
ఒక్కసారి ప్రగతి వళ్ళంతా తడిమేస్తున్నట్టుగా చూశాడు సర్వాధికారి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS